లోక కళ్యాణం కోసం శ్రీమహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడని చెప్పుకున్నాము. అవే దశావతారాలు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఆ దేవదేవుడు ఎత్తిన అవతారాలు అన్నీ ఏదో ఒక రకమయిన విశిష్ట సందేశాన్ని ఈ చరాచర సృష్టికి నిగూఢంగా తెలుపుతాయి. ఇక ఈ దశావతారాలలో శ్రీమహావిష్ణువు యొక్క నాలుగవ అవతారం అయిన నరసింహావతారం గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.
శాపగ్రస్థులయిన జయ విజయులు
బ్రహ్మాండ పురాణం ప్రకారం వరుణుడికి అతని భార్య స్తుతకు కలిగిన ఇద్దరు కుమారులే ఈ జయ మరియు విజయ. వీరు ఇద్దరూ మహావిష్ణువు చెంత ఉండి, ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ, ఆయనను సేవిస్తూ ఉండేవారు.
ఒకసారి, బ్రహ్మదేవుని మానస పుత్రులయిన సనక, సనాతన, సనందన, మరియు సనత్కుమారులు మహావిష్ణువు దర్శనం చేసుకోవాలని వైకుంఠాన్ని సందర్శిస్తారు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నారని, ఈ సమయంలో దర్శనానికి పంపించటం కుదరదని అంటారు. దీనికి కోపగించిన ఆ నలుగురు ఋషులు వీరిద్దరినీ భూలోకంలో రాక్షసులుగా జన్మించమని శపిస్తారు.
ఈ శాపానికి జయవిజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమయిన మహావిష్ణువును ప్రార్ధించి, తమను శాప విముక్తులను చెయ్యమని వేడుకుంటారు. అయితే మహాఋషులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యమని, కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి రెండు మార్గాలు చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణుభక్తులుగా భూమి మీద ఏడు జన్మలు తీసుకోవడం. ఇక రెండవది విష్ణుద్వేషులుగా మూడు జన్మలు తీసుకోవడం.
మహావిష్ణువుకు దూరంగా ఏడు జన్మలు ఉండటం కన్నా అతనికి శత్రువుగా మూడు జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని తలుస్తారు. ఈ కోరిక ప్రకారం, వీరు భూలోకంలో మహావిష్ణువుకు బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు, వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా మూడు అవతారాలు ఎత్తవలసి వస్తుంది.
సత్యయుగంలో ఈ జయ విజయులలో విజయుడు హిరాణ్యాక్షుడిగా, మరియు జయుడు హిరణ్యకశిపుడిగా, ఇలా సోదరులుగా జన్మిస్తారు. త్రేతాయుగంలో రావణుడు, మరియు కుంభకర్ణులుగా జన్మిస్తారు. ఇక ద్వాపరయుగంలో శిశుపాలుడు, మరియు దంతవక్రునిగా జన్మిస్తారు. అలా సత్యయుగంలో జన్మించిన హిరాణ్యాక్షుడిని, హిరణ్యకశిపుడిని చంపడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలే దశావతారాలలో మూడవదయిన వరాహ, నాలుగవదయిన నరసింహ అవతారాలు.
ముల్లోకాలను గడగడలాడించిన సోదరులు
సప్తఋషులలో ఒకడయిన కశ్యప మహామునికి, దక్షుడి కుమార్తె అయిన దితికి కుమారులుగా వీరు జన్మిస్తారు. దితి వీరిని ఇద్దరినీ వంద సంవత్సరాలు తన గర్భంలో పెంచింది. వీరు ఇద్దరూ పుట్టిన సమయంలో చెడుకు సంకేతంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి.
పెరిగి పెద్దయిన ఈ సోదరులు ఇద్దరూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తారు. ముల్లోకాలలోనూ వీరి ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు, మునులు, ఎంతో అల్లాడిపోయేవారు.
వీరి గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము కదా… ఇక హిరణ్యకశిపుడు శ్రీమహావిష్ణువు చేతిలో ఎలా అంతం అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాము.
బ్రహ్మదేవుడి అనుగ్రహంతో మహాశక్తి సంపన్నుడయిన హిరణ్యకశిపుడు
హిరణ్యాక్షుడు మహావిష్ణువు చేతిలో మరణించటంతో హిరణ్యకశిపుడు కోపోద్రిక్తుడవుతాడు. ఎలాగయినా విష్ణువు మీద, ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించాలని బలంగా అనుకుంటాడు. ఈ కోరికతో హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకొని అభేద్యమైన వరాలు పొందాలని తపస్సు ప్రారంభిస్తాడు. ఇతని ఘోర తపస్సుకు ముల్లోకాలు గడగడలాడిపోతాయి.
హిరణ్యకశిపుని తపస్సుకు బ్రహ్మ సంతోషించి అతనిని అనుగ్రహిస్తాడు. బ్రహ్మ హిరణ్యకశిపుని ముందు ప్రత్యక్షమై అతనికి నచ్చిన వరాన్ని కోరుకొమ్మని అంటాడు. హిరణ్యకశిపుడు వెంటనే అమరత్వం కోరతాడు. కానీ పుట్టిన ప్రతి ప్రాణీ మరణించక తప్పదని చెప్పి బ్రహ్మ తిరస్కరిస్తాడు.
అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి ఒక విచిత్రమయిన కోరిక కోరతాడు. అదేమిటంటే, ముల్లోకాలలో ఏ మానవుల వలన కానీ, రాక్షసుల వలన కానీ, గ్రహాల వలన కానీ, జంతువు వలన కానీ, ఆకాశంలో కానీ భూమి మీద కానీ, ఇంటిలో కానీ, ఇంటి బయట కానీ, ఏ విధమయిన ఆయుధంతో కానీ, పగలు కానీ, రాత్రి కానీ మరణం లేకుండా వరం కోరతాడు. అతని ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు కాదనలేక అతను కోరిన కోరికను అనుగ్రహిస్తాడు.
ఇదే కాకుండా, మహాభారతంలోని అనుశాసన పర్వం ప్రకారం ఉపమన్యు అనే ఋషి శ్రీకృష్ణుడితో హిరణ్యకశిపుడి గురించి చెబుతూ అతను పరమేశ్వరుడి నుండి కూడా గొప్ప వరాలు పొందాడని చెప్పాడు. దీని ప్రకారం, ఇంద్రుడు, కుబేరుడు, యముడు, సూర్యుడు, వాయు, అగ్ని, సోమ, వరుణుడు వంటి దేవతల అందరి శక్తులతో పాటుగా, అనేక అస్త్రశస్త్రాలను ఉపయోగించడంలో అత్యద్భుతమైన పోరాట పటిమను హిరణ్యకశిపునికి పరమేశ్వరుడు ప్రసాదించాడని చెప్పారు.
ఈ వరాల బలంతో హిరణ్యకశిపుడు అపార పరాక్రమవంతుడవుతాడు. మరొక్క పురాణ ఇతిహాసం ప్రకారం, ఒకసారి రావణుడు హిరణ్యకశిపుని చెవిపోగులు ఎత్తడానికి ప్రయత్నించాడని, కానీ అతని శక్తి వాటిని ఎత్తడానికి సరిపోలేదని చెప్పారు. స్కంద పురాణం ప్రకారం ఈ హిరణ్యకశిపుడు విశ్వాన్ని దాదాపు 107.28 మిలియన్ సంవత్సరాల పాటు పాలించాడు.
హిరణ్యకశిపుడి భార్యను కాపాడిన నారదుడు
బ్రహ్మదేవుడి గురించి తపస్సు చెయ్యడానికి వెళ్లిన సమయంలో, ఇంద్రుడు ఇంకా ఇతర దేవతలు రహస్యంగా అతని రాజ్యం మీద దాడి చేస్తారు. అక్కడ ఒంటరిగా, గర్భవతిగా ఉన్న హిరణ్యకశిపుడి భార్య అయిన కాయాదు ఈ ఆకస్మిక దాడికి భయపడిపోతుంది. సౌమ్యురాలయిన ఆమెను ఈ విపత్తు నుండి నారద మహర్షి రక్షిస్తాడు. ఆమెను ఇంద్రుడి చెర నుండి విడిపించి తనతో తీసుకువెళ్లి ఆమెకు రక్షణ కల్పిస్తాడు.
తన ఆశ్రమంలో నారదుడు మహావిష్ణువును కీర్తిస్తూ చెప్పే విషయాల వలన ఆమె గర్భంలోని శిశువు ఎంతో ప్రభావితమవుతాడు. నారదుడి ఆశ్రమంలోనే కాయాదు ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. అతనే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడి భార్య అయిన కాయాదు కొన్ని కథలలో లీలావతి అనే పేరుతో కూడా సంబోధించారు. ఇక హిరణ్యకశిపుడు వచ్చేవరకు అతని భార్య, కుమారుడు నారదుడి పర్యవేక్షణలో అతని ఆశ్రమంలోనే ఉంటారు.
ఇది కూడా చదవండి: Exploring the Hidden Story of Ravana
విష్ణు భక్తుడిగా పెరిగిన ప్రహ్లాదుడు
ఇక నారదుడి ప్రవచనాల ప్రభావం ప్రహ్లాదుడి మీద విపరీతంగా ఉంటుంది. ఈ కారణంగా అతను విష్ణుమూర్తికి మహాభక్తుడు అవుతాడు. ఊహించని ఈ పరిస్థితికి హిరణ్యకశిపుడు ఎంతగానో కలత చెందుతాడు. విశ్వాన్ని శాసించే తన కుమారుడు తన బద్ద శత్రువయిన విష్ణుమూర్తికి భక్తుడు అవ్వటం జీర్ణించుకోలేకపోతాడు. ఎన్నో రకాలుగా తన ప్రియ కుమారుడుని మార్చాలని, విష్ణుమూర్తి మీద అతని భక్తిని, నమ్మకాన్ని నశింపచేయాలని ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. చివరకు విద్యాభ్యాసం నేర్చుకునే గురువుల దగ్గర కూడా విష్ణునామ స్మరణ చేస్తూ కాలం గడుపుతాడు. ఇతని విష్ణుభక్తి ప్రభావం ఇతర అసుర విద్యార్థుల మీద పడుతున్నదని గురువులు హిరణ్యకశిపుడికి విన్నవించుకుంటారు.
కన్న కుమారుడయిన ప్రహ్లాదుడు విష్ణువును ద్వేషించకుండా అతనిని స్మరిస్తూ గడపటం హిరణ్యకశిపుడికి ఎంతో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. తన సొంత కుమారుడే తన కళ్ళ ముందే భక్తితో శత్రువును పూజించటం చూసి అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. భయపెట్టయినా తన కుమారుడి ఈ విష్ణుభక్తిని మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఎంత చెప్పినా కూడా తండ్రి అయిన హిరణ్యకశిపుడిని విశ్వానికి ప్రభువుగా గుర్తించడానికి నిరాకరిస్తాడు. విష్ణుమూర్తి ఒక్కడే లోకానికి ప్రభువు అని, అందరూ అతనినే పూజించాలని తండ్రితో విభేదిస్తాడు.
ఇక తప్పనిసరి పరిస్థితులలో, పేగుబంధాన్ని కూడా కాదనుకొని, విష్ణుభక్తుడయిన తన కుమారుడిని అంతమొందించాలని హిరణ్యకశిపుడు కఠినంగా నిర్ణయించుకుంటాడు.
భక్తితో ఆపదలను జయించిన ప్రహ్లాదుడు
ప్రహ్లాదుడిని చంపమని తన అనుచరులను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రభువు ఆజ్ఞ ప్రకారం వారు కూడా ఎన్నో రకాలుగా ఆ బాలుడిని చంపటానికి ప్రయత్నిస్తారు. ఏనుగుల చేత తొక్కించాలని ప్రయత్నించినప్పుడు ఆ ఏనుగులు అతనిని ఏమీ చేయకుండా పక్కకు వెళ్లిపోతాయి. విషసర్పాలతో కాటువేయించాలని చేసిన ప్రయత్నం కూడా విఫలమవుతుంది. ఎంతో ఎత్తు నుండి లోయలోకి పడేసినప్పుడు ఆశ్చర్యంగా ఒక చిన్న దెబ్బ కూడా లేకుండా తిరిగి వస్తాడు.
ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయిపోయి ఆ బాలుడి శక్తి గురించి, జరుగుతున్న మాయల గురించి హిరణ్యకశిపుడితో వివరించి చెబుతారు. అన్ని సందర్భాలలో ఏదో మాయాశక్తి ఆ బాలుడిని కాపాడుతున్నది విన్నవించుకుంటారు.
హోలిక మరణమే హోలీ పండుగ
ప్రహ్లాదుడిని చంపటానికి చేసిన అనేక ప్రయత్నాలలో అతనిని అగ్నిలో పడవేయటం ఒకటి. విష్ణుమాయను ఎదిరించటానికి, ప్రహ్లాదుడిని అతని అత్త అయిన హోలిక అనే రాక్షసితో పాటుగా మండుతున్న చితిపై కూర్చోబెడతారు. అయితే, కొంచెం కూడా భయపడకుండా ప్రహ్లాదుడు విష్ణునామస్మరణ చేసుకుంటూ ధైర్యంగా మండుతున్న అగ్నిలో కూర్చుంటాడు. విష్ణుమాయ ప్రభావంతో ఆ భయంకరమయిన అగ్నికీలలు ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోతాయి. అయితే ఆ అగ్నికీలల ప్రభావం వలన హోలిక భస్మమయిపోతుంది. హిందూ పురాణాల ప్రకారం ఈ సంఘటనను చాలా ప్రాంతాలలో పెద్ద సంబరంలాగా కూడా జరుపుకుంటారు. ఈ సంబరమే మనందరికీ తెలిసిన హోలీ పండుగ.
ప్రహ్లాదుడిని ఏమీ చేయలేకపోయిన కాలకూట విషం
ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విష్ణుమాయతో అన్నిటినీ ఎదుర్కొన్న ప్రహ్లాదుడికి చివరి ప్రయత్నంగా హిరణ్యకశిపుడు కాలకూట విషాన్ని ఇస్తాడు. తల్లి కళ్ళ ముందే కుమారుడి చేత ఆ కాలకూట విషాన్ని తాగిపిస్తాడు. అయినా కూడా ప్రహ్లాదుడు భయపడకుండా తండ్రి ఆజ్ఞ ప్రకారం ఆ విషాన్ని ధైర్యంగా తాగుతాడు. అయితే ఇక్కడ కూడా, విష్ణుమాయ ప్రభావం చేత ప్రహ్లాదుడికి ఏమీ కాదు.
ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే విష్ణుభక్తిలో ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడో అదే విధంగా తండ్రి మాట జవదాటకుండా అతని ఆజ్ఞలను ధైర్యంగా పాటించటంలో కూడా అంతే వినమ్రత, పెద్దల పట్ల గౌరవం చూపించి ఆదర్శంగా నిలిచాడు.
హిరణ్యకశిపుడిని అంతం చేసిన నరసింహావతారం
ఇక ఎన్నో రకాలుగా ప్రహ్లాదుడిని మార్చాలని ప్రయత్నించి విసిగిపోయిన హిరణ్యకశిపుడు విష్ణుమూర్తి మీద ఆగ్రహంతో ఊగిపోతాడు. తన కుమారుడి ఈ పరిస్థితికి విష్ణువే కారణమని, అతనిని అంతమొందించటమే ఈ సమస్యకు పరిష్కారమని గ్రహిస్తాడు. మాయావి అయిన విష్ణుమూర్తిని చూపించమని, తన కళ్ళముందుకు తీసుకురమ్మని ప్రహ్లాదుడిని ఆజ్ఞాపిస్తాడు.
అప్పుడు ప్రహ్లాదుడు భక్తితో విష్ణుమూర్తి అన్ని ప్రాణులలో, అన్ని వస్తువులలో, గాలిలో, నీటిలో, అన్ని చోట్లా ఉండగల సర్వాంతర్యామి అని గొప్పగా చెబుతాడు. తన శత్రువును అంత గొప్పగా పొగుడుతున్న కొడుకును ఏమీ చేయలేక, విష్ణువు ఎక్కడయినా ఉన్నాడా అని ఆవేశంతో అరుస్తూ, పక్కనే ఉన్న స్తంభాన్ని చూపించి… ఇందులో కూడా ఉంటాడా నీ మయావిష్ణువు అని ఆగ్రహంతో ఊగిపోతూ తన గదతో ఆ స్తంభాన్ని బద్దలుకొడతాడు.
అప్పుడు సాయంత్రం సంధ్యా సమయం. ఆ స్తంభంలో నుండి పెద్ద మెరుపుల మధ్య భయంకరమయిన అరుపులతో, సింహం తలతో మనిషి శరీరంతో, పెద్ద పెద్ద గోళ్లతో, నిప్పులు చెరిగే కళ్ళతో, కనీ వినీ ఎరుగని రూపంలో అప్పటివరకూ ఎవరూ చూడని ఒక భయంకరమయిన ఆకారం బయటకు వస్తుంది. హిరణ్యకశిపుడు కూడా ఆ విచిత్ర ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇతనేనా ఈ మాయావిష్ణువు అని అరుస్తూ మీద పడతాడు. అయితే భయంకరమయిన ఆకారంతో వచ్చిన విష్ణుమూర్తి ముందు నిలువలేకపోతాడు.
ఆగ్రహంతో నరసింహావతారంలో ఉన్న మహావిష్ణువు హిరణ్యకశిపుడిని ద్వారం దగ్గరకు రెండు చేతులతో ఎత్తి తీసుకువచ్చి తన తొడల మీద పెట్టుకొని అతని గుండెలను చీల్చి సంహరిస్తాడు. హారణ్యకశిపుడి కోరిక ప్రకారం ఈ అవతారంలో మహావిష్ణువు మనిషి ద్వారా లేక జంతువు ద్వారా కాకుండా రెండూ కలిసిన విచిత్ర ఆకారంలో, ఇంటిలో ఇంటి బయటా కాకుండా ద్వారం గడప మీద, పగలూ రాత్రీ కాకుండా సాయంత్రం సమయంలో, భూమి మీదా ఆకాశంలో కాకుండా తన తొడల మీద పెట్టుకొని, ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా కేవలం గోళ్ళతో అతని గుండెలను చీల్చి సంహరిస్తాడు. ఈ విధంగా ఆ విష్ణుమూర్తికి ద్వారపాలకులలో ఒకడయిన జయ శాపం వలన ఎత్తిన హిరణ్యకశిపుడి జన్మ ముగుస్తుంది.
నరసింహుడిని శాంతింపచేసిన ప్రహ్లాదుడు
మహావిష్ణువు ఎత్తిన ఈ భీకర నరసింహావతారాన్ని ముల్లోకాలలో ఎవరూ కూడా కనీసం ఎదురుగా చూడలేకపోతారు. అతనికి ఎదురుపడి శాంతించమని చెప్పే ధైర్యం చేయలేకపోతారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని పిలిచి ఆయనను శాంతపరచమని వేడుకుంటారు. కానీ ఆమె ప్రయత్నం వృధా అవుతుంది. ఇక వేరే ఏ మార్గం తోచక దేవతలు అందరూ కలిసి బ్రహ్మదేవుడిని వేడుకోగా, ఆయన సూచన ప్రకారం ప్రహ్లాదుడిని ఉగ్ర నరసింహుడి ముందుకు పంపిస్తారు. అచంచల భక్తితో ప్రహ్లాదుడు ఉగ్రరూపంలో ఉన్న ఆ నరసింహుడిని అనేక విధాలుగా స్తుతించి చివరకు శాంతింపచేస్తాడు.
ఇది కూడా చదవండి: Forgotten Vishnu Avatars in Hindu Mythology
నరసింహుడు అవతరించిన ప్రాంతమే అహోబిలం
మన ఆంధ్ర రాష్ట్రంలోని ఇప్పుడు ఉన్న అహోబిలం ప్రాంతమే ఒకప్పటి హిరణ్యకశిపుడి భవనం అని, అతనిని నరసింహావతారంలో ఆ మహావిష్ణువు అక్కడే అంతమొందించాడని చెబుతారు. అయితే కొంతమంది, పాకిస్తాన్ లోని ముల్తాన్ అనే ప్రాంతాన్ని నరసింహుడు అవతరించిన ప్రదేశంగా చెబుతారు. ఈ ప్రాంతాన్నే ఒకప్పుడు “మూల స్దన” అని పిలిచేవారని, కాలక్రమంలో అదే ముల్తాన్ అనే పేరుగా మారిందని చెబుతారు. అయితే ఈ వాదనకు సరయిన ఆధారాలు ఎక్కడా లేవు, ఈ వాదన పూర్తిగా అబద్ధమని కూడా చాలా మంది చెప్పారు.
నరసింహస్వామికి ప్రముఖ దేవాలయాలు
మన దేశంలో ఆ నరసింహుడికి అనేక ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమయినవి కొన్ని…
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అహోబిలం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింహాచలం నరసింహ దేవాలయం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ లో పెన్నా నది ఒడ్డున లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో పానకాల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
- తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరి గుట్ట (యాదాద్రి)
- తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల యోగానంద నరసింహ ఆలయం
- కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతంలో నరసింహ ఝర్ని అనే గుహ దేవాలయం
- కర్ణాటక రాష్ట్రంలోని మెల్కోట యోగ నరసింహ ఆలయం
- కర్ణాటక రాష్ట్రంలోని హంపి లోని లక్ష్మీ నరసింహ దేవాలయం, ఇక్కడ ఉన్న ఉగ్ర నరసింహ విగ్రహం ప్రధాన ఆకర్షణ
- తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ లోని నరసింహస్వామి ఆలయం
- కేరళ రాష్ట్రంలోని కన్నూర్‌లోని తలస్సేరి ప్రాంతంలోని లక్ష్మీ నరసింహ ఆలయం
- రాజస్థాన్ రాష్ట్రంలోని నర్సింహ్జీ నరసింహ ఆలయం
వీటిల్లో కొన్నయినా వీలయితే దర్శించి తరించండి.
చివరిమాట
నరసింహావతారం యొక్క ప్రాముఖ్యత మనకి ఏమని మెసేజ్ ఇస్తుందంటే, ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా మృగ స్వభావం అనేది ఉంటుంది. ఆ మృగ స్వభావం వచ్చినప్పుడు మనిషి తన విచక్షణ కోల్పోతాడు అనే విషయం ఈ నరసింహ అవతారంలో స్పష్టం అవుతుంది.