Lord Krishna's Death Story, Hindu Mythology

Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi

మహాభారత ఇతిహాసం గురించి, అందులోని ఎందరో యోధుల గురించి, కురుక్షేత్ర సంగ్రామంలో వారి ప్రాముఖ్యత గురించి ఇప్పటివరకూ అనేక విషయాలు తెలుసుకున్నాము. అయితే ఈ ఇతిహాసంలో అతి ముఖ్య పాత్ర పోషించిన శ్రీకృష్ణుడు మరణించిన తరువాత అతని శరీరం ఏమైందో చాలా మందికి తెలియదు. అంతేకాదు, అతని శరీరంనుండీ విడిపోయిన తర్వాత కూడా అతని ఆత్మ, మరియు గుండె ఇంకా సజీవంగానే మిగిలి ఉన్నాయి. అవి ఇప్పటికీ ఓ ప్రదేశంలో ఉన్నాయని మీకు తెలుసా! అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ రహస్యాన్ని ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా శ్రీకృష్ణుడు ఎలా మరణించాడో కొంచెం క్లుప్తంగా తెలుసుకొని ఆ తరువాత అతని అంత్యక్రియల గురించి తెలుసుకుందాము. 

గాంధారి శాపం

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, తన కుమారులందరూ మరణించడానికి కారణం కృష్ణుడేనన్న  కోపంతో గాంధారి కృష్ణుడిని శపిస్తుంది. కౌరవుల వలే  నీవు కూడా దిక్కులేని చావు చస్తావు. అలాగే యాదవ వంశంలో సోదర సమానంగా ఉన్నవారు అందరూ ఒకరినొకరు చంపుకొని చివరికి యాదవ వంశం నశిస్తుందని ఈ శాపం. 

మునుల శాపం

ఒకసారి కొంతమంది మునులు శ్రీకృష్ణుడిని చూడడానికి ద్వారకకు వస్తారు. ఆ మునులను చూసిన యాదవులకు వారిని ఆట పట్టించాలన్న దుర్బుద్ధి కలుగుతుంది. అలాంటి వారిలో కృష్ణుడికి జాంబవతితో కలిగిన కుమారుడు అయిన సాంబుడు కూడా ఉన్నాడు. 

ఇతను ఓ గర్భిణీ స్త్రీ వేషం వేసుకొని, తన స్నేహితులతో వచ్చి ఆ ఋషులను కలిసి తనకు పుట్టబోయే బిడ్డ గురించి అడిగి ఋషులను ఎగతాళి చేయాలని అనుకుంటాడు. అయితే, నిజం గమనించిన ఒక ఋషి కోపంతో సాంబడు ఒక ఇనుప గోళానికి జన్మనిస్తాడని, అది పూర్తిగా యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని శపిస్తాడు. అంతేకాదు, మీ కపటనాటకానికి ఇదే తగినశిక్ష అని ఆగ్రహంతో ఆ ఋషులు శ్రీకృష్ణుడిని చూడకుండానే వెళ్ళిపోతారు. 

యాదవులలో  అంతర్యుద్దం 

ఆ మరుసటిరోజే సాంబుడు మునుల శాపము ఫలించి ఓ ఇనుప గోళాన్ని కంటాడు. దీంతో భయపడిపోయిన అతను యాదవులతో కలిసి ఉగ్రసేన మహారాజు దగ్గరకు వెళ్లి విషయం చెప్తాడు. అప్పుడు ఆ రాజు వెంటనే ఆ ఇనుప గోళాన్ని అరగదీసి సముద్రంలో పడేయమని చెబుతాడు. 

ఆలా అరగదీసిన తరువాత ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది. వాళ్ళు ఆ ముక్కను కూడా సముద్రంలో పడేసి వెళ్ళిపోతారు. ఇక ఆ విషయము అంతటితో అందరూ మరచిపోయారు. 

జరా అనే ఒక వేటగాడికి ఆ ఇనుప ముక్క దొరుకుతుంది. అతను ఆ ఇనుప ముక్కను తన బాణాలలో ఒకదానికి బాణం కొనగా ఉపయోగిస్తాడు. 

కాలం గడిచిపోతుంది. మహాభారత యుద్ధం జరిగిపోతుంది. యుద్ధం పూర్తయి కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఒకానొక రోజు  శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం, పాంచజన్యం, రథం, ఇంకా బలరాముడి ఆయుధాలు అన్నీ అకస్మాతుగా మాయమవుతాయి. అంతా గమనించిన కృష్ణుడు యుగాంతం అయ్యే సమయం దగ్గర పడిందని తెలుసుకొని యాదవులందరినీ ద్వారక వదిలి ప్రభస్సా సముద్రం దగ్గరికి వెళ్ళమని ఆదేశిస్తాడు. 

అక్కడ అందరూ మద్యం సేవించి, మద్యం మత్తులో ఒకరినొకరు నిందించుకొని చంపుకుంటారు. అలా యాదవ వంశము అంతా సమూలముగా నాశనము అయింది. ఆ విధంగా గాంధారి శాపం ప్రభావం వలన యాదవులందరూ చనిపోతారు. 

ఇదికూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha

బలరాముని నిర్యాణము 

యుగాంతం జరగబోతుందని తెలిసి తానుకూడా ఇక అవతారాన్ని చాలించదల్చుకొని ఒకచెట్టు కింద కూర్చొని యోగ సమాధిలోకి వెళ్ళిపోతాడు బలరాముడు. ఆ తర్వాత ఓ పెద్ద నాగుపాము రూపంలో సముద్రము మీదుగా వెళ్ళి ఆకాశములో కలిసిపోతాడు. 

శ్రీకృష్ణుడి మరణం

ఇక చివరికి శ్రీకృష్ణుడు తాను కూడా అవతారము చాలించవలసిన సమయము వచ్చిందని అనుకున్నాడు. వెంటనే ద్వారకని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక చెట్టు నీడలో విశ్రమిస్తాడు. అటుగా వచ్చిన ఓ వేటగాడు పొదల మధ్యలో నుండి శ్రీకృష్ణుడి కాలి వేలును చూసి ఒక జింక అని భ్రమించి తనకు దొరికిన ఇనుప ముక్కతో చేసిన బాణం వేస్తాడు. దీనితో శ్రీకృష్ణుడికి మరణం సంభవిస్తుంది. 

మరి కొన్ని పురాణాల కథల ప్రకారం, త్రేతాయుగంలో రాముడు చెట్టు చాటు నుండి వాలిని బాణం వేసి చంపినందుకుగానూ ద్వాపర యుగంలో వాలి వేటగాడి రూపంలో చెట్టు చాటు నుండి బాణం వేసి శ్రీకృష్ణుడిని సంహరించాడని చెప్తారు. 

ఇక్కడి వరకూ అందరికీ తెలిసిందే! కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమీటంటే… మరణం సంభవించిన తరువాత శ్రీకృష్ణుడి శరీరం ఏమయిందో… ఆ తర్వాత ఏం జరిగిందో… దాని వెనుక ఉన్న ఒక ముఖ్యమయిన కథ ఏమిటో.. ఎవ్వరికీ తెలియదు. దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం.

వేటగాడు పొదల మధ్యలో నుండి వేసిన బాణం శ్రీకృష్ణుడి పాదానికి తగలగానే అక్కడ రక్తం ధారగా పారి భూమిలోకి ఇంకుతుంది. భయపడిపోయిన వేటగాడిని శ్రీకృష్ణుడు సమాధానపరిచి పంపించేస్తాడు. 

వేటగాడు వెళ్ళిపోగానే శ్రీకృష్ణుడు మరణించి అతని ఆత్మ శరీరాన్ని వదులుతుంది. ఈలోగా, శ్రీకృష్ణుడి శరీరంలోనుండి భూమిలోకి వెళ్లిన ఆ రక్తం భూమి కింద పాతాళలోకం చేరుతుంది. అక్కడ ఉన్న ఒక రాతి ప్రతిమ పెదవుల మీద ఈ నెత్తుటి చుక్కలు పడతాయి. ఈ రాతి శిల శతకి అనే ఒక రాక్షస యువతిది. ఇప్పుడు ఈ శతకి ఎవరు అనే కథ తెలుసుకుందాము.

శతకి మరియు శతక్షుల కథ

శతకి ఒక రాక్షస యువతి. ఆమెకు ఆరుగురు అన్నలు ఉన్నారు. అందరిలోకి చిన్నవాడి పేరు శతక్షు. రాక్షస జన్మ ఎత్తినప్పటికీ ఇతను మహా విష్ణుభక్తుడు. ఇతను విష్ణువుని పూజించటం మిగతా ఐదుగురు సోదరులకు, వీళ్ళ తండ్రికి అస్సలు ఇష్టం లేదు. వీళ్ళ చెల్లెలు అయిన శతకి కూడా ఈ విషయంలో శతక్షుకి వ్యతిరేకం అయినప్పటికీ శతక్షు అంటే చెల్లెలికి చాలా ఇష్టం. అందుకే ఆమె విష్ణువు గురించి వ్యతిరేకంగా, చెడుగా శతక్షు ముందు ఎప్పుడూ మాట్లాడదు. సోదరుడి విష్ణుభక్తిని గౌరవించింది.

శతక్షు ప్రతిరోజూ ఎంతో భక్తితో విష్ణువును పూజించేవాడు. ఒక రోజు, శతక్షు పూజకు సిద్ధమవుతుండగా, పూజకు అవసరమయిన మామిడి ఆకులు కనిపించలేదు. రెండు రోజుల క్రితమే శతక్షు భూమిపైకి వెళ్లి పూజకు అవసరమైన మామిడి ఆకులను తెచ్చుకుంటాడు. ఇప్పుడవి కనిపించకపోవటంతో చాలా ఆశ్చర్యపోతాడు. 

అయితే శతక్షుని పూజని ఆపటం కోసం అతని మిగతా ఐదుగురు సోదరులు కావాలనే ఆ మామిడి ఆకులను దాచిపెడతారు. పూజ చేసే సమయం దగ్గర పడటంతో ఏమి చెయ్యాలో తెలియక శతక్షు ఆందోళన చెందుతాడు. అప్పుడు అక్కడే ఉన్న అతని సోదరులు నవ్వుకుంటూ వెళ్ళటం చూసి వాళ్ళే మామిడి ఆకులను దాచారని గ్రహిస్తాడు. 

అయినప్పటికీ, వారిని కోపగించకుండా, దోషం తనదే అని తనను తాను నిందించుకుంటాడు. ఏమి చెయ్యలేక బాధపడుతూ కూర్చుంటాడు. తన అన్న పరిస్థితిని చూసి చెల్లెలు ఎంతో బాధ పడుతుంది. మిగతా సోదరులతో కలిసి తాను కూడా తన అన్నకి ఇబ్బంది కలిగించినందుకు అపరాధభావంతో కృంగిపోతుంది. వెంటనే మామిడి కొమ్మలను దాచి వుంచిన ప్రదేశానికి వెళ్లి వాటిని తీసుకువచ్చి శతక్షుడికి ఇచ్చేస్తుంది. శతక్షుడు ఎంతగానో సంతోషించి పూజ చేసుకోవటానికి వెళతాడు. 

అయితే జరిగిన విషయం తెలుసున్న మిగతా సోదరులు కోపంతో శతకి మీద దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపేస్తారు. ఇంతలో పూజ ముగించుకొని వచ్చిన శతక్షుడు గృహంలో తన చెల్లెలి మృతదేహం చూసి ఆశ్చర్యపోతాడు. ఏమి జరిగిందో విచారించే లోపే… ఇంకొక సారి విష్ణు పూజ చేస్తే నీ గతి కూడా ఇంతేనని బెదిరిస్తారు.  శతక్షుడు వారిపై ఎదురు దాడికి దిగుతాడు. దీంతో అతనిని కూడా చంపబోతే… తండ్రి వచ్చి కాపాడతాడు.

విషయం తెలుసుకున్న తండ్రి శతక్షుడు చేస్తున్న పనికి తానుకూడా అసహనం వ్యక్తం చేస్తాడు. శతకి చనిపోవడానికి శతక్షుడే కారణం అని తండ్రి కూడా అతనినే నిందిస్తాడు. మహావిష్ణువు నిజంగానే గొప్పవాడు, మహిమ కలవాడు అయితే నీ చెల్లెలిని బ్రతికించమని అడగమంటాడు. అలా ఆమెను బ్రతికిస్తే తాను కూడా మహావిష్ణువును పూజిస్తానని చెప్తాడు. 

వెంటనే శతక్షుడు ఎంతోసేపు తీవ్రంగా మహావిష్ణువును స్మరిస్తూ వేడుకుంటాడు. అయినా ఏమి జరగదు. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న మిగతా సోదరులు శతక్షుడిని చూసి హేళనగా నవ్వుతారు. అప్పుడు శతక్షుడి తండ్రి నీ విష్ణువుకు మహిమలు లేవు, కానీ నాకు శతకిని బతికించే శక్తి ఉంది అంటాడు. అయితే తాను చెప్పినట్లు చేస్తే శతకిని బతికిస్తానని అంటాడు. చెల్లెలి మీద ప్రేమతో వేరే ఆలోచన లేకుండా శతక్షుడు తండ్రి మాటకు ఒప్పుకుంటాడు. 

దుష్టశక్తులను ఉపయోగించి శతకిని వెంటనే బ్రతికిస్తాడు. మళ్ళీ ప్రాణాలతో బ్రతికిన శతకిని చూసి శతక్షుడు ఎంతగానో సంతోషిస్తాడు. తండ్రికి తాను ఇచ్చిన మాట గుర్తుకువచ్చి తన చెల్లెలిని బతికించినందుకు ఏమి చెయ్యాలో చెప్పమని తండ్రిని అడుగుతాడు. అప్పుడు అతను నీవు మహావిష్ణువును చంపాలని కోరతాడు. ఊహించని ఆ కోరికకు శతక్షుడు భయపడిపోతాడు. అది అసాధ్యమని తండ్రితో చెబుతాడు. 

అప్పుడు శతక్షుడి తండ్రి శతక్షుడితో ఒక రహస్యం గురించి చెబుతాడు. అది ఏమిటంటే, మహావిష్ణువును చంపగల శక్తి శతక్షుడికి నిజంగానే ఉండటం. చాలా కాలం క్రితం, శతక్షుడి తండ్రి రాక్షసుల గురువయిన శుక్రాచార్యుడి దగ్గర శిష్యరికం చేశాడు. అతని భక్తికి, సేవకి మెచ్చి శుక్రాచార్యుడు ఒక మహిమగల ఉంగరాన్ని ఇస్తాడు. ఆ ఉంగరం వేలికి ధరించినవారు ఎవ్వరినైనా ఒక్కసారి తాకి భస్మం చేయగలరని చెప్తాడు. అయితే, ఆ ఉంగరం కేవలం భూమి మీద మాత్రమే పని చేస్తుందని అని కూడా చెప్తాడు.

అయితే, దానిని ధరించాలని ఎంత ప్రయత్నించినప్పుటికీ ఆ ఉంగరం అతనికి కానీ, అతని కుమారులకి కానీ పట్టదు.  కానీ ఆశ్చర్యంగా శతక్షుడి వేలికి మాత్రం పడుతుంది. దీంతో శతక్షుడు పెరిగి పెద్దవాడు అయ్యేదాకా వేచి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని చెప్తాడు. 

తండ్రి ఆదేశం మేరకు ఆ ఉంగరం వేలికి ధరించగానే సరిగ్గా సరిపోతుంది. కానీ ఇచ్చిన మాట ప్రకారం తండ్రి కోరిక తీరుద్దామంటే ఆ కోరిక ధర్మవిరుద్ధంగా ఉంది. అందుకే తాను ఆ పని చేయలేనని చెప్తాడు. అందుకు ఆగ్రహించిన తన తండ్రి శతక్షుడిని చంపేయవలసిందిగా మిగితా కొడుకులని కోరతాడు. వారు శతక్షుడిని తాకగానే  ఆ ఉంగరం శక్తి వల్ల తీవ్రగాయాలయ్యి మరణిస్తారు. 

ఇది చూసిన శతక్షుడి తండ్రి తనకు ఇచ్చిన మాట తప్పినందుకు అతనిని తీవ్రంగా దూషిస్తాడు. అతనికి ఎంతో ఇష్టమయిన చెల్లెలిని వెంటనే శిలగా మార్చేస్తాడు. ఆమె మళ్ళీ బతకాలంటే మహావిష్ణువు మరణించి అతని నెత్తురు ఆ శిల మీద పడ్డప్పుడు మాత్రమే ఆమె మళ్ళీ బతుకుతుందని చెప్తాడు. శతక్షుడు ఆ ప్రదేశం విడిచి వెళ్లకుండా అతనిని బందిస్తాడు.

అప్పటినుండీ కొన్ని వందల సంవత్సరాలపాటు అక్కడే చెల్లెలి శిలతో పాటు ఆ గుహలోనే ఉండిపోతాడు. తండ్రి ఇచ్చిన శాపం వలన విష్ణుమూర్తిని కూడా పూజించలేకపోతాడు శతక్షుడు.

ఇలా కొంతకాలం జరిగిన తరువాత, శ్రీకృష్ణుడు మరణిస్తాడు. అతని కాలి నుండి పారిన నెత్తురు భూమిలో ఇంకి అక్కడి నుండి పాతాళ లోకంలో ఉన్న శతకి శిల మీద పడుతుంది. ఆశ్చర్యంగా ఆమె వెంటనే బతుకుతుంది. చుట్టూ చూసిన శతకి అక్కడే పక్కనే నీరసంగా పడి ఉన్న తన ప్రియమయిన అన్న శతక్షుడిని చూసి ఆనందంతో అతని దగ్గరకు పరిగెడుతుంది. 

నిజంగానే మళ్ళీ బతికిన తన సోదరిని చూసిన శతక్షుడి ఆనందానికి అవధులు ఉండవు. ఈ వింత ఎలా జరిగిందని శతక్షుడు శతకిని అడుగుతాడు. అప్పుడు ఆమె పైనుండి పడుతున్న నెత్తుటి ధారను చూపిస్తుంది. అది చూసిన వెంటనే శతక్షుడు ఏమి జరిగిందో ఊహించి, జరగబోయేది తలుచుకొని భయపడిపోతాడు. 

తనలాంటి ఒక చిన్న రాక్షసుడి కోసం మహావిష్ణువు తన ప్రాణాలను వదలటం తలుచుకొని ఎంతో బాధపడతాడు. మహావిష్ణువు చూపించిన ఈ కరుణకు తాను అర్హుడినా అని దిగులుపడతాడు. ఆ దిగులుతోనే అసలు ఆ నెత్తుటి ధార ఎక్కడినుండి వచ్చిందో తెలుసుకోవాలని తన సోదరితో కలిసి భూలోకానికి బయలుదేరతాడు. అక్కడకు చేరుకోగానే అక్కడ ఎన్నో వందల మంది విలపిస్తూ కనిపిస్తారు. 

వాళ్ళను దాటుకొని ముందుకు వెళ్ళగానే అక్కడ కట్టెల మీద ఉన్న పార్ధివదేహాన్ని చూస్తారు. ఆ మరణించిన వ్యక్తి ముఖం చనిపోయినా కూడా మంచి తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నది. ఆ ముఖంలో చనిపోయిన ఛాయలు ఏమాత్రం కనిపించటం లేదు. వెంటనే ఆ శరీరం మహావిష్ణువుదే అని శతక్షుడు గుర్తిస్తాడు. దుఃఖం ఆపుకోలేక అక్కడే చిన్న పిల్లవాడిలాగా ఏడుస్తాడు. మహావిష్ణువు మరణానికి కారణం తానే అనే భావనతో కుమిలిపోతాడు. 

అక్కడే ఆ సమూహంలో పాండవులు కూడా ఉంటారు. నిరంతరాయంగా విలపిస్తున్న శతక్షుడిని చూసిన ధర్మరాజు ఆశ్చర్యపోతాడు. శతక్షుడి పక్కనే నిలబడి మౌనంగా విలపిస్తున్న శతక్షుడి చెల్లెలు శతకిని పలకరించి వారి వివరాలు అడుగుతాడు. శతకి అన్ని వివరాలు ధర్మరాజుతో చెబుతుంది. అంతా అర్ధం చేసుకున్న ధర్మరాజు శతక్షుడిని ఓదార్చి అక్కడ ఉన్న సమస్య గురించి శతక్షుడికి వివరిస్తాడు. 

అక్కడ సమస్య ఏమిటంటే గంధపు చెక్కలు పేర్చి స్వచ్చమయిన నెయ్యి వేసి ఋషి పుంగవులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదివినా కూడా ఆ శరీరం అగ్నికి ఆహుతి అవ్వదు. ఏమి చెయ్యాలో తెలియక అందరూ ఆందోళన చెందుతూ ఉంటారు. సూర్యాస్తమయం గడిచేలోపు దహన సంస్కారాలు పూర్తి చేయాలని అందరి ప్రయత్నం. ఈ సమస్యను శతక్షుడికి వివరించి అతను ఏమన్నా సహాయం చెయ్యగలడేమో అని ధర్మరాజు ప్రార్ధించి అడుగుతాడు.

వెంటనే శతక్షుడికి అక్కడ ఉన్న సమస్యకి పరిష్కారం తానేనన్న విషయం అర్ధమవుతుంది. మహావిష్ణువు తన దహన సంస్కారాలు శతక్షుడి వలన జరగాలని నిర్ణయించాడని అర్ధం చేసుకుంటాడు. 

వెంటనే శ్రీకృష్ణుడి పార్థివదేహం వద్దకి వచ్చి భక్తితో శ్రీకృష్ణుడి చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రార్థిస్తాడు. వెంటనే ఆ ఉంగరం నుండి వచ్చిన అగ్నిలో ఆ పవిత్ర పార్థివదేహం కాలిపోతుంది. ఆ అగ్నికీలలలో శ్రీకృష్ణుడితో పాటుగా శతక్షుడు కూడా కాలిపోతాడు. 

తన అన్న అగ్నిలో కాలిపోవటం చూసిన శతకి వెంటనే శతక్షుడిని బయటకు లాగాలని ప్రయత్నిస్తుంది. కానీ శతక్షుడు నవ్వుతూ ఆమెను వెనక్కు తోసేస్తాడు. తన అన్నతో పాటే చనిపోవాలని తలచి శతకి కూడా ఆ మంటలలో దూకాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆమెను పాండవులు ఆపుతారు. మరికొద్ది క్షణాలలో శ్రీకృష్ణుడు, శతక్షుడు, ఇంకా అతని వేలికి ఉన్న ఉంగరం కూడా పూర్తిగా కాలిపోతారు. 

అక్కడ ఉన్నవారు అందరూ శ్రీకృష్ణుడిని, శతక్షుడిని పొగుడుతూ స్మరిస్తారు. శతకిని పాండవులు తమతో తీసుకువెళతారు. ద్రౌపది ఆమెను తమతో ఉండమని సాదరంగా ఆహ్వానిస్తుంది. అయితే, తన సోదరుడు మరణించిన చోటనే తాను కూడా మరణించాలని తలచి రాత్రి సమయంలో అందరూ నిద్రించాక ఆ ప్రదేశానికి వెళుతుంది. 

అక్కడ మహావిష్ణువు, తన సోదరుడు అయిన శతక్షుడు ఇద్దరూ నవ్వుతూ కనిపిస్తారు. అప్పుడు శతక్షుడు శతకిని దగ్గరకు రమ్మని పిలుస్తాడు. దగ్గరకు వెళ్లిన శతకిని మహావిష్ణువు శతక్షుడితో పాటుగా వైకుంఠానికి తీసుకువెళ్తాడు. అక్కడ వైకుంఠంలో శతక్షుడు, శతకి ఇద్దరూ భక్తితో మహావిష్ణువుని సేవించుకుంటూ ఉండిపోతారు. 

ఇక మరో కథలో బలరామ, శ్రీకృష్ణులిద్దరికీ అర్జనుడే స్వయంగా అంత్యక్రియలు నిర్వహిస్తాడని చెపుతారు. 

అయితే శ్రీ కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అర్జనుడికి ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అదేమిటంటే, శ్రీ కృష్ణుడి శరీరమంతా కాలి బూడిదైపోయినా అతని గుండె మాత్రం కాలదు. దీనికి ఒక కథ ఉంది. దాని ప్రకారం ఇప్పటికీ ఆ గుండె సజీవంగానే ఉంది. మరి ఆయన గుండె ఏమైంది? ఏ ప్రదేశంలో ఉంది? ఆ కథ గురించి తెలుసుకుందాం. 

ఇది కూడా చదవండి: Unexplained Himalayan Natural Phenomena

శ్రీ కృష్ణుడి గుండె ఉన్న ప్రదేశం

అర్జునుడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు నిర్వహిస్తున్న  సమయంలో  శరీరమంతా కాలిపోతుంది కానీ, కృష్ణుడి గుండె మండదు. ఏం చేయాలా అని దిక్కుతోచని స్థితిలో ఉన్న అర్జనుడికి  ఎప్పటిలాగే, స్వర్గం నుండి ఒక దివ్య స్వరం ప్రతిధ్వనిస్తుంది. కృష్ణుని హృదయాన్ని దుంగతో కట్టి సముద్రంలోకి విసిరేయమని. ఆ ప్రకారమే అర్జనుడు చేయగా… అది ద్వారక యొక్క పశ్చిమ తీరం నుండి పూరీ ఉన్న తూర్పు తీరం వరకు తేలుతూ వస్తుంది. 

కృష్ణుడిని చంపిన వేటగాడు జర, బిస్వా బసు అనే శబర గిరిజన వ్యక్తిగా పునర్జన్మ పొందుతాడు. అతను పూరి చుట్టుపక్కల ఉన్న అడవులలో ఓ ఘనీభవించిన నీలి రంగు రాయిని కనుగొంటాడు. ఆ పెద్ద రాయే శ్రీకృష్ణుని హృదయం. అందుకే ఆ రాతిని నీల మాధవునిగా పూజిస్తాడు. నిజానికి జగన్నాథుడు గిరిజనుల దేవుడు. 

ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఆదివాసీలచే పూజించబడుతున్న ఆ అద్భుతమైన నీలం రాయి గురించి వింటాడు. ఆ ప్రదేశాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించగా… ఆ రాయి మాయమవుతుంది. పశ్చాత్తాపంతో నిరాహార దీక్షకి పూనుకొన్న ఆ రాజుకి జగన్నాథుడు కలలో కనిపించి అక్కడ తనకి ఓ గుడి నిర్మించవలసిందిగా ఆదేశిస్తాడు. విగ్రహాలు చెక్కటానికి కావలసిన పెద్ద చెక్క దుంగలు సముద్రతీరానికి వాటంతట అవే కొట్టుకు వస్తాయని… వాటితో దారు విగ్రహాలు రూపొందించమని చెప్తాడు.  

కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ, విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలో తోచక రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ ఒక వికలాంగుడి రూపంలో అక్కడికి వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలన్నిటినీ చేక్కుతాననీ, అయితే ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ, ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ, తన పనికి ఆటంకం కలిగించకూడదని షరతు విధిస్తాడు. 

రాజు అందుకు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి ఆదేశంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం అక్కడ దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. 

చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు ఇక్కడ  పూజలందుకుంటాయని చెప్తాడు. అంతేకాదు, వాటికి ప్రాణప్రతిష్ఠ కూడా తానే స్వయంగా చేస్తాడు. అప్పుడే జగన్నాథుడి మూలవిరాట్టులో బ్రహ్మపదార్థం వచ్చి చేరుతుంది. అందుకే ఇప్పటికీ ఆ గుండె పూరీ జగన్నాధస్వామి విగ్రహంలో సజీవంగా ఉంది. అందుకే ఈ ఆలయానికి ఎంతో మహిమ ఉంది. 

అయితే ఇక్కడ ప్రతి పన్నెండేళ్లకి ఒకసారి విగ్రహాలు మారుస్తారు. అలా మార్చినప్పుడు శ్రీకృష్ణుడి గుండెను కూడా మారుస్తారని చెబుతారు. 

శ్రీ కృష్ణుడి ఆత్మ ఉన్న ప్రదేశం

కేరళలోని త్రిసూర్ జిల్లాలో పరమ పవిత్రమైన విష్ణుక్షేత్రం ఒకటి ఉంది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి   ‘గురువాయూరప్పన్’ అనే పేరుతో కొలవబడుతున్నాడు. ఈ ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ కలిసి ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. 

పాతాళశిలతో నిర్మితమైన ఈ విగ్రహాన్ని తన తండ్రి  వసుదేవుడి వద్దనుండీ శ్రీకృష్ణుడు అందుకున్నాడు. దానిని ద్వారకలో ప్రతిష్ఠించి నిత్యం పూజించేవాడని పురాణాలు చెబుతున్నాయి. 

స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమని చెప్పాడని పురాణప్రతీతి. 

ఉద్ధవుని మాట మేరకు బృహస్పతి వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా మారింది. 

అయితే శ్రీ కృష్ణునికి అంతగా ఆరాధ్యనీయమైన ఈ విగ్రహంలోనే శ్రీ కృష్ణుని ఆత్మ వచ్చి ప్రవేశించిందనీ… అందుకే ఆ విగ్రహం ప్రపంచంలో మరే ఇతర విగ్రహం లేనంత అందంగా ఉంటుందనీ చెప్తుంటారు. అప్పటినుండీ గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.

శ్రీ కృష్ణుడు తన దేహాన్ని విడిచిపెట్టిన ప్రదేశం

కృష్ణుడు ఒక రావి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకున్నప్పుడు, జర అనే వేటగాడు వచ్చి బాణం వేసిన ప్రదేశాన్ని ‘భాల్క తీర్థం’ అంటారు. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్రలో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన సోమనాథ్ ఆలయానికి సమీపంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే దాదాపు 1000 ఏళ్ల నాటి అశ్వత్ద వృక్షం ఉంటుంది. 

పాదానికి గాయం అయిన తరువాత, కృష్ణుడు హిరణ్య నది ఒడ్డున ఉన్న ఒక గుహలోకి వెళతాడు. అనంతరం త్రివేణి సంగమం దగ్గర తుది శ్వాస విడిచాడు. ఆ తర్వాత నిజ ధామ్ కు బయలుదేరతాడు. కృష్ణుడి దహనం ఇక్కడే జరిగిందని నమ్ముతారు. దీనిని ఇప్పుడు ‘దేహోత్సర్గ్’ అని పిలుస్తారు.

ద్వారక మునిగిపోవడం 

శ్రీకృష్ణ, బలరాములిద్దరికీ అంత్యక్రియలు పూర్తిచేసిన మరుసటి రోజే ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోతుంది. అది జరగటానికి కొద్దిసేపటి ముందే అర్జనుడు ద్వారకలో మిగిలి ఉన్న యాదవ స్త్రీలందరినీ హస్తినకి తరలిస్తాడు. తర్వాత పాండవులు కూడా తమ ప్రాణాలను విడుస్తారు. అంతటితో ద్వాపర యుగం ముగుస్తుంది.

చివరిమాట 

శ్రీకృష్ణుని భక్తుడు కావడం ప్రతి హిందువుకు గర్వకారణం. అలాగే, కృష్ణుడు బోధించిన గీత వినటం ప్రతి వ్యక్తి జీవితానికి ముక్తి దాయకం. అయితే శ్రీ కృష్ణుడు ఎలా మరణించాడు? అనే దాని గురించి చాలా కథలు ఉన్నాయి కానీ, మరణానంతరం అతని మృతదేహానికి ఏమి జరిగింది? అనే దాని గురించి మాత్రం అతి రహశ్యంగా ఉంచారు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top