మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఏమైందని అడగగా… చిన్నపాటి సర్జరీ జరిగిందని… 15 రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చిందని… స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.
కరోనా సెకండ్ వేవ్ సమయంలో… మహమ్మారి బారిన పడి ప్రజలు… ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే, అలాంటి వారి కోసం చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే! ఈ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా పేషెంట్లకి సేవలు అందించిన అభిమాన సంఘాల ప్రతినిధులతో చిరంజీవి ఆదివారం భేటీ అయ్యారు.
తెలంగాణ జిల్లాల ప్రతినిధులని చిరు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం అంతా హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా సాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్ ఉండడం అక్కడున్న అభిమానులందరినీ కలవరపెట్టింది.
దీంతో చిరు స్పందిస్తూ.. ఇటీవల కుడి చెయ్యి నొప్పిగా అనిపిస్తుంటే… వైద్యులని సంప్రదించాల్సి వచ్చింది. వాళ్లు మణికట్టు దగ్గరున్న నరం ఒత్తిడికి గురైందని… అందుకోసం శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. ఈ కారణంగానే తన కుడి చేతి మణికట్టుకి చిన్నపాటి శస్త్రచికిత్స ఒకటి జరిగిందని చెప్పారు. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని… 15 రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని… ఆయన చెప్పారు.