Sukracharya, Hindu mythology, guru of Asuras

Exploring Sukracharya’s Life and Teachings

పురాణాలలో ఋషులనగానే ఎంతో శక్తి యుక్తులు కలిగి ఉండి దేవతలకి గురువులుగా ఉండేవారని విన్నాం. కానీ ఒకే ఒక్క ఋషి మాత్రం రాక్షసులకు గురువుగా ఉండేవాడు. అతనే శుక్రాచార్యుడు. ఇంతకీ ఇతను రాక్షసులకు గురువు ఎలా అయ్యాడు? రాక్షసులకు గురువు కాబట్టి ఇతను కూడా దుర్మార్గుడేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ రోజు మనం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం పదండి.

శుక్రాచార్యుడి జననం 

శుక్రాచార్యుడి పేరు హిందూ పురాణాలలో మనకు చాలా తరచుగా వినిపిస్తుంది. ఇతను ఒక గొప్ప ఋషి, మరియు గురువు కూడా. ఇంకా రాక్షసుల గురువుగా చాలా ప్రసిధ్ధి చెందాడు. ఇతను వేదాలు, జ్యోతిష్యం మరియు ఇతర క్షుద్ర శాస్త్రాలలో అపార జ్ఞానం సంపాదించాడు.

అపారమైన శక్తులు, జ్ఞానం కలిగిన శుక్రాచార్యుడు  శ్రావణ శుద్ధ అష్టమి, శుక్రవారం నాడు స్వాతి నక్షత్రంలో జన్మించాడు. ఇతను భృగువు మహర్షి కుమారుడు. భృగువు యొక్క మొదటి భార్య దక్షుని కుమార్తె అయిన ఖ్యాతి. ఈమెనే కావ్యమాత అని కూడా పిలుస్తారు. వీరికి అనేక మంది కుమారులు ఉన్నారు. వీరిలో ఉష్ణ కూడా ఒకరు. ఇదే శుక్రాచార్యుడి మరొక పేరు అని నమ్ముతారు. ఈ విధంగా శుక్రాచార్యుడు బ్రహ్మదేవునికి మనవడు కూడా అవుతాడు. వీరికి కుమారులతో పాటు లక్ష్మి అని ఒక కుమార్తె కూడా ఉన్నది. ఆమెను మహావిష్ణువుకు ఇచ్చి వివాహం చేస్తాడు భృగువు మహర్షి. 

శుక్రాచార్యుడి పుట్టుక గురించి మరికొన్ని కథలు కూడా ఉన్నాయి. కొన్ని కథలలో శుక్రాచార్యుడు భృగువు మహర్షికి హిరణ్యకశ్యపుని కుమార్తె అయిన దివ్యకు జన్మించాడని చెబుతారు. మరొక చోట, శుక్రాచార్యుడు శివుని మూడవ కన్ను యొక్క చెమట నుండి జన్మించాడని అంటారు.

శుక్రాచార్యుడి విద్యాభ్యాసం

యవ్వనంలో ఉన్నప్పుడు, ఇతను అంగీరస ఋషి దగ్గర వేద విద్యను అభ్యసించడానికి వెళ్తాడు. అక్కడ, అంగీరస ముని కుమారుడయిన బృహస్పతి కూడా విద్యను అభ్యసిస్తాడు. శుక్రుడు బృహస్పతి కంటే చాలా జ్ఞానవంతుడని అంగీరస ముని గమనిస్తాడు. కాని అంగీరసుడు తన కొడుకు బృహస్పతి పట్ల పక్షపాతం చూపిస్తాడు. దీనికి శుక్రుడు చాలా బాధపడతాడు. ఆ తర్వాత గౌతమ ఋషి దగ్గర కూడా విద్యను అభ్యసిస్తాడు.

శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు ఎలా అయ్యాడు?

ఆ తరువాత కొంత కాలానికి దేవతలు బృహస్పతిని తమ గురువుగా అంగీకరించారు. తనకంటే తక్కువ సామర్ధ్యం ఉన్న బృహస్పతికి దేవతల గురువుగా ఆధిపత్యం ఇవ్వటం శుక్రుడికి ఏమాత్రం నచ్చలేదు. దేవతలలో, దేవఋషులలో ఉన్న పక్షపాత ధోరణికి  కోపగించుకున్న శుక్రుడు రాక్షసులతో సంబంధం పెట్టుకుంటాడు. వారికి మార్గదర్శకుడు అవుతాడు. అందుకే ఇతనిని ‘అసురాచార్య’ అని కూడా పిలుస్తారు. 

ఇది కూడా చదవండి: Jamadagni Maharshi: The Sage and His Significance

శుక్రాచార్యుడికి ఆ పేరు ఎలా వచ్చింది?

ఒకసారి శుక్రుడు కుబేరుని మోసం చేసి అతని సంపద మొత్తాన్ని దొంగిలిస్తాడు. దీని గురించి దేవతలు మహాశివునికి మొర పెట్టుకుంటారు. దీంతో కోపోద్రిక్తుడైన పరమేశ్వరుడు శుక్రుడిని అమాంతం మింగేస్తాడు. ఎన్నో వేల సంవత్సరాల పాటు అలా శివుని కడుపులో ఉండిపోతాడు. 

అయితే, చివరికి తన తప్పు తెలుసుకొని లోపల నుండి శివుడిని స్మరిస్తూ ఘోర తపస్సు చేస్తాడు. దీనితో సంతోషించిన శివుడు అతనిని శుక్రకణం రూపంలో బయటకు వదులుతాడు. అందుకే అతనికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. అలాగే అతనిని ‘రుద్ర పుత్ర’ అని కూడా పిలుస్తారు.

శుక్రాచార్యుడి వివాహం, కుటుంబం 

శుక్రాచార్యుడి మొదటి భార్య పేరు ఉర్జస్వతి, ఈమె ప్రియవ్రత అనే చక్రవర్తి మరియు సురూప దంపతుల కుమార్తె. శుక్రాచార్యుడి మరొక భార్య ఇంద్రుని కుమార్తె అయిన జయంతి.

శుక్రాచార్యుడికి మొత్తం ఐదుగురు మంది కొడుకులు. వీరి పేర్లు రుచక, త్వస్తా, వరుత్రి, సంద మరియు మర్క.ఇతని కుమార్తె పేరు దేవయాని. యయాతికి భార్య అయిన ఈమె యదు మరియు తుర్వసులకు జన్మనిచ్చింది. దీని పరంగా చూస్తే  కృష్ణుడు శుక్ర వంశం నుండి వచ్చాడు అని కూడా చెప్పవచ్చు.

శుక్రాచార్యుడు విష్ణువును ఎందుకు ద్వేషించాడు?

అసురులు దేవతలతో అనేక యుద్దాలు చేసేవారు. వారి బలం, మాయాజాలంతో ఎన్నో అద్భుతమైన విన్యాసాలు చేసేవారు. అయినప్పటికీ, వారికి దేవతలకు ఉన్నటువంటి జ్ఞానం లేదు. అందుకే వారు తరచూ యుద్ధంలో ఓడిపోయేవారు. అసురుల వైవు వెళ్లిన శుక్రాచార్యుడు వారికి వేదాలు, జ్యోతిష్యం మరియు ఇతర క్షుద్ర శాస్త్రాల రహస్యాలను ఎన్నో బోధించాడు. వారిని మరింత శక్తివంతంగా, ఇంకా జ్ఞానవంతులుగా మారడానికి చాలా సహాయం చేశాడు. అతని మార్గదర్శకత్వంలో, అసురులు బలీయమైన శక్తిగా మారారు. 

అయినా అనేక యుద్ధాలలో దేవతలే గెలుస్తుండటం వలన అసురులకు చాలా నష్టం జరిగింది. ఇది శుక్రాచార్యకు చాలా కోపం తెప్పించింది. అసురులను ఎలాగయినా రక్షించాలని తీవ్రంగా ఆలోచించాడు. చివరికి సంజీవని మంత్రాన్ని పొందేందుకు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని ఘోర తపస్సు చేయాలని భావించాడు. ఈ మంత్రానికి చంపబడిన తర్వాత కూడా మరణించిన వారి శరీరంలోకి జీవాన్ని నింపే శక్తి ఉన్నది. 

శుక్రుడు లేని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇంద్రుడు ఒకసారి అకస్మాత్తుగా అసురులపై దాడి చేస్తాడు. అప్పుడు దేవతల ధాటికి తట్టుకోలేక అసురులు పారిపోతారు. అలా పారిపోయి అడవికి వెళ్లి శుక్రుడి తల్లి అయిన కావ్యమాత రక్షణ కోరతారు. ఆమె వీరికి అభయం ఇచ్చి ఇంద్రుడితో పోరాడుతుంది. ఇంద్రుడు ఆమె శక్తి ముందు నిలవలేకపోతాడు. అప్పుడు ఇంద్రుడిని రక్షించటానికి మహావిష్ణువు వస్తాడు. ఆమెతో యుద్ధం చేసి తన సుదర్శన చక్రంతో ఆమె తల నరికేస్తాడు. తన తల్లిని చంపాడనే కారణంతో శుక్రాచార్యుడు విష్ణువును తీవ్రంగా ద్వేషిస్తాడు. అతని అంతాన్ని బలంగా కోరుకుంటాడు.

తన భార్యను చంపిన విష్ణువు మీద భృగువు మహర్షి కోపోద్రిక్తుడవుతాడు. మళ్లీ మళ్లీ జనన మరణాల బాధను అనుభవించమని విష్ణువును శపిస్తాడు. ఈ శాపం కారణంగానే మహావిష్ణువు భూమి మీద శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అవతారాలు ఎత్తాడని చెబుతారు. 

శుక్రాచార్యుడు సంజీవిని మంత్రాన్ని ఎలా నేర్చుకున్నాడు?

శుక్రాచార్యుడు అసురులను రక్షించాలని తీవ్రంగా ఆలోచించాడు. చివరికి సంజీవని మంత్రాన్ని పొందేందుకు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని ఘోర తపస్సు చేయాలని భావించాడు.

అసురులను రక్షించటం కోసం సంజీవని మంత్రాన్ని పొందేందుకు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని ఘోర తపస్సు చేస్తాడు. అతను ఆహారం మరియు నీరు త్యజించి, చెట్టుకు తలక్రిందులుగా వేలాడుతూ ఘోర తపస్సు చేస్తాడు. కాలిన ఆకుల నుంచి వచ్చే పొగను పీలుస్తూ తపస్సు చేస్తాడు. అతని సంకల్పం మరియు అతని కఠోర తపస్సు దేవతల రాజైన ఇంద్రుడికి చాలా కోపం, భయం కూడా కలిగిస్తుంది. అతని తపస్సుకు భంగం కలిగించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాడు. 

శుక్రుడి తపస్సుకు భంగం కలిగించడానికి, ఇంద్రుడి కుమార్తె అయిన జయంతి వచ్చి కాలుతున్న ఆకుల మీద మిరపకాయలు వేస్తుంది. ఆ మంటకు శుక్రాచార్యుని కళ్ళు, ముక్కు మరియు నోటి నుండి రక్తం కారుతుంది. అయినా కూడా ఈ ప్రయత్నాలు ఏమీ అతని తపస్సుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అతను అనుభవిస్తున్న బాధను, అతని అచంచలమయిన భక్తిని చూసి సంతోషించిన శివుడు ప్రత్యక్షమయ్యి శుక్రాచార్యుడికి సంజీవని మంత్రం ఉపదేశిస్తాడు.

శివుడు ప్రసాదించిన వర ప్రభావంతో శుక్రాచార్యుడు యుద్ధంలో మరణించిన అసురులను బ్రతికిస్తాడు. దీంతో అసురులు ఆ యుద్ధంలో దేవతలపై విజయం సాధిస్తారు. శుక్రాచార్యుడు తపోభక్తికి, అతని శక్తికి జయంతి చాలా ఆకర్షితురాలవుతుంది. తాను చేసిన తప్పును క్షమించమని శుక్రాచార్యుడిని ప్రార్థిస్తుంది. చివరికి తనను వివాహం చేసుకోమని అడుగుతుంది. ఆమెను క్షమించిన శుక్రాచార్యుడు, ఆమెను వివాహం కూడా చేసుకుంటాడు. ఈ విధంగా దేవతల అధిపతి అయిన ఇంద్రుడి కుమార్తె అసురుల గురువుకు భార్యగా మారింది.

శుక్రాచార్యుడు తన కన్ను ఎలా పోగొట్టుకున్నాడు?

శుక్రాచార్యుడి అత్యంత ప్రియ శిష్యులలో అసురుల రాజు అయిన బలి ఒకడు. ఇతను ఎంతో శక్తివంతమైన నాయకుడు. ఇతని పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. అందరు అసుర రాజుల లాగానే ఇతను కూడా విశ్వాన్ని జయించాలని కలలు కన్నాడు. మార్గనిర్దేశం కోసం శుక్రాచార్యుడిని ఆశ్రయించాడు. అజేయతను ప్రసాదించే యాగం చేయమని శుక్రాచార్యుడు సలహా ఇస్తాడు. 

అతని మాట ప్రకారం భక్తితో, దృఢ సంకల్పంతో శుక్రాచార్యుడి పర్యవేక్షణలో బలి చక్రవర్తి యాగం ప్రారంభిస్తాడు. ఆ యాగ ప్రభావం చేత అతని శక్తి విపరీతంగా పెరుగుతుంది. అతనికి పెరుగుతున్న శక్తిని చూసి దేవతలు తీవ్రంగా ఆందోళన చెందుతారు. ఏమి చెయ్యాలో తెలియక విశ్వాన్ని ఆపదల నుండి ఎప్పుడూ సంరక్షించే మహావిష్ణువు సహాయం కోరతారు. విష్ణువు బలి చక్రవర్తిని అంతం చేయటానికి మరుగుజ్జు రూపాన్ని ధరించాలని నిర్ణయించుకుంటాడు. 

యాగం జరుగుతున్న సమయంలో విష్ణువు వామనుడి అవతారంలో అక్కడ ప్రత్యక్షమవుతాడు. బలి చక్రవర్తి ఆ మరుగుజ్జు బాలుడిని చూసి ముగ్ధుడై అతనికి ఏమి కావాలో కోరుకొమ్మని అంటాడు. వామనావతారంలో ఉన్న విష్ణువు మూడడుగుల భూమిని అడుగగా బలి చక్రవర్తి సంకోచం లేకుండా ఇస్తానని మాట ఇస్తాడు. దానం ఇవ్వటానికి సూచికగా కమండలంలోని నీరు వామనుడి చేతిలో ధార పోయటానికి సిద్ధపడతాడు. 

వామనుడి రూపంలో వచ్చినది మహావిష్ణువుని గ్రహించిన శుక్రాచార్యుడు వెంటనే బలి చక్రవర్తిని వారిస్తాడు. తన మరణం తప్పదని గ్రహించిన బలి మహావిష్ణువే తన దగ్గర దానం తీసుకోవటానికి రావటం చాలా గొప్ప విషయమని చెప్పి శుక్రాచార్యుడిని తప్పుకోమంటాడు. ఎలాగయినా ఈ ఆపద నుండి బలిని కాపాడాలని ఒక చిన్న కీటకంగా మారి కమండలంలో నీరు పడే ద్వారానికి అడ్డుపడతాడు. 

బలి చక్రవర్తి ఎంత ప్రయత్నించినా కమండలంలోని నీరు బయటకు రాదు. అప్పుడు అసలు విషయం గ్రహించిన మహావిష్ణువు ఒక దర్భ పుల్లతో కమండలంలో పొడుస్తాడు. ఆ దర్భ పుల్ల శుక్రాచార్యుడి ఎడమ కంటికి గుచ్చుకుంటుంది. ఆ బాధతో శుక్రాచార్యుడు కమండలంలో నుండి బయటకు వచ్చేస్తాడు. బలి చక్రవర్తి నీరు ధార పోస్తాడు. 

వెంటనే వామనుడు తన ఆకారాన్ని విపరీతంగా పెంచుతాడు. తన రెండు అడుగులతో మొదటి అడుగు భూమండలం మొత్తం మీద, రెండవ అడుగుతో దేవలోకాన్ని అంతటినీ ఆక్రమిస్తాడు. మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడిగితే తన తల మీద పెట్టమని బలి చక్రవర్తి చెబుతాడు. వెంటనే మహావిష్ణువు బలి చక్రవర్తి తల మీద పాదం మోపి అతనిని పాతాళానికి తొక్కేస్తాడు. అతని మంచితనాన్ని గుర్తించి, అతనిని పాతాళానికి రాజుగా చేస్తాడు. 

ఈ విధంగా శుక్రాచార్యుడు మహావిష్ణువుకు అడ్డుపడి తన ఎడమ కన్ను పోగొట్టుకుంటాడు. దీని తరువాతనే శుక్రాచార్యుడికి ‘ఏకాక్ష’ అనే పేరు కూడా వచ్చింది.

ఇది కూడా చదవండి: Exploring the Hidden Story of Ravana

శుక్రాచార్యుడిని బ్రతికించిన కచ

దేవగురువు అయిన బృహస్పతి కుమారుడు కచ. శుక్రాచార్యుడికి బృహస్పతితో వైరం ఉన్నప్పటికీ అతని కుమారుడయిన కచను విద్యార్థిగా అంగీకరిస్తాడు. శుక్రాచార్యుడి వద్ద మృత సంజీవనీ మంత్రం నేర్చుకోవటానికి ఇతను శుక్రాచార్యుడి దగ్గర శిష్యరికం చేస్తాడు. గురువు నమ్మకం సంపాదించి మృతసంజీవనీ కళను నేర్చుకుంటాడు. 

అయితే ఇతనికి ఆ విద్య నేర్పటం రాక్షసులకు ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకనే ఎన్నోసార్లు కచను చంపటానికి ప్రయత్నిస్తారు. కానీ శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయాని అతనిని కాపాడుతుంది. ఒకసారి అసురులు కచను విజయవంతంగా చంపి, అతనిని కాల్చివేసి, అతని ఎముకలను పూర్తిగా భస్మంగా మార్చి, దానిని ద్రాక్షారసంతో కలిపి శుక్రాచార్యుడికి అందిస్తారు. ఈ విషయం తెలియని శుక్రాచార్యుడు కచను బ్రతికించటానికి ప్రయత్నించి అతనిని పిలుస్తాడు. 

అయితే కచ స్వరం శుక్రాచార్యుడు కడుపులో నుండి వినిపిస్తుంది. మంత్రం ప్రభావంతో కచ శుక్రాచార్యుడి కడుపుని చీల్చి బయటికి వస్తాడు. శుక్రాచార్యుడు మరణించినా వెంటనే కచ తాను నేర్చుకున్న విద్యతో గురువును మళ్ళీ బ్రతికిస్తాడు. ఈ విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసి దేవతల వద్దకు వెళ్లబోయే ముందు శుక్రాచార్యుడిని బ్రతికించి అసురులకు మంచి చేస్తాడు.

ఇక శుక్రాచార్యుడు చివరికి మరణించాడా అంటే సరయిన సమాధానం లేదనే చెప్పాలి. అతనిని ఒక అసురుల గురువుగా అమరుడిగా అందరూ పరిగణిస్తారు.

శుక్రాచార్యుడు ఒక ఆదర్శ గురువు

శుక్రాచార్యుడు అసురులకు గురువు అనే విషయం పక్కన పెడితే అతను ఎన్నో ఉన్నత విలువలు ఉన్న గురువుగా పేరు సంపాదించాడు. అతనికి ఉన్న శిష్యులలో కూడా చాలా గొప్పవారు ఉన్నారు. ముందుగా బృహస్పతి కుమారుడయిన కచ. ఇతని గురించి ఇప్పుడే చెప్పుకున్నాము. ఇక మిగతా శిష్యులలో కొందరి గురించి చెప్పుకుందాము… 

  • వృషపర్వ: అసురుల రాజు మరియు శర్మిష్ఠ తండ్రి, ఇతను పాండవులకు ఇంకా కౌరవులకు పూర్వీకుడు కూడా. 
  • ప్రహ్లాదుడు: మహా విష్ణు భక్తుడు అయిన ఇతడు అసురులలో అత్యంత శక్తివంతమైన రాజు, హిరణ్యకశిపుడి కుమారుడు. 
  • బలి: ప్రహ్లాదుని మనవడు, అసురుల రాజు, ఇతను కూడా ఒక విధంగా విష్ణు భక్తుడే.
  • దండ: అయోధ్య రాజ్యానికి రాజు అయిన ఇక్ష్వాకు యొక్క చిన్న కుమారుడు. ఇతను శుక్రాచార్యడికి విధేయుడిగా ఉన్నప్పటికీ, అతని కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా పొందాలని ప్రయత్నించి చంపబడతాడు.
  • ప్రితు: ఇతనిని మొదటి పవిత్రమైన రాజుగా గుర్తిస్తారు, ఇంకా మొదటి నిజమైన క్షత్రియుడు కూడా. 
  • భీష్ముడు: శంతను మహారాజు కుమారుడు ఇతడు, శుక్రాచార్యుడి నుండి అన్ని రకాల విజ్ఞాన శాఖలను ఇంకా పాలనా నైపుణ్యాలను అభ్యసించాడు.

శుక్రాచార్యుడు అసురులచేతనే కాకుండా, ఇంకా దేవతలు మరియు సాధువులచే కూడా గౌరవించబడిన గొప్ప జ్ఞానం కలిగిన మహాపురుషుడు. ఇతను రాజనీతి శాస్త్రంలో గొప్ప నిపుణుడు. శుక్రాచార్యుడు ఏర్పరచిన కొన్ని నీతులను కలిపి ‘శుక్ర నీతి’ అని గొప్పగా చెబుతారు. 

నవగ్రహాలలో శుక్రుడి ప్రాముఖ్యత 

శుక్రాచార్యుడినే మనం నవగ్రహాలలో ఒకటైన శుక్ర గ్రహంగా పూజిస్తాము. ఈ గ్రహ ప్రభావం మనిషి జీవితంలో దాదాపు అన్ని దశల్లోనూ ఉంటుంది. శుక్రగ్రహానికి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయని, అందుకే శుక్రుడిని శ్రద్ధగా పూజించాలని చెప్తారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఒక మనిషి జీవితంలో 20 సంవత్సరాల పాటు ఎంతో చురుకుగా ఉండే దశను ‘శుక్ర దశ’ అని పిలుస్తారు. 

చివరిమాట 

శుక్రాచార్యుడు నిస్వార్థ ప్రేమకు, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉండే గొప్ప గురువు. తరతమ బేధం లేకుండా విజ్ఞానం కోసం తన దగ్గరికి వచ్చే ఎవరికయినా జ్ఞానం అందించాలని తపించేవాడు. పేరుకి రాక్షస గురువే అయినప్పటికీ, గొప్ప ఔన్నత్యం కలిగిన మహా జ్ఞాని. అందుకే మనం కూడా అతని అడుగుజాడల్లోనే నడవటానికి ప్రయత్నించి, వీలయితే కొందరికయినా చదువుకోవటానికి సహకరిద్దాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top