The Dark Side of Dubai, Human Rights Concerns

Dubai’s Hidden Poverty

ఒక దేశంలో ఉన్న నేచురల్ రిసోర్సెస్, టెక్నికల్  స్కిల్స్ ఆ దేశ  భవిష్యత్తుని నిర్ణయిస్తే, హ్యూమన్ రిసోర్సెస్ మరో విధమైన ఇంపాక్ట్ చూపిస్తాయి. దీనివల్లే ఆ దేశం ప్రపంచ దేశాలలో తానేంటో ప్రూవ్ చేసుకోగలుగుతుంది. ఈ కోవకి చెందిందే దుబాయి. 

ఆర్ధిక ఇబ్బందులుతో సతమతమయ్యే వారెవరైనా సరే  దుబాయి వెళితే చాలు, ఇక వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుంటారు. ఎందుకంటే, ఫైనాన్షియల్ పరంగా బాగా డెవలప్ అయిన కంట్రీ కాబట్టి ప్రపంచ నలుమూలలనుండీ ఉపాధి కోసం ఇక్కడికి వస్తుంటారు. అందుకే, ప్రపంచంలోని మిగతా దేశాలన్నిటికన్నా దుబాయి ప్రత్యేకతే వేరు. 

నిజానికి దుబాయి రిచ్ కంట్రీ అయినప్పటికీ దానిలో చీకటి కోణం కూడా ఒకటి దాగి ఉంది. అక్కడికి వెళ్లి డెవలప్ అయినవాళ్ళ విషయం కొద్దిసేపు పక్కనపెడితే, సరయిన నైపుణ్యం లేకుండా ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచనతో అక్కడికి వెళ్ళిన వాళ్ళ జీవితాలలోకి తొంగి చూస్తే ఎన్నో భయంకరమయిన నిజాలు వెలుగు చూస్తాయి. ముఖ్యంగా దుబాయిలో సంపాదన కోసం వెళ్లిన వారి కష్టాలు, వారి పరిస్థితులు గురించి ఈ రోజు మనం తెలుసుకుందాము.

ఎమిరేట్స్ లో భాగం 

దుబాయ్ గురించి తెలుసుకునే ముందు ఈ ఇస్లామిక్ దేశాలను ఎలా విభజించారో ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మంది దుబాయ్ ఒక దేశం అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే దుబాయ్ అనేది ఏడు ఎమిరేట్స్ సమూహంలో ఒక భాగం మాత్రమే. 

అబుదాబి, దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా, ఉమ్ అల్ క్వైన్ మరియు రస్ అల్ ఖైమా – ఈ ఏడింటిని కలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అని పిలుస్తారు. ఇక మనందరికీ తెలిసిన మరొక పెద్ద ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా. ఇవి రెండూ కాకుండా సంపాదన కోసం ప్రజలు వెళ్లే ఇంకొక ఇస్లామిక్ ప్రాంతం కతార్. 

కఠిన నియమాలు 

ఈ మూడింటిలో సౌదీ అరేబియాలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇక్కడ సరదాలకు, షికార్లకు కూడా చాలా ఆంక్షలు ఉన్నాయి. తమ మతాన్ని మాత్రమే ఇక్కడ ప్రోత్సహిస్తారు. వీరితో పోలిస్తే UAEలో ఉన్న దుబాయ్ లాంటి ప్రాంతాలలో కొంచెం వెసులుబాటు ఉంటుంది. 

UAEలో ఉన్న దుబాయ్ లాంటి ప్రాంతాలలో ఆంక్షలు తక్కువ. కతార్ ఈ రెండిటికీ మధ్యస్థంగా ఉంటుంది. ఖర్చుల పరంగా UAEలో ఉన్న దుబాయ్  లో చాలా ఎక్కువ. ముఖ్యంగా అద్దెలు. కానీ అన్ని రకాల వాళ్ళు ఇక్కడ సంపాదన కోసం జీవిస్తూ ఉంటారు. అందుకే సౌదీ అరేబియాతో పోలిస్తే UAE సమూహంలో నగరాలకు, ముఖ్యంగా మన దేశం నుండి దుబాయ్ నగరానికి జీవనోపాథి కోసం వచ్చే వాళ్ళు చాలా చాలా ఎక్కువ. 

ఇదంతా చూస్తే సంపాదన కోసం దుబాయికి వెళ్ళటం మంచిది అనిపిస్తోందా? ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 

దుబాయ్ అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది… అక్కడ చూపు తిప్పుకోనివ్వని మేఘాలలో కలిసిపోయేంత ఎత్తయిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బుర్జ్ ఖలీఫా భవనం. దుబాయ్ నగరం ఇంకా ఇలాంటి ఎన్నో ఆకాశహర్మ్యాలకు, విలాసాలకు పేరుగాంచిన షాపింగ్ మాల్స్, క్రూరమృగాలను పెంపుడు జంతువులుగా ఇళ్లలో పెంచే అరబ్ సంపన్నులకు ప్రసిద్ధి. అయితే ఇది అంతా నాణానికి ఒక వైపు మాత్రమే. రెండవ వైపు ప్రపంచానికి అంతగా కనిపించని, తెలియని దుర్భర జీవితాలు, ఒక్క పూట కూడా తిండికి కష్టపడే కార్మికులు, జాతి వివక్షలు, ఇంకా ఇలాంటి ఘోరాలు ఎన్నో ఎనెన్నో…

ఇది కూడా చదవండి: Top 15 Most Dangerous Places on Earth

బానిసత్వానికి కేర్ అఫ్ అడ్రెస్ 

దుబాయ్ ప్రపంచం నలుమూలలలో పేద దేశాల నుండి ఇక్కడకు వచ్చి పని చేయడానికి లోకల్ వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లాంటి దేశాల నుండి ఎక్కువ మందిని కనీసం దశాబ్ద కాలం పాటు పని చేసే విధంగా ఒప్పందాలపై సంతకం చేయించుకొని  తీసుకువస్తారు. 

వీరిలో ముఖ్యంగా చదువుకోనివారు, సరయిన నైపుణ్యం లేనివారు ఎక్కువగా ఉంటారు. వీరు బ్రతుకుతెరువు కోసం సొంత దేశంలో భార్యా పిల్లలను, తల్లిదండ్రులను వదిలి సంపాదించాలనే ఆశతో ఇక్కడకు రావడానికి సిద్ధపడతారు. అలా వచ్చిన వెంటనే వీరి నుండి పాస్‌పోర్ట్‌లను తీసేసుకుంటారు. పాస్‌పోర్ట్‌లు తీసుకోవడం చట్టవిరుద్ధమని, అయినా వ్యాపారులు అలా తీసుకుంటున్నారని ప్రభుత్వానికి తెలిసినా కూడా, వీరి మీద చట్టపరమయిన చర్యలు తీసుకోరు.

ఈ పేదలకు నిర్దిష్ట వేతనం ప్రతి నెలా ఇస్తామని, నివాసం ఇంకా భోజనం ఉచితం అని ముందు వాగ్దానం చేస్తారు. కానీ ప్రతీ  నెలా వారి జీవనానికి సంబందించిన ఖర్చు వారి జీతం నుండే తగ్గిస్తారు. దీని వలన ఇలా వచ్చినవారి నెల జీతం చాలా తగ్గిపోతుంది. ఒకొక్కసారి నెలల తరబడి చెల్లింపులను నిలిపివేస్తారు. 

కనీసం రోజుకు 14 గంటలు పని చేయిస్తారు. అయినా కనీసం అడగటానికి కూడా అధికారం ఉండదు. ఎప్పుడయినా అందరూ కలిసి సమ్మె చేయాలని ప్రయత్నిస్తే వారిని జైలులో పెడతారు. ఎందుకంటే, ఇక్కడ నిరసన చేయడం చట్టవిరుద్ధం. ఇక్కడి వ్యాపారులు ఇచ్చే వసతి, భోజనం నచ్చకపోయినా బయట ఉండటానికి, తినటానికి డబ్బులు సరిపోవు. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే.

ఒక చిన్న గదిలో కనీసం పది మంది ఉండాల్సి వస్తుంది. సరయిన గాలి, వెలుతురు కూడా ఉండదు. ఇటువంటి కార్మికుల కోసం అని చిన్న చిన్న అగ్గిపెట్టెల్లాంటి డబ్బా గదులు తయారుచేసి వాటిల్లో ఎక్కువమందిని కుక్కుతారు. స్థలం సరిపోక కొంతమంది bathrooms లో కూడా కింద పడుకుంటారు. అన్నిటికీ మించి భరించలేనంత వేడి. అంత భయంకరమయిన అపరిశుభ్రమైన పరిస్థితులలో కాలం వెళ్ళదీస్తారు. ఈ విధంగా ప్రతి రోజూ జీవితం ఎంతో దుర్భరంగా నడుస్తుంది. 

ఇంకా చాలా మంది ఇక్కడ డ్రైవర్లుగా పని చెయ్యడానికి కూడా వస్తారు. వీరి జీవితం కూడా ఏమంత గొప్పగా ఉండదు. ఒక చిన్న గదిలో కనీసం 15 మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనీస అవసరాలయిన నీరు, తిండి దొరకడానికి చాలా కష్టపడాలి. కొన్ని రోజుల పాటు స్నానం కూడా చెయ్యకుండా దుర్గంధంలో బతుకుతూ ఉంటారు. ఇక ఈద్ లాంటి పండుగల సమయాలలో వీళ్ళ చేత 24 గంటలూ పని చేయిస్తారు. 

సోనాపూర్ – దుబాయ్‌ లేబర్ క్యాంప్

దుబాయ్‌ దగ్గరలో సోనాపూర్ అనే ఒక ప్రాంతం ఉన్నది. పేరుకు సోనాపూర్ అంటే “బంగారు భూమి” అని అర్ధం అయినప్పటికీ, దానికి బంగారంతో ఏమాత్రం సంబంధం లేదు. ప్రపంచం నలుమూలల నుండీ తక్కువ జీతాలకు కార్మికులను తీసుకువచ్చి ఇక్కడ ఉంచుతారు. ఈ ప్రాంతం పేద కార్మికులందరికీ పుట్టినిల్లు అని చెప్పవచ్చు. 

కొన్ని లెక్కల ప్రకారం ఇక్కడ కనీసం కొన్ని లక్షల మంది భరించలేని దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. వందల మందికి వాడుకోవడానికి ఒకే బాత్రూమ్ ఉంటుంది. ఈ ఒక్క విషయం చాలు…అక్కడ ఉండే వాళ్ల జీవితాలు ఎంత ఘోరంగా ఉంటాయో చెప్పటానికి. వీళ్ళు ప్రతి రోజూ ఎక్కువ గంటలు పని చేయాల్సిందే…ఎందుకంటే ఆలా చేయకపోతే వీరికి కనీసం తినటానికి తిండి కూడా దొరకదు. 

దయనీయ పరిస్థితులలో పనిమనుషుల జీవితాలు

దుబాయిలో సంపాదన కోసం భారత్, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ లాంటి దేశాలనుండి వచ్చే మగవారికి మాత్రమే ఇక్కడ కష్టాలు పరిమితం కాలేదు. పని కోసం, సంపాదన కోసం ఈ దేశాల నుండి ఎందరో ఆడవారు కూడా తెగించి ఇక్కడ అడుగు పెడుతూ ఉంటారు. వీళ్ళ జీవితాలు ఇంకా దుర్భరంగా ఉంటాయి. ఉద్యోగం ఇచ్చిన వారి ఇంటిలో పని మనుషులు ఖైదీలుగా మగ్గిపోతారు. ఇంట్లో అన్ని పనులూ చేస్తూ, సరయిన కూడు, నీరు, బట్ట దొరకక బానిసలుగా బతుకుతుంటారు. ఈ పనులే కాకుండా ఆడవారిని తమ కోరికలు తీర్చుకోవటానికి, సుఖాలు అందించటానికి కొంచెం కూడా కనికరం లేకుండా వాడుకుంటారు.  

అత్యాచారం అనేది ఇక్కడ సర్వ సాధారణం. లింగంతో సంబంధం లేకుండా, ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇక్కడ పని కోసం వచ్చినవాళ్ల మీద రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి అత్యాచారం చేస్తూ ఉంటారు. అడిగేవారు ఎవరూ ఉండరు. అందరూ బయటకు నీతులు చెబుతూ మంచివారిగా కనిపిస్తారు కానీ వీళ్లలో చాలా మంది వెనుక చేసే ఘోరాలు చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని ఇళ్లలో ఇలా పనిమనుషులుగా చేరిన వారిని గొలుసులతో పెంపుడు జంతువులను కట్టేసినట్లు కట్టేసి ఉంచుతారట.

ఇది కూడా చదవండి: Uncovering the Secrets of Kumari Kandam’s Lost City

మానవ హక్కుల ఉల్లంఘన, జాతి వివక్షలు

ఒక పక్క చాలీచాలని జీతాలతో, ఒక్క రోజు కూడా కడుపు నింపుకోలేని దీనస్థితిలో కార్మికులు, మరొక పక్క ఈ కార్మికులకు మానవ హక్కుల ఉల్లంఘన, జాతి వివక్షలు అడుగడుగునా ఎదురవుతాయి. పరాయి దేశాల నుండి వచ్చిన వారిని ఇక్కడ చాలా హీనంగా చూస్తారు. రోజువారీ కూలీ మీద బతికే వారి జీవితం చాలా దయనీయం. నడిరోడ్డు మీద అందరి ముందూ మొహం మీదనే ఉమ్మడానికి కూడా వాళ్ళు వెనుకాడరు. వాళ్లకు అంత అధికార, జాత్యహంకార మదం, ఇక అక్కడ పని చేస్తున్నవాళ్లకు ఈ అవమానాలు భరిస్తూ బతకాల్సిన దౌర్భాగ్యం. ఎదురు తిరిగితే ఇక జీవితం మీద ఆశలు వదులుకోవడమే. 

కొంత మంది ఈ బాధలు భరించలేక తెగించి అక్రమ కార్యకలాపాలలో చేరి డబ్బు సంపాదించాలని కూడా ప్రయత్నిస్తారు. కానీ దొరికితే ఇక వీళ్ళకి చావే గతి. మాదకద్రవ్యాల రవాణాను ఈ దేశాలలో చాలా తీవ్రమయిన నేరంగా పరిగణిస్తారు. సరయిన సంపాదన లేక ఇటువంటి వాటిల్లో ఇరుక్కొని అక్కడి జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోలీసులకు ఈ నేరాల్లో దొరికితే చాలా మందికి మరణశిక్ష కూడా విధిస్తారు. ఎప్పుడు మరణిస్తారో  తెలియని భయంకరమయిన జీవితం వీళ్లది. 

పోనీ, ఈ బాధలు ఎందుకని తిరిగి స్వదేశానికి వెళ్లాలనుకున్నా… వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు కనీసం టిక్కెట్‌ కొనడానికి కూడా సరిపోదు. ఎంతోకొంత పోగు చేసి టిక్కెట్‌ కొనాలనుకున్నా, చేతిలో పాస్‌పోర్ట్‌లు ఉండవు. 

కొంచెం మంచి జీతాలు సంపాదించే వాళ్ళ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా ఉండదు. ఎవరయినా తన కుటుంబంతో ఇక్కడ పని చేస్తూ ఉంటే, ఆ కుటుంబంలోని పిల్లలకు 18 సంవత్సరాలు రాగానే వెంటనే వాళ్ళు ఆ దేశం వదిలి స్వదేశానికి వెళ్ళిపోవాలి. పని చెయ్యడానికి visa సంపాదిస్తేనే మళ్ళీ ఇక్కడకు రావడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే, పిల్లలు ఒక చోట…కుటుంబం ఇంకొక చోట ఉండి బాధపడాల్సిందే. 

ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నా కూడా అక్కడి జనాభాలో 40 శాతం మంది భారతదేశం, పాకిస్తాన్, బాంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్లే ఉంటారు. వీళ్ళలో చాలా మంది జీతాలకు ఆశపడి, రంగుల ప్రపంచాన్ని ఊహించుకొని, ఎన్నో కలలతో ఇక్కడకు వచ్చి దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నవాళ్ళే. ఒక పక్క బయట ప్రపంచానికి కనిపించే ఎత్తయిన భవనాలు, చమురు నిల్వలు, విలాసాలు… మరొక పక్క ఈ భవనాలు నిర్మించడానికి, చమురు కేంద్రాలలో పని చెయ్యడానికి వేరే దేశాల నుండి వచ్చి దుర్భర జీవితాలు నడిపే కార్మికులు. ఇది అంతా ఎక్కడో దూరంగా ఉన్న మనలాంటి వాళ్లకు కనపడని, తెలియని భయంకరమయిన నిజం. 

మనిషి ప్రాణాలకు ధర కట్టే విధానం 

అయితే, ప్రభుత్వం ఏర్పరచిన నియమాల ప్రకారం, ఇలా వచ్చిన వారిలో ఎవరయినా చనిపోతే వారి కుటుంబానికి కంపెనీ తరఫున, ఇంకా ప్రభుత్వం తరఫున కూడా నగదు చెల్లిస్తారు. ఇక్కడి దుర్భర పరిస్థితులను తట్టుకోలేక కొంత మంది రోడ్డు మీద వెళుతున్న వాహనాల కిందపడి చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. ఈ విధంగా అయినా తమ కుటుంబానికి ధనం లభిస్తుందనే ఒక ఆశ మనిషిని ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రేరేపిస్తుంది.

మనిషి జీవితానికి ఇక్కడ అస్సలు విలువ ఉండదు, ముఖ్యంగా వేరే దేశాల నుండి పని చేయటానికి ఇక్కడకు వచ్చిన వాళ్లంటే చాలా హీనం. రోడ్డు మీద ఏదయినా వాహనం గుద్ది చనిపోతే డబ్బులు కట్టి బయటకు వచ్చేస్తారు. ఆ కట్టే డబ్బు కూడా చనిపోయిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడో చూసి దాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. ఉదాహరణకు, పాకిస్తానీ అయితే సుమారుగా 5000 డాలర్లు, ఆఫ్రికన్ అయితే 2000 డాలర్లు, భారతీయుడు అయితే 8000 డాలర్లు, ఇలా రకరకాలుగా రేట్లు ఉంటాయట. మనుషులకన్నా ఇక్కడ ఒంటెలకు విలువ ఎక్కువ. ఒక గర్భంతో ఉన్న ఒంటె వాహన ప్రమాదంలో మరణిస్తే 40,000 డాలర్లు చెల్లించాలి అంటారు.

చివరిమాట 

So friends! విదేశాలకు సంపాదన కోసం వెళ్ళటం అంటే అదొక రంగుల ప్రపంచం అనే భ్రమతో వెళ్లకుండా, అన్ని రకాలుగా ఆలోచించి, మోసపోకుండా వెళ్లి రావటం ఎంతో ముఖ్యం. ఎందుకంటే మన కోసం ఎదురుచూస్తూ, ఎల్లప్పుడూ మన క్షేమం కోరుకునే మనవాళ్ళు మన భారతదేశంలో ఉన్నారనే విషయం మర్చిపోవద్దు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top