పట్టాలమీద రైల్ ఇంజిన్ వస్తుందంటేనే ఆమడదూరం పరిగెడుతుంటాం. అలాంటిది రైల్ ఇంజిన్ కిందే కూర్చొని ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కి.మీ ప్రయాణం చేయటమంటే మామూలు మాట కాదు. కానీ, అలాంటి సంఘటనే ఒకటి జరిగింది.
పాట్నా మీదుగా రాజ్గిర్ నుంచి వస్తున్న బుద్ధ పూర్ణిమ ఎక్స్ప్రెస్ గయా జంక్షన్ వద్ద ఆగబోతోందనగా రైల్ ఇంజిన్ కిందనుండీ పెద్దపెద్ద ఏడుపులు, కేకలు వినిపించాయి. అవి ఎటు నుంచి వస్తున్నాయో… ఏమో… అర్ధకాక రైలు స్టేషన్ కి చేరుకోగానే దిగి అటుఇటూ చూసాడు ఆ ట్రైన్ డ్రైవర్.
ఇంతలో ఇంజన్ కిందనుండీ మంచినీళ్లు కావాలంటూ పెద్ద పెద్దగా కేకలు పెడుతూ, ఏడుస్తూ దీనంగా రోదిస్తున్నాడు ఓ వ్యక్తి. ఆ దృశ్యం చూసి డ్రైవర్ షాకయ్యాడు. వెంటనే రైల్వే పోలీసులకు అసలు విషయం చెప్పాడు. వెంటనే అతడిని రైలు ఇంజిన్ కింద నుంచి బయటకు లాగారు. ఇంతకీ, అతను ఎవరో… ఏమిటో… అక్కడికి ఎలా వచ్చాడో తెలుసుకుందాం అనుకొనేలోపు అతనుకాస్తా అక్కడినుండీ పరారయ్యాడు. ఇప్పటికీ అతని ఆచూకీ కోసం వెతుకుతున్నారు.