హైందవ సాంప్రదాయంలో ఏ పని చేయాలన్నా… ముందు శకునం చూడటం ఆచారంగా వస్తుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు తిధి, వారం, నక్షత్రం వంటివి చూడటం ఒక ఎత్తైతే, జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతం చూడటం మరో ఎత్తు.
ఆ సంకేతాల ఆధారంగానే అది మంచి ఫలితాన్ని ఇస్తుందా! లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా! అనేది అంచనా వేస్తుంటారు.
పూర్వ కాలంలో అయితే పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతాలని బట్టి శుభాశుభాలని లెక్కకట్టేవాళ్ళు. మరి ఆ జీవులేవో… అవి ఇచ్చే సంకేతాలేవో… అవి మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో… ఇప్పుడు తెలుసుకుందాం.
- ఉదయాన్నే ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకి వెళ్తుంటే… హంస, నెమలి, చిలుక, తెల్ల గుర్రం వంటివి కనిపిస్తే దానిని శుభ సూచకంగా పరిగణిస్తారు.
- ఇంట్లో పిల్లి ప్రసవిస్తే… అది సంపదకు సూచిక. అందుకే దానిని శుభప్రదంగా పరిగణిస్తారు. కానీ, ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా పిల్లి ఏడుపు వినిపిస్తే… అది విపత్తుకి కారణం. అలాకాక, ముఖ్యమైన పనికోసం బయటికి వెళుతున్నప్పుడు పిల్లి కనిపిస్తే… ఆ పనిలో ఆటంకం ఎదురవుతుంది.
- హిందువులు గోవుని చాలా పవిత్రమైన జంతువుగా భావిస్తారు. అలాంటి గోమాత దూడకి పాలిస్తూ కనపడితే… మీరు తలపెట్టిన పని విజయవంతం అవుతుందని అర్ధం.
- కాకి ఇంటిపై కూర్చుని అదేపనిగా అరుస్తూ ఉంటే… అతిథి వస్తారని సంకేతం. అదే కాకి మీ తలపై కానీ, లేదా మీ భుజంపై కానీ తన్నితే… ధన నష్టం, లేదా వ్యాధికి సంకేతం.
- ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు బురదలో పొర్లిన పంది కనిపిస్తే… అది శుభ సూచకం కానీ, దాని బురద ఎండిపోయి ఉంటే… అది అశుభ సంకేతం.
- ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గాడిద శబ్దం వినిపిస్తే…అది అశుభం. అదే గాడిద కనిపిస్తే… పనిలో ఆటంకం.
తెలుసుకున్నారు కదా! ఈ శకునాల ఆధారంగానే మన పెద్దలు శుభాశుభాలు అంచనా వేసేవాళ్ళు.