Mysterious powers of Thiruchendur Murugan Temple.

సునామీని సైతం వెనక్కి నెట్టిన ఒకే ఒక్క ఆలయం

వేదభూమిగా చెప్పబడే తమిళనాడులో ఆచారాలే కాదు, ఆలయాలు కూడా ఎక్కువే! ముఖ్యంగా ఇక్కడి తమిళులు మురుగన్ ని ఎక్కువగా పూజిస్తుంటారు.  దీనికి కారణం మురుగన్ కి సంబంధించి ఎన్నో యదార్ధ గాధలు, మహిమలు ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉండటం. మరో కారణం, మురుగన్ యొక్క 6 ప్రసిద్ధ క్షేత్రాలూ ఈ ప్రాంతంలోనే  ఉండటం. నిజానికి ఎంతో చారిత్రక నేపథ్యమున్న ఈ ఆలయాల్లో 5 ఆలయాలు మాత్రం కొండపై ఉంటే… ఒకే ఒక్క ఆలయం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. అంతేకాదు, సైన్స్ కి కూడా అంతు చిక్కని మిస్టరీలెన్నో ఆ ఆలయం తనలో దాచుకొంది. అయితే, ఆ ఆలయమేదో, దాని ప్రత్యేకత ఏమిటో ఇప్పుడే తెలుసుకోండి.

ఆ మిస్టీరియస్ టెంపుల్ ఏమిటి?

ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే  మురుగన్ కి సంబంధించి 6 ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అవే – తిరుపరకుండ్రం, తిరుచెందూర్, పళని, స్వామిమలై, తిరుత్తణి, ఇంకా పళముదిర్చోళై. ఈ ఆరు దేవాలయాలను కలిపి “ఆరుపడైవీడు” క్షేత్రాలు అంటారు. వీటిలో మనం ఇప్పుడు చెప్పుకుంటుంది తిరుచెందూర్ క్షేత్రం గురించి. 

తిరుచెందూర్ ఆలయం ఎక్కడ ఉంది?

తిరుచెందూర్ దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో గల తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఒక చిన్న అందమైన తీర పట్టణం. తిరుచెందూర్ మురుగన్ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అంతేకాదు, బే అఫ్ బెంగాల్ యొక్క కోస్టల్ కారిడార్ లో ఉన్న ఎకైక మురుగన్ ఆలయం కూడా ఇది ఒక్కటే!

సుదీర్ఘమైన యుద్ధం తర్వాత రాక్షస రాజైన సూరపద్మన్‌పై మురుగన్ సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఆలయం నిర్మించబడింది. ఆ రాక్షసుడిని చంపిన తర్వాత తన తండ్రి శివుడికి కృతజ్ఞతలు తెలుపుతున్న సమయంలో  దైవిక వాస్తుశిల్పి అయిన మయన్‌ చేత ఈ ఆలయాన్ని నిర్మింప చేశాడని చెప్తారు. 

ఆలయం వెనుక దాగి ఉన్న కథ

ఈ ఆలయ చరిత్ర కేవలం ఒక రాక్షసుడితో చేసిన వీరోచితమయిన యుద్ధంతో ముడిపడి ఉన్నది అని పురాణాలు చెప్తున్నాయి. కానీ, దానితోపాటు ఈ దేవాలయం మురుగన్ పుట్టుకతో కూడా ముడిపడి ఉన్నది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. 

వీర మహేంద్రపురి అనే ద్వీప రాజ్యాన్ని సూరపద్ముడు అనే రాక్షస రాజు పరిపాలించేవాడు. అతను పరమ శివ భక్తుడు కూడా. శూరపద్ముని అపారమైన భక్తి, విధేయతలకు ఆ పరమేశ్వరుడు ముగ్ధుడై… అతనికి అనేక వరాలను ప్రసాదించాడు. 

కాలక్రమేణా ఈ రాక్షస రాజు మరింత శక్తివంతుడు అవుతాడు. తనకు ఉన్న అమరత్వం ఇంకా ఆ పరమేశ్వరుడి వలన కలిగిన వరాలతో తనకు ఎదురులేదని అహంకారంతో విర్రవీగుతాడు. ముల్లోకాలమీద దండయాత్ర చేసి స్వర్గాన్ని, భూమిని, నరకాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. తన అహంకారంతో దేవతలను ఇబ్బంది పెట్టేవాడు. ఇంకా స్వర్గంలో నివసించే వారి చేత ఎన్నో నీచమయిన పనులు చేయించేవాడు. 

దేవతలు విసిగిపోయి అతని హింసను భరించలేక ఆ పరమశివునికి మొరపెట్టుకున్నారు. ఆవేశంతో ఊగిపోయిన పరమశివుడు తన మూడవ కన్ను తెరవటంతో ఆ ప్రభావానికి ఆరు అగ్నిజ్వాలలు పుట్టి వాటి నుండి ఆరుగురు శిశువులు జన్మిస్తారు. ఆ ఆరుగురు శిశువులను ఉమాదేవి తన చేతిలోకి తీసుకొనేసరికి వారందరూ కలిసి కుమారస్వామిగా  జన్మిస్తాడు. 

ఈ కుమారస్వామికే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శరవణభవుడు, స్వామినాధుడు, వేలాయుధుడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, స్కందుడు, సేనాపతి, మురుగన్ ఇలా మొత్తం 28 రకాల పేర్లున్నాయి. ఇతను ఆరు ముఖాలతో, పన్నెండు చేతులతో కారణజన్ముడిగా పుడతాడు. 

కుమారస్వామి పెరిగి పెద్దవాడయ్యాక ముల్లోకాలను గడగడలాడిస్తున్న తారకాసురుడు, ఇంకా సూరపద్ముడు అనే ఇద్దరు రాక్షసులను వధించడానికి సిద్ధపడతాడు. ఈ రాక్షసులను అంతమొందించడానికి వారిని వెదుకుతూ కుమారస్వామి ఈ తిరుచెందూర్ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ పరమేశ్వరుడిని పూజించినట్లు చెబుతారు. 

ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో తారకాసురుడిని సంహరించి సూరపద్ముడు కోసం వెదుకుతాడు. అయితే భయంతో ఇంకా తన మాయతో సూరపద్ముడు ఒక మర్రిచెట్టు రూపంలో ఈ ప్రాంతంలోనే దాక్కుంటాడు. అది తెలుసుకున్న కుమారస్వామి ఆ మర్రిచెట్టును తన ఆయుధంతో రెండు ముక్కలుగా నరికి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. 

పరమేశ్వరుడి భక్తుడయిన ఆ రాక్షసరాజు తన చివరి కోరికగా రెండు భాగాలుగా నరకబడిన మర్రిచెట్టు… ఒక భాగం నెమలిగా రెండవ భాగం ఒక కోడిగా మారి, అవి రెండూ కుమారస్వామి వాహనాలుగా మారాయని చెబుతారు. అప్పటి నుండి, భక్తులను అనుగ్రహించేందుకు కుమారస్వామి ఈ క్షేత్రంలో కొలువయ్యాడని చెబుతారు. 

ఇక తండ్రి అనుగ్రహంతో రాక్షసులను అంతమొందించిన కుమారస్వామి తన తండ్రి సహాయానికి కృతజ్ఞతగా అతని కోసం ఒక అద్భుతమయిన మండపాన్ని నిర్మించాలని తలచి దైవశిల్పి అయిన మాయాసురుడిని కోరతాడు. ఆ విధంగా కుమారస్వామి కోరిక ప్రకారం మాయాసురుడు ఇక్కడ మందిరాన్ని నిర్మించాడని పురాణ కథ. ఇప్పటికీ, ఇక్కడ కుమారస్వామి ఆ పరమేశ్వరుడిని పూజిస్తున్న రూపంలో కనిపిస్తాడు.

ప్రాచీన వాస్తుశిల్పం

తిరుచెందూర్ ఆలయ అద్భుత నిర్మాణం చూసేవారిని మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రధాన మండపం 124 స్తంభాలను కలిగి ప్రధాన ఆలయ ప్రవేశానికి ముందుగా ఉండి ఆకర్షిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం దక్షిణాభిముఖంగా ఉండి మొదటి ఆలయ ప్రాకారంలోకి తెరుచుకుంటుంది. దీనినే సివిలి మండపం అంటారు. 

పశ్చిమ గోపురం ఈ ద్వారం వెలుపలి వైపున ఉంది. ఇక్కడ దాదాపు 140 అడుగుల ఎత్తులో ఉండే భారీ ప్రవేశ గోపురం చూడవచ్చు. ఈ భారీ గోపురాలు దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా ఈ ఆలయాన్ని చూపిస్తుంది. 

తొమ్మిది అంతస్తులను కలిగి ఉందని సూచించడానికి ఈ గోపురం పైన తొమ్మిది కలశాలను ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులకు స్వాగతం పలుకుతూ ఉండే విధంగా ఒక పెద్ద వినాయక విగ్రహం కూడా ఉంది. అంతే కాకుండా ఈ గుడిలో ఉన్న వేంకటేశ్వరుని మందిరంలో పన్నెండు మంది ఆళ్వార్లు, గజలక్ష్మి, పల్లికొండ రంగనాథర్, శ్రీదేవి, భూదేవి మరియు నీలాదేవి విగ్రహాలను కూడా ఇక్కడ భక్తులు చూడవచ్చు.

ఈ ఆలయం గురించి మరికొన్ని అద్భుతమైన విశేషాలు

  • కుమారస్వామి ఆరు నివాసాలలో ఈ తిరుచెందూర్ ఆలయం ఒక్కటే సముద్ర తీరానికి సమీపంలో ఉంది, మిగిలిన ఐదు కొండ ప్రాంతాలలో ఉన్నాయి.
  • విస్తీర్ణం పరంగా చూస్తే, ఈ దేవాలయం ప్రాంగణం మొత్తం భారతదేశంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. 
  • భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుండి కూడా ఇక్కడకు ఎందరో భక్తులు ఆ స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. సింగపూర్, మలేషియా, శ్రీలంక, ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు తరలివస్తూ ఉంటారు. 
  • భారతదేశంలో అత్యధికంగా ప్రజలు సందర్శించే ఆలయ సముదాయాలలో ఈ తిరుచెందూర్ ఆలయం కూడా ఒకటి. 
  • భారతదేశంలో పశ్చిమ ద్వారంలో రాజ గోపురం ఉన్న ఏకైక ఆలయం ఇది. 
  • లభించిన ఆధారాల ప్రకారం ఈ ఆలయాన్ని రాజులు నిర్మించలేదు అని, ముగ్గురు పవిత్ర సాధువులు నిర్మించారు అని చెబుతారు.
  • భారతదేశంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటిగా ఈ ఆలయం పేరు సంపాదించింది. ఈ ఆలయానికి ఉన్న సంపద మరియు నిధులు లెక్కలేనన్ని ఉన్నాయని చెబుతారు.
  • ఒకే ఆలయ ప్రాంగణంలో విష్ణువు మరియు శివుని యొక్క వివిధ అవతారాలను కూడా కలిగి ఉన్న అతి కొన్ని దేవాలయాలలో ఇది ఒకటి.

బ్రిటీష్ దాడుల నుండి ఈ ఆలయం ఎలా బయటపడింది?

ప్రస్తుతం మనం చూసే దేవాలయం ఇంకా ఇతర మందిరాలు కనీసం 2000 సంవత్సరాల ముందు కట్టినట్లుగా భావిస్తారు. ఈ ఆలయం ఎన్నో పరాయి పాలకుల దాడులను తట్టుకొని ఇప్పటికి నిలబడింది.

1646 నుండి 1648 సంవత్సరాల మధ్య పోర్చుగీసు వారితో జరిగిన యుద్ధంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోర్చుగీసు వారితో యుద్ధం జరుగుతున్నా సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు. కొంత కాలం వీరి ఏలుబడిలో ఉన్న ఈ గుడి చివరకు నాయక్ పాలకులతో జరిగిన ఒప్పందం ప్రకారం డచ్  వారు ఈ ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను ఖాళీ చేయడానికి అంగీకరించి వెళ్లిపోయారు. 

అయితే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసేముందు ఇక్కడి విలువయిన ఎన్నో విగ్రహాలను తీసుకెళ్లిపోయారు. ఆ తరువాతి కాలంలో జరిగిన చర్చల అనంతరం ఆ విగ్రహాలను డచ్ వారు తిరిగి ఇచ్చేసారు అని చెబుతారు.

తిరుచెందూర్ ఆలయం గురించి అద్భుతాలు

భారతదేశంలోని చాలా పురాతన కట్టడాలు, ఆలయాలు వాటితో ముడిపడి ఉన్న నమ్మశక్యం కాని కథలు మరియు అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అదే విధంగా ఈ తిరుచెందూర్ ఆలయం కూడా ఎన్నో అద్భుతాలకు నెలవు. వాటిలో కొన్ని తెలుసుకుందాము.

రహస్యంగా అదృశ్యమైన విగ్రహం

ఆసియా ఉపఖండం అంతటా యూరోపియన్లు అధికారం కోసం అనేక దేశాల మీద దండెత్తి రాజ్యాలను ఆక్రమిస్తున్న కాలంలో జరిగిన ఒక అద్భుతం ఇది. క్రీస్తుశకం 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారితో యుద్ధం జరిగిన సమయంలో డచ్ సైనికుల బృందం తిరుచెందూర్‌లోని ఈ ఆలయంలోనే తమ బస ఏర్పాటు చేసుకున్నారు. తరువాత కాలంలో ఈ ప్రాంతం నుండి వెళ్ళిపోతూ ఇక్కడ ఉన్న ఎన్నో విలువయిన విగ్రహాలను లూటీ చేసి తీసుకెళ్లిపోయారు. 

ఆ సమయంలోనే ఈ దేవాలయంలోని కుమారస్వామి విగ్రహాన్ని చూసి అది పూర్తిగా బంగారంతో చేసినది అని భావించి ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్లారు. ఆలా సముద్రంలో కొంత దూరం వెళ్ళగానే ఒక తీవ్రమయిన తుఫానులో వారు చిక్కుకుపోతారు. కుమారస్వామి విగ్రహాన్ని దొంగిలించటం వల్లనే తమకు ఇలా జరిగిందని భయపడిపోయారు. 

ఆ భయంకరమయిన తుఫాను నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక భయంతో ఆ కుమారస్వామి విగ్రహాన్ని అక్కడే సముద్రంలో వదిలేస్తారు. ఆ మరుక్షణమే అంత భయంకరమయిన తుఫాను ఒక్కసారిగా మాయమయిపోతుంది. డచ్ సైనికులు ప్రాణాలు దక్కితే చాలనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు వదిలేసిన విగ్రహం అక్కడే సముద్రంలో మునిగిపోతుంది. 

కొన్ని రోజుల తరువాత, గుడిలో ఆ స్వామివారికి పూజలు నిర్వహించే వాడమలయప్పన్ పిళ్లై అనే భక్తుడికి ఆ స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు. సముద్రంలో ఒక ప్రాంతంలో పైన ఆకాశంలో గరుడ పక్షి సంచరిస్తూ ఉంటుందని…అదే ప్రాంతంలో సముద్రపు నీటిలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని, అక్కడే నీటి అడుగు భాగంలో విగ్రహం కోసం వెదకమని చెప్పి అదృశ్యమవుతాడు. 

ఆ స్వామి చెప్పిన విధంగానే సముద్రంలో వెదకగా విగ్రహం బయటపడుతుంది. దీంతో ఎంతో భక్తితో ఆ స్వామి విగ్రహాన్ని మరలా ఆలయంలో ప్రతిష్టిస్తారు. ఇదంతా మనం ఆలయంలో గోడలపైన ఉన్న పెయింటింగ్స్ రూపంలో  చూడవచ్చు.

మహిమాన్వితమైన పవిత్ర బూడిద

సముద్రం నుండి బయటకు తీసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చేసిన తరువాత మరొక్క అద్భుతం జరిగిందని చెప్పుకుంటారు. తిరువాయిదురై అనే మఠంలో నివసించే దేశికామూర్తి అనే భక్తుడికి ఆ కుమారస్వామి కలలో కనిపించి తనకు 9 అంతస్తుల రాజ గోపురం నిర్మించాలని చెప్పాడట. 

స్వామి కోరిక ప్రకారం నిర్మాణం ప్రారంభించాడు కానీ పేదవాడైన ఆ దేశికామూర్తి ఆలయం నిర్మాణం కోసం పని చేసే కూలీలకు ప్రతిరోజూ డబ్బులు ఎలా ఇవ్వాలో అర్ధమయ్యేది కాదు. ఆ స్వామి మీద భారం వేసి, స్వామివారి విభూదిని పని చేసేవారికి పంచేవాడు. 

ఆ స్వామి మహిమ వల్లనే కాబోలు…ఆ విభూది తీసుకొని వారు కొద్ది దూరం వెళ్లే సరికి ఆ విభూది బంగారు నాణేలుగా మారిపోయేది. ఈ విషయం తెలుసుకుని, ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారట. చివరికి వారంతా కలిసి గోపుర నిర్మాణం పూర్తి చేసినట్లు చెబుతారు. 

అప్పటి నుంచి ఆ స్వామి విభూదిని ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు భావిస్తారు. ఆ స్వామి విభూదిని నుదుట ధరించడం, ఇంట్లో ఉంచుకోవడం వలన ఆపదలు, అనారోగ్యాలు దూరమవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.

అందమైన విగ్రహ రూపం

ఈ ఆలయంలోని సుబ్రహ్మణేశ్వరుడి తేజో రూపం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధాన్య ముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలాంటి రూపంలో కుమారస్వామి ఉన్న విగ్రహం మన భారతదేశంలో ఇదొక్కటే కావడం విశేషం. బాలుడిగానే రాక్షసులను అంతం చేసి విజయం సాధించాడు కుమారస్వామి. అందుకే ఇక్కడ బాలసుబ్రహ్మణ్యస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. 

ఇక్కడ స్కంద షష్టి అంటే… సుబ్రహ్మణ్యేశ్వర షష్టిని పురస్కరించుకుని ఆరు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో రెండు రూపాల్లో కుమారస్వామి దర్శనమిస్తాడు. శివాలయం, వల్లీ, దేవసేన ఆలయాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.

సునామీని కూడా జయించిన ఆలయం 

ఇక ఈ మధ్య కాలంలో జరిగిన మరొక్క అద్భుతం గురించి కూడా తెలుసుకుందాము. 2004 సంవత్సరంలో దక్షిణభారత తీరప్రాంతాన్ని సునామీ కుదిపేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సునామీలో కడలూరు, పాండిచేరీ ప్రాంతాలలో ఎన్నో ప్రాంతాలను ఆ సముద్రం ముంచేసిన ఘోర విపత్తు మనం మరచిపోలేము. ఎందరో సామాన్య ప్రజలు ఆ సునామీ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. 

అయితే సముద్రం ఒడ్డునే ఉన్న ఈ ఆలయానికి సునామీ వలన కొంచెం కూడా నష్టం కలగలేదు. ఆ ఆలయంలో ఉన్న భక్తులు అందరూ ఎటువంటి ప్రమాదం లేకుండా క్షేమంగా ఉన్నారు. మిగతా ప్రదేశాలను సునామీ ముంచేస్తే ఈ ఆలయం ప్రాంతంలో కొంచెం కూడా నష్టం జరగలేదు. 

ఈ ఆలయం నుంచి సునామీ దాదాపు రెండు కిలోమీటర్లు వెనక్కి తగ్గినట్లు ప్రత్యక్ష్యంగా చూసిన వారు కూడా చెబుతుంటారు. అంతేకాదు, ఈ ఆలయానికి నీటి వలన ఎలాంటి హాని జరగదనే వరం ఉందట. ఈ విషయం ఆలయంలోని శిలాశాసనాలపై రాయబడి ఉన్నట్లు చెబుతారు. ఇది అంతా పూర్తిగా ఆ కుమారస్వామి మహిమగా భక్తులు భావిస్తారు. ఆ దేవుడు తన భక్తులకు సంరక్షకుడిగా నిలబడి అందరి ప్రాణాలు కాపాడాడని నమ్ముతారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top