“పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత”. కేవలం మనం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. మన చుట్టూ ఉండే పరిసరాలని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే పర్యావరణం పచ్చగా ఉంటుంది. ఈ నినాదం ప్రజలందరికీ గుర్తుండిపోయేలా “స్వచ్ఛభారత్” పేరుతో ప్రజల్లో స్ఫూర్తి నింపారు ప్రధాని మోదీ.
ప్రధానమంత్రి ఇచ్చిన స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రజల్లో ఏ మేరకు నాటుకుందో తెలియదుగానీ, మూగ జీవాల్లో మాత్రం బాగా నాటుకుంది. అందుకేనేమో ఓ గజరాజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఎక్కడో… ఏమిటో… తెలియదుగానీ, ఒక ఏనుగు నడుచుకుంటూ వస్తుండగా… ఒక ఇంటి ముందు చెత్తబుట్ట కనిపించింది. దాని చుట్టుపక్కల చెత్త పడేసి ఉంది. అంతే… అది చూసిన ఏనుగు ఆగి… ఆ చెత్తని తీసి డస్ట్ బిన్ లో వేసి మరీ వెళ్ళింది. అదికూడా ఎలా అనుకున్నారు. చిత్తు కాగితాన్ని దాని తొండం, కాలు ఉపయోగించి ఉండలు చుట్టి మరీ ఆ డస్ట్ బిన్ లో వేసింది. పని పూర్తయ్యాక అక్కడినుండీ వెళ్ళిపోయింది.
ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్కస్వాన్ ట్విటర్లో పోస్టు చేశారు. గజరాజు స్వచ్ఛస్ఫూర్తికి దానిని స్వచ్ఛభారత్ మస్కట్‌గా వాడాలని ప్రతిపాదించారు.