ఇటీవలికాలంలో కంటి సమస్యలు ఎక్కువైపోతున్నాయి. చిన్న వయసులోనే చాలామంది ‘గ్లకోమా’ బారిన పడుతున్నారు. ఇక వృద్ధుల్లో అయితే శుక్లాలు, నీటి కాసులు రూపంలో కంటిచూపు మందగిస్తుంది. దీనిని నివారించాలంటే, ముందుగా అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అందుకోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా కంటి ఒత్తిడిని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయినప్పటికీ, చాలామంది కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల కలిగే పరిణామాలు గురించి పట్టించుకోరు. దృష్టి కోల్పోయే వరకు ఎటువంటి సమస్యలను గమనించుకోరు.
కంటి వ్యాధులకి చికిత్స చేయాలన్నా, నివారించాలన్నా సమగ్ర కంటి సంరక్షణ అవసరమవుతుంది. అలాంటప్పుడు హాస్పిటల్ కి వెళ్లి కంటి పరీక్ష చేయించుకోవటం కష్టంగా మారినప్పుడు ఇంటివద్దనే ఉండి తమ కళ్ళని పరీక్షించుకోవచ్చు. అందుకోసం సరికొత్తగా ఓ పరికరాన్ని రూపొందించారు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ శాస్త్రవేత్తలు.
‘హోప్స్’పేరుతో ఓ వినూత్న పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఒక నల్లటి గ్లౌజ్ ని చేతికి తొడుక్కొని… దానిని కనురెప్ప మధ్యభాగంలో ఉంచటం ద్వారా… కంటి లోపల భాగాలపై పడుతున్న ఒత్తిడిని మనం గమనించవచ్చు. అందుకోసం ఈ డివైజ్ లో సెన్సర్‌ను అమర్చారు. ఇలా కంటిలో ఎంత వరకూ ప్రజర్ ఉన్నదీ స్మార్ట్‌వాచ్‌లో కనిపిస్తుంది. ఈ డివైజ్ డైసన్ అవార్డుల్లో అంతర్జాతీయ విభాగంలో విన్నర్‌గా నిలిచింది.