తోటి వాళ్ళు కష్టాల్లో ఉంటే చేతనైన సహాయం చేయాలనుకోవటంలో తప్పులేదు. కానీ, మనుషులు మాత్రం మానవత్వం మరిచిపోయి, స్వార్ధబుద్ధితో ఒకరినొకరు చంపుకుంటున్నారు. బంధాలు అనుబంధాలు కూడా పక్కన పెట్టి… కక్షలు, పగలు పెంచుకుంటూ పోతున్నారు.
మనుషులం మనం చేయలేని పనిని మూగజీవాలు చేస్తున్నాయి. మర్చిపోయిన ఈ బంధాలను మనిషికి గుర్తు చేస్తున్నాయి. తాజాగా ప్రాణాపాయంలో చిక్కుకున్న ఒక కోడి విషయంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడినుంచీ వచ్చిందో ఒక గ్రద్ద కోడిని నోటకరుచుకొని పోదాం అనుకుంది. ఆ గ్రద్ద కోడిని ఎటాక్ చేయగానే సమీపంలో ఉన్న ఒక కుక్క, మేక ఈ దృశ్యాన్ని చూశాయి. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గ్రద్ద వెంట పడ్డాయి. వాటితో జరిగిన పెనుగులాటలో కోడిని కింద పడేసి బతుకు జీవుడా! అంటూ గ్రద్ద పైకెగిరిపోయింది. ఈ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
ఎప్పుడూ మనతో కలిసి తిరిగేవాడు కాదు స్నేహితుడంటే… మనకి నిజంగా కష్టం కలిగినప్పుడు ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. అయినా కాపాడటానికి బంధువులు, స్నేహితులే కానక్కర్లేదు, భూతదయ ఉంటే చాలు.