సరిహద్దు దేశాలతో డ్రాగన్ కంట్రీ గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది. గిచ్చి, గిల్లి కయ్యాలు కొనితెచ్చుకుంటోంది. తాజాగా మరోసారి బార్డర్ కాన్ఫ్లిక్ట్ కి కారణమైంది. ప్రపంచదేశాలన్నీ ఏకమై… చైనాని తప్పుపట్టినా… అది తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు. సరిహద్దు దేశాలతో సయోధ్యగా ఉండాల్సింది పోయి… కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.
ఇక రీసెంట్ గా అరుణాచల్ ప్రదేశ్ సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొచ్చుకు రావడానికి విఫలయత్నం చేసింది. 200 మంది చైనా జవాన్లు… తవాంగ్‌లోకి చొచ్చుకొచ్చి… భారత బంకర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన భారత జవాన్లు… వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది గంటల పాటు ఇరుదేశాల మధ్య సైనిక ఘర్షణ జరిగింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.
ఇటీవలే నందా దేవి బయోస్పియర్ రిజర్వ్ సమీపంలో ఉన్న బారాహోటి ప్రాంతం నుంచి కూడా చైనా ఆర్మీ మనదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దాదాపు 100 మంది భారత జవాన్లని అతిక్రమించి… మన దేశంలోకి చొచ్చుకొని రాబోయారు.
ఇప్పటికే ఇలా అనేక పర్యాయాలు చైనా సైన్యం, భారత సైన్యాన్ని కవ్వింపు చర్యలు చేపట్టింది. అలాగే, రాబోయేది వింటర్ సీజన్ కావటంతో… ప్రతికూల వాతావరణ పరిస్దితుల్లో… సరిహద్దుల్లో చొరబాట్లకు ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చైనా బలగాలు ఇప్పటి నుంచే ఆ విధమైన ప్లాన్స్ వేస్తున్నట్లు తెలిసింది. అందుకే, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై భారత బలగాలు ఓ కన్నేసి ఉంచినట్లు అర్ధమవుతోంది.