తిరుమల పేరు చెపితే చాలు, మనసంతా… ఆనంద పారవశ్యంతో మునిగిపోతుంది. తిరుమల కొండపై ఎక్కడ చూసినా… గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన తిరుమలలో ఏది చూసినా… అద్భుతమే! ఎక్కడ స్పృశించినా… హరి నామమే!
ఒక్కసారి ఈ కొండపై అడుగుపెడితే చాలు… అక్కడ పీల్చే గాలి… పలికే పలుకు… చేసే పని… అన్నీ కూడా శ్రీహరికే అంకితం. నరనరాల్లోనూ హరి నామం జీర్ణించుకొని పోతుంది. అంతటి మహత్తు కలిగిన తిరుమల కలియుగంలో వెలసిన ఒక గొప్ప స్వర్గధామం. అందుకే ప్రపంచవ్యాప్తంగా శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు క్యూ కడుతుంటారు.
విషయం పక్కనపెడితే, తిరుమల కొండపై శ్రీవారి సహజ శిల ఒకటి ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. శ్రీవారి సహజ శిలతో పాటు, శిలా తోరణం, గరుడ పర్వతం కూడా సహజ సిద్ధంగా ఏర్పడినవే! గరుడ పర్వతం అచ్చం గరుడ పక్షి ఆకారంలో ఉంటుంది. ఆ పర్వతమే స్వామి వారి నివాసం కూడా.
ఇక ఘాట్ రోడ్డు నుంచి చూస్తే… దూరంలో శ్రీవారి సహజ శిల కనబడుతుంది. ఈ శిల మొత్తం భారీ విగ్రహం, శ్రీవారి మోము, తలపై కిరీటంతో ఓ చెక్కిన శిల్పంలా… శ్రీవారి రూపం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తరచూ పూజలు కూడా చేస్తారు. అయితే, ఈ సహజ శిల ఏకశిలతో నిర్మితమై ఉండడంతో… కొండ అంచు పైనుంచి జారి పడే ప్రమాదం ఉండటంతో… నడుముకు తాళ్లు కట్టుకొని పూజారులు కైంకర్యాలు నిర్వహిస్తారు.
ఎప్పటిలానే శ్రీవారి సహజ శిలకి అర్చకులు భారీ గజమాల వేసి, పూలు చల్లుతూ, మంత్రోచ్చరణ చేస్తున్నారు. ఇంతలో ఎటునుండీ వచ్చిందో తెలియదు కానీ, ఒక గరుడ పక్షి అక్కడ ప్రత్యక్షమైంది. పూజ జరుగుతున్నంత సేపూ ఆకాశంలో తిరుగుతూ… స్వామివారి గజమాలపై వచ్చి వాలింది. ఆ దృశ్యాన్ని కెమెరాలో క్యాప్చర్ చేశారు. శ్రీవారి వాహనమైన గరుడ పక్షిని చూసి భక్తులు పులకించిపోయారు. గోవింద నామస్మరణతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగి పోయింది.