సైన్స్ కి కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్న దేవాలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటే ఈ రాహు ఆలయం. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాగదోషంతో బాధపడేవారు రాహుకాలంలో రాహువుకి పాలుపోస్తే… అవి నీలి రంగులోకి మారిపోతాయట. అవి క్రిందకి జారిన తర్వాత తిరిగి మళ్ళీ తెల్లని పాల రంగులోకి మారతాయట. ఇలాంటి వింత జరిగే ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు, ఒక్క కుంబకోణం లో తప్ప.
తమిళనాడులో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి కుంబకోణం లోని తిరునాగలింగేశ్వర ఆలయం. ఇక్కడ శివుడిని నాదనాదేశ్వరుడుగా, అమ్మవారిని గిరిజకుజలాంబికగా పిలుస్తారు. ఈ ఆలయం సముద్రమట్టానికి అతి దగ్గరగా ఉండటం వల్ల… ఆలయం బయట అంతా ఇసుక మేట ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధానంగా పూజలందుకుంటున్నది రాహువు. గర్భాలయంలో తన భార్యలైన నాగరాజ సింహ, చిత్రరేఖలతో కొలువై ఉంటాడు రాహువు. ఈ గుడికి ఓ విశిష్టత ఉంది. అదేంటంటే, రాహు దోషం, నాగ దోషం ఉన్నవారు రాహుకాలంలో రాహువు కి పాలాభిషేకం చేస్తే… వారి దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం.
అయితే, ఇలా రాహు కాలంలో పాలాభిషేకం చేస్తున్నప్పుడు… ఆ పాలు రాహువు కంఠం నుండి క్రిందకి దిగగానే… గొంతు దగ్గర నీలిరంగులోకి మారుతుంది. ఆ పాలు నేలపై పడగానే తిరిగి తెలుపు రంగులోకి మారిపోతాయి. దీనికి కారణం నాగదోషంతో బాధపడేవారు పాలాభిషేకం చేస్తేనే ఇలా జరుగుతుందట. అందుకే, నాగ దోషంతో బాధపడేవారు ఈ ఆలయానికి వచ్చి… రాహువుకి పాలు పోసి… తమ దోషం పోగొట్టుకుంటారు. ఇక ఈ వింతని చూడడానికి కూడా రాహుకాలంలో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు.