పురాణాల ప్రకారం మన భూమిపైన 7 లోకాలు, భూమి క్రింద 7 లోకాలు ఉన్నాయని చెప్తారు. అయితే, భూమి క్రింద ఉండే లోకాలన్నిటిలో పాతాళలోకమే చివరిది అంటుంటారు. ఈ పాతాళ లోకాన్నే ‘నాగ లోకం’ అనికూడా అంటారు. ఈ నాగ లోకం మొత్తం పాములతో నిండి ఉంటుంది. మానవ మాత్రులెవ్వరూ అక్కడ అడుగు పెట్టలేరు. ఒకవేళ అడుగు పెట్టినా బతికి బట్టకట్టలేరు.
సాదారణంగా ఈ నాగ లోకానికి సంబందించిన విషయాలు మనం పాత సినిమాల్లో ఎక్కువగా చూసి ఉన్నాం. కానీ, నిజానికి అసలు నాగాలోకమనేది ఉందో! లేదో! కూడా మనకి తెలియదు. ఎందుకంటే, దానికి సంబందించిన ఆనవాళ్ళు ఎవరూ, ఎక్కడా పేర్కొనలేదు కాబట్టి. అయితే, నిజంగానే నాగలోకం ఉంది. దానికి దారి కూడా ఉంది. ఆ దారి కూడా మన దేశంలోనే ఉంది. ఆశ్చర్యంగా ఉంది కదూ!
ఇండియాలో 5 మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ ఉన్నాయి. అవి నేరుగా నాగలోకానికి దారితీస్తాయి. కానీ, ఈ మార్గాలని చేరుకోవటమే చాలా కష్టం. దట్టమైన అడవులు, ఎత్తైన పర్వతాలు, గుహలు, సొరంగాలు, బావులు, సరస్సులు ఇలా అనేక ప్రమాదాకర మార్గాల గుండా వెళ్లాల్సి ఉంటుంది. మరి ఆ 5 మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కోటక్ నాగేశ్వర్ బావి (వారణాసి):
కర్కోటక్ నాగేశ్వర్ అనేది వారణాసిలోని జైత్పురా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలోని ఒక చిన్న ఆలయం వెనుక ఒక పురాతన మెట్ల బావి ఉంటుంది. ఈ బావి గుండా లోపలికి వెళితే, 45 మీటర్ల లోతులో నాగలోకానికి దారి ఉందని అంటారు. అయితే, ఏడాది పొడవునా ఈ బావి పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. కానీ, ఒక్క నాగ పంచమి రోజు మాత్రమే ఇక్కడి శివుడిని పూజించటానికి వీలుగా నీరు లోపలి వెళ్ళిపోతుంది. ఆ రోజు మాత్రం ఈ బావిని తెరిచి ఉంచుతారు. అంతేకాదు, పాముకాటుకి గురైన వాళ్ళని నాగ పంచమి రోజున ఈ బావిలో ముంచితే విరుగుడు లభిస్తుందని నమ్మకం. ఇంకా జాతకంలో సర్పదోషం ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ మునిగితే… దోషం పోతుందని చెప్తారు.
2. మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (మహారాష్ట్ర):

మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలోని అమరావతి ప్రాంతంలో ఉంది. మధ్యప్రదేశ్ లో ఉన్న సాత్పురా పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రాంతమంతా వర్షంలో తడిసిన దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. ఇక్కడికి చేరుకోవాలంటే, ప్రమాదకరమైన పర్వతాలను అధిరోహించాల్సి ఉంటుంది. ఇంకా ఎత్తైనకొండలు, లోయలు, నదులు, సరస్సులతో ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అందుకే ఇక్కడికి ఏడాదికి ఒకట్రెండు రోజులు మాత్రమే అనుమతిస్తారు. అయితే, ఈ దట్టమైన అడువుల గుండా ప్రయాణిస్తే… ఓ రహస్య మార్గం ఉంటుంది. అది నాగలోకానికి దారితీస్తుందని చెప్తారు. ఈ మార్గం గుండా వెళ్ళేటప్పుడు మద్యలో నాగమణి ఆలయం కూడా కనిపిస్తుంది. ఆ ఆలయంలో అనేక పాములు దర్శనమిస్తాయి. కానీ, ఏ ఒక్కటీ కూడా భక్తులకి హాని తలపెట్టదు. కాలసర్ప దోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి పూజిస్తే, దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
3. కైలాష్ గుఫా (ఛత్తీస్‌గఢ్):
కైలాష్ గుఫా అనేది ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఒక గుహ. ఇది కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్‌లోని దట్టమైన అడవిలో ఉంది. ఈ ప్రదేశాన్ని తప్కర అని కూడా అంటారు. ఈ ప్రాంతంలో అనేక జాతుల పాములు కనిపిస్తాయి. అంతేకాదు, తప్కర ప్రాంతం చాలా మర్మమైందని కూడా చెప్తారు. ఇక్కడి నుండి నాగలోకానికి దారి ఉన్నట్లు పురాణగాధలు చెప్తున్నాయి. కొటెబిరా ఎబ్ అనే నది ప్రవహించే ఓ పర్వతంపై ఈ గుహ ఉంది. ఇప్పటివరకూ ఈ గుహలోకి వెళ్లినవారెవరూ తిరిగి మళ్ళీ రాలేదు. కాబట్టి ఈ గుహ పెద్ద రాతిబండతో మూసివేయబడి ఉంటుంది. చుట్టూ చీకటి, ఇరుకైన ప్రవేశద్వారం కలిగి ఉన్న ఈ గుహ చరిత్ర పూర్వ యుగానికి చెందింది. ఇక్కడ స్టాలగ్మైట్ తో సహజ సిద్ధంగా ఏర్పడిన శివ లింగం ఒకటి ఉంది. రామాయణ కాలంలో ఈ ఆలయాన్ని రావణుడి సోదరి శూర్పణఖ పూజించినట్లు తెలుస్తోంది. అలాగే, వనవాస సమయంలో సీతా, రాములు కూడా ఇక్కడి శివలింగాన్ని పూజించారని ఆధారాలు చెప్తున్నాయి. ఇంకా మహాభారత కాలంలో దుర్యోధనుడు భీమునికి విషపూరితమైన పాయాసాన్ని ఇస్తాడు. అప్పుడు భీముడు ప్రాణాపాయ స్థితిలో ఈ నది దగ్గరికి రావడం చూసి, అక్కడి నాగకన్యలు ఈ మార్గం గుండానే భీముడిని నాగ లోకానికి తీసుకెళ్లి… అక్కడ ఆయనకి చికిత్స చేసి పంపించారట.
4. పహరి బాబా ఆలయం (ఝార్ఖండ్):
పహరి బాబా ఆలయం అనేది ఝార్ఖండ్ రాజధాని రాంచీ ప్రాంతంలో ఉన్న ఓ పర్వత మందిరం. ఈ మందిరంపై నాగ దేవతల గుహ ఒకటి కనిపిస్తుంది. ఈ గుహలో నాగరాజు-నాగిని భక్తులకి ప్రత్యక్ష దర్శనాన్ని అందిస్తున్నారు. 500 ఏళ్ళుగా ఈ గుహ ఇక్కడ ప్రసిద్ధి చెందింది. నాగదేవతలు ఎప్పుడూ ఈ ఆలయంలో సంచరిస్తూ ఉండటంతో… దీని లోపలి నుండీ నాగలోకానికి చేరుకోవడానికి మార్గం కూడా ఏర్పడింది. అందుకే, నాగ పంచమి రోజున ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు.
5. మోతీ జీల్ సరస్సు (ఉత్తర ప్రదేశ్):
మోతీ జీల్ సరస్సు అనేది ఉత్తర ప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో ఉన్న శుక్రతల్ లో ఉంది. ఈ సరస్సు ఎప్పటికీ ఎండిపోదు. అయితే, ఈ సరస్సు నాగలోకం వరకు ఉందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ ప్రాంతానికి నాగలోకంతో సంబంధం ఉన్నట్లు చెప్తారు. మహాభారతంలో అభిమన్యుడి కుమారుడైన పరిక్షీత్తుడు ఒక రోజు అడవిలో ధ్యానం చేస్తున్న శుక్దేవ్ మహర్షి మెడలో చనిపోయిన పామును వేస్తాడు. అది చూసిన మహర్షి కుమారుడు ఆగ్రహించి… ఏడు రోజుల్లో తక్షకుడు నిన్ను కాటేస్తాడని శపిస్తాడు. ఆ తర్వాత పాములు రాలేనంత ఎత్తైన ప్రదేశంలో ఒక బిల్డింగ్ కట్టుకొని ఉంటుంటాడు. ఆ సమయంలో పాప పరిహారం కోసం శ్రీమద్భాగవత కథని వింటుంటాడు. అయితే, కథ పూర్తయిన వెంటనే తక్షకుడు అతనిని కాటేస్తాడు. అలాగే, దుర్యోధనుడు, భీముడికి విషమిచ్చిన తర్వాత నీటిలో పడేస్తాడు. అప్పుడు భీముడు ఈ సరస్సు నీటి గుండానే నాగలోకానికి వెళ్లి… అక్కడున్న అమృత కుండని తాగడం వల్ల పదివేల ఏనుగుల బలం వస్తుంది. అందుకే, ఈ సరస్సు నాగలోకం వెళ్ళటానికి ఏకైక మార్గం.