లైఫ్‌లో సక్సెస్ అయిన వాళ్ళని గమనిస్తే, వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో నిద్ర లేస్తామని చెప్తారు. సక్సెస్ పీపుల్ అంతా ఈ బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు నిద్ర లేస్తున్నారు? ఆ సమయానికి అంత విలువ ఉందా? అసలు బ్రహ్మ ముహుర్తం అంటే ఏమిటి? పండితులు, డాక్టర్లు కూడా ఈ బ్రహ్మ ముహుర్తంలో ఎందుకు నిద్ర లేవాలని అంటున్నారు? ఇక మన పూర్వీకులంతా బ్రహ్మ ముహుర్తంలోనే ఎందుకు నిద్ర లేచేవాళ్ళు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని ఈ రోజు ఈ ఆర్టికల్ ద్వారా నేను మీతో షేర్ చేసుకో బోతున్నాను.
ముందుగా –
బ్రాహ్మీముహర్తం అంటే ఏమిటి?
పూర్వకాలంలో పెద్దలు రోజూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అలా నిద్రలేవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెప్పేవారు. ఇక్కడ సూర్యోదయానికి ముందు అంటే… బ్రాహ్మీముహూర్తం అని అర్ధం.
అయితే, ఇప్పుడలా చెప్పే తరాలు వెళ్లిపోయాయి. మనిషి జీవవనశైలి మొత్తం మారిపోయింది. పనివేళలు, నిద్ర వేళలు అన్నీ పూర్తిగా రివర్స్ అయ్యాయి. పగలు నిద్ర పోతున్నాం. రాత్రుళ్ళు మేల్కొంటున్నాం. ఇక అలాంటప్పుడు బ్రహ్మ ముహూర్తం గురించి పట్టించుకొనే టైమెక్కడండీ బాబూ! అంటారేమో..!
నిజమే మరి. ఇప్పుడు ఉండే ఉద్యోగాలు అలాంటివి. అయినప్పటికీ, కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే… మార్గం లేకపోలేదు. ఇంతకీ ఈ బ్రాహ్మీముహూర్తం అంటే ఏమిటో… అది ఏ సమయంలో వస్తుందో… చెప్పనేలేదు కదూ! సూర్యోదయానికి 96 నిమిషాల ముందు వచ్చే కాలమే “బ్రాహ్మీముహూర్తం”.
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఋతువులను బట్టి సూర్యోదయ వేళలు కూడా మారిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ సమయాన్ని ఎలా పరిగణిస్తారు అనే డౌట్ మీకు రావచ్చు. అందుకే, ఏ ఋతువులో అయినా సరే, తెల్లవారు జామున 3 నుంచి 5 గంటల మధ్య కాలాన్ని బ్రాహ్మీముహూర్తంగా భావిస్తారు.
బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలు
బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: కలలో కాకి కనిపిస్తే ఏమవుతుందో తెలుసా..!
జ్ఞానం కలిగి ఉంటారు
హిందూ సనాతన ధర్మంలో బ్రహ్మ ముహుర్తంలోనే నిద్ర లేవాలని ఓ నియమం ఉంది. ఎందుకంటే, బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రకృతి మొత్తం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సృష్టి అంతా నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని తాకీ తాకనట్లు ఉంటుంది. ఈ సమయంలో వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు.
ఒకరకంగా చెప్పాలంటే, రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏక కాలంలో అనుభవించే సమయం ఇదన్నమాట. అందుకే ఈ సమయంలో మనుషులు ప్రధానంగా సత్వగుణం కలిగి ఉంటారట. సూర్యుని లేలేత కిరణాలు మన శరీరాన్ని తాకడం ఆరోగ్య పరంగా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
చురుగ్గా ఉంటారు
ఇక ఈ సమయంలో ప్రధానంగా వాత లక్షణాలు కలిగి ఉంటాము. మన శరీరంలోని రక్తప్రసరణనీ, ఆలోచనలనీ, కదలికలనీ ప్రభావితం చేయటమే ఈ వాత లక్షణం. దీనివల్ల మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం. ప్రశాంతంగా ఉండగలం. మంచి ఆలోచనలు చేయగలం. చదివినదానిని ఆకళింపు చేసుకోగలం. జ్ఞాపకశక్తితో జీవించగలం. ఆయుర్వేదపరంగా ఇది ఎంతో గొప్ప లక్షణం. స్ట్రయిట్ గా చెప్పాలంటే, ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి, బాడీ, బ్రెయిన్ రెండూ కూడా చురుగ్గా పనిచేస్తాయి.
ఆరోగ్యంగా ఉంటారు
మనబాడీలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రకృతిని బట్టి, మన అలవాట్లను బట్టి నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, నిద్రలేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం ఇవన్నీ చేయవలసిన సమయానికి చేస్తేనే ఆరోగ్యంగా ఉండగలం.
ప్రశాంతంగా ఉంటారు
అలాగే, మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని చెప్తారు. బ్రాహ్మీముహూర్తంలో లేవడం వల్ల ఈ సుషుమ్న నాడి చాలా ఉత్తేజితమవుతుందట. ఈ కారణంగా, మన శరీరంలోనూ, మన చుట్టూ ఉండే వాతావరణంలోనూ, ఇంకా ప్రకృతిలోనూ ప్రశాంతత ఏర్పడుతుందట. అందువల్ల వల్ల యోగా, ధ్యానం, చదువు వంటివి ఈ సమయంలో చాలా తేలికగా సాగుతాయి.
స్థిరంగా ఉంటారు
బ్రహ్మ ముహూర్త కాలంలో మన బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ వల్ల జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ఉంటుంది. ఇక గుండెజబ్బులు ఉన్నవారు కూడా బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచినట్లైతే, వారిలోని రక్తపోటు సాధారణ ష్టితికి చేరుకుంటుంది.
ముగింపు
ఇదంతా చదివిన తరువాత కూడా బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తమని అనుకోకుండా… కొంచెం మీ బద్ధకాన్ని ఒదిలించుకొని… తెల్లవారుజామున నిద్రలేచినట్లైతే… ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటంటే, బ్రహ్మ ముహూర్త కాలం అంటే సృష్టికర్త సమయం. అంటే… మీ జీవితానికి మీరే సృష్టి కర్తగా మారే సమయం. కాబట్టి, మిమల్ని మీరు కోరుకున్న విధంగా మలుచుకోవచ్చని గుర్తుపెట్టుకోండి.