ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం”; “ప్రయాణికుల భద్రతే మాకు ముఖ్యం” అనే స్లోగన్స్ తరచూ మనం చూస్తుంటాం. కానీ, ఈ వీడియో చూస్తే… “ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం కాదు”; “ప్రయాణికులకి అస్సలు భద్రత లేదు” అనాల్సి వస్తుంది.
టాపిక్ లోకి వస్తే, కుప్పం నుండి హైదరాబాద్ వెళ్తున్న ఏపీయస్ ఆర్టీసీ బస్సు అనంతపురం జిల్లా కదిరి బస్టాండ్లో ఆగింది. అక్కడ ఓ ప్రయాణికుడికి సీటు కేటాయించే విషయంలో, కండక్టర్ కి – ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుడి పై దాడికి పాల్పడ్డారు. బస్సులో తోటి ప్రయాణీకులంతా చూస్తుండగానే అతనిని మెడపట్టుకొని కిందకు తోసేశారు. ఎవ్వరికి చెప్పుకుంటావో… చెప్పుకో! అంటూ హెచ్చరించారు కూడా.
బస్టాండ్లో ఉన్న ఇతర ప్రయాణికులంతా సిబ్బందిని ఆపే ప్రయత్నం చేశారు. ఐనా వారు వినిపించుకోలేదు. మొత్తం ఐదారుగురు ఆర్టీసీ సిబ్బంది కలిసి… రౌండప్ చేసి… అతనిని చితకబాదారు. ఏకంగా బస్టాండ్ నుంచే వెళ్లిపోవాలని నెట్టేశారు.
ఈ దృశ్యాలన్నీ అక్కడున్న మిగిలిన పాసింజర్స్ తమ సెల్ఫోన్లో చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అది కాస్తా వైరల్ కావడంతో… ఆర్టీసీ స్టాఫ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆర్టీసీ విచారణ అధికారి దృష్టికి వెళ్ళింది. ఆయన విచారణలో ఆ ప్రయాణీకుడే మద్యం మత్తులో సిబ్బందితో గొడవ పడ్డాడని చెప్పారు.