వేద పురాణాల్లో మహాభారతాన్ని పంచమ వేదంగా చెప్తుంటారు. అలాంటి ఈ పురాణంలో ఎన్నో ఆసక్తికరమైన కధలు, రాజకీయ ఎత్తుగడలు, యుద్ధ నైపుణ్యాలే కాదు, సైన్సుకి కి కూడా అంతు చిక్కని రహశ్యాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాల గురించి వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ గానూ, ఇన్స్పైరింగ్ గానూ ఉంటుంది. ఇద్దరు తల్లుల గర్భంలో పెరిగి, రెండుగా విడిపోయిన శరీర భాగాలతో పుట్టి, అతి పరాక్రమవంతుడిగా మారిన ఒక వీరుడు ఎన్నో రాజ్యాలని జయించినప్పటికీ, చివరకి ఊహించని విధంగా చనిపోవటానికి దారితీసిన పరిస్థితులు ఏమిటో, ఆ పరిస్థితుల వెనుక ఉన్న అసలైన కారణాలు ఏమిటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం.
జరాసంధుని పుట్టుక రహశ్యం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని బృహద్రథుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్లు కాశిరాజుకి పుట్టిన కవల కూతుళ్లు. వారిద్దర్నీ సమానంగా ప్రేమిస్తానని బృహద్రథుడు భార్యలిద్దరికీ మాట ఇచ్చాడు.
అయితే ఎన్ని మంగళ కార్యాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అతనికి పిల్లలు పుట్టలేదు. ఒకసారి చండకౌశికుడనే ముని వీరి రాజ్యానికి వచ్చాడు. పుత్రుణ్ని ప్రసాదించమని రాజు ఆ మునిని ప్రార్థించాడు. ముని ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. కొంత సేపటికి, ఓ మామిడి పండు ముని ఒడిలోకి వచ్చి పడింది.
దాన్ని మంత్రించి రాజు చేతికిచ్చాడు. అతడా పండును తీసుకువెళ్లి భార్యల చేతిలో పెట్టాడు. భార్యల్ని సమానంగా చూస్తానన్న మాటను బట్టి వాళ్లు ఆ పండును రెండు సగాలు చేసి తిన్నారు. ఆ తర్వాత ఇద్దరు భార్యలు గర్భం దాల్చారు. కొంత కాలానికి రాణులిద్దరూ సగం పండుని తినటం వల్ల సగం శరీరాలున్న శిశువులకు జన్మనిచ్చారు.
ప్రాణం లేని ఆ శిశువు యొక్క రెండు శరీర భాగాలు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి వాట్గిని అడవిలో పడవేయమని బృహద్రథుడు ఆదేశిస్తాడు. రాజు ఆదేశానుసారం ఆ శిశువులిద్దరినీ భటులు అడవిలో పడేసి వస్తారు.
అదే అడవిలో జర అనే ఓ రాక్షసి సంచరిస్తూ ఉండేది. ఒకసారి నరమాంసం కోసం వెతుకుతున్న ఆ రాక్షసికి ఈ శిశువులు ఏడుస్తూ కనిపిస్తారు. చూడటానికి ముద్దుగా కనిపిస్తున్న ఆ శిశువుల్ని చంపబుద్ధి కాలేదు ఆమెకి. వెంటనే వారిద్దరినీ తన చేతిలోకి తీసుకోగా, ఊహించని విధంగా రెండు ముక్కలు కలిసిపోయి, సజీవ బిడ్డగా మారాయి. వెంటనే ఆ శిశువు అత్యంత శక్తివంతంగా మారి, పెద్దగా కేకలు వేయడంతో జర చాలా భయపడ సాగింది.
బతికి ఉన్న బిడ్డను తినడానికి ఎంతైనా ఆమె మనసు ఒప్పుకోలేదు. వెంటనే జర ఆ శిశువును రాజు వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా చెప్పింది. ఆ శిశువు మరెవరో కాదు, తన బిడ్డే అని తెలుసుకొన్న బృహద్రథుడు తన కుమారుడిని చూసి ఎంతో సంతోషించాడు. అందుకు కృతజ్ఞతగా జర పేరు కలిసి వచ్చేలా తన బిడ్డకి “జరాసంధ” అని పేరు పెట్టాడు. ఇక్కడ జర అంటే రాక్షసి పేరు; సంధ అంటే చేరడం జరాసంధ అంటే జరచే చేరినవాడు అని అర్ధం.
తర్వాత కొద్దిరోజులకి చండకౌశికుడు మళ్ళీ బృహద్రథుని ఆస్థానానికి వస్తాడు. బృహద్రథుని కుమారుడిని చూసి, ఈ పిల్లవాడు గొప్ప శివభక్తుడిగా ఎదుగుతాడని ఊహిస్తాడు. ఆయన చెప్పినట్లే, జరాసంధుడు గొప్ప శివభక్తుడు అవుతాడు. అంతే కాదు, దానధర్మాల్లో కర్ణుడితో సమానంగా ఉండేవాడు. అడిగిన వారికి కాదనకుండా విరివిగా దానాలు చేసేవాడు.
యుక్తవయసులోకి రాగానే జరాసంధుడు అత్యంత బలవంతుడిగా మారాడు. మగధ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత గిరివ్రజపురాన్ని రాజధానిగా చేసుకొని తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేశాడు. ఎదుటివాడు ఎంత బలసంపన్నుడైనా సరే అతని బలాన్ని హరించే శక్తి కలిగి ఉండేవాడు. ఏ ఆయుధంతోనూ చావురాని విధంగా శివుని నుండీ వరం పొందిన హంస డింభకులనే రాక్షసులని మిత్రులుగా కలిగి ఉన్నాడు జరాసంధుడు. వారి సహాయంతోనే ఎన్నో రాజ్యాలని గెలిచి, తన సామ్రాజ్యంలో కలిపేసుకొన్నాడు. ఇలా రోజురోజుకీ అతని శక్తి పెరుగుతూనే ఉంది. కానీ వారసులు లేకపోవడంతో భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు.
బలరాముడు మరియు కృష్ణుడితో విభేదాలు
జరాసంధునికి అస్తి, ప్రాప్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధురని పరిపాలించే కంసుడు జరాసంధుని దృష్టిని ఆకర్షించాడు. అతని ధైర్యసాహసాలకు ముగ్ధుడై, తన ఇద్దరు కుమార్తెలను అతనికిచ్చి వివాహం చేస్తాడు. దీంతో కంసుడు జరాసంధునికి అల్లుడుగా మారతాడు. ఇదిలా ఉంటే, కొంతకాలానికి కంసుడు తన చెల్లెలు దేవకి కడుపున పుట్టే ఎనిమిదో సంతానం వల్ల చని పోతాడని తెలుస్తుంది. అందుకే భయంతో ఆమెకు పుట్టిన పిల్లలను వరసగా చంపడం మొదలు పెడతాడు. కానీ, చివరికి అనుకోని విధంగా మల్ల యుద్ధంలో శ్రీకృష్ణుని చేతిలో చనిపోతాడు.
దాంతో తన కూతుళ్ళిద్దరూ ఒకేసారి విధవలైపోయారు. తండ్రి దగ్గరికి చేరి, ‘మా భర్తను చంపిన వాణ్ని చంపి ప్రతీకారం తీర్చుకో’మని జరాసంధుని కోరతారు. తన కుమార్తెల పరిస్థితి చూసి జరాసంధకు కోపం వచ్చింది. ఆ తర్వాత, జరాసంధ కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే 23 అక్షౌహిణుల సైన్యంతో మధురపై దాడి చేసాడు, కానీ కృష్ణుడు, బలరాముడు కలిసి జరాసంధుడు అతని సైన్యాన్ని తిప్పికొడతారు.
అంతటితో ఊరుకోక మళ్ళీ మధురపై దాడికి దిగుతాడు. మళ్ళీ కూడా అతని సైన్యాన్ని తిప్పికోడతారు. ఇలా జరాసంధ మధురపై వరుసగా 17 సార్లు దాడి చేసి, ప్రతిసారీ కృష్ణుని చేతిలో ఓడిపోతాడు. అయితే, ఇలా దాడిచేసిన ప్రతిసారీ జరాసంధుని సైన్యాన్ని అయితే తిప్పి కొడుతున్నారు కానీ, మధురలోని ప్రజలు మాత్రం నానా ఇబ్బందులూ పడుతూ వచ్చారు.
తన రాజ్యంలోని ప్రజల ఇబ్బందులని గమనించిన శ్రీకృష్ణుడు ఇక ఎక్కువకాలం తన రాజ్యాన్ని ఇక్కడ ఉంచటం మంచిది కాదని ఊహిస్తాడు. అందుకోసం వెంటనే మరొక చోటకి మార్చాలని అనుకొంటాడు. వెంటనే దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి సముద్రం మద్యలో ఒక అద్భుతమైన నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించమని ఆజ్ఞాపించాడు, తర్వాత కృష్ణుడు మధురలో ప్రజలందరినీ ద్వారక అనే కొత్త నగరానికి తీసుకువెళతాడు.
18వ దాడి సమయంలో జరాసంధ మళ్లీ దాడి చేసినప్పుడు అతను మధుర నగరాన్ని తగులబెడతాడు. ఆ మంటల్లో పడి బలరామ కృష్ణులు కూడా చనిపోయి ఉంటారని భావించి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. కానీ, వాళ్ళు తమ శక్తులను ఉపయోగించి క్షేమంగా ద్వారకకు చేరుకొంటారు.
మరోవైపు జరాసంధుని విజయానికి కారణమైన అతని మిత్రులు హంస డింభకులు కూడా బలరాముని కారణంగా చనిపోతారు. ఇది జరాసంధుని విపరీతమైన బాధకి గురిచేస్తుంది. జరాసంధునికి శిశుపాలుడు మంచి మిత్రుడు. అతనిని తన సేనాపతిగా నియమించుకొంటాడు. తన పరాక్రమాన్ని చాటుకోవటానికి చాలా రాజ్యాలని జయించి, ఆ రాజ్యాల రాజులని బంధించి హింసించే వాడు. అలాగే, తాను చేసే రుద్రయాగం కోసం ఆ రాజులను శివుడికి బలిచ్చే వాడు. ఇంకా ఆ రాజుల సంపదనీ, సైన్యాన్నీ తన నియంత్రణలో ఉంచుకొన్నాడు. ఇలా ఏ రాజ్యంలోనూ లేనంత అతి పెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Lesser-Known Stories of Hanuman
భీముడు మరియు జరాసంధుల మధ్య సంఘర్షణ
పాండవులు ఒకసారి రాజసూయయాగం చేయాలని అనుకొంటారు. అయితే జరాసంధుడిని వదించనిదే ఈ యాగాన్ని తలపెట్టలేమని చెప్తాడు కృష్ణుడు. ఎందుకంటే, జరాసంధుని దగ్గర అంతులేని సైన్యం ఉంది. ఫ్యూచర్ లో జరగబోవు కురుక్షేత్రానికి చాలా సైన్యం అవసరమవుతుంది. అలానే ఎంతోమంది రాజుల మద్దతు కావాల్సి ఉంటుంది. కానీ, ఉన్న రాజులందరూ జరాసంధుని వద్దే బంధీలుగా ఉన్నారు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో సపోర్ట్ చేయాల్సి వస్తే, జరాసంధుడు ఖచ్చితంగా కౌరవుల పక్షానే ఉంటాడు. అతని సైన్య బలం ముందు పాండవుల సైన్య బలం చాలా తక్కువ. అందుకే జరాసంధుని వధించాల్సిన అవసరం ఉందని చెప్తాడు.
నిజానికి పాండవులలో ఏ ఒక్కరికీ జరాసంధుడిని చంపే శక్తి లేదు. అయితే, మహాభారతంలో ఒకే నక్షత్రంలో ఐదుగురు మహా వీరులు పుట్టారు. వారే భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు, బకాసరుడు, కీచకుడు. అయితే, వీరిలో మొదట ఎవరు ఎవరి చేతిలో చంపబడతారో … మిగిలిన ముగ్గురూ కూడా అతని చేతిలోనే చనిపోతారు. ఇక ఆల్రెడీ భీముని చేతిలో బకాసురుడు మరణించాడు. కాబట్టి జరాసంధుడు కూడా భీముని చేతిలోనే చనిపోవాల్సి ఉంది.
శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపటం కోసం భీముడు, అర్జునుడుతో కలిసి బ్రాహ్మణ వేషములో జరాసంధుడి వద్దకు బయలు దేరుతారు. మగధ పొలిమేరలకు చేరు కాగానే జరాసంధుడు పరిపాలిస్తున్న గిరివ్రజం వస్తుంది. ఈ కొండమీదే జరాసంధుడి కోట ఉంటుంది. అయితే ఆ కోటని దాటి లోపలి వెళ్ళటం చాలా కష్టం. శత్రువుల బారినుండీ తన కోటని రక్షించుకోవటానికి జరాసంధుడు చాలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొన్నాడు.
ముందుగా శత్రువులు ఎవరైనా రాజ్యములో ప్రవేశిస్తే ఆటోమేటిక్ గా ఢంకాలు మోగుతాయి. కృష్ణుడి ఆజ్ఞ మేరకు భీముడు వాటిని తన రొమ్ముతో చీల్చి పూర్తిగా ధ్వంసము చేస్తాడు. తర్వాత వీళ్ళు రాజమార్గంలో కాకుండా దొడ్డిమార్గములో రాజధానిలో ప్రవేశిస్తారు. ఇక జరాసంధుడికి బ్రాహ్మణులంటే ఎంతో గౌరవం. ఖచ్చితంగా వారు ఏమడిగినా దానమిచ్చేస్తాడు. అందుకే శ్రీకృష్ణుడు భీమార్జునులకి ఈ ఉపాయం చెప్తాడు.
బ్రాహ్మణ రూపంలో ఉన్న వీరు ముగ్గురూ జరాసంధుడిని కలిసి భిక్ష కోరుతారు. వారేమడిగినా తప్పకుండా ఇస్తానని మాట ఇస్తాడు జరాసంధుడు. వెంటనే, శ్రీకృష్ణుడు యుద్ధ భిక్ష కోరుతాడు. అందుకు జరాసంధుడు భీముడితో మల్లయుద్ధము చేయడానికి అంగీకరిస్తాడు.
భీముడు, జరాసంధుడు మద్య మల్లయుద్ధం మొదలవుతుంది. 27 రోజుల పాటు వీళ్ళిద్దరూ భీకరంగా పోరాడతారు. ఎంతకీ తగ్గకపోయేసరికి జరాసందుడ్ని సగానికి చీల్చమని కృష్ణుడు భీమునికి సూచించాడు. వెంటనే భీముడు ఆ ప్రకారమే అతన్ని రెండు ముక్కలుగా చీల్చేశాడు. అలా చీల్చిన రెండు సగాలను విసిరి పడేయగా… మళ్ళీ అవి వచ్చి అతుక్కొంటాయి. దీంతో జరాసంధుడు సజీవంగా మారి మళ్ళీ పోరాడతారు. అలా రెండుసార్లు జరిగిన తర్వాత కృష్ణుడు మూడోసారి ఒక గడ్డి పరకని తీసుకొని చూపిస్తూ… ఆ చీల్చిన శరీర భాగాలని వ్యతిరేక దిశలో పడేయమని భీమునికి సైగ చేస్తాడు. ఆ ప్రకారమే చేస్తాడు భీముడు. అంతే ఇక ఆ చీలిన శరీర భాగాలు అతుక్కొక పోవటంతో జరాసంధుడు మరణిస్తాడు.
జరాసంధుని మరణంతో కృష్ణుడు చెరసాలలో ఉన్న రాజులందర్నీ విడిపిస్తాడు. ఆయన కుమారుడైన సహదేవుడిని రాజుని చేసి మగధ సింహాసనంపై కూర్చోపెడతారు. అతను పాండవులకు సామంత రాజుగా ఉంటాడు.
భీముడు, జరాసంధుడు మద్య ద్వంద్వ పోరాటం జరిగిన ప్రాంతాన్ని మనం చూడవచ్చు. ఇప్పటికీ ఆ ప్రదేశం ఓ లెజెండరీ ప్లేస్ గా నిలిచి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని “జరాసంధ కా ఆఖారా” అని పిలుస్తున్నారు. ఇది బీహార్ రాష్ట్రంలోని రాజ్‌గిరి పట్టణంలో ఉంది.
నీతి
ఫైనల్ గా ఈ స్టోరీలో మనం తెలుసుకొనే మోరల్ ఏంటంటే, సైన్స్ కే అంతు చిక్కని పుట్టుక, గొప్ప దైవ భక్తి, కర్ణుడిని మించిన దానగుణం, అత్యంత పరాక్రమవంతమైన వీరత్వం ఇన్ని గొప్ప గుణాలని కలిగి ఉన్నప్పటికీ, తానే గొప్ప అని నిరూపించుకోవటం కోసం అన్ని రాజ్యాలని ఆక్రమించుకోవటం, యాగం పేరుతో అత్యంత క్రూరంగా రాజులని బలివ్వటం చేత చరిత్రలో ఓ దుష్ట రాజుగా మిగిలిపోయాడు.
మహాభారతంలో భీముడు మరియు జరాసంధుల పోరాటానికి సంబంధించిన ఈ కథ ప్రపంచంలోని మంచిని సంరక్షించడానికి చెడును ఓడించడం చాలా అవసరమని తెలుపుతుంది.