మహాభారత ఇతిహాసంలోని చాలా క్యారెక్టర్ల గురించి మనం కధలు కధలుగా చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యల దగ్గర విన్నాము, ఇంకా చాలా సినిమాల్లో కూడా చూసాము. ఈ సినిమాలు చూడటానికి చాలా ఆసక్తిగా ఉండేవి. అయితే వీటిలో మనకు తెలిసిన పాత్రలు కొన్ని అయితే, మనకు తెలియని పాత్రలు ఎన్నో!
పాండవులను హీరోలుగా, కౌరవులను విలన్లుగా చాలా సినిమాల్లో చూసాము. వాళ్లతో పాటుగా, ఇంకా కొన్ని ఆసక్తికరమైన పాత్రలుకూడా మనకు ఈ సినిమాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకి, మాయాబజార్ సినిమా చూసిన వాళ్లందరికీ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఘటోత్కచుడు. చిన్న పిల్లలకి అయితే ఈ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. పాండవులకు సహాయం చేస్తూ, కౌరవులకు సరదాగా సమస్యలు సృష్టించే పాత్రలో ఘటోత్కచుడు మనల్ని చాలా నవ్వించాడు.
ఈ ఘటోత్కచుడి కుటుంబం గురించి సినిమాల్లో కానీ, పురాణాల్లో కానీ ఎక్కువ ఆధారాలు లేవు. అయితే ఇతనికి మౌర్వి అనే భార్య, ఇంకా ముగ్గురు కుమారులు ఉన్నారు. వారి పేర్లు అంజనపర్వన్, మేఘవర్ణ, ఇంకా బార్బరిక. వీరు కూడా మహాభారత ఇతిహాసంలోని చెప్పుకోదగ్గ క్యారెక్టర్ల లిస్టులో ఉంటారు. ఈ రోజు మనం ఘటోత్కచుడి భార్య అయిన మౌర్వి గురించి, ఆమె అసలు పేరు, పూర్వజన్మ వృత్తాంతం, ఇంకా ఆమెకు కృష్ణుడితో ఉన్న వైరం, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలను గురించి తెలుసుకుందాము.
మౌర్వి ఎవరు?
మౌర్వికి పూర్వ జన్మలో ఉన్న పేరు అహిలావతి. ఈమెకు ఈ రెండు పేర్లు కాకుండా, ఇంకా “కామ్కాంతిక” అనే పేరు కూడా ఉంది.
ఒక పురాణేతిహాసం ప్రకారం అహిలావతి గొప్ప నాగకన్య. ఈమె తండ్రి నాగలోకానికి అధిపతి అయిన వాసుకి. ఈమె తల్లి నాగయక్షి. వాసుకి శివుని మెడలో ఉండే పవిత్ర సర్పమని మనందరికీ తెలుసు. అయితే, అహిలావతి కైలాసంలో పార్వతి పరమేశ్వరులను పూజిస్తూ ఉంటుంది. ఈమె పార్వతీ దేవికి గొప్ప భక్తురాలు ఇంకా నమ్మకమైన సేవకురాలు కూడా. ఈ అహిలావతి రోజూ పార్వతీ దేవికి శివ పూజ చేయటానికి పువ్వులు అందిస్తూ ఉంటుంది. ఇది ఆమె ప్రతిరోజూ బాధ్యత.
అయితే ఒక రోజు, అహిలావతి పొరపాటున పార్వతీ దేవికి శివ పూజ సమయంలో వాడిపోయిన పూలను అందిస్తుంది. ఇది గమనించిన పార్వతీ దేవికి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో పార్వతీ దేవి అహిలావతిని శపిస్తుంది. రాక్షసుల వంశంలో పుట్టి, అసుర యువరాణిగా పెరిగి, ఒక భయంకరమయిన ఇంకా భయానకంగా కనిపించే పెద్ద రాక్షసుడిని పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడతావని శపిస్తుంది. పార్వతీ దేవి కోపానికి, ఇంకా ఆమె ఇచ్చిన శాపానికి అహిలావతి చాలా భయపడి పోతుంది. తాను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకొని, వెంటనే పార్వతీ దేవి పాదాల మీద పడి శరణు వేడుకుంటుంది. తనను క్షమించమని ఎన్నో విధాలుగా పార్వతీ దేవికి క్షమాపణలు చెప్పి ప్రార్థిస్తుంది.
అయితే, జగన్మాత అయిన పార్వతీ దేవి తాను ఇచ్చిన శాపం చాలా శక్తివంతమైంది కాబట్టి, ఒక్క సారి తాను శాపం ఇస్తే దాని నుండి విముక్తి పొందటం అసాధ్యం అని పార్వతీ దేవి అహిలావతికి గుర్తు చేస్తుంది. చివరికి కొంత శాంతించిన పార్వతీ దేవి తన శాపం వెనక్కి తీసుకోలేకపోయినా, అహిలావతికి లభించే భర్త మంచి దయగల వ్యక్తి అవుతాడని ఇంకా గొప్ప యోధుడు కూడా అయి ఉంటాడని దీవిస్తుంది. అంతే కాకుండా, తమను ఇంత కాలం ఎంతో భక్తితో పూజించి, సేవించిన కారణంగా… అహిలావతిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటానని, తనకి ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటానని దీవిస్తుంది.
మౌర్విగా అహిలావతి జననం
జగన్మాత అయిన పార్వతీ దేవి ఇచ్చిన ఈ శాపం కారణంగా, కైలాసంలో శివపార్వతులను పూజిస్తూ ఉండాల్సిన భక్తురాలయిన అహిలావతి… నరకాసురుని సేనా నాయకుడు అయిన మురాసురునికి కూతురుగా జన్మిస్తుంది. ఈమెకు మౌర్వి అని పేరు పెడతాడు. మురాసురుడు చాలా భయంకరమయిన రాక్షసుడు. ఇతను నరకాసురుడికి చెందిన గొప్ప రాక్షస సైన్యానికి నాయకత్వం వహిస్తూ ఉంటాడు.
మురాసురుడు ఐదు తలలతో చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. ఇతను చాలా గొప్ప యోధుడు. అందుకే నరకాసురుడు తన రాక్షస సైన్యం బాధ్యత మొత్తం మురాసురునికి ఇస్తాడు. మురాసురునికి నరకాసుర రాజ్యాన్ని అన్ని వేళలా కాపాడటానికి కావాల్సిన శక్తులు అన్నీ ఉన్నాయి. అటువంటి శక్తులకు సంబందించి మురాసురునికి పూర్తి జ్ఞానం ఉంది.
మౌర్వి జన్మించిన తరువాత ఆమె తన తల్లిని కోల్పోతుంది. మురాసురునికి మౌర్వి కాకుండా ఇంకా ఏడుగురు కుమారులు కూడా ఉంటారు. వీరు అందరూ గొప్ప యోధులుగా తయారయి తమ తండ్రితో పాటుగా నరకాసురుడు రాజ్యాన్ని కాపాడుతూ, అతని సైన్యానికి నాయకత్వం వహిస్తూ, ఇంకా దేవతలని చాలా హింసిస్తూ ఉండేవారు. దేవతలపైన ఈ భయంకరమైన రాక్షసుల అరాచకాలు ఎక్కువయిపోయి దేవతలు అందరూ కృష్ణుడి దగ్గరకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకొని తమని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు శ్రీ కృష్ణుడు నరకాసురుడిని సంహరిస్తానని దేవతలకు ధైర్యం చెప్పి పంపిస్తాడు. ఆ తరువాత, శ్రీ కృష్ణుడు, తన ప్రియమయిన భార్య మరియు సత్రాజిత్తు కూతురు అయిన సత్యభామతో కలిసి నరకాసురుడు మీదకు యుద్ధం చెయ్యటానికి బయలుదేరి వెళతాడు.
ఇది కూడా చదవండి: Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife
శ్రీ కృష్ణుడిని ఓడించడానికి మౌర్వి ప్రయత్నం
శ్రీకృష్ణుడు నరకాసురుని మీద యుద్ధం చెయ్యటానికి వచ్చినప్పుడు, ముందుగా నరకాసురుని సేనా నాయకుడు అయిన మురాసురుడు కృష్ణుడి మీద దాడి చేస్తాడు. వీళ్ళు ఇద్దరూ భీకరంగా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధం లో మురాసురుడితో పాటుగా అతని ఏడుగురు కుమారులు కూడా ఒక్కసారిగా కలిసి కృష్ణుడి మీదకు యుద్ధం చెయ్యటానికి వస్తారు. ఎంతో భీకరంగా జరిగిన ఈ యుద్ధంలో, చివరికి కృష్ణుడు మురాసురుడిని, అతని ఏడుగురు కుమారులను దిగ్విజయంగా చంపేస్తాడు. ఆ యుద్ధంలోనే సత్యభామ రాక్షసుడయిన నరకాసురుడిని కూడా ధైర్యంగా యుద్ధం చేసి చంపేస్తుంది. నరకాసురుడిని సత్యభామ చంపటం గురించిన కథ మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాము, ఇంకా సినిమాలలో కూడా చూసాము. ఈ విధంగా నరకాసురుడు కోసం, అతని రాజ్యాన్ని కాపాడటం కోసం మురాసురుడు, ఇంకా అతని ఏడుగురు కుమారులు కృష్ణుడి చేతిలో మరణిస్తారు.
అలా మౌర్వి శ్రీకృష్ణుడు, సత్యభామ చేసిన ఈ యుద్ధంలో తన తండ్రి అయిన మురాసురుడిని, ఇంకా తన ఏడుగురు సోదరులను కూడా పోగొట్టుకుని ఒంటరి అయిపోతుంది. తన తండ్రిని, సోదరులను చంపినందుకు శ్రీకృష్ణుడిని మౌర్వి ఎంతగానో ద్వేషిస్తుంది. తన ఈ పరిస్థితికి కారణం కృష్ణుడే అని అతనిని ఆ రోజు నుండీ బాగా అసహ్యించుకుంటుంది. అప్పటి నుండి, ఎలాగయినా శ్రీకృష్ణుడిని చంపాలని బలంగా మనసులో అనుకుంటుంది.
తన జీవితానికి ఉన్న ఒకే ఒక్క పరమార్ధం అదే అని నమ్మి, శ్రీకృష్ణుడిని చంపాలి అనే ఉద్దేశ్యంతో తనను ఒక గొప్ప యోధురాలిగా మార్చుకుంటుంది. అందుకోసం ఎంతో కఠినమయిన శిక్షణ తీసుకుంటుంది. అన్ని రకాల యుద్ధ విద్యలలో నైపుణ్యం సాధించి చివరికి గొప్ప యోధురాలిగా మారుతుంది. రాక్షస వంశంలో పుట్టినా కూడా మౌర్వి పార్వతీ దేవి స్వరూపం అయిన కామాఖ్య దేవికి గొప్ప భక్తురాలుగా ఉంటుంది. యుక్త వయస్సు వచ్చిన తరువాత, మౌర్వి శ్రీకృష్ణుడితో పోరాడటానికి అతని మీద యుద్ధానికి వెళుతుంది.
అయితే యుద్ధసమయంలో, శ్రీకృష్ణుడి దైవత్వం వలన మౌర్వి చాలా ప్రభావితం అవుతుంది. మనసులో ఎంతో పగ, ద్వేషం ఉన్నా కూడా కృష్ణుడితో మౌర్వి యుద్ధం చేయలేకపోతుంది. తన ఈ గందరగోళానికి తన మీద తనకే చాలా కోపం వస్తుంది. ఇంతకాలం కృష్ణుడిని చంపాలని చూసిన తనకు ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుందో అర్ధం కాదు. జీవితమంతా పగతో, ప్రతీకారంతో గొప్ప శత్రువుగా భావించిన కృష్ణుడిని ఎదిరించి చంపాలనే అవకాశం కోసం ఎదురు చూసిన తాను ఇప్పుడు ఎందుకు అతని మీద యుద్ధం చెయ్యలేకపోతుందో అర్ధం కాక బాధపడుతుంది. ఏమీ తెలియని ఈ పరిస్థితిలో, తాను ఎందుకు పోరాడలేకపోతున్నానని కృష్ణుడినే నేరుగా అడుగుతుంది.
అప్పుడు శ్రీకృష్ణుడు శాంతించి, మౌర్విని సమాధానపరిచి, ఆమెకు తన పూర్వ జన్మ విషయం, ఇంకా పార్వతీ దేవి శాపం గురించి వివరంగా చెప్తాడు. ఇంకా పార్వతీ దేవి అహిలావతిని ఎల్లప్పుడూ కాపాడతానని ఇచ్చిన మాట కూడా గుర్తుచేసి, ఈ జన్మలో మౌర్వి భక్తితో పూజిస్తున్న కామాఖ్య దేవి పార్వతీ దేవి స్వరూపమే అని స్పష్టం చేసి ఆమెను సమాధానపరుస్తాడు. మౌర్వి తండ్రి అయిన మురాసురుడు, ఇంకా అతని కుమారులు అందరూ కేవలం తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పటికీ, వాళ్లు అందరూ అధర్ముడయిన నరకాసురుడు కోసం, అతని వైపు ఉండి పోరాడారు కాబట్టి వారిని తప్పక చంపాల్సిన అవసరం వచ్చిందని కృష్ణుడు మౌర్వికి వివరిస్తాడు.
శ్రీ కృష్ణుడు చెప్పినది అంతా విన్న తరువాత, మౌర్వి శాంతించింది. తన పూర్వ జన్మ గురించి అంతా తెలుసుకొని, తన ఈ ప్రస్తుత జన్మ శాపం కారణంగా వచ్చిందని తెలుసుకుంటుంది. తనకు కళ్ళు తెరిపించిన శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి తనను అనుగ్రహించమని వేడుకుంటుంది. అప్పుడు కృష్ణుడు ఆమెను దయతో ఆశీర్వదించి, సమయం వచ్చేంతవరకు అక్కడే నరకాసుర రాజ్యంలోనే ఉండమని చెప్తాడు.
సరయిన సమయం వచ్చినప్పుడు పార్వతీ దేవి ఇచ్చిన శాపం ప్రకారం తనకు భర్త కావలసిన వ్యక్తి తనంతట తానుగా మౌర్వి ముందుకు వస్తాడని చెప్పి ఆమెను ఆశీర్వదిస్తాడు. త్వరలోనే తనకు సరయిన వ్యక్తితో వివాహం జారుతుందని ధైర్యం చెప్తాడు. అప్పటినుండి, మౌర్వి ఆ సమయం కోసం ఎదురుచూస్తూ నరకాసుర రాజ్యంలోనే కాలం గడుపుతుంది. అలా చాలా కలం గడుస్తుంది.
అన్నిరకాలుగా యుద్ధవిద్యలు, తెలివితేటలు సంపాదించిన మౌర్వి తనకు కాబోయే భర్త కూడా తన లాగే చాలా గొప్ప మేధావిగా, ఇంకా తనను యుద్ధంలో ఓడించగలిగిన గొప్ప వీరుడిగా ఉండే శక్తివంతమైన వ్యక్తినే వివాహం చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తుంది. ఈ ప్రతిజ్ఞను నెరవేర్చుకోడానికి, మౌర్వి ఎంతోమంది పురుషులను పరీక్ష చేసి, ఓడిపోయిన వాళ్ళను చంపేస్తూ ఉంటుంది.
ఘటోత్కచుడితో మౌర్వి వివాహం
మహాభారత కథలో మనకు ఘటోత్కచుడి గురించి తెలుసు కదా! ఈ ఘటోత్కచుడి పాత్రని మనం మాయాబజార్ సినిమాలో అస్సలు మర్చిపోలేము. మనిషి జన్మలో ఉన్న భీముడికి, రాక్షస జన్మలో ఉన్న హిడింబికి పుట్టిన కుమారుడే ఈ ఘటోత్కచుడు. ఇతను కామ్యక అనే అడవిలో భీముడికి, హిడింబికి జన్మిస్తాడు. పుట్టుకతోనే ఇతను కుండ ఆకారంలో ఉండటం వలన “ఘట” అని, తల మీద వెంట్రుకలు లేకుండా ఉండటం వలన “ఉత్కచ” అనీ, ఈ రెండు పేర్లు కలిపి ఇతనికి ‘ఘటోత్కచ’ అని పేరు పెడతారు.
పెద్దవాడయిన ఘటోత్కచుడికి వివాహం చెయ్యాలని భీముడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. సరయిన యువతి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మౌర్వి గురించి వివరంగా చెప్పి, ఆమె ఘటోత్కచుడిని వివాహం చేసుకోవడం కోసమే శాపం కారణంగా పుట్టిన అమ్మాయి అని తన గత చరిత్ర అంతా భీముడికి, ధర్మరాజుకి, ఇంకా మిగతా పాండవులకు చెప్తాడు.
కృష్ణుడి సలహా ప్రకారం, భీముడు ఘటోత్కచుడిని మౌర్వి దగ్గరకు పంపిస్తాడు. అప్పుడు మౌర్వి ఘటోత్కచుడిని చూసి, అతను నిజంగా తనకు తగినవాడో కాదో తెలుసుకోవడానికి రకరకాల పరీక్షలు పెడుతుంది. ఆమె పెట్టిన అన్ని పరీక్షలలో గెలిచి ఘటోత్కచుడు మౌర్విని పెళ్లి చేసుకుంటాడు. ఈ విధంగా మౌర్వి ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది. అలాంటి సంఘటనల పరంపర తర్వాత ఘటోత్కచుడు చివరకు అహిలావతిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా పార్వతీ దేవి భక్తురాలయిన అహిలావతి, పార్వతీ దేవి ఇచ్చిన శాపం ప్రకారం మౌర్వి రూపంలో రాక్షసుడయిన ఘటోత్కచుడిని వివాహం చేసుకుంటుంది.
ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology
మౌర్వి శాప విముక్తి
కురుక్షేత్ర యుద్ధంలో చెప్పుకోదగ్గ గొప్ప వీరులలో ఈ ఘటోత్కచుడు కూడా ఒకడు. ఇతను పాండవులవైపు ఉండి కౌరవులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటాడు. యుద్ధసమయంలో ఈ ఘటోత్కచుడు అలయుధుడు, అలంబుషుడు, వంటి అనేక మంది రాక్షసులను, చాలా మంది అసురులను భీకరంగా యుద్ధం చేసి చంపాడు. పాండవులవైపు ఉన్నప్పటికీ, రాక్షస అంశ ఉండటం వలన, ఇతను కూడా యుద్ధంలో చనిపోతాడు.
కర్ణుడికి ఇంద్రుడు ఒకసారి వాసవీ శక్తి అనే దివ్య ఆయుధాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని, ఈ ఆయుధం కచ్చితంగా అవతలి వ్యక్తిని చంపుతుందని చెప్తాడు. కర్ణుడు తన బద్ధ శత్రువు అయిన అర్జునుడిపై ఉపయోగించడానికి ఈ ఆయుధాన్ని ఉంచుకుంటాడు. కానీ, ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడిని చంపటానికి వాడమని దుర్యోధనుడు కర్ణుడికి సలహా ఇస్తాడు. దుర్యోధనుడి మాట కాదనలేక, కర్ణుడు ఆ ఆయుధం ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం 14వ రోజు రాత్రి, కర్ణుడు ఇంద్రుడు ప్రసాదించిన బాణంతో ఘటోత్కచుడిని చంపుతాడు. కర్ణుడి చేతిలో మరణించిన ఘటోత్కచుడి తల ఎగిరి ఎక్కడో పడిపోతుంది. అక్కడ ఒక ఆలయం కూడా కట్టారని చెబుతారు. ఆప్రాంతం ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని “చంపావత్” అనే ఏరియాలో ఉన్నది అని చెబుతారు. ఇలా కురుక్షేత్ర యుద్ధంలో ఘటోత్కచుడు మరణిస్తాడు.
ఘటోత్కచుడికి మౌర్వితో ముగ్గురు కుమారులు కలుగుతారు. వారి పేర్లు అంజనపర్వన్, మేఘవర్ణ, ఇంకా బార్బరిక. ఈ ముగ్గురిలో, బర్బరీకుడు తన తల్లి అయిన మౌర్వి దగ్గర అన్ని రకాల మాయా విద్యలలో శిక్షణ పొందుతాడు. బర్బరీకుడు కురుక్షేత్ర యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనక పోయినా, కృష్ణుడి వరం వల్ల కురుక్షేత్ర యుద్ధం మొత్తం చూస్తాడు. రెండవ కుమారుడు అయిన అంజనపర్వన్ యుద్ధంలో పాల్గొని అశ్వద్ధామ చేతిలో మరణిస్తాడు. చివరి కుమారుడు అయిన మేఘవర్ణ కురుక్షేత్ర యుద్ధ సమయంలో చాలా చిన్న పిల్లవాడు. యుద్ధం ముగిసిన తరువాత, అతను మౌర్వి పర్యవేక్షణలో హిడింభవన్ను వారసత్వంగా పొందాడు.
తన భర్త ఘటోత్కచుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తరువాత, తన కుమారుల బాధ్యతలు పూర్తి చేసిన తరువాత, మౌర్వి శాప విముక్తురాలు అవుతుంది. శాపం పోయిన వెంటనే, ఆమె మళ్ళీ కైలాసం చేరుకుంటుంది. అక్కడ అహిలావతిగా మళ్ళీ గొప్ప భక్తితో, శ్రద్ధతో పార్వతీ పరమేశ్వరులను సేవించుకుంటూ ఉంటుంది. అప్పటినుండీ మౌర్వి దేవిని భక్తితో పూజించిన వారికి విష రోగాల నుండి, పాము కాటు నుండి, ఇంకా అనేక భయంకరమయిన రోగాల నుండి విముక్తి లభిస్తుందని ప్రజల నమ్మకం.
చివరిమాట
మౌర్వి మహాభారతంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె జీవిత కథ ఆమె ధైర్యం, విధేయత ఆమె యొక్క భర్త మరియు కుటుంబం పట్ల భక్తిని ప్రదర్శిస్తుంది. అపారమైన దుఃఖం మరియు కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, మౌర్వి స్థిరంగా మరియు దృఢంగా ఉంది. ఆమె పాత్ర ఒక ప్రేరణగా నిలిచింది. ఈమె పాత్ర ప్రియమైనవారి పట్ల అచంచలమైన నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. మహాభారత చరిత్రలో మౌర్వి వారసత్వం జ్ఞాపకం ఇప్పటికీ గౌరవించబడుతూనే ఉంది.