కేజీఎఫ్ తరహాలో బీహార్లో బంగారు గనులు బయటపడ్డాయి. ఈ గనుల తవ్వకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం కూడా తీసుకుంది. ఈ గనుల్లో దేశంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్నట్లు తేలింది.
బీహార్ రాష్ట్రంలోని జముయ్ జిల్లాలో కర్మాటియా, ఝాఝా, సోనో ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నట్లు ఇటీవలే కనుగొన్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. జముయ్ లో దేశంలోనే అత్యధికంగా 222.88 మిలియన్ టన్నుల బంగారం, 37.6 టన్నుల ఖనిజాలు ఉన్నట్టు వీళ్ళు గుర్తించారు. దీంతో బీహార్ గవర్నమెంట్ ఇక్కడ తవ్వకాలు జరపటానికి అనుమతి మంజూరు చేసింది. ఈ క్రమంలో బిహార్ మైన్స్ అండ్ జియాలజీ శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టారు.
నిజానికి ఈ ప్రాంతంలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గత 40 ఏళ్లలో ఎవరూ గుర్తించలేకపోయారు. అందుకు కారణం ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటమే! అయితే, ఇటీవల జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఆధారంగా ఈ గని బయటపడింది.
అదేంటంటే, జముయ్ లోని ఓ ప్రాంతంలో పెద్ద మర్రిచెట్టు ఉండేది. సమ్మర్ సీజన్లో వేడిని తట్టుకునేందుకు చీమలు అక్కడ పెద్ద పెద్ద పుట్టలు పెట్టాయి. ఆ పుట్ట కోసం కావలసిన మట్టిని మర్రిచెట్టు కింద నుండీ తెస్తూ ఉండేవి. ఆ మట్టిలో తళతళా మెరిసే కణాలు కనిపించేవి. అక్కడ ఉండే స్థానికులు ఇది గమనించారు. వెంటనే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ప్రస్తుతం మన ఇండియాలో ఇప్పటి వరకు బయటపడ్డ గోల్డ్ మైన్స్ లో కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మొదటిడైతే, ఇది రెండవది. అయితే, 2001లో కర్ణాటక ప్రభుత్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ని మూసివేసింది.