ఆకలి అనేది ఎవరికైనా సహజమే! సృష్టిలో ప్రతి ప్రాణి బతికేది ఆ పొట్టకూటి కోసమే! ఆకలిని తట్టుకోలేక మనుషులైతే దొంగతనం చేస్తారు. మరి జంతువులైతే ఏం చేస్తాయి? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంచి ఆకలి మీద ఉన్న ఒక ఏనుగు ఏం చేయాలో దిక్కుతోచక ఒక దొంగతనం చేసింది. అది దొంగిలించింది ఏమిటో! ఎక్కడో! ఇప్పుడు చూద్దాం.
థాయిలాండ్ లోని హువా హిన్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఏనుగు గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంటి కిచెన్ లోకి చొరబడింది. అది ఎలా జోరబడిందో తెలిస్తే నవ్వాపుకోలేరు. రావటం రావటం నేరుగా ఓ ఇంటి గోడని తన తొండంతో బలంగా కొట్టింది. దాంతో అక్కడి గోడ కాస్తా బద్దలైంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అది కరెక్ట్ గా వారి కిచన్ కావటం విశేషం.
ఆ గోడలో నుండీ తన తల మాత్రం దూరేలా రంధ్రం చేసేసింది. ఆ రంధ్రంలోనుంచీ తలని లోపలి పోనిచ్చి, తొండం సహాయంతో చుట్టూ వెతికింది. వెంటనే అక్కడ అందుబాటులో ఉన్న రైస్ బ్యాగ్ ని లాగేసింది. ఇంతలో ఆ ఇంట్లో నిద్రిస్తున్న ఓ కపుల్ కి ఏదో అలికిడి అవుతున్నట్టు అనిపించి… లేచి చూస్తారు. అప్పుడు ఏనుగు నిర్వాకం కాస్తా బయటపడుతుంది.
ఎలాగోలా నానా తంటాలూ పడి ఆ ఏనుగును బయటకు వెళ్లగొట్టగలిగారు. అయితే, అది కూడా వారిపై ఎలాంటి దాడి చేయకుండానే దగ్గర్లోని చెట్లలోకి వెళ్ళిపోయింది. అయితే, ఆ ఏనుగు సుమారు 2 నెలలుగా ఆ ప్రాంతంలోనే తిరుగుతునట్లు సమాచారం. నిజానికి అక్కడక్కడే తిరుగుతున్నా ఎప్పుడూ దేన్నీ నాశనం చేయదు, కానీ ఇప్పుడెందుకు ఇలా చేసిందోనని వాపోతున్నారు ఆ జంట.