Kashi Kalabhairava, Lord Shiva's Furious Form

Kalabhairavas Connection to Kashi Vishwanath

మానవాళి మనుగడకి అవసరమైన జీవిత పాఠాలని నేర్పించటానికి శివుడు కాలభైరవుడుగా మారాడు. ఇతని స్వరూపం మరియు స్వభావం రీత్యా చూస్తే శివుని యొక్క ఉగ్ర రూపమని నమ్ముతారు. అలాంటి కాలభైరవుని పుట్టుక వెనకున్న అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు. నిజానికి కాల భైరవుడు అంటే వేరెవరో కాదు, పరమశివుని యొక్క మరో అంశ. ఈయన శివుని జటాఝూటం అంటే కేశాల నుండీ ఉద్భవించాడు అంటారు. తాత్రిక శక్తులు కలిగి ఉండి, శత్రువుల బారి నుండీ మానవాళిని కాపాడే క్షేత్ర పాలకుడైన కాలభైరవుని యొక్క మిస్టీరియస్ స్టోరీ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

కాల భైరవుడు ఎవరు?

కాల భైరవుడు శివుని ఉగ్ర రూపం. ఇతను అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అంతర్గత శత్రువుల బారినుండి మానవజాతిని కాపాడే రక్షకుడు. అలానే, ప్రకృతిలోని అష్ట దిక్కులనూ నియంత్రిస్తూ బాహ్య శత్రువులను శిక్షించే శిక్షకుడు. 

కాల భైరవుడు ఎలా ఉద్భవించాడు? 

హిందూ మతంలో భైరవ ఆవిర్భావానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. ఈ కథలన్నింటిలో, అత్యంత ప్రాచుర్యం పొందిన కథ శివ మహాపురాణానికి చెందినది. దీని ప్రకారం, ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఒక సంభాషణ జరుగుతుంది.

ఆ సమయంలో, విష్ణువు బ్రహ్మను ఇలా అడుగుతాడు. “ఈ విశ్వం మొత్తానికి సర్వోన్నత సృష్టికర్త ఎవరు? అని. వెంటనే బ్రహ్మ అహంకారంతో ఇలా చెప్తాడు. “ఈ విశ్వానికి సృష్టికర్తని నేనే.  అందరూ నన్నే పూజించాలి” అని అంటాడు. 

మళ్ళీ విష్ణువు “నీ యొక్క సృష్టిని నాశనం చేసేవాడు శివుడు, కాబట్టి నీ యొక్కసృష్టిని అంతం చేసే శక్తి కూడా అతనికే ఉంది” అని చెప్తాడు. దీంతో బ్రహ్మకు చాలా కోపం వస్తుంది. అహంభావంతో బ్రహ్మ దేవుడు ఆ రోజు నుండి, శివుని పనిలో జోక్యం చేసుకోవడం మొదలు పెడతాడు. పదే పదే శివునికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా శివుడు తన కర్తవ్యం నెరవేరుస్తూ పోతాడు. 

రోజు రోజుకీ బ్రహ్మ చేసే పనులు శృతిమించటంతో ఇక భరించలేని శివుడు తన కేశాల నుండి ఒక చిన్న వెంట్రుకను విసురుతాడు. అది కాస్తా కాల భైరవ రూపాన్ని ధరిస్తుంది. కాల భైరవుడు పట్టరాని కోపంతో బ్రహ్మ యొక్క 5 తలల్లో ఒకదానిని తన చిటికెన వ్రేలుతో లేపేస్తాడు.

దీంతో బ్రహ్మకి పట్టిన అహంభావం పూర్తిగా తొలగిపోతుంది. పశ్చాత్తాపంతో ఇకనుండీ తాను విశ్వ ప్రయోజనాల కోసం మాత్రమే పని చేస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పటినుండీ బ్రహ్మ 4 తలల్ని మాత్రమే కలిగి ఉండి… చతుర్ముఖ బ్రహ్మగా పిలవబడుతున్నాడు.

అయితే, బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడు కావటంతో,  బ్రాహ్మణుడైన బ్రాహ్మని చంపడం వలన శివునికి బ్రహ్మ-హత్యా పాతుకం చుట్టుకుంటుంది. బ్రహ్మదేవుని పుర్రె కాల భైరవ చేతులకు అతుక్కొని పోతుంది. దీనినే ‘బ్రహ్మ కపాలం’ అంటారు. బ్రాహ్మణుడిని చంపిన పాపానికి తన చేతికి అతుక్కొన్న పుర్రెతో 12 సంవత్సరాల పాటు భైరవుడు ప్రపంచమంతా తిరిగాడు. ఎక్కడా కూడా ఆ కపాలం అతని చేతినుండీ విడిపోలేదు. 

కాలభైరవుడు బ్రహ్మహత్యాపాతుకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలంతో సహా క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు అంటుకున్న పాతుకం విడిపోలేదు. చివరికి మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ని ప్రాధేయపడతాడు. 

అప్పుడు శ్రీ మహావిష్ణువు ‘‘కాలభైరవా! నీవు శివుని పుత్రుడివి. కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు నీవు. అందుకే, ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీ క్షేత్రానికి వెళ్లు. కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యాపాతకం భస్మమై పోతుంది” అని మహావిష్ణువు సలహా ఇచ్చాడు.

అతని సూచన మేరకు భైరవుడు కాశీకి చేరుకుంటాడు. ఆశ్చర్యంగా  కాలభైరవుని చేతికి అతుక్కున్న బ్రహ్మ కపాలం అతని చేతుల నుండి వేరు చేయబడి నేలపై పడింది. ఆ స్థలాన్నే “కపాల మోక్ష తీర్థం” అని పిలుస్తారు. అదే స్థలంలో కాలభైరవ మందిరం నిర్మించబడింది.

తర్వాత కాలభైరవుని చూసి శివుడు “కాలభైరవా! నీవు ఇక్కడే కొలువుదీరి క్షేత్రపాలకుడుగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి. నీ తరువాతనే నాకు పూజలు జరుగుతాయి.” అని పరమశివుడు చెప్తాడు. అప్పటినుండీ కాశీ క్షేత్ర పాలకుడుగా కాలభైరవుడు పూజలు అందుకుంటున్నాడు.

కాలభైరవుడు భూమిపై అవతరించిన రోజుని భైరవ అష్టమిగా జరుపుకొంటారు. హిందూ చాంద్రమాన మాసంలో మార్గశీర కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ఈ రోజును పాటిస్తారు. వేదాంతవేత్త అయిన ఆదిశంకరుడు కాశీ నగరంలో “శ్రీ కాలభైరవ అష్టకం” అనే కాల భైరవ శ్లోకాన్ని రచించాడు.

దక్షయజ్ఞంలో కాల భైరవుని పాత్ర ఏమిటి?

పురాణాల ప్రకారం, సత్య యుగంలో, బ్రహ్మదేవుని కుమారుడైన దక్ష ప్రజాపతి శివునిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో వృహస్పతి యజ్ఞాన్ని నిర్వహించాడు. అతని అత్యంత ఇష్టమైన కుమార్తె సతీదేవి శివుని ఎంతగానో ఆరాదించేది. మరియు అతని ఇష్టానికి విరుద్ధంగా శివుని వివాహం కూడా చేసుకుంది. 

ఒకసారి దక్షుడు తాను తలపెట్టిన యజ్ఞానికి  దేవతలందరినీ ఆహ్వానించాడు, కానీ సతీదేవిని మరియు శివుడిని మాత్రం పిలవలేదు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందకపోవడం పట్ల సతి బాధపడినప్పటికీ, అది తన పుట్టింటి వాళ్ళు చేసే కార్యం కావడంతో దానికి హాజరు కావాలని కోరుకుంది. తన కోరికను శివునితో చెప్తుంది. కానీ శివునికి ఎంతమాత్రం ఇష్టంలేదు. కానీ ఆమె ఆ యజ్ఞానికి ఎలాగైనా హాజరు కావాలని పట్టుబట్టింది. చేసేదేమీ లేక శివుడు అంగీకరించాడు. శివుని గణాలతో సతీదేవి తన తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరింది.

సతీదేవి యజ్ఞం జరిగే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, ఆమె రాక చూసి దక్షుడు ఎంతమాత్రం సంతోషించడు. పైగా ఆమెను నిరాకరిస్తాడు కూడా. అంతేకాక, తన భర్త అయిన  శివుడిని కూడా అవమానిస్తాడు. తండ్రి తన భర్తని దూషించటం తట్టుకోలేని సతి ఆ యాగశాలలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివునికి పట్టరాని కోపం వస్తుంది. అది తెలుసుకొన్న కాల భైరవ శివుని గణాలతో కలిసి యజ్ఞం జరిగే ప్రదేశానికి వెళ్లి దానిని పూర్తిగా నాశనం చేశాడు. ఆ తర్వాత అహంకారి అయిన దక్షుని తలను నరికివేస్తాడు.

కాలభైరవ అనే పేరు యొక్క మూలం ఏంటి?

కాలభైరవుడు తన పేరుకి తగ్గట్టే కాలాన్ని శాసించేవాడు. అలాగే దోషులను శిక్షించేవాడు కాబట్టి ఇతనిని “దండపాణి” అని కూడా పిలుస్తారు. ఇక్కడ ‘దండ’ అంటే దండము అంటే ‘కర్ర’ అని అర్ధం.  పాపులను శిక్షించడానికి అతను చేతిలో కర్రను పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇతనికి ఆ పేరు వచ్చింది.

భైరవ అనేది భీరు అనే పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం “భయంకరమైనది”. భైరవ అంటే భయంకరమైన రూపం కల్గిన వాడు లేదా భయాన్ని నాశనం చేసేవాడు లేదా భయానికి అతీతుడు అనే అర్ధం వస్తుంది. 

ఒక వివరణ ఏమిటంటే, అతను తన భక్తులను భయంకర శత్రువులైన దురాశ, కామం మరియు కోపం నుండి రక్షిస్తాడు. ఈ శత్రువులు అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే, ఇవి  మానవులు తమ  లోపల ఉన్న దేవుణ్ణి వెతకడానికి అనుమతించవు.  

మరొక వివరణలో, భైరవ అనే పదం సంస్కృత పదం. ‘భై’ అంటే సృష్టి; ‘ర’ అంటే జీవనోపాధి; ‘వ’ అంటే విధ్వంసం. అందుకే భైరవ వినాశనంతో సంబంధం కలిగి ఉన్నాడు. అంతేకాదు, భైరవ జీవితంలోని మూడు దశలను సృష్టించి, నిలబెట్టేవాడు. అందువల్లే అతనిని సర్వోన్నతుడుగా చెప్తారు.

టోటల్ గా ‘కాలభైరవ’ అంటే – కాలాన్ని శాసిస్తూ… మానవ జీవితాలని కాపాడే… అల్టిమేట్ సుప్రీమ్ అని చెప్పకోవచ్చు. 

ఐకానోగ్రఫీ

సాధారణంగా అన్ని శివాలయాల్లో భైరవ విగ్రహాలు మనకి కనిపిస్తుంటాయి. ఈ విగ్రహాలు ఉత్తరం మరియు దక్షిణ దిక్కులలోనే ఉంటుంటాయి. భైరవ సాధారణంగా నాలుగు చేతులతో నిలబడి ఉన్న స్థితిలో చిత్రీకరించబడి ఉంటుంది. ఒక చేతిలో గద, ఇంకొక చేతిలో పాశం, మరొక చేతిలో త్రిశూలం, వేరొక చేతిలో కపాలం పట్టుకొని ఉంటాడు. కుక్క వాహనంగా కలిగి ఉంటాడు. 

భైరవ యొక్క కొన్ని రూపాలు ఉగ్ర రూపంతో నాలుగు కంటే ఎక్కువ చేతులను కలిగి ఉన్నట్లు చూపిస్తాయి. అయితే, ఇందులో అతను సాధారణంగా దిగంబరుడుగా కనిపిస్తాడు.  అలాగే, తామర పువ్వులు, పులి పళ్ళు, మండుతున్న వెంట్రుకలు మరియు అతని మెడ లేదా కిరీటం చుట్టూ పాముతో పాటు మానవ పుర్రెల దండతో చిత్రీకరించబడ్డాడు. 

హాలాహలం మింగడంతో అతని గొంతు నీలిరంగులో ఉంది. అందుకే మృత్యువును జయించిన వ్యక్తిగా పరిగణిస్తారు. ఇంకా అతని మూడవ కన్ను అత్యున్నత జ్ఞానాన్ని సూచిస్తుంది. కొన్ని చోట్ల ఇలాంటి భయంకరమైన రూపంతో భైరవుడు కనిపిస్తుంటాడు. 

కాల భైరవుని రూపాలు ఎన్ని? 

భైరవ శివుని యొక్క సంచారం రూపం. మొత్తం 64 మంది భైరవులు ఉన్నారు. వీరంతా 8 వర్గాల క్రిందకు వస్తారు. ఈ 8 వర్గాల్లో ఒక్కో వర్గం ఒక్కో భైరవ నేతృత్వంలో ఉంటుంది.  నాయకుడుగా ఉన్న భైరవులను అష్టాంగ భైరవులుగా పేర్కొంటారు. ఈ అష్టాంగ భైరవులే విశ్వంలోని 8 దిశలను కాపాడే మరియు నియంత్రించే వారుగా ఉంటున్నారు. ఈ అష్ట భైరవ స్వరూపాలు ఏవంటే – 

  1. అసితాంగ భైరవ
  2. రురు భైరవ
  3. చండ భైరవ
  4. క్రోధ భైరవ
  5. ఉన్మత్త భైరవ
  6. కపాల భైరవ
  7. భీషణ భైరవ
  8. సంహార భైరవ

ఈ ఎనిమిది రకాల భైరవులు పంచభూతాలను ఇంకా సూర్యుడు, చంద్రుడు మరియు ఆత్మను సూచిస్తారు. అష్ట భైరవులలో ప్రతి ఒక్కరు అష్టలక్ష్మిలతో అనుబంధం కలిగి ఉంటారు. అలా వారి భక్తులకు ఎనిమిది రకాల సంపదలను ప్రసాదిస్తారని చెబుతారు. అంతేకాదు, అష్టాంగ భైరవులు చివరికి అష్ట మాతృకలను వివాహం చేసుకున్నారు. ఈ అష్ట భైరవులు మరియు అష్ట మాతృకల నుండి 64 మంది భైరవులు మరియు 64 మంది యోగినిలు సృష్టించబడ్డారు.

ఈ భైరవులందరూ మహా స్వర్ణ కాల భైరవునిచే నియంత్రించబడతారు, ఇతనినే “కాల భైరవ” అని కూడా పిలుస్తారు. అతను సర్వోన్నత దేవుడు మరియు మిగిలిన భైరవులకు పాలకుడు. కాల భైరవ భార్య భైరవి. ఈమె పార్వతి లేదా కాళి యొక్క భయంకరమైన అంశం.

భగవంతుని యొక్క ఈ భయానకమైన అంశ ముఖ్యంగా   అఘోరాలచే పూజించబడుతుంది. శివరాత్రి పండుగ సమయంలో వీరంతా భైరవుడిని పూజిస్తారు.

కాల భైరవుడు క్షేత్రపాలకుడిగా ఎందుకు మారాడు? 

కాల భైరవుడు 8 దిక్కులను కాపాడుతాడు. ముఖ్యంగా మహిళల రక్షకుడిగా కూడా పరిగణించబడ్డాడు. అన్ని శివాలయాల్లో భైరవ విగ్రహం ఉంటుంది. ఆలయానికి సంబంధించిన తాళాలు ఈయన ముందు ఉంచబడతాయి, ఎందుకంటే అతను రోజు ఆలయం మూసివేయబడినప్పుడు కూడా ప్రాంగణాన్ని రక్షిస్తాడని నమ్ముతారు. అందుకే అతన్ని ‘క్షేత్రపాలకుడు’ లేదా ‘ఆలయ సంరక్షకుడు’ అని కూడా పిలుస్తారు.

భైరవుడు యాత్రికులని కూడా సంరక్షిస్తుంటాడు. సుదూర ప్రయాణాలు, ముఖ్యంగా రాత్రిపూట  ప్రయాణం చేసేవారికి కాపలాగా ఉంటాడని నమ్ముతారు. అందుకే మన పూర్వీకులు ప్రయాణాలు చేసేటప్పుడు కాలభైరవ అష్టకం చదువుకోమని చెప్తారు.  

కాల భైరవుడు శని యొక్క గురువుగా పరిగణించబడ్డాడు. తమిళులు ఇతనిని ‘భైరవర్’ లేదా ‘వైరవర్’ అని కూడా పిలుస్తారు, సాదారణంగా భైరవుడు గ్రామ దేవత లేదా గ్రామ సంరక్షకుడిగా మారాడు. అతను గ్రామాన్ని అందులో నివసించే ప్రజల్ని ఎనిమిది దిక్కులలో ఎటునుండీ వచ్చే ముప్పు నుండి అయినా సరే రక్షిస్తాడు. అతను శ్రీలంక వాసులచే కూడా పూజించబడ్డాడు. సింఘాలీస్‌, అతన్ని ‘బహిరావా’ అని పిలుస్తారు. అక్కడ కూడా, అతను ట్రెజర్స్ గార్డియన్ గా గౌరవించబడ్డాడు.

కాల భైరవుడ్ని ఎవరెవరు పూజిస్తారు?

కాల భైరవుడిని హిందూ మతంలోనే కాకుండా బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గౌరవిస్తారు. అందుచేత ఇతనిని హిందువులు, బౌద్ధులు మరియు జైనులు పూజిస్తారు. 

బౌద్ధమతం కూడా భైరవను దేవతగా మరియు ధర్మపాలుడు లేదా ధర్మ రక్షకుడిగా కొలుస్తారు. భైరవుని  యొక్క వివిధ బౌద్ధ రూపాలు టిబెటన్ బౌద్ధమతంలో తాంత్రిక శక్తిగా పరిగణించ బడుతున్నాయి.

ఇంకా అఘోరీలు, కాపాలిక శాఖ, గోరట్ కాశ్మీరీలు, అస్సామీ తాంత్రిక అభ్యాసకులు, కర్ణాటక గౌడలు, ఖాట్మండు మరియు శ్రీలంకలోని ప్రజలు మరియు కొన్ని వర్గాల వాళ్ళు ఈ కాల భైరవుడిని పూజిస్తారు.

కాలభైరవుడిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

భైరవుడు శివుని యొక్క అత్యంత భయంకరమైన రూపం. భైరవుడిని పూజించడం వల్ల భక్తుడికి శాంతి, శ్రేయస్సు, విజయం మరియు సంతానం వంటివి లభిస్తాయని నమ్ముతారు. ఎంతో శక్తివంతమైన దేవుడు కావటం చేత తన భక్తులను అకాల మరణం, విచారం, విషాదం మరియు ఋణ బాధల నుండి కాపాడతాడని నమ్ముతారు.

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో విజయం సాధించడానికి, శత్రువులను జయించడానికి మరియు భౌతిక సుఖాలను పొందేందుకు సహాయం చేస్తాడు. లక్ష్యాలను సాధించడంలోను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటంలోనూ  కూడా ఇతను అందరికీ సహాయం చేస్తాడు. అందుకే ఆయనను ‘కాల ప్రభువు’ అని అంటారు. 

పనికిమాలిన పనులలో సమయాన్ని వృధా చేసే వారు కాల భైరవుడిని క్రమం తప్పకుండా పూజిస్తే మరింత సమర్థవంతంగా తయారవుతారు. అతను తన శక్తి ద్వారా మన ఆత్మలను పవిత్రంగా మారుస్తాడు. 

కాల భైరవుని దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి? 

  • కాల భైరవుడు క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు. అందుకే, ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయాలన్నీ భైరవునికి అంకితం చేయబడిన దేవాలయాలు. 
  • ఇవేకాక, శివుని ఆరాధనకు అంకితం చేయబడిన అన్ని శివాలయాలలో, రోజువారీ పూజ సూర్య భగవానుడి పూజతో మొదలై…  భైరవ పూజతో ముగుస్తుంది.
  • దక్ష యజ్ఞంలో ఆహుతైన సతీదేవి శరీరభాగాలు 18 వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి, వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా కొలుస్తుంటాం. ఈ అష్టాదశ శక్తిపీఠాలతో పాటు  52 శక్తిపీఠాల్లో కాపలా చేసే పనిని శివుడు భైరవుడికి అప్పచెప్పాడు. 
  • పురాతన కాల భైరవ దేవాలయాలలో ఒకటి పంజాబ్ లోని ధురి నగరంలో ఉంది. ఈ ఆలయంలో ఉన్న కాల భైరవ విగ్రహం వందల సంవత్సరాల క్రితం దొరికింది. ఈ ఆలయాన్ని చాలా సంవత్సరాలుగా “బాబా శ్రీ ప్రీతమ్ ముని జీ” నిర్వహిస్తున్నారు. ఇక్కడ కాలభైరవుడు నివసిస్తున్నాడని నమ్ముతారు.
  • భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో, కాల భైరవేశ్వరుడు శ్రీ ఆదిచుంచనగిరి మఠం యొక్క క్షేత్రపాలకుడుగా గౌరవించబడ్డాడు. ఈ ప్రాంతంలోని గౌడలు ఆయనను పరమాత్మగా ఆరాధిస్తారు.
  • సాంప్రదాయకంగా, కాల భైరవ మహారాష్ట్రలోని గ్రామీణ గ్రామాలలో గ్రామ దేవత. ఇక్కడ అతన్ని “భైరవ” లేదా “భైరవనాథ్” లేదా “బైరవర్” అని పిలుస్తారు. 
  • మధ్యప్రదేశ్‌లోని శ్రీ కాల భైరవ నాథ్ స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందినది.
  • భైరవ నెవార్ల యొక్క ముఖ్యమైన దేవత. నెవార్స్ యొక్క అన్ని సాంప్రదాయ స్థావరాలలో కనీసం ఒక భైరవ దేవాలయం ఉంటుంది. నేపాల్‌లోని చాలా భైరవ దేవాలయాలు నెవార్ పూజారులచే నిర్వహించబడుతున్నాయి. ఖాట్మండు లోయలో అనేక భైరవ దేవాలయాలు ఉన్నాయి.
  • చత్తిస్ ఘడ్ లోని జగదల్ పూర్ లో ఉన్న దంతేవాడలో ప్రాచీనాలయం ధ్వంసం కాగా, భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలుగా  పూజలందు కుంటున్నాయి.
  • అస్సాం లోని గౌహతిలో ఉన్న తేజ్ పూర్ లో ‘మహాభైరవుడు’ అనే పేరుతో స్వామి లింగరూపంలో పూజలందుకుంటూ ఉన్నాడు.
  • తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాలో ఉన్న ఇసన్నపల్లిలో ఉన్న దిగంబర విగ్రహం దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా ప్రసిద్దికెక్కింది.
  • ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాలో ఉన్న రామగిరిలో  శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కనే 5 అడుగుల  కాలభైరవాలయం కూడా ఉంటుంది.  
  • శ్రీశైల క్షేత్రం దగ్గర ఉన్న భైరవ గుహలో శివస్వరూపుడైన భైరవుడు స్థానిక చెంచులకి దేవుడై దర్శనమిస్తాడు.
  • ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న అడవివరంలో ఓపేన్ ఎయిర్ మండపంలో భైరవుడు దర్శనమిస్తాడు.
  • ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లాలో ఉన్న భైరవకొండ ప్రాంతంలో త్రిముఖదుర్గ అమ్మవారు కొలువై ఉంది.  ఇక్కడ క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.
  • తమిళనాడులోని కుంబకోణంలో ఉన్న తిరువైసనల్లూరు శివయోగినాథ ఆలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.
  • న్యూడిల్లిలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు ఇక్కడి స్థల పురాణం చెప్తుంది.
  • ఉత్తరప్రదేశ్ లోని ధున్నాస్ ప్రాంతంలో ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. 
  • ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్న మున్నంగి మరియు భైరవపాడు ప్రాంతాల్లో స్వయంభువులుగా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు.
  • కర్నాటక లోని ధర్మపురి జిల్లాలో ఉన్న అధియమాన్ కొట్టాయ్ ప్రాంతంలో అధియమాన్ అను చక్రవర్తిచే 9వ శతాబ్దంలో ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.
  • కర్నాటక లోని కొల్లూర్ దగ్గర ఉన్న కచ్ఛాద్రి దగ్గర ఉన్న కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు.

ఇలా చెప్పుకొంటూ పోతే కాలభైరవుడు లేని శివాలయం కానీ, దేవీ ఆలయాలు కానీ లేవు. 

ముగింపు 

ఫైనల్ గా కాల భైరవ స్టోరీ విన్న తర్వాత మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. భైరవ సమస్త విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకొన్నాడు. విశ్వంలోని అన్ని శక్తులు అతనిలో కలిసిపోయాయి. అందుకే మానవాళిని అన్ని రకాలుగాను, అన్ని వైపులనుండీ రక్షిస్తూ ఉన్నాడు. ఇక  చనిపోయాక ప్రజలు తమ పాపాలనుండి విముక్తి పొందటానికి కపాల మోక్షం పేరుతో వారి ఆత్మలని కూడా క్షమిస్తూ ఉన్నాడు. 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top