హిందూ పురాణాలలో సప్త ఋషుల గురించి మనం విని ఉన్నాం. అలాంటి ఋషులలో ఒకరు జమదగ్ని మహర్షి. ఈయన వేద జ్ఞానాన్ని కలిగి ఉండటమే కాకుండా యుద్ధ నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండేవాడు. ఏకంగా సుర్యుడినే శాసించిన గొప్ప కోపిష్టి మరియు అతి పరాక్రమ వంతుడైన పరశురాముని తండ్రి. ఈ రోజు మనం అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన జమదగ్ని మహర్షి యొక్క ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం.
జమదగ్ని జన్మవృత్తాంతం
భాగవత పురాణం ప్రకారం, సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టించిన ప్రజాపతిలలో భృగు మహర్షి ఒకరు. ఈయన వంశానికి చెందిన బుచీకుడనే ఋషి ఉండేవాడు. ఒకసారి ఈ ఋచీకుడు కుశ వంశానికి చెందిన గాధి మహారాజు దగ్గరికి వెళ్ళి, ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరతాడు.
తన కూతురిని ఒక సాదారణ మునికిచ్చి వివాహం చేయటం ఇష్టం లేని గాధి రాజు ఆయనకో పరీక్ష పెడతాడు. నల్ల చెవులున్న వెయ్యి తెల్ల గుర్రాలను తీసుకురావాలని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే వరుణుడిని ప్రార్ధించి వేయి గుర్రాలని సాధించి సత్యవతిని పెళ్ళిచేసుకుంటాడు ఋచీకుడు.
పెళ్లి తర్వాత, గాధిరాజు దంపతులు పుత్రసంతానం కోసం రకరకాల పూజలు, హోమాలు చేస్తారు. అందులో భాగంగా ఒకరోజు తన కూతురైన సత్యవతి దగ్గరికి వచ్చి, పుత్రుని కోసం బుచీక మహర్షి ఆశీర్వాదం కోరారు. అప్పుడాయన రెండు రకాల హోమ ద్రవ్యాలు తయారు చేస్తాడు. అందులో ఒకటి బ్రహ్మ మంత్రంతోను, మరొకటి క్షత్రియ మంత్రంతోను తయారుచేస్తాడు. వీటిలో బ్రహ్మ మంత్రంతో చేసింది భార్య కోసం, క్షత్రియ మంత్రంతో చేసింది తన అత్తగారి కోసం సిద్ధం చేసి పుణ్యస్నానం చేసేందుకు వెళతాడు.
కానీ, అది తెలియని సత్యవతి ఒకరిది ఒకరికి ఇస్తుంది. జరిగిందంతా దివ్యదృష్టితో గమనించిన బుచీకుడు ఈ పరిణామం కారణంగా తన భార్యకి యోధుడైన కుమారుడు, తన అత్తగారికి సాత్వికుడైన కొడుకు పుడతారని చెప్తాడు.
జమదగ్ని మహర్షి పుట్టుక
సత్యవతి చేసిన పొరపాటు కారణంగా, ఆమెకి జమదగ్ని, గాధిరాజు భార్యకి విశ్వామిత్రుడు పుడతారు. బుచీకుడు చెప్పినట్లే, జమదగ్ని సాత్వికుడే అయినప్పటికీ, మహా కోపిష్టి, యోధుడు అలానే తనకి జన్మించిన పరశురాముడు అతి పరాక్రమ వంతుడు. ఇక విశ్వామిత్రుడు క్షత్రియుడే అయినప్పటికీ, తపశ్శక్తితో బ్రహ్మర్షిగా మారతాడు.
జమదగ్ని మహర్షిని “జమదగ్ని భార్గవ” అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాలలో సప్తఋషులలో ఒకరీయన. జమదగ్నికి పుట్టుకతోనే కోపమెక్కువ. జమదగ్ని పరమశివుని భక్తుడు మరియు గొప్ప ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉన్నాడు.
పెరిగి పెద్దవాడయ్యాక జమదగ్ని కష్టపడి చదివి వేదపఠనంలో పాండిత్యాన్ని సాధించాడు. ఇతను ఎవరి దగ్గరా శిక్షణ పొందకుండా, కేవలం తన తండ్రి మార్గదర్శకత్వంతో ఆయుధ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించాడని చెబుతారు. అంతేకాదు, తన తండ్రైన బుచీక మహర్షి నుండి విష్ణువు యొక్క ఖగోళ విల్లు అయిన శారంగను అందుకుంటాడు. ఇంకా ఇప్పుడు ఉనికిలో లేని ‘ఔషనాస ధనుర్వేదం’ అనేది జమదగ్ని మరియు శుక్రాచార్యుల మధ్య యుద్ధం గురించి జరిగిన సంభాషణ.
రేణుకతో వివాహం
ఋషిగా మారిన తరువాత, జమదగ్ని అనేక పవిత్ర స్థలాలను సందర్శించాడు. చివరకు సౌర వంశానికి చెందిన ప్రసేనజిత్ రాజభవనానికి చేరుకున్నాడు. అక్కడ యువరాణి రేణుకను చూడగానే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమెను తనకిచ్చి వివాహం చేయమని రాజును కోరాడు.
అలా రాజు కూతురైన రేణుకాదేవిని వివాహమాడతాడు. వీరికి ఐదుగురు సంతానం ఉన్నారు వారందరినీ సమిష్టిగా “పంచపుత్రులు” అని పిలుస్తారు. వీరిలో చిన్నవాడు పరశురాముడు. ఇతను శ్రీమహా విష్ణువు యొక్క దశావతారాలలో 6వ అవతారం.
జమదగ్ని తన కుటుంబంతో కలిసి అడవులలో ఒక ఆశ్రమంలో నివసించాడు. ఆయన ఆశ్రమం నర్మదా నది ఒడ్డున ఉండేది. ఆ నది ఒడ్డునే రోజూ తపస్సు చేసుకొంటూ ఉండేవాడు.
ఇది కూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha
రేణుక మరణం
ఓరోజు జమదగ్ని ముని పూజ కోసం గంగాజలం తీసుకు రమ్మని తన భార్య రేణుకని ఆదేశిస్తాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, పూజకు సమయం మించిపోకుండా, త్వరగా గంగాజలాన్ని తీసుకు రమ్మని చెప్పాడు.
రేణుకాదేవి భర్త చెప్పినట్లు నీళ్ళు తెచ్చేందుకు నదికి వెళ్ళింది. నీళ్ళు తేబోతుంటే అక్కడ నదిలో గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి నదిలో జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక ఎంతో తన్మయత్వంతో చూసింది.
కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుకకి భర్త చెప్పిన మాట గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను నదిలో ముంచి నీటిని తీసుకుంది. భయంతో వేగంగా నడుచుకొంటూ ఆశ్రమం చేరింది. ఒణుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉంచింది.
ఇదంతా గమనించిన జమదగ్ని తన దివ్యదృష్టితో అంతా చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలిసి ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ, తన తల్లిని సంహరించమని కుమారులని ఆదేశిస్తాడు. వారిలో ఎవ్వరూ ఆ సాహసం చేయలేకపోతారు. అప్పుడు తల్లిని, మరియు సోదరులని సంహరించమని పరశురాముడిని ఆదేశిస్తాడు.
పరశురాముడికి తన తండ్రి తపశ్శక్తి తెలుసు. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా వెంటనే పరశురాముడు తన పరశుతో తల్లిని సంహరిస్తాడు. తన ఆజ్ఞ పాటించినందుకు సంతోషంతో జమదగ్ని వెంటనే ఏదైనా వరం కోరుకోమంటాడు,
మరేమీ ఆలోచించకుండా పరశురాముడు వెంటనే తన తల్లిని, సోదరులని మళ్ళీ బతికించమని వేడుకొంటాడు. జమదగ్ని వెంటనే “తథాస్తు” అంటాడు. అనంతరం రేణుకాదేవి మరియు ఆమె మిగిలిన కుమారులు పునర్జీవితులయ్యారు.
ధర్మ పరీక్ష
మహాభారతంలోని అశ్వమేధ పర్వంలో, ధర్ముడు జమదగ్ని మునిని పరీక్షించాలని అనుకొంటాడు. వెంటనే ఆయన కోపం యొక్క రూపాన్ని పొందుతాడు. ఒకసారి జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువు ఇచ్చిన పాలని ఒక కుండలోకి పట్టి ఉంచుతారు. ధర్మం వెంటనే కోపం రూపంలోకి మారి ఆ కుండలో ప్రవేశిస్తుంది.
అయితే కోపం కలిసిన ఆ పాలని జమదగ్ని తాగుతాడు. అయినప్పటికీ ఆయన ప్రశాంతంగానే ఉంటాడు. అది గమనించిన ధర్ముడు బ్రాహ్మణ రూపంలో వచ్చి, జమదగ్ని ఋషిని భవిష్యత్తులో ఎప్పుడూ ధర్మంగా ఉండమని వరం ప్రసాదిస్తాడు.
సూర్యుని నుండి వరాలు
మహాభారతం ప్రకారం, జమదగ్ని ఒకప్పుడు సూర్య దేవుడు ఎక్కువ వేడిని కలిగించినందుకు ఆయనపై కోపంగా ఉన్నాడు. అంతటితో ఆగక సూర్యుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆకాశంలోకి అనేక బాణాలు వేశాడు. ఈ పరిణామానికి భయపడిపోయిన సూర్యుడు జమదగ్ని ముందు ఓ బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమవుతాడు. తన వేడిని ఎదుర్కోవటానికి మానవాళికి రెండు వరాలను ప్రసాదిస్తాడు. అవే చెప్పులు మరియు గొడుగు.
కార్తవీర్యునితో వైరం
హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు తనకున్న శాపం కారణంగా చేతులు లేకుండా జన్మిస్తాడు. గొప్ప తపస్సుచేసి, దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని, వేయి చేతులు పొంది, మహావీరుడవుతాడు.
ఒకరోజు ఆ కార్తవీర్యుడు వేటకై వెళ్ళి, అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. అప్పుడు మహర్షి కార్తవీర్యార్జునునికి, మరియు అతని పరివారానికి కూడా పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. అది చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి, ఇది ఎలా సాధ్యమైంది అని అడుగుతాడు. అప్పుడు జమదగ్ని తన దగ్గర కామధేనువు ఉందని, దాని వల్లనే ఇది సాధ్యపడిందని తెలిపాడు. వెంటనే స్వార్ధంతో ఆ గోవుని తనకిమ్మని మహారాజు కోరతాడు. అందుకు జమదగ్ని నిరాకరిస్తాడు. కానీ, కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు.
తర్వాత ఇంటికి వచ్చిన పరశురాముడు విషయం తెలుసుకొని మాహిష్మతికి పోయి, కార్తవీర్యార్జునునితో యుద్ధం చేస్తాడు. అతని వెయ్యి చేతులు, తలను తన పరశుతో ఛేదిస్తాడు. తిరిగొచ్చి ఈ విషయాన్ని తన తండ్రికి చెప్తాడు. అప్పుడు జమదగ్ని ముని అతనిని మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. వెంటనే తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.
ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology
జమదగ్ని మహర్షి మరణం
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు వచ్చి, జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. అప్పుడు రేణుక తన భర్త శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. తిరిగొచ్చిన పరశురాముడు విషయం తెలుసుకొంటాడు. వెంటనే మాహిష్మతికి వెళ్లి, కార్తవీర్యార్జునుని మరియు అతని కుమారులులను చంపి తన తండ్రి తలను తెస్తాడు. తెచ్చిన ఆ తలని తన తండ్రి మెండానికి అతికిస్తాడు.
తన తండ్రిని కోల్పోయినందుకు పరశురాముడు ఎంతగానో కృంగిపోతాడు. యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. వెంటనే అతను తన పరశుని తీసుకొని విధ్వంసానికి దిగుతాడు. ప్రపంచంలోని క్షత్రియులందరిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ వంశాలన్నిటినీ నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను పరశురాముడు క్షత్రియుల రక్తంతో నింపి, తన తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు.
జమదగ్ని మహర్షి ఆలయాలు
జమదగ్ని మందిర్ హవాయి గ్రామం మధ్యలో ఉంది. జమదగ్ని మహర్షికి అంకితం చేయబడిన చాలా పురాతన ఆలయం ఇది. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఉన్న హవాయి అనే మారుమూల గ్రామంలో ఈ ఆలయం ఉంది.
ఇక ఈయన ఆశ్రమం హర్యానాలోని కైతాల్‌కు ఈశాన్యంగా 24 కి.మీ దూరంలో ఉన్న జజ్నాపూర్ గ్రామంలో ఉంది. అయితే ఆ ఆశ్రమం ఇప్పుడు సరస్సులా మారింది.
నీతి
జమదగ్ని మహర్షి కథ విషాదకరమైనదే అయినప్పటికీ, ఆయన యొక్క అపారమైన జ్ఞానం, గొప్ప తపోశక్తి , విధేయత, ధర్మం మరియు కోపం అనేవి అనేక పరిణామాలకు ప్రతీక. జమదగ్ని ఋషి కోపాన్ని తన అంతిమ లక్ష్యమైన జ్ఞానోదయాన్ని సాధించడానికి అతనిని కదిలించే ఒక గొప్ప ఆయుధంగా మార్చుకొన్నాడు.
మొత్తంమీద, జమదగ్ని మహర్షి కథ కర్తవ్యం మరియు ధర్మాన్వేషణకు సంబంధించినది. ఇది మానవ భావోద్వేగాల సంక్లిష్టతలను ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం చేసే అన్వేషణగా మారుస్తుంది. అందుకే ఈయన కథ ప్రజలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో ఆయన మార్గదర్శకత్వం మనకి ప్రేరణగా నిలుస్తుంది.