`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు`, ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇదంతా రియల్ లైఫ్ లో డైలాగ్ కాదు, రీల్ లైఫ్ డైలాగ్. అదేనండీ… తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్` చిత్ర ట్రైలర్‌లోది.
ఈ మూవీలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.
ఇక కధ విషయానికొస్తే… ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే… ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? సీఎం కుర్చీ కోసం ఎవరెవరు పావులు కదుపుతున్నారు? వాటిని బ్రహ్మ ఎలా అడ్డుకున్నారు? అనేది ‘గాడ్ ఫాదర్’ కథాంశం.
ఈ క్రమంలో మోస్ట్ డేంజరస్ మిస్టీరియస్ మ్యాన్ గా బ్రహ్మా పరిచయం కాబోతున్నాడు. చిరు మార్క్ స్టయిల్, యాక్షన్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో మెగాస్టార్ రెచ్చిపోయారు. నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా, సత్యదేవ్ నెగెటివ్ షేడ్ కలిగిన పాత్ర పోషిస్తున్నారు. ఇక కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరంజీవి తల్చుకుంటే వాలిపోయే షార్ప్ షూటర్ గా కనిపిస్తాడు.
మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘లూసిఫర్’ మూవీకి రీమేక్ గా ”గాడ్ ఫాదర్” చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం లో మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం తెలుగుతోపాటు హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 5న థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్‌ని వదిలారు ఈ ట్రైలర్ మెగాస్టార్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకొంటుంది.