తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ఈ దృశ్యం ఎంతోమందిని కలిచివేసింది. పేగుబంధం వీడక ముందే… బిడ్డని తనివి తీరా ముద్దాడక ముందే… కడుపారా పాలు ఇవ్వక ముందే బిడ్డని అనాధని చేసి, ఆ తల్లి అనంత లోకాలకి వెళ్ళిపోయింది. తిరుమలలో జరిగిన ఈ దృశ్యం అక్కడి వారందరికీ కంట తడి పెట్టించింది.
సోమవారం తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడికి చెందిన పరకామణి బస్సు ఘాట్ రోడ్డులో వేగంగా ప్రయాణిస్తుంది. ఇంతలో దిగువ కనుమదారిలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్దకి రాగానే… అటవీ ప్రాంతంనుండీ ఒక జింక ఒక్కసారిగా రోడ్డుమీదకి పరిగెత్తుకుంటూ వచ్చింది. దానిని చూసి డ్రైవర్ బ్రేక్ వేసేలోపే… ఆ జింక బస్సు టైరు కింద పడి చనిపోయింది.
అయితే, అప్పటికే ఆ జింక గర్భందాల్చి ఉంది. ఎప్పుడైతే జింక చనిపోయిందో… వెంటనే దాని కడుపులో ఉన్న పిల్ల బయటపడింది. బిడ్డ పుట్టుక తల్లికి తెలియదు, తల్లి స్పర్శ బిడ్డకి తెలియదు. అలా ఒకరికొకరు విడివిడిగా రోడ్డుపై పడి ఉన్న దృశ్యం చూసి అటువైపుగా వెళ్తున్న ప్రయాణీకుల హృదయం ద్రవించివేసింది.
మానవత్వంతో జింకని కాపాడదామని ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది. అది అప్పటికే చనిపోయింది. తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది. అప్పుడే పుట్టిన బిడ్డకి సపర్యలు చేసి దానిని సేవ్ చేయగలిగారు.
వెంటనే ఈ విషయం అటవీశాఖ అధికారులకి అందించారు. వారు ఆ కాఫ్ ని ఎస్వీ జూకి అప్పగించారు. ఏదేమైనా ఈ దృశ్యం చూస్తే ఎవరికీ కన్నీళ్లు ఆగవు.