మహాభారతం అంటే గొప్ప గొప్ప వీరులే కాదు, దీర వనితలు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కొక్కరూ ఒక్కో రకంగా కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రభావితం చేశారు. అయితే, యుద్ధంతో కానీ, యుద్ధ ఫలితంతో కానీ సంబంధం లేకపోయినా… కేవలం ఒకే ఒక మహిళ మాత్రం తన వారసత్వాన్ని మొత్తం పణంగా పెట్టి, పాండవుల విజయానికి కారణమయింది. రాజ వైభోగాలున్నా వాటిని ఎప్పుడూ కోరుకోలేదు. ఒక సాధారణ మహిళగానే జీవనం సాగించింది. రాక్షస వంశంలో పుట్టినా… చివరికి దేవతగా మారి ఆరాధింప బడుతుంది. ఆమె ఎవరో… భారతంలో ఆమెకున్న ప్రత్యేక స్థానం ఏమిటో… ఈ ఆర్టికల్ ద్వారా మనం తెలుసుకుందాం.
ఈ రోజు మహాభారతంలో మనం చెప్పుకోబోయే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ పేరు హిడింబి. ఈమెకే పల్లవి అనే మరో పేరు కూడా ఉంది. ఈమె పాండవులలో రెండవ వాడైన భీముని భార్య అని అందరికీ తెలిసిందే! సాదారణంగా ఈమె స్టోరీ గురించి కూడా చాలామందికి తెలుసు. కానీ, ఈమె పరోక్షంగా పాండవులకి ఎలా సహాయపడింది? వారి క్షేమం కోసం తన కొడుకుని, మనవడిని యుద్ధ రంగానికి ఎలా బలిచ్చింది? శ్రీకృష్ణుని కోసం ఆమె ఏం త్యాగం చేసింది? ఇలాంటి ఎన్నో రహశ్యాల గురించి తెలుసుకొనే ముందు అసలు భీముడు హిడింబిని కలవటానికి దారి తీసిన పరిస్థితుల గురించి సింపుల్ గా చెప్పుకుందాం. ఈ స్టోరీ మహాభారతంలోని ఆదిపర్వంలో 18 వ ఆశ్వాసంలో ఉంది.
దుర్యోధనుని దురాలోచన
దుర్యోధనుడు కపట బుద్ధితో పాండవులని అంతమొందించాలని ఒక పధకం పన్నుతాడు. ఆ పధకం ప్రకారం, వారణావతం అనే ప్రాంతంలోని లక్క ఇంటిలో పాండవులు నివసించేలా చేస్తాడు. ఆ లక్క ఇంటిని లక్క, మట్టి, నెయ్యి, మిశ్రమంతో నిర్మించేలా చేస్తాడు.
హస్తినలో దుర్యోధనుని కుతంత్రం తెలుసుకున్న విదురుడు అసలు విషయం పాండవులకి తెలిసేలా చేస్తాడు. దీంతో ముందు జాగ్రత్తగా భీముడు ఒక సొరంగ మార్గాన్ని తవ్వుతాడు. ఊహించినట్లుగానే ఒకరోజు పాండవులంతా నిద్రిస్తున్న సమయంలో ఆ లక్క ఇంటిని తగలబెడతారు.
అప్పుడు భీముడు తన తల్లి మరియు సోదరులందరినీ తన భుజాలపై ఎక్కించుకొని సొరంగ మార్గం గుండా ఒక అడవిలోకి తీసుకు వెళ్లి పడుకోబెడతాడు. తన వారంతా నిద్రిస్తూ ఉంటే… తాను మాత్రం నిద్ర మేల్కొని వారికి పహారా కాస్తూ ఉంటాడు.
మనుషుల ఉనికిని పసిగట్టిన హిడింబ
ఆ అరణ్య ప్రాంతంలో హిడింబ, మరియు అతని సోదరియైన హిడింబి అనే భయంకరమైన రాక్షసులు నివసిస్తూ ఉన్నారు. పాండవులు ఆ అడవిలోకి రావటంతో హిడింబ మనుషుల ఉనికిని పసిగట్టాడు. వెంటనే అతను తన సోదరి అయిన హిడింబిని పిలిచి, వారిని ఆకర్షించి, ఉచ్చులోకి లాగమని ఆదేశిస్తాడు. అప్పుడు వారందరినీ చంపి తినవచ్చని, ఈ రకంగా తమ ఆకలి తీర్చుకోవచ్చని చెప్తాడు.
హిడింబి భీముడిని కలవటం
హిడింబి అయిష్టంగానే తన సోదరునికి విధేయత చూపి… సరస్సు వద్దకు వెళ్ళింది. అక్కడ నిద్రిస్తున్న పాండవులను చూసింది. ఆమె వాళ్ళ అందమైన రూపాలని మరియు గొప్ప ప్రకాశాన్ని చూసి ఆశ్చర్యపోయింది, ముఖ్యంగా వారందరిలో అత్యంత బలవంతుడు మరియు ధైర్యవంతుడు అయిన భీమునిది.
ఆమె మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడింది. అంతేకాదు, అతనిని తన సోదరుడి బారి నుండి రక్షించుకో వాలని నిర్ణయించుకుంది. వెంటనే, హిడింబి ఒక అందమైన స్త్రీగా మారిపోయింది. భీముని దగ్గరకు వచ్చి మెల్లగా నిద్ర లేపింది. తన గురించి తాను పరిచయం చేసుకొంది. తాము రాక్షస జాతికి చెందిన వారిమని తాను, తన సోదరుడితో కలిసి ఈ అడవిలోనే నివసిస్తూ ఉన్నారని తెలిపింది. అంతేకాదు, తన సోదరుడు మిమ్మల్ని, మీ సోదరులందరినీ చంపాలని నిర్ణయించుకున్నాడని తెలిపింది.
భీమునిపై తన ప్రేమని తెలియచేసిన హిడింబి
తన సోదరుడి ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చానే కానీ, తనకు అలాంటి ఉద్దేశ్యమే లేదని, పైగా మిమల్ని రక్షించాలని ఉందని హిడింబి భీమునితో చెప్తుంది. అంతేకాక, తొలిచూపులోనే నాకు మీపై ప్రేమ కలిగిందని, నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నానని, పారిపోయి తనని పెళ్లి చేసుకోమని వేడుకుంది.
ఆమె నిజాయితీకి భీముడు ఆశ్చర్యపోయాడు ఇంకా ఆమె పట్ల జాలిపడ్డాడు. అయితే, సోదరుడి బారి నుండి తనని రక్షించడానికి అంగీకరించాడు. కానీ, తమ రాజ్యాన్ని తిరిగి పొందే వరకు తాను కానీ, తన సోదరులు కానీ బ్రహ్మచర్యం పాటిస్తామని ప్రతిజ్ఞ చేసి ఉన్నందున, ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు.
హిడింబి త్యాగం
భీమునిపై ప్రేమ తనకి ఆనందాన్ని ఇచ్చినా… అతన్ని పొందటం కోసం సోదరునితో తన సంబంధాన్ని త్యాగం చేసింది. భీముని ఆశయాలు, మరియు బాధ్యతలు నెరవేర్చాలంటే, అతనని ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని తలిచింది. అందుకోసం తన అన్న అడ్డు కాకూడదని భావించింది. ఒక గొప్ప మంచి కోసం తన సోదరుడిని ఒదులుకోవటానికి కూడా సిద్ధపడింది.
ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology
భీముడు మరియు హిడింబల మధ్య యుద్ధం
ఎంతసేపటికీ హిడింబి తిరిగి రాకపోవడంతో… హిడింబ తన సోదరిని వెతుక్కుంటూ వెళతాడు. దారిలో ఒకచోట తన సోదరి భీమునితో మాట్లాడుతూ ఉండటం చూస్తాడు. వెంటనే ఆవేశం ఆపుకోలేక “నేను నిన్ను ఆ మానవులని చంపడానికి పంపాను. కానీ నీవు అతనితో మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళముందే అతడిని నేనే చంపేస్తాను.” అంటూ భీమునిపై దాడికి దిగుతాడు హిడింబ.
అయితే, భీముడు కూడా ఏం తీసిపోలేదు, అతనితో ద్వంద్వ యుద్ధానికి సవాలు చేశాడు. ఇంకా అతని సోదరులకు గానీ, లేదా హిడింబికి గానీ హాని కలుగనివ్వను అని చెప్తాడు. భీముని మాటలకు హిడింబ మరింత ఆవేశంతో అతనిపై పూర్తి స్థాయిలో దాడిచేస్తాడు.
ఇలా కొన్ని గంటల పాటు వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు కొట్టుకోవడానికి చెట్లు, రాళ్లు, కొండలను ఉపయోగించి వాటిని ముక్కలు చేశారు. వాటి తాకిడికి అడవి అంతా కంపించేంత భయానక వాతావరణం ఏర్పడింది. ఈ భీకర పోరాటం తరువాత భీముడు హిడింబని చంపుతాడు.
ఇక తన సోదరులను ప్రమాదం నుండి రక్షించానని అనుకొని సంతోషంలో మునిగి తేలతాడు. తర్వాత హిడింబి దగ్గరికి వెళ్లి, ఆమెకి తనపై ఉన్న ప్రేమ మరియు విధేయతకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన సోదరుడిని చంపినందుకు క్షమించమని కోరాడు.
కుంతి అంగీకారం
తన ప్రేమ కోసం అన్ననే త్యాగం చేసిన హిడింబికి ప్రస్తుతం తాను తప్ప మరెవరూ దిక్కులేరని తలుస్తాడు. వెంటనే హిడింబిని వెంటబెట్టుకొని భీముడు తన తల్లి దగ్గరికి వెళ్తాడు. జరిగిన విషయమంతా తల్లితో చెప్తాడు.
అప్పుడు కుంతి హిడింబి చేసిన త్యాగానికి ఆమెని కీర్తిస్తూ… తమపై చూపిన గౌరవానికి అభినందిస్తూ… తన కుమారుడిపై ఉన్న ప్రేమకి సంతోషిస్తూ… ఈ వివాహానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తుంది.
అయితే, తన కుమారులు తిరిగి తమ రాజ్యాన్ని పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారని తెలిపింది. కానీ తమ కోసం ఎవ్వరూ చేయలేనటువంటి త్యాగం చేసినందువల్ల నా కుమారుడు తప్పక నిన్ను వివాహమాడతాడని చెప్తుంది కుంతి. వెంటనే హిడింబిని పెళ్లి చేసుకోవాల్సిందిగా భీముడ్ని ఆజ్ఞాపిస్తుంది.
భీమునికి ఇచ్చిన మాట
భీముడు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకుని పెళ్లి చేసుకుంటానని, అయితే పెళ్లి తర్వాత కొద్దికాలం మాత్రమే తనతో కలిసి ఉంటాననీ చెప్పాడు. పాండవ యువరాజుగా తిరిగి తన కర్తవ్యాన్ని నిర్వహించాల్సి ఉందని, కౌరవులపై న్యాయం కోసం పోరాడాలని చెప్పాడు.
భీముని సందిగ్ధతను అర్థం చేసుకున్న హిడింబి అతని నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాట కూడా ఇస్తుంది. తాను ఇచ్చిన మాట మేరకు కొంతకాలమే భీమునికి భార్యగా ఉండేందుకు సిద్ధపడింది.
భీమునితో వివాహం
రాక్షస స్త్రీ అయిన హిడింబి కోరుకున్న ప్రకారం భీముడిని వరించి పెళ్లి చేసుకుంది. కుంతి మరియు పాండవుల సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకొన్నారు. ప్రకృతి అందాలను అన్వేషిస్తూ, కలిసి కొన్ని ఆనందకరమైన రోజులను గడిపార
హిడింబి కూడా జీవితాంతం పాడవుల క్షేమాన్నే కోరుకుంది. రాక్షస లక్షణాలన్నీ విడిచిపెట్టి సాత్విక మహిళగా జీవితం గడిపింది. ఈ ప్రయత్నంలో తన జాతికి పూర్తిగా దూరమైంది. అలాగని రాజ విలాసాలను ఎప్పుడూ అనుభవించాలని అనుకోలేదు.
ఘటోత్కచుని జననం
కొంతకాలానికి హిడింబి గర్భవతి అయింది. ఒక కొడుకుకు జన్మనిచ్చింది. అతనికి ‘ఘటోత్కచ’ అని పేరు పెట్టారు. అతని తలపై వెంట్రుకలు లేకపోవటం మరియు తల కుండ ఆకారంలో ఉండటంచే ఇతనికి ఈ పేరు పెట్టబడింది.
కొడుకును శక్తివంతుడిగా తీర్చిదిద్దిన హిడింబి
ఘటోత్కచ ఒక అద్భుతమైన పిల్లవాడు. అతను తన తల్లిదండ్రులిద్దరి ఉత్తమ లక్షణాలను వారసత్వంగా పొందాడు. భీముని యొక్క బలం, ధైర్యం మరియు హిడింబి యొక్క రూపాన్ని మార్చే మరియు మాంత్రిక సామర్థ్యాలను కలిగి ఉన్నాడు.
ఇంకా పెద్దల పట్ల చాలా విధేయత కలిగి ఎంతో గౌరవప్రదంగా నడుచుకొనే వాడు. అతను తన తండ్రిని ఎంతగానో ప్రేమించేవాడు. ప్రతి విషయంలోనూ అతనిని అనుసరించేవాడు.
తండ్రికి తగ్గ తనయుడిగా ఘటోత్కచుడిని శక్తివంతుడిగా తీర్చి దిద్దింది హిడింబి. అస్త్ర, శస్త్ర విద్యల్లో గొప్పవాడిని చేసింది. కష్ట కాలంలో పాండవులను కలిసిన హిడింబి యుద్ధం అనేది ఎప్పుడైనా జరిగితే వారికి సమానమైన శక్తిసామర్ధ్యాలు కలిగిన కుమారుడిని అందించాలని నిర్ణయించుకుంది. అందుకు తగినట్లుగా ఘటోత్కచుడిని పెంచింది. పాండవులతో సమానంగా పోరాడగల నైపుణ్యంలో శిక్షణ ఇప్పించింది.
తల్లి దండ్రుల ఆశయాల్ని గౌరవించిన ఘటోత్కచుడు
పెరిగి పెద్దవాడైన ఘటోత్కచుడు ఏనాడూ కూడా తన తల్లి హిడింబి ఆశలను వమ్ము చేయలేదు. ఆమె కోరుకున్నట్లు మహా బలశాలి, బుద్ధిశాలిగా ఎదిగాడు. హిడింబి లాగానే ఘటోత్కచుడు కూడా ఏనాడు తాను రాజభోగాలు కావాలనుకోలేదు. ఇందులో తల్లి పాత్రే చాలా కీలకం. రాజకుమారులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగాడు ఘటోత్కచుడు.
ఘటోత్కచుడు తన తండ్రికి విధేయుడని వాగ్దానం చేసాడు మరియు అతని ఆశయానికి ఎల్లప్పుడూ మద్దతు ఇస్తానని కూడా మాట ఇస్తాడు. భీముడు తన కుమారుడిని చూసి గర్వపడి తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పించాడు.
అతను పాండవుడిగా తన కర్తవ్యం గురించి అలానే తన పెద్ద సోదరుడు యుధిష్ఠిరుని పాలనను పునరుద్ధరించడానికి తన లక్ష్యం గురించి కూడా చెప్పాడు. భవిష్యత్తులో కౌరవులతో జరిగే యుద్ధంలో తన సహాయం తనకు అవసరమని, సమయం వచ్చినప్పుడు తనతో చేరేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాడు. అంతేకాక, యుద్ధంలో నీవు అజేయుడు అవుతావని, దేవతల రాజు ఇంద్రుడి దివ్య ఆయుధం తప్ప మరే ఆయుధం నుండీ నీకు ప్రాణ హాని కలిగదని భీముడు ఘటోత్కచునికి వరం కూడా ఇస్తాడు.
ఇది కూడా చదవండి: Gandhari’s Prophecy and Afghanistan’s Future
ఘటోత్కచుని వివాహం
హిడింబి మరియు ఘటోత్కచుడు భీముని పిలుపు కోసం ఎదురుచూస్తూ అడవిలోనే ఉండిపోయారు. అడవిలోని ఇతర జీవులకు సహాయం చేస్తూ, దానధర్మాలు చేస్తూ ఉండేవారు. ఘటోత్కచుడికి వివాహ వయస్సు రావటంతో ఐలావతి అనే రాక్షస కన్యనిచ్చి వివాహం జరిపించింది హిడింబి.
బార్బారీకుడి జననం
కొంతకాలానికి ఘటోత్కచుడు మరియు ఐలావతి దంపతులకి ఒక కొడుకు పుడతాడు. అతని పేరు బార్బారీకుడు. అయితే, ఐలావతి మరోపేరు మౌర్య. ఈమె చాలా శక్తివంతమైన స్త్రీ. తన కుమారుడైన బార్బారీకుడిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వీరుడిగా తయారు చేస్తుంది. అంతేకాదు, ఎప్పుడూ ఓడిపోయే వారి పక్షాన ఉండాలని తల్లి ఆదేశిస్తుంది. ఈ బార్బారీకుడికి తన తల్లి మూడు వరాలు కూడా ఇస్తుంది.
రణరంగంలోకి ఘటోత్కచుడు
సంవత్సరాలు గడిచిపోయాయి. పాండవులు మరియు కౌరవుల మధ్య కురుక్షేత్ర రంగంలో యుద్ధం ప్రారంభమైంది. భీముడు ఘటోత్కచుడికి సందేశం పంపాడు. అతనితో యుద్ధంలో పాల్గొనమని కోరాడు. వెంటనే ఘటోత్కచుడు తన తండ్రి ఆజ్ఞను పాటించి తన రాక్షస సైన్యంతో కురుక్షేత్రానికి వెళ్లాడు. ముందుగా పాండవులందరినీ ఆప్యాయంగా పలకరించాడు. ఆ తర్వాత పాండవ సైన్యంలో చేరి కౌరవ సేనలతో వీరోచితంగా పోరాడాడు.
శత్రు శ్రేణుల మధ్య విధ్వంసం సృష్టించడానికి అతను తన ఆకారాన్ని మార్చడం మరియు మాంత్రిక శక్తులను ఉపయోగించటం వంటివి చేశాడు. ఇలా వివిధ రూపాల్లోకి మారి ఎంతోమంది శత్రువులని సంహరించాడు. చివరికి కర్ణుడితో పోరాటానికి దిగుతాడు. ఇద్దరూ ఎంతోసేపు వీరోచితంగా పోరాడతారు.
కర్ణుని వద్ద ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధం ఉంది. దీనిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించటం కుదురుతుంది. అందుకే దీనిని అర్జనుని కోసం దాచి ఉంచుతాడు. కానీ అర్జనుని కాపాడే క్రమంలో శ్రీకృష్ణుడు దానిని ఘటోత్కచునిపై ప్రయోగించేలా చేస్తాడు. ఈ విధంగా ఘటోత్కచుడు మరణిస్తాడు.
కురుక్షేత్రంలో బార్బరీకుడు
బార్బారీకుడు అత్యంత శక్తివంతుడు. అతను కేవలం మూడంటే మూడే బాణాలతో ఈ యుద్ధరంగంలో ఉన్నవారినందరినీ చంపేయ గలడు. అలాంటి వీరుడు ఈ యుద్ధరంగంలో ఉంటే ఫలితాలు తారుమారు అవుతాయని గ్రహించి… శ్రీకృష్ణుడు అతనిని ఒక కోరిక కోరతాడు.
యుద్ధ రంగానికి ఒక వీరుడి తల కావాలి. నీకంటే వీరుడు ఈ ప్రపంచంలోనే లేరు కాబట్టి నీ తల కావాలి అని చెప్తాడు. సంతోషంగా తన తల నరికి ఇస్తాడు బార్బరీకుడు. అయితే, కురుక్షేత్రాన్ని చూడాలని అతని ఆశ కారణంగా కురుక్షేత్రానికి దూరంగా ఒక కొండపై ఇతని తలని ఉండేలా చేస్తాడు శ్రీకృష్ణుడు. అలా బార్బారీకుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.
కొడుకు, మనుమడిని త్యాగం చేసిన హిడింబి
అర్జునుడికి అడ్డంకులు తొలగిపోవడం అంటే పాండవుల విజయానికి బాటలు వేసినట్లే! ఇలా ధర్మాన్ని కాపాడటం కోసం హిడింబి తన కొడుకుని, మనుమడిని ఒకే సారి యుద్ధరంగానికి సమర్పించింది. ఈ రకంగా హిడింబి చేసిన\ త్యాగం చరిత్రలో నిలిచిపోయింది.
శ్రీకృష్ణుని వరం పొందటం
యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు హిడింబిని కలుస్తాడు. కొడుకు, మనుమడి మరణానికి చింతిస్తాడు. యుద్ధాన్ని నిలువరించే శక్తి ఉన్నప్పటికీ… యుద్ధం జరిగేలా చేస్తాడు శ్రీకృష్ణుడు. అయినా ఆయన్ని హిడింబి పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆమె ఔన్నత్యానికి సంతోషించిన కృష్ణుడు హిడింబి త్యాగానికి గర్విస్తున్నానని అన్నాడు.
ఈ సందర్భంగా హిడింబిని దేవతగా సంబోధించాడు. ఆ తర్వాత హిమాలయాలకి వెళ్లి తపస్సు చేసుకోమని ఆజ్ఞాపిస్తాడు. ఇంకా ముందు తరాల వాళ్ళు తనని ఒక దేవతగా భావించి పూజిస్తారని వరమిస్తాడు. అలా తపస్సుకు వెళ్లిన హిడింబి శ్రీకృష్ణుడి వరంతో దేవతగా నిలిచింది. ఇప్పటికీ ఘటోత్కచుడి వారసత్వం కొనసాగుతోంది. వారు హిడింబిని తమ దేవతగా కొలుస్తారు.
హిడింబి ఆలయాలు
- భీముని భార్య హిడింబికి హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలిలో ఓ ఆలయం ఉంది. దానిని ‘హిడింబాదేవి ఆలయం’ అంటారు. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన శిల ఉంది. దానినే హిడింబాదేవిగా ఘటోత్కచుడి వారసులు నమ్మి పూజిస్తారు. స్థానిక భాషలో ఆ రాయిని ‘డోంగ్’ అంటారు. డోంగ్రీ దేవిగా వీరు హిడింబిని కొలుస్తారు.
- కుల్ రాజవంశస్తులు హిడింబి దేవికి ఈ ఆలయం నిర్మించారు. పగోడా శైలిలో ఉండే ఈ ఆలయం ఎత్తయిన దేవదారు వృక్షాల నడుమ ఎంతో మనోహరంగా ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ జంతు బలులు ఇచ్చేవారు. ఇప్పుడు నిషేధించారు.
- భీమునికీ హిడింబకీ యుద్ధం జరిగిందని తెలియచేసే ఒక రాక్ ఉత్తరాఖండ్‌లోని భీమ్తల్ అనే సరస్సు సమీపంలో ఉంది. ఈ రాతిని హిడింబి అనే పేరుతో పిలుస్తారు.
- నాగాలాండ్‌లోని అతిపెద్ద పట్టణం డిమాపూర్. నిజానికి దీని అసలు పేరు ‘హిడింబాపూర్’ అని చెబుతారు.
- ఇక హిడింబి పేరుతో ఉన్న ఆలయాలు ఉత్తరాదిలో అక్కడక్కడా కనిపిస్తాయి.
- నేపాల్‌లోని హెటౌడా అనే ఊరిలో హిడింబ ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ ఆమెను ‘భూతన్దేవి’ అన్న పేరుతో కొలుచుకుంటారు.
- గుజరాత్లో లావణ అనే గ్రామంలో మనకి హిడింబి కుండం, హిడింబి ఆలయాలను కలిగి ఉన్న ఓ వనం కనిపిస్తుంది. ఆ వనానికి ‘హిడింబి వనం’ అని పేరు.
చివరిమాట
భీముడు మరియు అతని రాక్షస భార్య హిడింబి కథ అంచనాలను మించిన ప్రేమ కథ. దీని మూలం గుండె యొక్క లోతైన మూలల్లో ఉంది. స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో చేసిన త్యాగాలు విధిని రూపొందించగలవని ఇది మనకు గుర్తు చేస్తుంది. వీరి అసాధారణ ప్రయాణం ప్రేమ, భక్తి మరియు నిస్వార్థత యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
ఏదేమైనా హిడింబి ధర్మం గెలవాలని కోరుకున్న ధీర వనిత. భార్యగా భీముడి మేలు… పాడవుల క్షేమం కోరుకుంది. రాక్షస స్త్రీగా జన్మించినా సామాన్య మహిళగా జీవనం సాగించింది. చివరకు దేవతగా పూజలు అందుకుంటోంది.