సాదారణంగా బావిలోని నీరు చల్లగానే ఉంటుంది. ఎంత ఎండాకాలమైనా… బయట ఎండలు మండిపోతున్నా… సరే భూగర్భ జలాలు చల్లని నీటినే అందిస్తుంటాయి. అలాంటి ఓ బావిలోని నీరు ఇప్పుడు సల సలా కాగుతూ… హాట్ స్ప్రింగ్ ని మరిపిస్తుంది.
అయితే, తెలంగాణాలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఓ పురాతన శివాలయం ఉంది. ఆ ఆలయ ఆవరణలో రాతితో నిర్మించిన ఓ చేదబావి ఉంది. దీనిని కాకతీయుల కాలంలోనే నిర్మించారు. అప్పటినుంచీ ఈ శివాలయం ఎంతో విశిష్టతని సంతరించుకుంది. ఎప్పుడూ ధూపదీప నైవేద్యాలతో కళకళలాడుతూ ఉండేది.
నిత్యం శివాలయాన్ని వెలిశాల సుగుణమ్మ అనే మహిళ శుభ్రం చేస్తూ ఉండేది. ఈ క్రమంలోనే, నాలుగు నెలల క్రితం ఎప్పటిలాగే ఆలయాన్ని శుభ్రం చేయటానికి బావిలో నీటిని ఉపయోగిద్దామని… చెదవేసి నీటిని తోడగా… నీళ్లు బాగావేడిగా ఉండటం గమనించింది. వాటిని ఆలయ ఆవరణలో పోయగా పొగలు కూడా వచ్చాయి.
ఈ విషయాన్ని స్థానికులకి చెప్తే… ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి వచ్చిన పూజారికి ఆమె ఈ విషయం చెప్పింది. బావిలో నీరు వేడిగా ఉండటం చూసి… ఆయన గ్రామపెద్దలకు సమాచారమిచ్చారు. వెంటనే ఈ విషయం ఊరంతా పాకింది. దీంతో గ్రామస్థులు ఇదంతా దేవుడి మహిమేనంటూ ఆలయానికి చేరుకుని ఆ బావి వద్ద పూజలు చేశారు. అంతేకాదు, ఈ బావిలో నీటిని తాగటం వల్ల రుగ్మతలు తొలగిపోయి… సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నమ్ముతున్నారు.
అయితే, భూగర్భ శాస్త్రవేత్తలు మాత్రం భూగర్భ పొరల్లో వచ్చిన మార్పుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని తెలిపారు. అలాగే, బావిలోపల ఏదైనా సున్నపు రాతి పొరలు, వేడినీటి ఊటలు ఏర్పడినప్పుడు కూడా ఇలా జరుగుతుంటుందని చెప్తున్నారు.