కనకదుర్గమ్మ పుట్టినిల్లు విజయవాడ. అలాంటి విజయవాడలో 1955వ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతం అనేకంటే… ‘అమ్మవారి లీల’ అంటే బాగుంటుందేమో!
భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా… వరాలిచ్చే వరలక్ష్మిగా… నమ్మిన వారి కొంగు బంగారంగా… ఇంద్రకీలాద్రిపై వెలసింది కనకదుర్గమ్మ. అలాంటి ఆ తల్లి… తన భక్తుల యోగక్షేమాలు తెలుసుకోవటానికి… ప్రతిరోజూ కొండ దిగి వచ్చి… విజయవాడ నగర సంచారం చేస్తుంది. ఇందుకు సాక్షం కొండపై రాత్రి నిద్రించే భక్తులు, మరియు అక్కడ ఉండే దేవీ ఉపాసకులే! రాత్రి పూట ఆ తల్లి గజ్జెల సవ్వడి విన్నవాళ్ళు ఎందఱో ఉన్నారు.
ఇదిలా ఉంటే… 1955వ సంవత్సరంలో, విజయవాడ మారుతీ టాకీస్ లో ‘రోజులు మారాయి’ సినిమా ఆడుతుంది. ఆ సినిమా సెకండ్ షో అయిపోగానే ఎవరైనా వస్తే ఎక్కించుకుని వెళదామని ఎదురు చూస్తున్నాడు వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు. నిజానికతడు అమ్మవారి భక్తుడు. కాయకష్టం మీద బతికే వాడు. ఈ కారణంగానే అర్ధరాత్రి వేళ అయినా సరే మంచి బేరం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఇంతలో సినిమా హాల్ లో నుంచి ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. ఆమె ఎర్ర చీర కట్టుకొని… పెద్ద బొట్టు పెట్టుకొని… చూడటానికి నిండు ముత్తైదువలా ఉంది. ఆమె వెంకన్న దగ్గరికి వచ్చి రిక్షా వస్తుందా బాబూ! అని అడిగింది. ఎక్కడ దించాలో చెప్పమంటాడు వెంకన్న. ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని చెప్పి… రిక్షా ఎక్కి కూర్చుంది ఆ పెద్దావిడ.
వెళ్ళేదారిలో వెంకన్నని ఉద్దేశించి ఆవిడ ఇలా అంటుంది. “బాబూ! ఇప్పుడు సమయం 12 గంటలు అయింది. ఊరంతా నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి పూట ఆ దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుందని వినే ఉంటావు కదా! మరి నీకు భయం వేయట్లేదా..!” అని అడుగుతుంది. దానికి వెంకన్న ఇలా సమాధానం చెప్పాడు. “ఆ… అమ్మ దుర్గమ్మ… మా అందరి తల్లి! తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు ఉంటుందమ్మా..?” అని చెప్తాడు.
ఇక కొంతదూరం వెళ్ళగానే ఇంద్రకీలాద్రి కొండ వచ్చేస్తుంది. దీంతో ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా..! అని ఆమెని అడుగుతాడు. కానీ, వెనుక నుండి సమాధానం లేదు. ఏమిటని వెనక్కి తిరిగి చూస్తే… రిక్షా లో ఆమె లేదు. ఖంగారుగా చుట్టూ వెతుకుతాడు. ఇంతలో పక్కనే ఉన్న ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న గుడి మెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది.
వెంటనే, అదేంటమ్మా..! డబ్బులు ఇవ్వనేలేదు అని వెంకన్నఅడగగా… నీ తలపాగలో పెట్టాను చూడు అంటుంది. వెంటనే అతను తన తలపాగా తీసి చూడగా… అందులో అమ్మవారి బంగారు గాజు, 10 రూపాయల నోటు ఉన్నాయి. దీంతో వెంటనే ఆయనకి అర్ధమయింది తన రిక్షా ఎక్కింది మరెవరో కాదు, అమ్మలగన్న అమ్మ ఆ కనక దుర్గమ్మే అని. తిరిగి చూడగా ఆమె మాయమైపోతుంది. దీంతో ఆనందంతో ఒక్కసారిగా వెర్రి కేకలు వేయడం మొదలు పెడతాడు చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి… ఏమైందో అని కంగారు పడతారు. జరిగిన విషయం చెప్పి… ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతుంటాడు.
అయితే, ఈ సంఘటన నిజమా..! కాదా..! తెలియచేసేందుకు అప్పట్లో వచ్చే ఆంధ్రకేసరి మ్యాగ జైన్ ఈ కధనాన్ని ఫోటోలతో సహా ప్రచురించింది.