మనదేశంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో భద్రకాళి అమ్మవారి ఆలయం ఒకటి. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారమై ఈ తల్లి ఇక్కడ వేంచేసి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో గల వరంగల్ – హన్మకొండ ప్రధాన రహదారిలో ఉన్న భద్రకాళి చెరువు తీరంలో ఉండే గుట్టల మధ్య ఉంది శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం.
ఆలయంలోని ప్రధాన గర్భగుడిలో భద్రకాళీదేవి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు కలిగి ఉండి గంభీర రూపంతో భక్తులకి దర్శనమిస్తుంది. పూర్వం ఈ విగ్రహం రౌద్రం ఉట్టిపడేలా… వ్రేలాడుతున్న నాలుకతో… చూడటానికి అతి భయంకరంగా ఉండేదట. 1950లో, ఆలయ పునరుద్దరణలో భాగంలో అమ్మవారి ముఖాన్ని ప్రసన్నవదనంగా తీర్చి దిద్దారు.
ఈ ఆలయానికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. సుమారు 1400 ఏళ్ల క్రితమే ఈ ఆలయం నిర్మించినట్లు చారిత్రిక ఆధారాలు చెప్తున్నాయి. రెండవ పులకేశి చక్రవర్తి క్రీ.శ. 625లో ఈ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించినట్లు స్పష్టమవుతుంది. తర్వాత కాకతీయులు ఈ భద్రకాళి మాతని ఆరాధించేవారట. కాకతీయ గణపతి దేవుడు ఈ ఆలయం ప్రక్కనే ఒక చెరువును తవ్వించాడట. ఇక రాణిరుద్రమదేవి ఈ తల్లిని ఆరాదించనిదే భోజనం కూడా ముట్టదట.
అంతేకాదు, ఈ ఆలయ ప్రాంతంలో సిద్ధులు కూడా ఎక్కువగా సంచరిస్తూ ఉంటారట. అందుకే ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన వారెవరైనా సరే, వారు తెలిసో, తెలియకో వారు చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల అపార నమ్మకం.
ఇక దసరా ఉత్సవాలని పురస్కరించుకుని నిన్న వరంగల్ భద్రకాళీ చెరువులో తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అమ్మవారు హంస వాహనంపై విహరించటం చాలా కన్నుల పండుగగా సాగింది. ఈ తెప్పోత్సవానికి భక్తులంతా హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు రాత్రి భద్రకాళీ-భద్రేశ్వరుల కల్యాణంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.