వెయ్యేళ్ల చరిత్ర కలిగిన గరిసెండా టవర్ ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇటలీ పట్టణంలోని 150 అడుగుల పొడవున్న ఈ టవర్ కూలిపోయే దశకి చేరుకొంది.
ఇటలీలోని బోలోగ్నా… గరిసెండా, అసినెల్లి అనే రెండు టవర్లకి ప్రసిద్ధి. ఈ రెండు నిర్మాణాలను 1109 నుంచి 1119 సంవత్సరాల మధ్య నిర్మించారు.అయితే, అసినెల్లి టవర్ గరిసెండా కంటే రెండు రెట్లు ఎత్తులో, వాలుగా ఉంటుంది. టూరిస్టులు ఎక్కడానికి వీలుగా అసినెల్లి టవర్ ని తెరుస్తుంటారు.
ఇదిలా ఉంటే, గరిసెండా టవర్ మాత్రం దాని కొన భాగంలో బరువు ఎక్కువగా ఉండటంతో 14వ శతాబ్దంలో వంగిపోవడం ప్రారంభమయింది. అందువల్ల దాని ఎత్తుని తగ్గించారు. అయినప్పటికీ, ఇది దాదాపు 4 డిగ్రీల మేర వంగిపోతూ వచ్చింది. దానిని యధాస్థితికి తీసుకొచ్చేందుకు అప్పట్లో చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇలా వంగి ఉండటం వల్ల అప్పటి నుంచి దీనిని ‘లీనింగ్ టవర్’ అని కూడా పిలుస్తారు.
తాజాగా, ఈ టవర్ మరింత మేర వంగినట్లు గుర్తించారు. దీంతో ఏ క్షణంలోనైనా ప్రమాదం పొంచి ఉందని ఊహించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా చుట్టపక్కల ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు.
ఒకవేళ కూలినా.. ఆ శిథిలాలు చుట్టుపక్కల ఇళ్లపై పడకుండా టవర్ చుట్టూ బ్యారియర్లని ఏర్పాటు చేశారు. ఇక టవర్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 2019లో శాస్త్రీయ కమిటీ సెన్సార్లను అమర్చింది.
ఆ సెన్సార్లు మొదటిసారిగా అక్టోబరు నెలలో ప్రమాద ఘంటికలు మోగించాయి. దీనిపై రీసర్చ్ చేసిన శాస్త్రీయ బృందం టవర్ ప్రమాదంలో పడిందని, అది ఏక్షణంలోనైనా కూలిపోవచ్చని తేల్చారు.