విశ్వంలో బ్లాక్ హోల్స్ ఏర్పడటం అనేది సర్వ సాదారణమైన విషయమే! కానీ అలాంటి బ్లాక్ హోల్స్ మన భూమిపై ఏర్పడితే…
బ్లాక్ హోల్స్ భూమిపై ఏర్పడాలంటే మన భూగోళం బఠానీ గింజంత పరిమాణంలోకి మారిపోవాలి. మరి ఈ బ్లాక్ హోల్ ఏమిటి అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ‘బటగైకా క్రేటర్’ గురించి.
నిజానికి ఇది బ్లాక్ హోల్ కానప్పటికీ, బ్లాక్ హోల్ ఎలాగైతే దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాలన్నిటినీ తనలోకి లాగేసుకుంటుందో… ఈ బటగైకా క్రేటర్ కూడా దాని చుట్టుపక్కల ఉన్న భూమినంతా తనలోకి లాగేసుకుంటుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద శాశ్వత మంచు బిలంగా చెప్పబడే ఈ బటగైకా క్రేటర్ రష్యా యొక్క ఫార్ ఈస్ట్‌లోని సఖా రిపబ్లిక్‌లోని వెర్కోయాన్స్కీ జిల్లాలో ఉంది. దీనిని అక్కడి స్థానికులు ‘నరకపు నోరు’ (mouth to hell) అని పిలుస్తారు. సైంటిఫిక్‌గా దీనిని బటగైకా క్రేటర్ అంటారు.
1960కి ముందు ఈ లోయ ఉన్న ప్రాంతంలో… దట్టమైన అడవి ఉండేదట. 1960 తర్వాత ఆ అడవి కనుమరుగై పోయింది. నేల మాత్రమే మిగిలింది. సూర్యుడి కిరణాలు డైరెక్టుగా ఇక్కడ పడటం మొదలైంది. దాంతో… ఆ నేల కరిగి ఇలా గొయ్యి ఏర్పడటం మొదలైనట్లు తెలుస్తోంది. సైంటిస్టులు అయితే ఇలాంటి మరిన్ని లోయలు త్వరలో ఏర్పడవచ్చని అంటున్నారు. కారణం భూతాపం.
ప్రస్తుతం నరకపు నోరు అని చెప్పుకోబడే ఈ లోయ.. సంవత్సరానికి 20 నుంచి 30 మీటర్లు పెరుగుతోంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. భవిష్యత్తులో ఇంకా ఎంత సైజ్ పెరుగుతుందో కూడా తెలియదు. శాటిలైట్ ఇమేజెస్‌లో దీనిని చూస్తే… కప్పపిల్ల (tadpole) ఆకారంలో కనిపిస్తుంది.
1980లో 282 అడుగుల లోతు ఉన్న ఈ లోయ చూడటానికి చాలా చిన్నగా ఉండేది. కాలం గడిచేకొద్దీ దీని సైజ్ పెరుగుతోంది. ఇప్పుడు ఇది 1 కిలోమీటర్ పొడవు ఉంది. ఈ లోయ చుట్టూ ఉన్న ప్రదేశం రాను రానూ గొయ్యిలా అయిపోతోంది. దీనిని ‘మెగా-స్లంప్’ అని పిలుస్తారు.
సైంటిస్టులేమో… ఈ లోయ చుట్టూ ఉన్నది కరిగిపోయే భూమి అంటున్నారు. ఎప్పుడో 25.8 లక్షల సంవత్సరాల క్రిందట ఈ భూమి గడ్డకట్టినట్లు అయ్యిందట. అందుకే ఈ క్రేటర్ అనేది థర్మోకార్స్ట్ డిప్రెషన్, ఇది శాశ్వత మంచును కరిగించడం వల్ల ఏర్పడే పతనం. దీనికి సమీపంలో బటగాయ్కా నది ఉండటంతో దీనికి ఆ పేరు పెట్టారు.
ఇక వానాకాలంలో అప్పుడప్పుడూ ఈ లోయ నుంచి భారీ శబ్దాలు కూడా వినిపిస్తాయట. ఈ లోయ దగ్గర నివసించే యాకుత్ జాతి ప్రజలను ఇది భయపెడుతోందట. వారికి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారింది. నరకానికి వెళ్లేందుకు ఈ లోయే మార్గం చూపిస్తుందని వారు నమ్ముతున్నారు.
చివరిమాట:
ఏది ఏమైనా నానాటికీ ఈ లోయ పెరుగుతూ… తన చుట్టూ ఉన్న భూమిని లోపలికి లాగేసుకుంటోంది. అందుకే భూమిపై ఇదో రకమైన బ్లాక్ హోల్ అనుకోవచ్చు. భవిష్యత్తులో ఇలాంటి బ్లాక్ హోల్స్ ఇంకా ఎన్ని చూస్తామో కదా!