Mysterious Temples of India

Mysterious Rituals and Practices in Indian Temples

ఇండియా అంటేనే మిస్టరీలకి పెట్టింది పేరు. అలాంటి ఇండియాలో ఎటు చూసినా టెంపుల్స్ కనిపిస్తూనే వుంటాయి. ఒక్కో టెంపుల్ కీ ఒక్కో ప్రత్యేకమైన స్టోరీ ఉంది. అయితే వీటిలో కొన్ని మాత్రం ఇప్పటికీ మిస్టీరియస్ టెంపుల్స్ గా మిగిలిపోయాయి. ఆ టెంపుల్స్ ఏవో…! వాటి మిస్టీరియస్ స్టోరీస్ ఏమిటో… !  తెలియచేసే ప్రయత్నమే మా ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

కొడంగల్లూర్ భగవతి ఆలయం (కేరళ)

సాధారణంగా మనం ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడి దేవుణ్ని భక్తితో కొలుస్తాం. ఇంకా భజనలు, కీర్తనలతో కీర్తిస్తాం. కానీ,  ఒకే ఒక ఆలయంలో మాత్రం అక్కడి దేవత గుడిపైకి రాళ్లు విసురుతారు. ఇంకా తిట్ల దండకం మొదలు పెడతారు. అది మరెక్కడో కాదు, కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం ప్రత్యేకత ఇది. 

ఇక్కడ కొలువై ఉండే భద్రకాళీ అమ్మవారికి ఏటా 7 రోజులపాtu ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తుల ఒంటి మీదకి భగవతి అమ్మవారు వస్తుందని అంటారు. అందుకే పూనకం వచ్చినట్లు ఊగిపోతూ… అమ్మవారిని తమ ఇష్టమొచ్చినట్లు తిడతారు. ఆ తిట్లని మాటల రూపంలోనే  కాదు… పాటల రూపంలో కూడా చూపిస్తారు. ఆ టైమ్‌లో భక్తులు కత్తులు పట్టుకొని ఆలయం చుట్టూ పరిగెడతారు. ఆ కత్తితో తమ తలపై తామే దాడి చేసుకుంటారు. రక్తం కారుతున్నా పట్టించుకోరు. అలాగే గుళ్లోకి వెళ్తారు. 

ఇక్కడ పూజా-కైంకర్యాలు లాంటివి ఉండవు. దానికి బదులు అమ్మవారిని బండ బూతులు తిడతారు. కొబ్బరికాయలు కొట్టటం అసలే ఉండదు. దానికి బదులు గుడిపైకి రాళ్లు విసురుతారు. ఇలా రాళ్లతో కొడుతుండటం వల్ల ఏటా ఆలయం దెబ్బతింటోంది. పూనకం దిగిపోగానే అక్కడే పడిపోతారు. స్పృహ వచ్చాక లేచి భగవతిని దర్శించుకొని వెళ్ళిపోతారు. 

దెయ్యాలు, గాలి వంటివి సోకినవారు ఎక్కువగా ఈ గుడికి వస్తుంటారు. అలాంటివారి ఒంటిమీదకి అమ్మవారు వచ్చి, వారిలో ఉన్న దెయ్యాన్ని పోగోడుతుందని భక్తుల నమ్మకం. అందుకే వాళ్ళు తమ ఒంటిని రక్తం కారేలా గాయ పరుచుకొంటారు. ఉత్సవం ముగిసిన 7 రోజుల తర్వాత వారంరోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో ఆలయంలో అయిన రక్తపు మరకల్ని క్లీన్ చేస్తారు.

స్తంభేశ్వర మందిరం (గుజరాత్)

ఏ టెంపుల్‌ అయినా నేలమీదో… కొండమీదో… ఉంటుంది. కానీ, ఈ టెంపుల్ మాత్రం నీటిలో ఉంటుంది. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇది అప్పుడప్పుడూ కనిపించి, మాయమవుతుంది. గుజరాత్ లో ఉన్న వడోదరలోని స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం యొక్క ప్రత్యేకత ఇది.

ఈ ఆలయం అరేబియా సముద్ర తీర జలాల్లో ఉంది. ఇక్కడి ఈశ్వరుడిని దర్శించుకోవాలంటే, తెగించి సముద్రంలోకి దిగాలి. వచ్చే పోయే అలల ఆటుపోట్లని తట్టుకొంటూ మహదేవుని దర్శించుకోవాల్సి ఉంటుంది.

సముద్ర అలల తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ఆలయాన్ని దర్శించగలం. అప్పుడే అది నీటి నుండీ బయటకి వచ్చి కనపడుతుంది. అలల తాకిడి పెరిగినప్పుడు ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది. కొన్ని గంటల తర్వత మళ్ళీ తిరిగి కనిపిస్తుంది. ఆలయానికున్న ఈ ప్రత్యేకత వల్లే బాగా ఫేమస్ అయింది.

ఒక రకంగా చెప్పాలంటే, ఈ దేవాలయం సందర్శన సాహస యాత్రగా చెప్పవచ్చు. వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అదుపు తప్పినా భక్తుల ప్రాణాలు నీటిలో కలిసి పోతాయి.  అలల తీవ్రత, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఈ ఆలయ దర్శనం ఉంటుంది. ఏ రోజుకారోజు చీకటి పడేసరికి  వెదర్ మారుతూ ఉంటుంది. దూరం నుంచి కేవలం ఆలయం ధ్వజస్థంభం మాత్రమే కనిపిస్తుంది. తీరం నుంచి దేవాలయం వరకూ కట్టిన తాడును పట్టకుకుని మాత్రమే దేవాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఇక్కడ ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులే అక్కడ ఉన్న శివలింగానికి నేరుగా పూజలు చేస్తారు. తీసుకువెళ్లిన పూలను శివ లింగం పై పెట్టి చీకటి పడేలోపు ఒడ్డును చేరుకుంటారు. అయితే వందల ఏళ్లుగా సముద్రపు నీటిలో మునిగి, తేలుతూ ఉన్నా ఈ ఆలయం చెక్కు చెదరక పోవడం ఇక్కడ గమనార్హం. అయితే, పౌర్ణమి రోజున ఇక్కడి లింగం ఒక అద్భుతమైన కాంతితో మెరుస్తుందట.

బ్రహ్మ దేవాలయం (రాజస్థాన్‌)

హిందూ పురాణాల ప్రకారం… త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మను పూజించకూడదని శాపం ఉంది. అందుకే, ఆయనకి ఎక్కడా ఆలయాలు ఉండవు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేవలం  ఒకే ఒక్క ఆలయం మాత్రం ఉంది. అదే… రాజస్థాన్‌ లో ఉన్న పుష్కర్ లోని బ్రహ్మ ఆలయం.  

ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 14వ శతాబ్దంలో నిర్మించారు. చరిత్రని తిరగేస్తే, ఔరంగజేబు మన దేశాన్ని పాలించిన సమయంలో అనేక హిందూ ఆలయాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పుష్కర్‌లో ఆలయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కానీ, బ్రహ్మ ఆలయం మాత్రం చెక్కు చెదరలేదు. ఇక హిందూ ఆలయాలని ఎన్నిటినో ధ్వంసం చేసిన ఔరంగజేబు దృష్టి ఈ ఆలయంపై మాత్రం ఎందుకో పడలేదు. అందుకే, ఇది మిస్టీరియస్ టెంపుల్ గా  నిలిచింది. మార్బుల్స్ తో చెక్కిన ఆ ఆలయం లోపలి గోడలకు భక్తులు సమర్పించిన విరాళాలతో సేకరించిన వెండి నాణేలు అమర్చారు. 

బ్రహ్మ ఒక యజ్ఞం చేయడానికి భూమిపైకి వచ్చి తన ఆలయం కోసం ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. 8వ శతాబ్దంలో, హిందూ ఫిలాసఫర్ అయిన ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడానికి తనను తాను అంకితం చేసుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, మ్యారీడ్ పీపుల్ ని ఇక్కడ ఎలౌ చేయరు. కేవలం అన్ – మ్యారీడ్ వాళ్ళని మాత్రమే ఆలయం లోపలికి అనుమతిస్తారు.  సరస్వతీ దేవి శాపమే దీనికి కారణమని చెప్తారు. 

ఇది కూడా చదవండి: Kasar Devi Temple’s Cosmic Connection

కాల్ భైరవ నాథ్ ఆలయం (వారణాసి) 

ఏ గుళ్లోనైనా లడ్డూనో, పులిహారో ప్రసాదంగా పెడతారు. కానీ, ఈ టెంపుల్‌లో మాత్రం ఆల్కహాల్ ని ప్రసాదంగా ఇస్తారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో శివుడి ప్రతిరూపమైన కాల భైరవనాథ్ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఇదే! 

కేవలం నైవేద్యమే కాదు, ఇక్కడ నైవేద్యంతో సహా దేవుడికి సమర్పించే ప్రతీదాన్నీ మద్యంతోనే తయారుచేస్తారు.  అది విస్కీ కావచ్చు లేదా వైన్ కావచ్చు, మరేదైనా కావచ్చు. అంతేకాదు. ఇక్కడ ప్రధాన దైవంగా భావించే కాలభైరవుడి నోట్లో కూడా ఆల్కహాల్ పోస్తారు. దాన్నే పవిత్ర తీర్ధంగా భక్తులకు పంచుతారు. 

మరో విచిత్రం ఏంటంటే, మామూలుగా ఆలయాల చుట్టుపక్కల షాపుల్లో పువ్వులు, స్వీట్ల వంటివి అమ్మడం కామన్. ఇక్కడ మాత్రం ఏ షాపుకి వెళ్లినా ఆల్కహాలే అమ్ముతారు. 

ఇది పూర్తిగా శివుని అగ్ని రూపమైన కాల భైరవుడికి అంకితం చేయబడింది. కాల్ అంటే ‘మరణం’ లేదా ‘సమయం’. ఎవరినైనా చంపవలసి వచ్చినప్పుడు మాత్రమే శివుడు ఈ రూపాన్ని ధరిస్తాడని చెబుతారు. శివుని ఈ రూపానికి మరణమే భయపడుతుందని అంటారు. వారణాసిని కాశీ అని కూడా అంటారు. కాశీ శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన నగరం కాబట్టి, శివుడు ఇక్కడ కాలభైరవుడిని క్షేత్రపాలుడిగా నియమించాడు. వారణాసిలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో ఈ కాలభైరవుడే నిర్ణయిస్తాడని చెబుతారు. 

నిధివన్ ఆలయం (ఉత్తరప్రదేశ్‌)

కళ్ళ ముందే ఆధారాలు కనపడుతున్నా కొన్ని కొన్ని విషయాల్ని నమ్మాలో, నమ్మకూడదో అర్ధం కాదు. అలాంటి మిస్టరీనే ఉత్తరప్రదేశ్‌లోని బృదావనంలో ఉంది. నిధివనం రంగ మహల్ టెంపుల్ కి రాత్రివేళ రాధాకృష్ణులు వస్తారని, రాసలీలలు ఆడతారని స్థానికుల నమ్మకం.  

అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఈ టెంపుల్‌ని మూసేస్తారు. ఆలయ పరిసరాల్లోకి ఎవ్వర్నీ అనుమతించరు. ఒకవేళ ఎవరైనా రాత్రివేళ రహశ్యంగా ఈ టెంపుల్‌లోకి వెళ్తే… వాళ్ల మెంటల్ కండిషన్ దెబ్బ తింటుంది. చూపు, మాట, వినికిడి శక్తి పోతుంది. ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంది.

ఇక నిధివన్‌లో చెట్లన్నీ మెలికలు తిరిగి… చిత్ర విచిత్రమైన ఆకారాల్లో కనిపిస్తాయి. ఇక్కడి నేలంతా బీటలు బారి ఉన్నా… ఈ చెట్లు మాత్రం ఎప్పుడూ పచ్చదనంతో ఉంటాయి. పగలంతా గుబురుగా కనిపించే చెట్లు రాత్రైతే  గోపికలుగా మారతాయట. తెల్లవారుజామున మళ్లీ అవే చెట్లుగా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు. ఆ చెట్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. సాధారణంగా చెట్ల వేర్లు కిందకి, కొమ్మలు పైకి ఉంటాయి. కానీ, అక్కడ మాత్రం రివర్స్. చెట్ల వేళ్లు పైకి ఉన్నట్లుగా వంకరటింకరగా ఉంటాయి. అంతేకాదు, ఇక్కడ రోజూ రాత్రిపూట ఎవరో నృత్యం చేస్తున్నట్లుగా గజ్జెల శబ్దాలు కూడా వినిపిస్తుంటాయట. 

అలాగే, నిధివన్ లోపల ‘రంగ్ మహల్’ ఆలయం ఉంది. దీన్నే రాధా రాణి హ్రీంగర్-ఘర్ అని కూడా అంటారు.తన చేతులతో స్వయంగా రాధను ఆభరణాలతో అలంకరిస్తాడని చెప్తారు. అందుకే, ఆలయ పూజారులు ప్రతి రాత్రి వారి కోసం గంధపు చెక్కతో తయారు మంచాన్ని సిద్ధం చేస్తారు. తమల పాకు, వేప, వక్క, నీటితో నింపిన కూజా వంటివి కూడా ఆ మంచం పక్కన ఉంచుతారు. ఆ తర్వాత ఆలయానికి తాళాలు వేస్తారు. ప్రతి ఉదయం పూజారి తలుపులు తీయగానే అవన్నీ చెల్లాచెదురుగా కనిపిస్తాయి. 

మరో విచిత్రం ఏంటంటే, ప్రసాదాన్ని 5 ముద్దలుగా చేసి ఆలయంలో పెడతారు. వాటిలో ఒక ముద్ద పూర్తిగాను, రెండు ముద్దలు సగం తినేసినట్లుగాను ఉంటాయి. ప్రతి రోజు ఆ ప్రసాదం ఈ విధంగానే వస్తుంది. ఈ విషయం నిజంగా అంతుబట్టని రహస్యమే! అందుకే నిధివన్‌ ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. 

మహేందీపూర్ బాలాజీ ఆలయం (రాజస్థాన్)

ఏదైనా ఆలయానికి వెళ్ళాలంటే, గంటల తరబడి, రోజుల తరబడి ప్రయాణం చేసి మరీ అక్కడికి చేరుకొంటాం. మొక్కులు చెల్లించుకుంటాం. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మరోసారి ఆ దైవాన్ని దర్శించుకుని ప్రసాదం తీసుకుని వెళ్లిపోతుంటాం. ఇదంతా హైందవ సాంప్రదాయంలో ఏ దేవుని విషయంలోనైనా కామన్ గా జరిగేదే! కానీ, కొన్ని దేవాలయాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఆలయాలు ఇలాకూడా ఉంటాయా అనే సందేహం వస్తుంది. అక్కడ ఆచారాలు, సంప్రదాయాలు చూస్తే మతిపోతుంది. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉన్న మహేందీపూర్ బాలాజీ ఆలయం.

దెయ్యాలూ, భూతాలూ, పిశాచాలూ, చేతబడుల వంటివి వదిలిపోవాలంటే ఈ ఆలయానికి వెళ్ళమని రాజస్థాన్ జనాన్ని అడిగితే చెప్తారు. ఈ టెంపుల్ కి రోజూ వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే, వాళ్లు చూపించే భక్తే భరించలేని విధంగా ఉంటుంది. 

కొందరు సలసలా కాగే నీళ్లను ఒంటిపై పోసుకుంటారు. ఇంకొందరు ఉరి వేసుకున్నట్లు వేలాడతారు. మరికొందరు  గొలుసులతో కట్టేసుకుని తలను గోడకేసి కొట్టుకుంటారు. ఇంకొందరు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు. మరి కొందరు తాళ్లతో తమని తామే కొట్టుకుంటారు. కొందరు భయంకరంగా అరుస్తూ, కేకలేస్తూ, ఏడుస్తూ కనిపిస్తారు. ఇదంతా ఎందుకంటే, తమను దెయ్యాలు వదిలిపోవాలి అంటారు. పూజారులే దగ్గరుండి ఇలాంటి పనులు  చేయిస్తారు. 

ఇక ఇక్కడ ప్రసాదం ఇవ్వరు. ఆలయం నుంచీ వెళ్లిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదట. అలా చూస్తే దెయ్యాల్ని మళ్ళీ తమలోకి రమ్మని పిలిచినట్లట. ఇది నిజమా, కాదా అని ఆలోచిస్తే… ఎవరి నమ్మకాలు వాళ్లవి.

ఇది కూడా చదవండి: Mysterious Powers of Trimbakeshwar Temple

బుద్ధ నీలకంఠ ఆలయం (నేపాల్‌)

పేరు వినగానే ఇదేదో బుద్ధిడి ఆలయం అనుకోకండి. పేరులో బుద్ధ ఉన్నప్పటికీ, ఇది వైష్ణవాలయం. సాక్షాత్తూ ఆ మహా విష్ణువే ఇక్కడ వెలిశాడు. బుద్ధ నీలకంఠ అంటే… ‘పురాతన నీలపు రంగు విగ్రహం’ అని అర్థం. ఈ విగ్రహం ఉన్న ఆలయం నేపాల్‌లోని ఖాట్మండ్ లోయలో ఉంది.

త్రిమూర్తులలో ఒకడైన శ్రీమహావిష్ణువు ఈ ఆలయంలో ఆదిశేషుడి పైన శయన మూర్తిగా మనకు దర్శనమిస్తాడు. ఇక్కడి ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, విష్ణుమూర్తి విగ్రహం సుమారు 5 మీటర్ల పొడవైన రాతితో చెక్కబడి వుంది. ఈ భారీ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది. ఇంత భారీ విగ్రహం నీటిపై తేలడం అంటే అంత ఈజీ కాదు. అదంతా స్వామిమహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు. 

సహజంగా అనేక చోట్ల విష్ణువు శయన మూర్తిగా ఒక పక్కకు తిరిగి పడుకొని ఉండే మూర్తుల్ని మనం చూస్తుంటాం. కానీ, ఇక్కడ మాత్రం స్వామి వెల్లకిలా పడుకొని, ఆకాశం వైపు చూస్తుంటాడు. 1957లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం, 1300 సంవత్సరాల నుంచీ ఈ విగ్రహం ఇలా నీటిలో తేలుతూనే ఉందట. ఇదంతా దైవశక్తిగా భక్తులు నమ్మితే, పరిశోధకులు మాత్రం దీని మిస్టరీ ఛేదించలేక పోయారు. 

జ్వాలాముఖి ఆలయం (హిమాచల్ ప్రదేశ్‌)

ఏ ఆలయంలోనైనా దేవుడు, లేదా దేవతని పూజిస్తారు. కానీ, ఈ ఆలయంలో నిరంతరం వెలుగుతున్న ఓ జ్వాలని దేవతగా భావించి కోలుస్తున్నారు. అదే హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా ముఖీ దేవి ఆలయం. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఆలయ ప్రాంగణలో ఉండే జ్వాల… కొన్ని వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉంది. దానికి e విధమైన ఇంధనంగానీ, నూనె గానీ పోయకుండానే నిరంతరాయంగా అది వెలుగుతోంది.

సతీదేవి తండ్రి దక్షుడు శివుణ్ని తిరస్కరించడంతో మనస్థాపం చెంది ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె చితాభస్మం ఈ భూమిపై 18 వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తి పీఠాలని చెప్పుకుంటున్నాం. ఈ జ్వాలాముఖి క్షేత్రం ఉన్న ప్రాంతంలో అమ్మవారి నాలుక పడిందట. అందుకనే అక్కడ అమ్మవారు నాలుక చాస్తున్నట్లుగా కనిపిస్తుంది. నిరంతరం ఒక జ్వాల ఇక్కడ వెలువడుతూ ఉంటుంది. అనాదిగా ఆరిపోకుండా వెలుగుతున్న ఈ జ్వాల వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టట్లేదు.

జ్వాలాముఖి అంటే నోట్లోంచి మంటలు వస్తున్న అమ్మవారు అని అర్థం. అందుకు ప్రతీకగానే ఇక్కడి మందిరంలో అమ్మవారి విగ్రహం ఉండదు. దానికి బదులుగా కొండ పగుళ్ళనుంచి, చిన్న నీటి కుండం కనిపిస్తుంది. అలాగే, గోడలలోంచి వస్తున్న మంటలను అమ్మవారిగా భావించి పూజలు చేస్తుంటారు

ఈ ఆలయం ధౌలాధర్ పర్వత శ్రేణిలో ఉంది. జ్వాలాముఖి దేవి గర్భగుడి లోపల ఒక రాతిలో చిన్న పగుళ్ల నుండి ఉద్భవించే శాశ్వతమైన జ్వాలగా పూజించబడుతుంది. అయితే ఈ మంటలు ఎప్పుడొచ్చాయో, ఎక్కడి నుంచి పుట్టాయో ఇప్పటికీ మిస్టరీనే! 

లింగరాజ దేవాలయం (ఒడిషా)

హిందువులు అత్యంత విశ్వాసంతో పూజించబడే ఆలయం ఏదైనా ఉందా అంటే అది లింగరాజ దేవాలయం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇక్కడ హరిహరులు ఇద్దరూ పూజించ బడతారు. ఒడిషాలోని భువనేశ్వర్‌లో ఉన్న  అతిపెద్ద దేవాలయం ఈ లింగరాజ దేవాలయం. 

ఈ మిస్టీరియస్ టెంపుల్ క్రీస్తు పూర్వం 1090 నుండి 1104 నాటిది. 54 మీటర్ల ఎత్తు ఉండే మందిరం నిజానికి శివునికి అంకితం చేయబడింది. ప్రధాన ఆలయ సముదాయంలో 150 వరకూ  చిన్న దేవాలయాలు ఉన్నాయి. లింగరాజ దేవాలయంలో  ఉన్న మిస్టీరియస్ థింగ్ ఏంటంటే, అది పూర్తయ్యే దశలో ఉన్నప్పుడు, పూరీ జగన్నాదుని ఆరాదించటం వల్ల అదే రూపాన్ని సంతరించుకొంది. అందుకే ఇక్కడ హరిహరుల యొక్క ఉనికిని అనుభవిస్తారు. దీనికి కారణం పూరీలో జగన్నాథ ఆలయాన్ని నిర్మించిన గంగా రాజవంశానికి చెందిన రాజులు ఈ ఆలయాన్ని కూడా నిర్మించటం. గర్భగుడి లోపల, శివలింగం స్వయంభువుగా వెలిసింది. అందువలన, ఇది స్వయంభూ లింగంగా పిలవబడుతుంది. 

ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయాన్ని ఎటునుంచి చూసినా…  ఆప్టికల్ ఇల్యూషన్ కారణంగా, ఆలయం ఉన్నదానికంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. 

వైష్ణో దేవి ఆలయం (జమ్ము- కాశ్మీర్)

హిందువులు అష్టాదశ శక్తి పీఠాలను పవిత్రమైన ప్రదేశాలుగా భావించి కొలుస్తుంటారు. అలాంటి శక్తిపీఠాలన్నిటికంటే అత్యంత పవిత్రమైన ప్రదేశమే ఈ వైష్ణో దేవి ఆలయం. కారణం అష్టాదశ శక్తి పీఠాలంటే కేవలం సతీదేవి శరీర భాగాలు పడ్డ ప్రదేశాలే! కానీ వైష్ణో దేవి ఆలయం ఉన్న గుహ ముగ్గురమ్మలు కలిసి ఉన్న పరమ పవిత్రమైన శక్తిపీఠం. 

జమ్ము- కాశ్మీర్ లోని త్రికూట పర్వతం మీద ఉన్న పురాతన గుహలో మాతా వైష్ణో దేవి దేవాలయం ఉంది. వైష్ణో దేవి అంటే.. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. ఇక్కడ ముగ్గురమ్మలు తమ అంశతో ఒక స్త్రీని సృష్టించి, తన కర్తవ్యం నెరవేర్చగానే తిరిగి ఆమె విష్ణువులో ఐక్యమై పోయేలా చేస్తారు. ఆమే ఈ వైష్ణో దేవి. ఈ పవిత్ర ఆలయం భారత్‏లోని మిగిలిన అమ్మవారి ఆలయాల కంటే మిక్కిలి పవిత్రంగా భావిస్తారు.

సాక్షాత్తూ ఆ దుర్గాదేవే వైష్ణోదేవి రూపంలో ఇక్కడ అవతరించినట్లు అక్కడి ప్రజలు చెప్తారు. నిజానికి వైష్ణో దేవి ఆలయం యొక్క ఖచ్చితమైన వయస్సు ఒక రహస్యం. కొంతమంది ఇది మహాభారత కాలం నాటిదని చెప్తే, ఇంకొంతమంది దాదాపు మిలియన్ సంవత్సరాల పురాతనమైనది అని చెప్తుంటారు. అయితే,  ఓ భక్తుని కలలో వైష్ణో దేవి కనిపించి, ఈ ప్రదేశాన్ని చూపించిన తర్వాత, ఈ మందిరం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కనుగొనబడింది.

పురాణాల ప్రకారం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమయ్యే ముందు వైష్ణోదేవిని ఆరాధించమని శ్రీకృష్ణుడు పాండవులకి సలహా ఇచ్చాడని చెప్తారు. అంతటి మహిమ ఉన్న వైష్ణోదేవి ఆలయం ఇక్కడ ఎప్పుడు వెలిసిందో అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీనే! 

చివరిమాట 

ఇప్పటిదాకా మనం చెప్పుకొన్న ఈ మిస్టీరియస్ టెంపుల్స్ లో ఉన్న మిస్టరీస్ ని డీకోడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ, ఏ ఆర్కియాలజిస్ట్ కూడా సాల్వ్ చేయలేకపోయాడు. అందుకే అంటారు ఇండియా అంటేనే మిస్టరీలకి నిలయమని. అలాంటి ఇండియాలో ఉండే ఈ మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top