Ramayana historical evidence, archaeological discoveries

What Archaeological Discoveries Prove Ramayana’s Existence?

ఒక్కోసారి మనకో డౌట్ వస్తుంటుంది. అసలీ  పురాణాలనేవి నిజంగా ఉన్నాయా అని. ఎందుకంటే పురాణాల పేరుతో మనమంతా ఎంతోకొంత ఆచారాల్ని, పద్ధతుల్ని పాటిస్తున్నాం కాబట్టి . తరచి చూస్తే పురాణాలు, అందులో పాత్రలు మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి.   

అయితే కొందరు హేతువాదులు మాత్రం రామాయణ మహాభారతాలు అసలు జరగలేదని, అవన్నీ ఒట్టి కల్పిత కథలని వాదిస్తారు. ఏది నిజమో?  ఏది అబద్ధమో?  చెప్పేంత పరిజ్ఞానం మనకి లేకపోయినా, ఈ ఇతిహాసాలు నిజంగా జరిగాయని చెప్పటానికి కావాల్సిన ఆధారాలు, అందుకు బలం చేకూర్చే ప్రదేశాలు, సంఘటనలు మనకు ఈ ప్రపంచంలో ఎన్నో కనిపిస్తాయి. అందుకే ఈ రోజు రామాయణ ఇతిహాసం అసలు నిజమేనా? రామాయణ కథలో మనకు తెలిసిన పాత్రలన్నీ నిజంగానే ఉన్నాయా? లేవా? అనే దాని గురించి తెలుసుకుందాము. మరింకెందుకు ఆలస్యం… రండి!

ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశంలో కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా, ఇంకా మన పక్కనే ఉన్న శ్రీలంకలో కూడా రామాయణ ఇతిహాసం నిజంగానే జరిగింది అని చెప్పే బలమయిన ఆధారాలు మన పురావస్తు శాస్త్రజ్ఞులకు, చరిత్రకారులు ఎన్నో లభించాయి. రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పే అలాంటి కొన్ని బలమయిన ఆధారాలను ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము. ముందుగా అందుకు సంబందించిన కొన్ని ముఖ్యమయిన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. 

Cobra Hood Caves 

కోబ్రా హుడ్’ అంటే పాము తల ఆకారంలో ఉన్న గుహలు అని అర్థం. శ్రీలంకలోని సిగిరియా ప్రాంతంలో ఉన్న ఈ గుహలు పూర్తిగా సహజంగా ఏర్పడ్డాయని పురావస్తు శాస్త్రవేత్తలు ధృవీకరించారు. ఎవరూ చెక్కకపోయినా కూడా ఈ గుహలు పూర్తిగా నాగుపాము తల ఆకారంలో ఏర్పడ్డాయి. 

రామాయణ ఇతిహాసం ప్రకారం రావణాసురుడు సీతా దేవిని అపహరించిన తరువాత ఆమెను ముందుగా ఇక్కడికి తీసుకువచ్చాడని కొన్ని కథలలో చెప్పారు. ఈ గుహలలో పైకప్పు మీద ఈ ఆధారాన్ని బలపరిచే విధమయిన ఎన్నో చిత్రాలు ఉన్నాయి. 

అంతే కాకుండా, ఈ గుహలో గోడల మీద “Parumaka naguliya lene” అని కూడా చెక్కబడి ఉన్నది. సీతాదేవికి ఇక్కడ కాపలాగా ఉన్న రాక్షసులు ఆమెను “నాగులియా” అని పిలిచేవారు. అంటే నాగలి దున్నేటప్పుడు పుట్టినది అని అర్థం. మనందరికీ తెలుసు సీతాదేవి జనక మహారాజు నాగలి దున్నేటప్పుడు భూమిలో దొరికిందని. అలాగే, శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని పరీక్షించి అక్కడ గోడల మీద, పైకప్పు మీద ఉన్న చిత్రాలు, చెక్కిన పదాలు క్రీస్తు పూర్వ కాలానికి చెందినవని నిర్ధారించారు కూడా.

Sita Kotuwa

‘కోటువ’ అంటే కోట అని అర్ధం. ఆధారాల ప్రకారం ఇది రావణాసురుడి భార్య అయిన మండోదరి భవనం ఉన్న స్థలం. ఈ భవనం ‘గురులుపోత’ అనే ప్రదేశంలో ఉన్నది. దీనికి దగ్గర ఉన్న పేరుగాంచిన పట్టణం హసలక.  

ఈ  పట్టణం పైన చెప్పుకున్న సిగిరియా ప్రాంతం నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  సీతాదేవిని ఎక్కడ ఉంచాలో తెలియక రావణాసురుడు ఆమెను తన భార్య అయిన మండోదరి భవనానికి తీసుకువస్తాడు. ఆమెను అక్కడే ఉంచాలని మండోదరికి చెప్తాడు. 

కానీ, ఆమె అందుకు అంగీకరించక, సీతాదేవిని పంపించివేసి రాముడిని శరణు కోరాలని తన భర్తకి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. దానికి రావణాసురుడు అంగీకరించక ఆమె మీద ఆగ్రహిస్తాడు. ప్రస్తుత శ్రీలంకలో మనకు ఈ భవనం గురులుపోత ప్రదేశం పక్కనే ఉన్న అడవిలో ఒకటిన్నర కిలోమీటర్లు వెళితే కనిపిస్తుంది. ఈ భవంతి దక్షిణం వైపు నుండి పక్కనే ఉన్న నదిలోకి 50 మెట్లు ఉన్నాయి. సీతాదేవి అక్కడ ఉన్నన్ని రోజులు ఈ నదిలో స్నానం చెయ్యడానికి ఈ దారిలో వచ్చేదని చెప్తారు. 

Ashoka Vaatika

శ్రీలంకలో సీతాదేవి చివరిగా చేరుకున్న ప్రదేశం ఈ అశోక వాటిక. దీనినే మనం ‘అశోకవనం’ అంటాము. ప్రస్తుతం ఉన్న శ్రీలంకలో అశోకవనం Hagkala Botanical Gardenలో ఉన్నది. 

ఈ ప్రదేశం పైన చెప్పుకున్న Sita Kotuwa నుండి దాదాపు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ అశోక వాటికలో సీతాదేవి శింషాప చెట్టు క్రింద కాలం గడిపింది. హనుమంతుడు మొదటిసారి సీతాదేవిని కలుసుకున్నది ఇక్కడే. ఈ అశోకవనంలోనే హనుమంతుడి పెద్ద పాద ముద్రలు కూడా మనకు కనిపిస్తాయి. రామాయణం నిజంగా జరిగింది అనడానికి ఇది ఒక గొప్ప బలమయిన ఆధారం అని చెప్పవచ్చు. ప్రపంచం నలు మూలల నుండీ ఈ పాదముద్రలు చూడటానికి ప్రజలు తరలి వస్తారు. 

Trincomalee 

ఈ ప్రదేశంలో పెద్ద కొండ అంచున నిర్మించబడిన ‘తిరు కోనేశ్వరం’ అనే దేవాలయం. పురాణ కథల ప్రకారం, రావణాసురుడి భక్తికి మెచ్చిన పరమ శివుడు అగస్త్య మహామునిని ఇక్కడ గుడి నిర్మించమని కోరాడని చెబుతారు. అలాగే, రాముడు కూడా బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించాడని కథ ప్రాచుర్యంలో ఉన్నది.

Colombo

శ్రీలంక రాజధాని అయిన కొలొంబోలో కూడా రెండు ప్రసిద్ధ ఆలయాలు రామాయణ ఇతిహాసానికి సంబందించిన ఆధారాలుగా ఉన్నాయి. ప్రపంచంలోనే ఆంజనేయుడు రథం మీద ఉన్నట్లు కనిపించే ఏకైక ఆలయం ఇక్కడ ఉన్నది. ఇంకా ఇక్కడ ఉన్న ‘కెలనియా ఆలయం’ రావణుడి మరణం తర్వాత లంకకు విభీషణుడిని రాజుగా పట్టాభిషేకం చేసిన ప్రదేశంగా నమ్ముతారు.

Nilavarai

జాఫ్నాలోని నీలవరై అనే ఒక చిన్న గ్రామం శ్రీలంకలో రామాయణానికి సంబంధించిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఎప్పటికీ నీరు ఇంకిపోని ఒక నీటి తటాకం ఉంది. దీని లోతు ఎంత ఉందొ ఎవ్వరూ కనుక్కోలేకపోయారని చెబుతారు. రావణుడితో యుద్ధం జరిగే సమయంలో తన వానర సైన్యానికి నీటి సంక్షోభం లేకుండా ఉండటానికి రాముడు భూమిలోకి బాణం వేసి ఈ నీటి తటాకం ఏర్పడేలా చేసాడని నమ్ముతారు.

Hot Wells

శ్రీలంకలో రావణాసురుడు నిర్మించాడని చెప్పే ఈ వేడి నీటి బావులు ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. ఇవి సహజంగానే ఎప్పుడూ వేడి నీటితో నిండి ఉంటాయి. 

Dark Soil 

హనుమంతుడు లంకా దహనం చేయటం వలన రావణాసురుడి రాజ్యానికి నిప్పు పెట్టాడు. అందుకే నేటికీ, రావణుడి రాజభవనం ఉన్న కొన్ని ప్రాంతాలలో నేల రంగు మిగతా ప్రాంతాలతో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నదని చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు గమనించారు.

ఇది కూడా చదవండి: Exploring Sukracharya’s Life and Teachings

Four Tusked Giant Elephants

రామాయణ ఇతిహాసం ప్రకారం రావణ లంకలో కాపలా కోసం అనేక ప్రదేశాలలో నాలుగు దంతాల భారీ ఏనుగులు ఉండేవని చెప్పారు. హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు, రావణ లంకలోని విశేషాలను చెప్పే సందర్భాలలో ఈ భారీ ఏనుగుల గురించి ప్రస్తావించారు. 

మన శాస్త్రవేత్తలు కూడా సరిగ్గా రామాయణం జరిగింది అని ఊహిస్తున్న వేల లక్షల సంవత్సరాల క్రితం ఈ విధమయిన నాలుగు దంతాల ఉండే భారీ ఏనుగులు భూమి మీద జీవించి ఉన్నాయని నిర్ధారించారు. పురాణాలను, ఇతిహాసాలను పక్కన పెడితే, కేవలం శాస్త్రవేత్తలు చెప్పిన కాలం ప్రకారం కూడా రామాయణం నిజంగా జరిగింది అని చెప్పవచ్చు.

Ayodhya

ఈ పేరు గురించి మనకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రాముడి జన్మస్థలంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ప్రపంచంలోని ఎన్నో ప్రాంతాల కన్నా ఈ ప్రాంతం, ఇక్కడ కనిపించిన పురావస్తు అవశేషాలు ఎంతో ప్రాచీనమయినవని నిరూపించబడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రాంతం అనేక పెద్దా చిన్న దేవాలయాలతో నిండిపోయి ఉన్నది. ఇక్కడే మహమ్మదీయుల మసీదులు, ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. 

అయితే ఈ ప్రదేశం ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువు కూడా. రాముడు అసలు ఇక్కడ జన్మించలేదని వాదించేవాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. బాధాకరమయిన విషయం ఏమిటంటే, మన దేశంలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన తీవ్ర మత కల్లోలాలు ఇక్కడే మొదలయ్యాయి. అయితే, అసమానతలను దూరంగా పెట్టి భారతీయులుగా మనందరం కలిసి ఉండి సర్వమత సమానత్వం చూపించాల్సిన ఆవశ్యకతను కూడా ఈ ప్రదేశం చాటి చెబుతుంది. 

Lepakshi

మన తెలుగు వారికి బాగా పరిచయం ఉన్న పేరు ఇది. ఆంధ్రప్రదేశ్ లోని హిందూపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఈ లేపాక్షి ఉన్నది. సీతను రావణాసురుడు అపహరించినప్పుడు, ఆమెను రక్షించడానికి జటాయు అనే ఒక దైవపక్షి వచ్చి రావణుడిని అడ్డుకుంటాడు. అయితే రావణాసురుడి శక్తి ముందు జటాయు నిలువలేకపోతాడు. 

రావణాసురుడు జటాయు రెక్కలను కత్తితో కోయటం వలన జటాయు అక్కడే కిందపడిపోతాడు. ఇక సీతాదేవిని వెతుక్కుంటూ రాముడు, లక్ష్మణుడు వచ్చినప్పుడు కొన ఊపిరితో ఉన్న జటాయు సీతాదేవి జాడ గురించి చెప్పి రాముడి ఒడిలో మరణిస్తాడు. రాముడు జటాయుని లేపడానికి “లే” “పక్షి” అని పిలుస్తాడు. కాలక్రమంలో ఈ మాటలే లేపాక్షి అనే పేరుగా మారింది. ఇక్కడ ఉన్న వీరభద్రుడి ఆలయం చాలా ప్రముఖమయినది. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ ప్రదేశాన్ని సందర్శించండి. 

Panchavati

ఇది రామాయణంలో మనందరికీ తెలిసిన పేరు. సీతాదేవిని రావణాసురుడు అపహరించిన ప్రదేశంగా దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. నాసిక్ నగరంలోని పవిత్ర గోదావరి నదికి ఎడమ వైపు ఒడ్డున ఈ ప్రాంతం ఉన్నది. వనవాసం చేసిన పద్నాలుగు సంవత్సరాలలో రాముడు, లక్ష్మణుడు ఇంకా సీతాదేవి కొన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపినట్లుగా నమ్ముతారు. 

పంచ అంటే ఐదు, వటి అంటే మహావృక్షం అని అర్ధం. ఈ ప్రదేశంలో ఐదు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి, అందుకే ఈ ప్రదేశానికి పంచవటి అని పేరు వచ్చింది. రామాయణ ఇతిహాసానికి ఈ ప్రదేశంతో సంబంధం ఉండటం వల్లనే ఇక్కడి పవిత్ర గోదావరిలో స్నానం చెయ్యడానికి దేశం నలు మూలల నుండి ఇప్పటికీ ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. 

సీతాదేవి ఉన్న గుహ ఇక్కడ ఈ ఐదు పెద్ద మర్రి చెట్ల దగ్గరే ఉన్నది. ఒక చిన్నమెట్ల మార్గం గుండా ఈ గుహలోకి వెళ్ళవచ్చు. ఈ గుహలో ఇప్పుడు మనకు రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాలు కనిపిస్తాయి. దీనికి ఎడమ వైపున, ఒక గుహలో శివలింగం కనిపిస్తుంది. రావణాసురుడు సీతాదేవిని ఇక్కడే అపహరించాడని నమ్మకం. ప్రస్తుతం ఈ ప్రదేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. 

ఈ ప్రదేశంలో ‘రామ్‌కుండ్’ అనే తీర్థం ఉన్నది. శ్రీరాముడు ఇక్కడ ఉన్నంతకాలం ఈ తీర్థంలో స్నానం చేసేవాడని చెప్తారు. అందుకే, ఈ తీర్థంలో కలిపిన అస్థికలు వెంటనే నీటిలో మునిగిపోతాయని చెప్తారు. ఇంత ప్రాముఖ్యత ఉండటం వల్లనే మహాత్మాగాంధీ అస్థికలు ఇక్కడే గోదావరిలో కలిపారు.

Ram Setu

దీని గురించి ఎన్నో కథలు, ఎన్నో వివాదాలు మనం చదివే ఉంటాము. రావణ లంకకు చేరుకోవడానికి శ్రీరాముడు వానర సేనల సహాయంతో ఈ రామసేతు నిర్మించాడని రామాయణ ఇతిహాసంలో మనం చదువుకున్నాము. రాముడు తన గొప్ప శక్తులతో వానరసేన సేతు నిర్మించడానికి వేసిన బండరాళ్లు నీళ్లలో మునిగిపోకుండా చేశాడని చెప్తారు. చాలా మంది ఈ రామసేతు నిజం కాదని కూడా వాదించారు. అయితే సరయిన ఆధారాలు చూపించలేకపోయారు. 

అయితే పరీక్షగా గమనిస్తే భారతదేశం అంచు నుండి శ్రీలంకను  కలుపుతున్నట్లుగా ఈ రామసేతు కనిపిస్తుంది. దీనినే ‘Adam’s Bridge’ అని కూడా అంటారు. ఇది సుమారుగా 48 కిలోమీటర్లు ఉంటుంది.   NASA వారు కూడా పరీక్షించి ఈ రామసేతు మార్గంలో ఉన్న సుదీర్ఘమయిన ఇసుక రాసులు సహజంగా ఏర్పడినవే అని, అయితే వాటి మీద ఉన్న బండరాళ్లు మాత్రం సహజంగా ఏర్పడలేదని, ఎన్నో వేల వేల సంవత్సరాల క్రితం పేర్చినవాని చెప్పారు. 

క్రీస్తు పూర్వం 5100 సంవత్సరాల క్రితం, ఈ రామసేతు మార్గం సముద్రం పైనే ఉన్నదని, రామేశ్వరం శ్రీలంక మధ్య ప్రయాణించడానికి ఉపయోగించి ఉండవచ్చని నిర్ధారించారు. అదే విధంగా, ఈ రామసేతుకి రెండు వైపులా ఎనెన్నో పనిముట్లను, ఇంకా భారీ కట్టడాలను నిర్మించిన ఆనవాళ్లను కూడా కనిపెట్టారు. ఈ ఆధారాలతో, రామసేతు నిజంగానే నిర్మించబడినది అని నమ్మవచ్చు.

Sanjeevani Mountain

హనుమంతుడు లక్ష్మణుడి కోసం హిమాలయాల నుండి సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చాడని మనం రామాయణ ఇతిహాసంలో చదువుకున్నాము. ఈ పర్వతం, ఇంకా ఇది ఉన్న ప్రదేశం ఎన్నో రోగాలను నయం చేసే అమూల్యమయిన మూలికలకు, మొక్కలకు మూలస్థానం అని చెప్తారు. ఇప్పటికీ, హిమాలయాలలో ద్రోణగిరి అనే పర్వతప్రాంతం ఇటువంటి మూలికలు, మొక్కలకు పేరుగాంచినది.

Mithila City

మిథిలా నగరం సీతాదేవి జన్మస్థలం. అలాగే సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం. ఈ ప్రాంతం ప్రస్తుతం భారత దేశపు అంతర్జాతీయ సరిహద్దు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఖాట్మండూ దగ్గర ఉన్నది. 1967లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలతో పాటు, రామాయణానికి సంబంధించిన మరికొన్ని ఆధారాలు లభించాయి.

ఇది కూడా చదవండి: Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife

Prayag

వనవాసం చేసేటప్పుడు, శ్రీరాముడు, లక్ష్మణుడు, ఇంకా సీతాదేవి కొంతకాలం ప్రయాగలోని భరద్వాజ మహాముని ఆశ్రమంలో ఉన్నారు. ఇదే ఇప్పుడు మనకు తెలిసిన అలహాబాద్. దీనికే ప్రయాగరాజ్ అని కూడా పేరు.

Chitrakoot 

రామాయణంలో ఈ ప్రదేశానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. రాముడు వనవాసానికి వెళ్లిన తరువాత, దశరథ మహారాజు మరణించాడని చెప్పటానికి భరతుడు రాముడిని కలిసి తిరిగి అయోధ్యకు రమ్మని వేడుకున్న ప్రాంతం. ఇది ఉత్తరప్రదేశ్ ఇంకా మధ్యప్రదేశ్ మధ్యలో ఉన్నది.

Kishkindha

వానరుల సుసంపన్న రాజ్యం ఈ కిష్కింద. రామాయణ ఇతిహాసం ప్రకారం ఎందరో ఋషులు రావణుడితో యుద్ధం చెయ్యటం కోసం ఇక్కడ పెద్ద వానర సైన్యంగా మారారని చెబుతారు. కర్ణాటక రాష్ట్రంలోని హంపి సమీపంలో ఉన్న తుంగభద్రా నది దగ్గర ఈ ప్రాంతం ఉండేదని చెబుతారు.

Rishyamukha Mountain

హనుమంతుడు శ్రీరాముడిని కలిసిన ప్రదేశం ఇది. వాలి తరిమేసిన తరువాత సుగ్రీవుడు పారిపోయి ఇక్కడ తలదాచుకున్నాడు. ప్రస్తుత భారతదేశంలో కర్ణాటకలోని నింబాపుర అనే ప్రాంతంలో ఈ రిష్యముఖ పర్వతం ఉన్నదని చెబుతారు. 

Rameswaram

లంకకు వెళ్ళడానికి నిర్మించిన రామసేతు ఇక్కడి నుండే నిర్మించారని చెబుతారు. తిరిగి వచ్చిన తరువాత కూడా, రాముడు సీతాదేవితో కలిసి ఇక్కడ ఒక గొప్ప శివ లింగాన్ని ప్రతిష్టించాడని పురాణం కథ. ఈ ప్రదేశం మన భారత దేశంలో చూడదగ్గ ప్రదేశాలలో ఎంతో ప్రముఖమయినది. 

Dhanushkodi

రావణుడు తరిమేసిన తరువాత విభీషణుడు వచ్చి తలదాచుకున్న ప్రదేశమే ఈ ధనుష్కోటి. ఇక్కడే విభీషణుడిని లంకకు రాజుగా శ్రీరాముడు ప్రకటించాడు. December 1964లో వచ్చిన ఒక భయంకరమయిన ప్రకృతి విపత్తు వలన ఈ ప్రాంతం పూర్తిగా జనావాసానికి అనుకూలం కాకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రాంతంగా మారుతోంది. 

ఇక చివరిగా ఇంకొక ఆసక్తికరమయిన ఆధారం కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాము. శ్రీరాముడు రావణాసురుడిని విజయదశమి రోజున ఓడించి, యుద్ధంలో గెలుపొంది, సీతాదేవిని విడిపించాడు. అక్కడి నుండి బయలుదేరి 21 రోజుల తరువాత శ్రీరాముడు అయోధ్యకు తన పరివారంతో చేరుకున్నాడు. ఈ సందర్భంగా అయోధ్యలో, ఇంకా భారతదేశం అంతా గొప్పగా దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీనినే మనం ‘దీపావళి’ అని కూడా అంటాము. ఇది కూడా రామాయణం నిజంగా జరిగింది అని చెప్పుకోవడానికి ఒక మంచి ఆధారం.

చివరిమాట 

ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణం నిజంగానే జరిగింది అని చెప్పటానికి ఎన్నో ఎనెన్నో ఆధారాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమయినవి మాత్రమే మనం ఇక్కడ చర్చించాం. వీలయితే వీటిలో కొన్ని ప్రదేశాలు అయినా చూసి రావడానికి ప్రయత్నించండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top