మహాభారతంలో ఎంతోమంది గొప్ప యోధులు ఉన్నారు. అయితే వారిలో ఎవరు గొప్ప అని అడిగితే అది ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఎందుకంటే, ఒకరిని మించిన శక్తి మరొకరిది. మిగతావాళ్ళని పక్కన పెడితే, కర్ణుడు మరియు అర్జనుడు వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనే ప్రశ్న తలెత్తినప్పుడు కొంతమంది కర్ణుడు పక్షాన మాట్లాడితే, ఇంకొంతమంది అర్జనుడి పక్షాన మాట్లాడతారు. అందుకే ఈ మాట శతాబ్దాల తరబడి మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మిగిలిపోయింది. నిజానికి వీళ్ళిద్దరూ సోదరులే అయినప్పటికీ, విధి వారిని యుద్ధంలో పాల్గొనేలా చేసింది. అంతేకాదు, మహాభారతంలో వీరిద్దరూ అత్యంత శక్తివంతమైన పాత్రలుగా మిగిలిపోయారు. ఇంతకీ వీరిద్దరిలో గ్రేట్ వారియర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కర్ణుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొందాం.
కర్ణుడి పుట్టుక:
కర్ణుడు పాండవులకు సవతి సోదరుడు. సూర్య భగవానుని అనుగ్రహం చేత కుంతీదేవికి కలిగిన కుమారుడే కర్ణుడు. అయితే, తనకి వివాహం కాకుండానే కలిగిన కుమారుడు కావటంతో భయపడి కుంతి కర్ణుడిని గంగానదిలో విడిచిపెడుతుంది. పుట్టుకతోనే కవచ కుండలాలని కలిగి మెరిసిపోతూ నదిలో తేలియాడుతున్న ఆ శిశువుని చూసి… సంతానం లేని అతిరథ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొంటూ వచ్చారు. అతిరథుడు అంటే వేరే మరెవరో కాదు, కౌరవుల తండ్రైన ధృతరాష్ట్రుని యొక్క రథసారథి. సూత వంశంలో పెరిగినందువల్ల కర్ణుడు సూత పుత్రుడుగా పిలవబడ్డాడు.
కర్ణుడి విద్యాభ్యాసం :
కౌరవ, పాండవులతో సమానంగా కర్ణుడు కూడా గురువు ద్రోణాచార్యుని దగ్గర సకల విద్యలూ నేర్చుకొన్నాడు. సూతపుత్రుడన్న కారణం చేత ద్రోణాచార్యుడు ఇతనికి అస్త్రవిద్య నేర్పలేదు. కానీ, ఎలాగైనా అస్త్రవిద్య నేర్చుకోవాలన్న పట్టుదలతో, తానొక బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి, పరశురాముని దగ్గర అస్త్రవిద్య నేర్చుకొంటాడు.
కర్ణుడి శాపాలు:
కర్ణుడు అబద్ధమాడి అస్త్రవిద్య నేర్చుకొన్నాడన్న విషయం ఆలస్యంగా తెలుసుకొంటాడు పరశురాముడు. నిజం తెలుసుకొన్న అతను వెంటనే తాను ఉపదేశించిన ఆ దివ్యాస్త్రాలు ఆపత్కాల సమయంలో ఫలించవు అని శాపమిస్తాడు.
పరశురాముడి ఆశ్రమంలో విలువిద్య నేర్చుకొనే సమయంలోనే ఒకసారి తాను వేసిన బాణం దగ్గరలో మేత మేస్తున్న ఒక బ్రాహ్మణుని ఆవుకి తగిలి అది చనిపోతుంది. అది చూసిన ఆ బ్రాహ్మణుడు ఒక నిస్సహాయ జంతువును చంపిన విధంగానే నీవుకూడా యుద్ధరంగంలో నిస్సహాయంగా చంపబడతావని శపిస్తాడు.
ఒకసారి కర్ణుడు నెయ్యి పార పోసుకుని ఏడుస్తూ వెళుతున్న ఒక చిన్నారిని చూశాడు. అదే నెయ్యి కావాలని ఆ చిన్నారి పట్టుపట్టటంతో మట్టి నుండి నెయ్యిని పిండి ఇస్తాడు. దీంతో భూమాత ఆగ్రహించి యుద్ధభూమిలో కీలకమైన సమయంలో నీ రథచక్రాన్ని భూమిలో బంధిస్తానని శపిస్తుంది.
ఇలా కర్ణుడి జీవితంలో తాను పొందిన ఒక్కో శాపం చివరి సమయంలో తన మరణానికి కారణమవుతాయి.
కర్ణుడి స్నేహం:
ఒకసారి హస్తినాపురంలో ద్రోణుడి సమక్షంలో కర్ణుడు మరియు అర్జునుడుల మద్య పోటీ జరుగుతుంది. యుద్ధ సామర్థ్యాలలో అర్జునుడితో సమానమైన వ్యక్తి అయినప్పటికీ కర్ణుడిని సూతపుత్రుడని తనకి ఆ అర్హత లేదని అంతా హేళన చేస్తారు. అది తట్టుకోలేని దుర్యోధనుడు వెంటనే కర్ణుడిని తన స్నేహితునిగా చేసుకొని అంగ రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాడు. అందరూ ఎగతాళి చేసినపుడు దుర్యోధనుడు ఒక్కడే తనని సమర్థించాడు కాబట్టి అప్పటినుంచీ కర్ణుడు దుర్యోధనుడిని ప్రాణమిత్రుడిగా భావిస్తాడు.
కర్ణుడు తల్లికిచ్చిన మాట
కొంతకాలానికి పరిస్థితుల ప్రభావం చేత యుద్ధం అనివార్యమైంది. యుద్ధం సమీపిస్తున్న తరుణంలో ఒకరోజు కుంతి కర్ణుడి దగ్గరకి వచ్చి తన జన్మ రహశ్యాన్ని చెప్తుంది. ఇంకా తన సోదరులకి ఏవిధమైన కీడు తలపెట్టవద్దని ప్రాదేయపడుతుంది. అప్పుడు కర్ణుడు తన నలుగురు సోదరులకు హాని చేయనని, అర్జునుడితో మాత్రమే ద్వంద్వ పోరాటం చేస్తానాని తల్లికి మాట ఇస్తాడు.
కర్ణుడి మరణం:
ఇక రథసారధి అయిన శల్యుడు కర్ణుడిని అడుగడుగునా చిత్రవధ చేస్తూ, సూటిపోటి మాటలతో ఆయన్ని కించపరుస్తూ యుద్దరంగలో కర్ణుడి ఏకాగ్రతని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు.
ఇక యుద్ధంలో మరణించే ముందు ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపాన్ని ధరించి, కర్ణుని వద్దకి వెళ్లి అతని సహజ కవచ కుండలాలని దానమడుగుతాడు. వెంటనే అర్జనుడు కర్ణుడి చాతీపై బాణం వేస్తాడు. బాధతో కర్ణుడు నేలకొరిగి మరణిస్తాడు.
ఇదీ కర్ణుడి జీవితం! కర్ణుడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతీ సమస్యని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. పుట్టినప్పటి నుంచీ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలని ఒకసారి తిరగేస్తే, ఎంతటి గొప్పవాడో మీకే అర్ధమవుతుంది.
కర్ణుడి గురించి ఆసక్తికరమైన విషయాలు:
- కర్ణుడికి తన అసలు వంశం గురించి తెలిసినప్పటికీ, తనను విడిచిపెట్టినందుకు కుంతిని ఎప్పుడూ దుర్భాషలాడలేదు. దీనికి ప్రతిఫలంగా, అతను ఏ తల్లికి ఇవ్వలేనంత ప్రేమని, గౌరవాన్ని ఆమెకు ఇచ్చాడు.
- సూత వంశంలో పెరిగినందువల్ల తనని అందరూ సూత పుత్రుడని హేళన చేస్తూన్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు.
- సూతపుత్రుడన్న కారణంగా గురు ద్రోణుడు ఇతనికి అస్త్రవిద్య నేర్పక పోయినా చింతించలేదు.
- అబద్దమాడి విద్య నేర్చుకొన్న పాపానికి పరశురాముడు శపించినా దానిని ఆశీర్వాదంగా స్వీకరించాడు.
- చిన్నారిని సంతోషపెట్టిన పాపానికి భూమాత ఆగ్రహానికి గురయినా బాధపడలేదు.
- దుర్యోధనుడి అధర్మ చర్యలు తనకి ఇష్టం లేకుండా మద్దతు ఇచ్చాడు. దుర్యోధనుడితో తనకున్న స్నేహం చివరికి వినాశనంతోనే ముగుస్తుందని తెలిసినా ఆ స్నేహాన్ని కంటిన్యూ చేశాడు. ఎందుకంటే, అందరూ ఎగతాళి చేసినపుడు దుర్యోధనుడు ఒక్కడే తనని ఆదుకొన్నాడు కాబట్టి.
- తల్లికిచ్చిన మాట కోసం పాండవులని ఏమీ చేయలేదు. వారందరినీ కేవలం ఓడించటం మాత్రమే చేశాడు కానీ వారిని ఎన్నడూ చంపలేదు.
- తాను అర్జునుడికి సోదరుడని తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు, ఎందుకంటే, నిజం తెలిస్తే అర్జనుడు తనతో యుద్ధం చేయడు కాబట్టి.
- రణరంగంలో రథసారధి అయిన శల్యుడి మాటలు తూటాల్లా గుచ్చుకొంటున్నా వెనుదిరగలేదు.
- తన రథచక్రం భూమిలో కూరుకు పోయినప్పుడు యుద్ధ నియమాలకి వ్యతిరేకంగా అర్జనుడు నిస్సహాయ స్థితిలో ఉన్న తనపై బాణాలని సంధించినప్పుడు తనకిచ్చిన శాపాలు గుర్తొచ్చి మౌనంగా తల వంచాడు.
- ఇక చివరిగా అర్జునుడి తండ్రి ఇంద్రుడు తన కవచ కుండలాలని ఇవ్వమని మోసగిస్తున్నాడని కర్ణుడికి తెలుసు. వాటిని వదులుకుంటే తనకే ఓటమి తప్పదని ఆయనకు బాగా తెలుసు. అయినప్పటికీ, అతను ఇంద్రుడి దానాన్ని తిరస్కరించలేదు. ధర్మ మార్గంలో పయనించినప్పటికీ, కర్ణుడు అర్జునుడి చేతిలో మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చింది, అది కూడా అనైతిక మార్గంలో.
కర్ణుడి గొప్పతనం:
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అనేది ఓ సామెత. కుంతీకి ఇచ్చిన మాట, గురుదేవుని కోపం, రథసారథి మాటల పోరు, భూదేవి శాపం, ఇంద్రుడి వెన్నుపోటు.. ఇలా చాలానే కర్ణుడి చావుకి కారణాలు అయ్యాయి.
కర్ణుడికి ఇంత అన్యాయం ఎందుకు జరిగిందో, ఇంత హింసాత్మక మరణాన్ని ఎందుకు అనుభవించాడో తెలుసా! కేవలం అధర్మాన్ని సపోర్ట్ చేయటమే!
చాలా మంది హిందువులు ఇప్పటికీ కర్ణుడిని, అతని ధైర్యసాహసాలని మరియు అతని దాతృత్వాన్ని గౌరవిస్తారు. జీవితాంతం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, అతను ఎప్పుడూ ఆశను వదులుకోలేదు. బదులుగా, తన కర్తవ్యాన్ని కొనసాగించాడు చివరకు అమరవీరుడు అయ్యాడు. భీష్ముడు మరియు కృష్ణుడు వంటి దిగ్గజాలు కూడా అతన్ని గొప్ప వ్యక్తి గా భావించారు. కర్ణుడు నిజంగా సానుభూతికి అర్హుడు. యువరాజుగా జన్మించినప్పటికీ, అతను తన జీవితమంతా సూతపుత్రుడుగానే పరిగణించబడ్డాడు. కుంతి తన జ్యేష్ఠ కుమారునిగా కర్ణుడిని గుర్తించాల్సింది పోయి, ఆమె అతన్ని విడిచిపెట్టింది.
మహాభారతం చదివినా… చదవకపోయినా… తెలిసినా… తెలియకపోయినా… కర్ణుడు-దుర్యోధనుల స్నేహం గురించి మాత్రం ప్రపంచానికి చాటి చెప్పొచ్చు. ఎందుకంటే కర్ణుడు తన చివరి శ్వాసలో కూడా దుర్యోధనుడ్నే తలుచుకున్నాడు. “అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు కోతగా భావించి కన్నతల్లి అనాథగా వదిలేసింది. విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా శాపగ్రస్థుడిని చేశాడు. దాతృత్వాన్ని ఆసరాగా తీసుకొని దేవేంద్రుడు శక్తిని హరించాడు. ఓరిమికి ప్రతీకగా నిలిచే భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల శక్తిహీనుడనై… స్నేహితుడికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నీ దయ ముందు నేనెంత… ఈ జన్మకే కాదు హితుడా… జన్మజన్మలకి ఈ రాధేయుడు నీ విధేయుడే… మిత్రమా!” అని మనసులో అనుకొని శరీరాన్ని త్యజించిన కర్ణుడు నిజంగా గొప్ప యోధుడే!!
ఇక అర్జనుడి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకొందాం.
అర్జునుడి పుట్టుక:
ఇంద్రుడి నుండి పొందిన వరం ద్వారా కుంతీదేవి అర్జునుడికి జన్మనిస్తుంది. అందుకే అర్జునుడు ఇంద్రదేవుని కొడుకు అని కూడా అంటారు. కుంతి యొక్క అనేక పేర్లలో ‘పృథ’ ఒకటి. అందుకే అర్జునుడిని ‘పార్థ’ అని పిలుస్తారు. పార్థ అంటే కుంతీ పుత్రుడు. ఈ పేరు యొక్క మరొక అర్థం శత్రువులపై ఎప్పుడూ గెలిచేవాడు అని.
పంచ పాండవులలో మూడవ వాడైన అర్జునుడు పుట్టినప్పుడు ఋషులూ, దేవతలూ అతనిని ఆశీర్వదించారు. గంధర్వులు నృత్యం చేసారు. కురువంశంలో ఒక గొప్ప వీరుడు పుట్టినందుకు అందరూ వేడుకలు జరుపుకున్నారు.
అర్జునుడి విద్యాభ్యాసం:
అర్జునుడు తన చిన్నతనంలోనే వేదాల జ్ఞానాన్ని పొందాడు. ప్రతి ఆయుధంతోనూ పోరాడడం నేర్చుకొన్నాడు. అర్జనుడికి విలువిద్యలో అపారమైన జ్ఞానం ఉండేది. విలువిద్యలో అర్జునుని ఓడించే వారు ఎవరూ లేరు. విలువిద్యలో అర్జనుడి ఏకాగ్రత చూసి తన జ్ఞానాన్నంతా అర్జునుడికి బోధించాడు ద్రోణుడు. ఇంకా అర్జనుడుని తన ప్రియశిష్యుడుగా కూడా చేసుకున్నాడు.
అర్జునుడు ద్రోణాచార్యుని నుండే కాదు, పరశురాముడి నుండి కూడా యుద్ధకళలో, ఆయుధాలలో ప్రావీణ్యం సంపాదించాడు. యుద్ధరంగంలో అర్జునుడు తన రెండు చేతులని ఉపయోగించి శత్రువులపై బాణాలు వేసేవాడు, అందుకే ఆయన్ని సవ్యసాచి అని కూడా పిలుస్తారు.
పాండవులందరూ ఒకసారి ఆహారం తింటూ ఉండగా సడెన్ గా దీపం ఆరిపోతుంది. వెలుతురు కోసం అందరూ వెతకడం మొదలుపెడితే, అర్జనుడు ఒక్కడే ఆ చీకట్లో కూడా ఆహారం తిన గలుగుతాడు. ఈ విధానం ద్వారా కళ్ళతో చూడకుండా, కేవలం వాసన పసిగట్టి టార్గెట్ ఫినిష్ చేయటం అనే కాన్సెప్ట్ తో అతను శబ్దవేది విద్యని నేర్చుకున్నాడు.
అర్జునుడి ఇతర నైపుణ్యాలు:
మనకి తెలిసినంత వరకూ అర్జునుడి యొక్క విలువిద్యా నైపుణ్యం గురించి మాత్రమే తెలుసు. కానీ ఆయనకి సంగీతం, నృత్యంలో కూడా గొప్ప నైపుణ్యం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అజ్ఞాతవాసం సమయంలో ఈ విద్య అతనికి బాగా ఉపయోగపడింది. ఇది ఆయనలో ఉన్న ఇతర నైపుణ్యాలని తెలియచేస్తుంది.
ద్రౌపది స్వయంవరంలో అందరూ విఫలమయినప్పటికీ, మత్స్యయంత్రం చేదించి ఆమెని వివాహమాడతాడు. అజ్ఞాతవాస సమయంలో, కౌరవులపై ప్రయోగించటం కోసం సెలెస్టియల్ వెపన్స్ ని పొందడానికి స్వర్గలోకం చేరుకొంటాడు.
స్వర్గలోక అప్సరసల్లో ఒకరైన ఊర్వశి అర్జనుడి అందానికి మోజుపడి ఆయనపై తనకున్న కోరికని తెలియచేస్తుంది. కానీ అర్జనుడు మాత్రం ఆమెని తన తల్లితో సమానంగా భావించి సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇది ఆయన గొప్ప ఔన్నత్యానికి నిదర్శనం. శివుని కోసం ఘోరమైన తపస్సు చేసి పాశుపతాస్త్రం పొందుతాడు. ఇది భగవంతుని పట్ల ఆయన కున్న భక్తిని తెలియచేస్తుంది.
కురుక్షేత్ర యుద్దంలో పాల్గొనటం అర్జనుడికి అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే, మొదటినుండీ అర్జనుడు సెన్సిటివ్ గా ఉండేవాడు. పెద్దల పట్ల గౌరవం, ప్రేమ మరియు కరుణ కలిగి ఉండేవాడు. అందుకే, బంధువులు, పెద్దలపై ఆయుధాలు ప్రయోగించడం తనవల్ల కాలేదు. ఇది బంధువుల పట్ల, పెద్దల పట్ల ఆయనకున్న విదేయతని సూచిస్తుంది.
జయద్రథునితో యుద్ధం చేస్తున్నప్పుడు, సాధారణ సైనికులని చంపకుండా భీముడిని అడ్డుకుంటాడు. చిత్రసేనుడు తన ఓటమిని అంగీకరించి, యుద్ధం చేయవద్దని కోరినప్పుడు, అర్జునుడు వెంటనే తన కత్తిని వెనక్కి తీసుకొంటాడు. అర్జునుడి గుణానికి ముగ్ధుడైన చిత్రసేనుడు అప్పటినుండీ అతనికి స్నేహితుడుగా మారతాడు. ఈ విధంగా తన గుణాల ద్వారా శత్రువుని కూడా స్నేహితునిగా మార్చే గొప్ప వ్యక్తి,త్వం అర్జనుడిది.
తన కుమారుని మరణవార్త విని, ఒక్క క్షణం ఆలోచించకుండా, సూర్యాస్తమయం లోపు జయద్రతుని చంపుతానని శపథం చేసాడు. సవాళ్లను అధిగమించి అతన్ని చంపాడు. ఇది అతని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
ప్రపంచానికి నష్టం కలిగించే బ్రహ్మాస్త్రాన్ని తిరిగి ఇవ్వమని వ్యాసుడు కోరినప్పుడు, అతను ఇంకేమీ ఆలోచించలేదు. వెంటనే అతను తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇది ఆయనలో ఉన్న గొప్ప మానవత్వానికి నిదర్శనం.
కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, అర్జునుడు నిర్జీవుడు అయ్యాడు. తన ఆత్మ సహచరుడు లేని ప్రపంచాన్ని చూడలేక పోయింది. అయినప్పటికీ అతను తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. వాసుదేవుడిని అగ్నికి అర్పించాడు, ద్వారక సముద్రంలో మునిగిపోకముందే కృష్ణుడి వారసులని అతని భార్యలనూ రక్షించాడు. ఇది ప్రజల పట్ల తనకున్న బాధ్యతకి అర్ధం చెప్తుంది.
ఇదీ అర్జనుడి జీవితం! అర్జునుడు అన్ని కాలాలలోనూ గొప్ప వీరుడే కాదు, ఇచ్చిన మాట తప్పని సంస్కార వంతుడు కూడా.
అర్జునుడి గురించి ఆసక్తికరమైన విషయాలు:
- కురువంశ పితామహుడైన భీష్మునికి అర్జునుడడంటే ఎంతో ఇష్టం. అర్జునుడు భీష్ముని తన సొంత తండ్రిలా చూసుకొనేవాడు.
- అర్జునుడు తన గురుదేవుడైన ద్రోణుడ్ని మొసలి బారి నుండి తన బాణాలతో రక్షిస్తాడు.
- ద్రుపదునితో యుద్ధంచేసి అతనిని బంధించి ద్రోణుడికి గురుదక్షిణగా ఇస్తాడు.
- మత్స్య యంత్రాన్ని చేదించటంలో అందరూ విఫలమైనప్పటికీ, కర్ణుడు విజయం సాధించి, స్వయంవరంలో ద్రౌపదిని గెలుచుకున్నాడు.
- తన సోదరులకన్నా ఎక్కువగా ద్రౌపదిచే ప్రేమించబడ్డాడు.
- చీకట్లో ఆహారం తింటూ శబ్దవేది నేర్చుకున్నాడు.
- కృష్ణుడితో కలిసి ఖాండవ వనాన్ని దహనం చేసి, అగ్ని దేవునికి సహాయం చేసి గాంఢీవాన్ని వరంగా పొందుతాడు.
- గయుడిని రక్షించటం కోసం చివరికి కృష్ణుడితోనే పోరాడతాడు.
- అంత పరాక్రమవంతుడై ఉన్నప్పటికీ అర్జనుడు అజ్ఞాతవాస సమయంలో ఒక సంవత్సరంపాటు విరాట రాజ్యంలో బృహన్నల అనే నపుంసకుడిగా గడిపాడు.
- అర్జునుడిలాంటి గొప్పవ్యక్తి తన రాజ్యంలో పుట్టినందుకు గర్వంగానూ, సంతోషంగానూ ఉందని స్వయంగా దుర్యోధనుడే ఒపుకొన్నాడు.
- ఒకేసారి 50,000 కంటే ఎక్కువ బాణాలు వేసే సామర్థ్యం ఉన్నవాడు అర్జనుడు.
- మహాభారత యుద్ధంలో అందరికంటే ఎక్కువ మంది సైన్యాలను చంపిన అంతిమ యోధుడు అర్జునుడు.
- గంధర్వస్త్రాన్ని ఉపయోగించి గురువైన ద్రోణుడినే తప్పుదారి పట్టించాడు.
- జయద్రథుడిని, అతని తండ్రిని ఒకేసారి చంపాడు.
- ఈ విశ్వం మొత్తాన్నే నాశనం చేయగల బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్నప్పటికీ, అతను ధర్మాన్ని మరియు నియమాలను దాటలేదు.
- కృష్ణుని విశ్వరూప దర్శనం చూసిన మానవుడు అర్జునుడు ఒక్కడే.
అర్జనుడి గొప్పతనం:
మహాభారత సంగ్రామంలో అర్జునుడిది చాలా కీలకమైన పాత్ర.. యుద్ధ రంగంలో నిలిచి తన బంధువులను, హితులను, సన్నిహితులనూ చూసి అర్జునుడు మొదట యుద్ధం చేయటానికి వెనకడుగు వేస్తాడు. కానీ రథ సారథియైన శ్రీకృష్ణుడు భగవద్గీత రూపంలో అర్జనుడికి తన కర్తవ్యాన్ని ఉపదేశిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధం తరువాత, కొన్నేళ్ళకి కృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెడతాడు. కొద్దిసేపట్లో ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోబోతోంది అని తెలిసి అర్జునుడు రాజ్యంలోని స్త్రీలని, ద్వారకలోని మిగిలిన ప్రజలని ఇంద్రప్రస్థానికి తీసుకెళ్లాడు. శ్రీకృష్ణుడు తనకి అప్పచెప్పిన కర్తవ్యాన్ని ముగించుకొని తన సోదరులతో, భార్యతో కలసి హిమాలయాలకు అంతిమ యాత్ర చేస్తాడు.
కర్ణుడు మరియు అర్జునుడు: ఎవరు గొప్ప?:
ఒకే సమయంలో 60వేల మందితో పోరాడి, వారందరినీ విజయవంతంగా ఓడించగల సామర్థ్యం ఉన్న సైనికుడికి అతిరథి అనే బిరుదు ఇవ్వబడుతుంది. నిజానికి, మహాభారత కథ కేవలం ఐదుగురుని మాత్రమే అతిరథిలుగా పేర్కొంది. వాళ్ళే కృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు అర్జునుడు.
కర్ణుడు మరియు అర్జునుడు వీరిద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే… వారిద్దరికీ ఎదురైన కొన్ని పరిస్థితులే సమాధానం చెప్తాయి. అర్జునుడు మరియు కర్ణుడు ఇద్దరూ నిష్ణాతులు. ఇద్దరూ కూడా స్వయంవరంలో ద్రౌపది కోసం పోటీ పడ్డారు. యుద్ధంలో తమ సొంత సోదరులైన వీరిద్దరూ ఒకరితో ఒకరు పోరాడవలసి వచ్చింది. ఇద్దరికీ కౌరవులతో గాఢమైన అనుబంధం ఉంది. ఒక తేడా ఏమిటంటే అర్జునుడు వారిని ద్వేషించాడు; కర్ణుడు వారిని ప్రేమించాడు.
అర్జునుడుతో పోలిస్తే కర్ణుడు చాలా ప్రతిభావంతుడు, దయగలవాడు, ధైర్యవంతుడు మరియు నీతిమంతుడు.
అర్జునుడు నిజానికి, ఎప్పుడూ కృష్ణుడి వల్లనే విజయం సాధించాడు. కానీ, చాలాసార్లు తన అహంకారాన్ని ప్రదర్శించాడు. ఉదాహరణకు, కర్ణుడిని చంపిన తర్వాత, అర్జునుడు తనను తాను ప్రపంచంలోనే గొప్ప విలుకాడు అని ప్రకటించుకున్నాడు.
అప్పుడు కృష్ణుడు కేవలం చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడకుండా అర్జునుడిని తన రథం దిగమని చెప్తాడు. అర్జనుడు దిగగానే హనుమంతుని గుర్తు ఉన్న జెండా నేలపై పడింది. ఆ క్షణంలో, అర్జునుడి రథం ఒక్కసారిగా పేలిపోయింది. దాని గుర్రాలు సజీవ దహనమయ్యాయి. హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై… కర్ణుడి ఆయుధాల ప్రభావం నుండి అర్జునుడి రథాన్ని రక్షించింది తానేనని చెప్పాడు. శ్రీకృష్ణుడి శక్తి మాత్రమే రథాన్ని పట్టుకున్నదని అర్జునుడికి గుర్తు చేశాడు. వెంటనే అర్జునుడు తన తప్పును గ్రహించి కర్ణుని మెచ్చుకున్నాడు.
కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు నియమాల ప్రకారం ఆడాడు. బలహీనమైన క్షణంలో అతను అర్జునుడిపై ఎప్పుడూ దాడి చేయలేదు. ఒకసారి, కర్ణుడి బాణం తాకిడికి అర్జునుడు మూర్ఛపోయినప్పుడు, కర్ణుడు తన దిశలో మరిన్ని నాగాస్త్రాలను పంపడానికి నిరాకరించాడు, ఎందుకంటే అది మానవాళికే ద్రోహమైన చర్య అవుతుంది. దీనికి విరుద్ధంగా, అర్జునుడు మాత్రం కర్ణుని బలహీనమైన క్షణాన్ని సద్వినియోగం చేసుకొని అతన్ని చంపాడు, అతన్ని ఇక జీవించనిస్తే తాను అసమర్థుడు అవుతాడని బాగా తెలుసు.
ముగింపు:
కర్ణుడు తన జీవితాంతం కర్మను నమ్మాడు. కష్టాలని, సమస్యలని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. జీవితంలో ఎన్ని అవమానాలు ఎదురైనా సంతోషంగా స్వీకరించాడు. కర్ణుడు నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. దీన్నిబట్టి జీవితంలో ఎలాంటి కష్టం ఎదురైనా … ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలో మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక అర్జునుడు గెలవడానికి పుట్టినవాడు కానీ జీవితాంతం పాలించాలనుకోలేదు. సమయస్పూర్తితో శత్రువుపై ఎలా విజయం సాదించాలో తెలిసినవాడు. వారి యొక్క బలహీనతలని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఎరిగినవాడు. అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. తల్లిదండ్రుల పట్ల, గురువుల పట్ల, పెద్దలపట్ల, బందువుల పట్ల ఎలా గౌరవాన్ని కలిగి ఉండాలనే విషయాన్ని మహాభారతంలో అర్జునుడి ద్వారా తెలుసుకోవచ్చు.
ఇక ఫైనల్ గా నేనిచ్చే మెసేజ్ ఏంటంటే… కర్ణుడు, అర్జునుడు వీరిద్దరిలో ఎవరు గ్రేట్ అనేది మీ యొక్క ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా.