Jwalamukhi Temple's eternal flame burning continuously

Jwalamukhi Temple’s Eternal Flame Secret | అంతుచిక్కని జ్వాలాముఖి ఆలయం రహస్యం

భారతదేశం అంటే కేవలం ఆచారాలు, సాంప్రదాయాలే కాదు, వింతలు, విశేషాలకు కూడా పెట్టింది పేరు. సాదారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలనో, వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలనో పూజిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం విచిత్రంగా నిరంతరం వెలిగే జ్వాలని పూజిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆ జ్వాల ఎక్కడి నుంచీ వచ్చిందో! దాని వెనకున్న రహస్యం ఏమిటో! ఎవరికీ తెలియదు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలకు సైతం ఆరిపోని ఆ జ్వాల… ఎన్నో రహశ్యాలని తనలో దాచుకుంది. ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగా మిగిలి ఉన్న ఆ జ్వాల ఏమిటో…. దాని యొక్క ప్రత్యేకత ఏమిటో… ఈ ఆర్టికల్ లో  తెలుసుకుందాం. 

జ్వాలాముఖి ఆలయం ఎక్కడ ఉంది?

జ్వాలాముఖి టెంపుల్ భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ఉన్న ఓ ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయం జ్వాలాముఖి దేవతకు డెడికేట్ చేయబడింది. జ్వాలాముఖి అంటే… ‘మంటలు మండుతున్న నోరు’ అని అర్ధం. ఇక్కడ ఉండే అమ్మవారు దుర్గ లేదా మహాకాళి. 

జ్వాలాముఖి స్టోరీ గురించి తెలుసుకొనే ముందు అసలు ఈ ఆలయం ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులు, అక్కడి స్థల పురాణం గురించి ఓసారి బ్రీఫ్ గా తెలుసుకుందాం. 

జ్వాలాముఖి దేవాలయం యొక్క పురాణ చరిత్ర

దేవీ భాగవతం ప్రకారం, దక్షయజ్ఝం సమయంలో తన భర్తకి జరిగిన అవమానానికి గాను, సతీదేవి తనను తాను దహించి వేసుకుంటుంది. సతీదేవి వియోగం భరించలేని శివుడు తన కర్తవ్యాన్ని మరిచి రుద్రతాండవం చేస్తుంటాడు. అది చూసిన విష్ణుమూర్తి శివునికి తన కర్తవ్యాన్ని తెలియచేసి, తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 18 ముక్కలుగా ఖండిస్తాడు. అవి కాస్తా భూమ్మీద పడి… అష్టాదశ పీఠాలుగా మారతాయి. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుచుకుంటున్నాము. 

మరికొందరేమో విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేశాడనీ, ఇంకొందరేమో 108 ముక్కలుగా చేశాడనీ ఇలా రకరకాలుగా చెప్తుంటారు. ఏదేమైనప్పటికీ అమ్మవారి శరీర  భాగాలు ఈ భూమ్మీద పడ్డాయన్నది నిజం. అందులో ఆమె నాలుక పడిన ప్రదేశమే ఈ జ్వాలాముఖి. 

జ్వాలాముఖి ఆలయ చరిత్ర

జ్వాలాముఖి ఆలయానికి ఎన్నో శతాబ్దాల నాటి గొప్ప చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం, ఈ ఆలయాన్ని కాంగ్రాలోని పాలక రాజైన రాజా భూమి చంద్ కటోచ్ స్థాపించాడు. దుర్గా దేవి భక్తుడైన ఈ రాజు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ పవిత్ర స్థలం గురించి ఓ కల కన్నాడట. ఆ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవాలని రాజు ప్రజలను ఆదేశించినట్లు చరిత్ర చెబుతోంది. 

మొత్తం మీద చివరికి ఆ స్థలం కనుగొనబడుతుంది. వెంటనే  ఆ ప్రదేశంలో రాజు ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. ప్రస్తుతం ఆ ఆలయంలో బంగారు పూతపూసిన గోపురం, కొన్ని శిఖరాలు, ఇంకా వెండి ప్రవేశ ద్వారం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆలయం ధౌలాధర్ పర్వత శ్రేణిలో ఉంది. జ్వాలాముఖి దేవి గర్భగుడి లోపల ఉన్న ఒక రాతిలో చిన్న పగులు నుండి వచ్చే శాశ్వతమైన జ్వాల. ఆ జ్వాలనే ప్రజలు అమ్మవారిగా పూజిస్తారు. 

అయితే, దేవాలయం క్రింద భూగర్భంలో అగ్నిపర్వతం ఉందనీ, ఆ అగ్నిపర్వతం నుండీ వచ్చే నేచురల్ గ్యాస్ కారణంగా జ్వాలలు వస్తున్నాయనీ, ఆ మంటలు రాతి గుండా వెళ్తూ కాలిపోతున్నాయనీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. 

అది తెలుసుకొన్న మొఘల్ చక్రవర్తి అక్బర్… ఆ అగ్ని పట్టణాన్ని కాల్చేస్తుందనే భయంతో ఒకసారి మంటలను ఇనుప చట్రంతో కప్పి, వాటిపై నీటిని చల్లి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆ మంటలు ఈ ప్రయత్నాలన్నింటినీ ధ్వంసం చేశాయి. అప్పుడు అక్బర్, తన తప్పు తెలుసుకొని… అమ్మవారిని క్షమాపణ అడిగి… అమ్మవారికి బంగారు గొడుగుని సమర్పించుకొని… అక్కడినుండీ తిరిగి ఢిల్లీ వెళ్లిపోతాడు.

పంజాబ్ మహారాజా రంజిత్ సింగ్ 1809లో ఆలయాన్ని సందర్శించి, ఆలయ గోపురానికి బంగారు పూత పూయించి బహుమతిగా ఇచ్చారు. అతని కుమారుడు ఖరక్ సింగ్ కూడా ఆలయానికి వెండి పూతతో కూడిన తలుపులను బహుమతిగా ఇచ్చాడు.

ఆలయ నిర్మాణ శైలి మొత్తం ఈ ప్రాంతం యొక్క సాంప్రదాయ శైలిని ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను జోడించే అందమైన డిజైన్లు  కారణంగా ఏళ్ల తరబడి ఈ ఆలయం ఎన్నో చారిత్రక సంఘటనలకు కేంద్ర బిందువుగా నిలిచింది. ఇంకా ఆలయం యొక్క ఆకర్షణను కొనసాగించడానికి అనేక పునర్నిర్మాణాలకు కూడా గురైంది. పాండవులు కూడా ఈ ఆలయంలో కొన్ని పునర్నిర్మాణ పనులు చేశారని నమ్ముతారు. 

జ్వాలాముఖి ఆలయ ప్రాముఖ్యత

జ్వాలాముఖి ఆలయం భక్తులకు, ముఖ్యంగా అమ్మవారి ఉగ్ర రూపాన్ని ఆరాధించే వారికి గొప్ప ప్రాముఖ్యతను అందిస్తుంది. విగ్రహాలు ఉన్న అనేక దేవాలయాల మాదిరిగా కాకుండా, జ్వాలాముఖి ఓ ప్రత్యేకతని కలిగి ఉంటుంది. గర్భగుడిలో నిరంతరం మండే శాశ్వతమైన జ్వాలలని కలిగి ఉంటుంది. ఈ జ్వాలలు దేవత యొక్క దైవిక శక్తిని సూచిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి ఈ ఆలయం ఓ ప్రత్యేకం.

జ్వాలాముఖి అంటే ‘అగ్నిపర్వతం’ కాబట్టి ఆలయంలో ఏ విధమైన దేవతా విగ్రహం గానీ లేదా దేవతా చిత్రం గానీ లేదు. కానీ దేవతను సూచించే మండుతున్న గొయ్యి మాత్రం ఒకటి ఉంటుంది. 

ఆలయం లోపల 3 అడుగుల చతురస్రాకారపు గుంత ఒకటి ఉంది. దాని చుట్టూ ఒక మార్గం ఉంటుంది. ఇది భూమి లోపల ఉండే పగుళ్లపై ఒక బోలుగా ఉన్న రాయి లాంటి ప్రాంతంలో ఏర్పడింది. దాని మధ్యలో నుండీ జ్వాల బయటకు వస్తుంది. ఇది మహాకాళి నోరుగా పరిగణించబడుతుంది. ఇలా మొత్తం 9 పగుళ్లు ఉంటాయి. ఈ 9 పగుళ్లు దుర్గాదేవి యొక్క 9 రూపాలను సూచిస్తాయి. 

జ్వాలాముఖి ఆలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది?

జ్వాలాముఖి దేవాలయం కేవలం ఓ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మాత్రమే కాదు, మన ఆత్మను శుద్ధి చేసే అంతర్ముఖ జ్వాల. జ్వాలా దేవి ఆలయంలో శతాబ్దాలుగా ఎలాంటి నూనె, వత్తి లేకుండా సహజంగా తొమ్మిది చోట్ల జ్వాలలు వెలుగుతూనే ఉన్నాయి. ఈ తొమ్మిది జ్వాలలలో వెండి వలయానికి మధ్యలో ఒక జ్వాల వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రధాన జ్యోతిని ‘మహాలకి’ అంటారు. మిగిలిన ఎనిమిది మంది, అన్నపూర్ణ, చండీ, హింగ్లాజ్, విద్యావాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక, అంజి దేవి అనే పేర్లతో పిలుస్తారు.

ఈ దేవాలయ కీర్తి దాని మతపరమైన ప్రాముఖ్యతకు మించి పోయింది. ఈ ఆలయంలో వెలిగే శాశ్వతమైన జ్వాల శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. యుగాలు మారినా ఆరిపోకుండా నిత్యం వెలుగుతూ ఉండే ఈ జ్వాల యొక్క రహశ్యం భక్తులను విపరీతంగా  ఆకర్షించింది. అంతేకాకుండా, ఈ ఆలయం అద్భుతమైన ప్రదేశంలో ఉంది. దాని చుట్టూ గంభీరమైన ధౌలాధర్ పర్వత శ్రేణి ఉంది. ఇది యాత్రికులు మరియు పర్యాటకులకు ఎంతగానో ప్రసిద్ధి చెందిన ప్రదేశం. ప్రశాంతమైన వాతావరణం, ఆలయ ఆధ్యాత్మిక శక్తితో కలిపి ప్రశాంతమైన మరియు ఉల్లాసకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ముగింపు 

జ్వాలాముఖి ఆలయం హిందూ దేవత జ్వాలాదేవి యొక్క భక్తులకు అలాగే  శాంతి మరియు సాంత్వన కోరుకునే వారికి పూజ్యమైన పుణ్యక్షేత్రం. దేవాలయం యొక్క విశిష్టమైన వాస్తుశిల్పం, అంతులేని జ్వాలలు ఇంకా  గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వం హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లే వారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. ఈ ఆలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక మరియు మతపరమైన వారసత్వానికి చిహ్నంగా నిలవటమే కాదు, విశ్వాసం మరియు భక్తి శక్తికి నిదర్శనం కూడా. అందుకే, జ్వాలాముఖి ఆలయం యొక్క దైవిక ప్రశాంతతను స్వీకరించండి; దాని శాశ్వతమైన జ్వాల ద్వారా ఆధ్యాత్మిక మేల్కొలుపుకు మార్గాన్ని వెలిగించనివ్వండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top