మహాలయ పక్షం ప్రారంభమైంది అంటే… కాకుల కోసం వెతకటం ప్రారంభిస్తారు హిందువులు. ఎందుకంటే హైందవ సాంప్రదాయంలో కాకులని తమ పితృదేవతల ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే, కాకుల్ని చాలా పవిత్రంగా చూస్తారు. అందుకే, పిండప్రదానం చేసే సమయంలో కాకికి వెనుక భాగంలో కూర్చుంటే చాలా శుభసూచకమని నమ్ముతారు. ఎందుకంటే, ఈ రకంగా మన పూర్వీకులు మన కుటుంబాన్ని ఆశీర్వదించినట్లు భావిస్తారు. అసలు కాకులనే మన పూర్వీకులుగా భావించటానికి, కాకులకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటానికి గల కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకిని పూర్వీకుల ప్రతిరూపంగా ఎందుకు భావిస్తారు?
కాకిని పూర్వీకుల ప్రతిరూపంగా భావించటం అనేది ఇప్పటి ఆచారం కాదు. ఇది త్రేతాయుగం నాటిది. రామాయణ కాలంలో ఇంద్రుని కుమారుడైన జయంతుడు కాకి రూపంలో వచ్చి సీతాదేవిని గాయపరుస్తాడు. అది చూసిన రాముడు ఒక గడ్డిపోచని తీసుకొని మంత్రించి కాకిపై వదులుతాడు. ఈకారణంగానే “పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం” అనే సామెత వచ్చింది. తర్వాత జయంతుడు తన తప్పు తెలుసుకొని శ్రీరాముడిని క్షమాపణ కోరుతాడు. అప్పుడు శ్రీరాముడు అతడిని క్షమించి… ఈ రోజునుంచీ మీకు ఇచ్చిన ఆహారం… మీ పూర్వీకులు అందుకుంటారని వరమిస్తాడు. అప్పటి నుంచి కాకిని పూర్వీకుల ప్రతిరూపంగా భావిస్తారు.
అలాగే మరో కథ కూడా ఉంది. కాకి యముడి వాహనం. అందువల్ల పితృ పక్షాల్లో మనం పెట్టే ఆహారం కాకి తింటే… యముడు తృప్తి పడి, పితృ దోష నివారణని కలిగిస్తాడని… అలాగే, మన ఆర్ధిక సమస్యలన్నిటినీ నివారిస్తాడని నమ్ముతారు.
కాకి కనిపించకపోతే ఏం చేయాలి?
ఒకప్పుడైతే ఎక్కడచూసినా కాకులు విపరీతంగా కనిపిస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు పర్యావరణ ప్రభావం వల్ల జంతువులు, పక్షులు చాలావరకూ అంతరించిపోతున్నాయి. ఈ కారణంగానే కాకులు కూడా ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పెద్దలకు పిండ ప్రదానం చేసేటప్పుడు పొరపాటున కాకి కనిపించకపోతే ఏం చేయాలి? అనే సందేహం అందరిలో మెదులుతుంది. దీనికి పెద్దలు ఏం చెబుతున్నారంటే, కాకి రాకపోతే, కనిపించిన పక్షికి దేనికైనా ఆహారం పెట్టవచ్చని చెబుతున్నారు. అవి కూడా కనిపించకపోతే, ఏదో ఒక జీవికి ఆహారం పెట్టవచ్చని చెప్తున్నారు.