Kasar Devi Temple, Almora

Kasar Devi Temple’s Cosmic Connection

మన భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నాయి. వీటిలో చాలా దేవాలయాలు ఎందరో దేవుళ్ళ శక్తికి ప్రతిరూపాలుగా కూడా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొనే మన దేశంలోనూ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలలోనూ ప్రముఖమయిన దేవాలయాలు దివ్యధామాలుగా, శక్తిపీఠాలుగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అలాంటి వాటిలో అమ్మవారికి సంబంధించిన శక్తిపీఠాలు కూడా కొన్ని ఉన్నాయి. ఉత్తర భారత దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఒకటయిన కాసర దేవి ఆలయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. 

అసలు ఈ కాసర దేవి ఆలయం ఎక్కడ ఉంది?

భారతదేశానికి ఉత్తర భాగాన ఉన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం మొత్తం ఒక దేవభూమిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం ఎన్నో ప్రముఖ దేవాలయాలతో నిండి ఉంది. ఈ భూమి శివుడు మరియు అతని భార్య అయిన శక్తి దేవితో ఆశీర్వదించబడిందని భక్తులు నమ్ముతారు. ఈ శక్తి అమ్మవారికి అంకితం చేయబడిన అనేక పూజ్య దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏడాది పొడవునా, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఈ ఆలయాలకు యాత్రికులు తండోపతండాలుగా వస్తారు.

ఈ కాసర దేవి ఆలయం ఉత్తరాఖండ్‌లోని అల్మోరా సమీపంలో ఉన్న గ్రామంలో ఉంది. ఈ దేవి ఆలయం పేరు మీదుగా ఈ ప్రదేశానికి కూడా కాసర గ్రామం అని పేరు వచ్చింది. సముద్ర మట్టానికి సుమారు 2,100 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆధ్యాత్మిక గ్రామం హిమాలయాల యొక్క అందాలను వీక్షకులకు అందిస్తుంది. ఈ ఆలయం అల్మోరా నుండి ఉత్తరాన 7 కి.మీ దూరంలో ఉన్న కాషాయ్ కొండలపైన ఉన్నది.

కాసర దేవి ఆలయం ప్రాముఖ్యత

చాలా పురాతనమైన ఈ కాసర దేవి ఆలయాన్ని 2వ శతాబ్దంలో ఒక పర్వత శిఖరంపై నిర్మించారు. దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చే ఈ కాసర దేవి నల్లరాతి విగ్రహం విశేషమయిన ఆభరణాలతో అలంకరించబడి వెలిగిపోతూ ఉంటుంది. 

ఉత్తరభారత దేశంలో ఈ కాసర దేవి ఆలయం ఒక అద్భుతమయిన మరిచిపోలేని ప్రదేశం. ప్రతి ఉదయం ఇక్కడ నుండి కనిపించే విశాలమయిన హిమాలయాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. మానసిక ప్రశాంతతను అన్వేషిస్తూ… దేశ విదేశాల నుండి వచ్చే ఎందరో యాత్రికులను ఈ ప్రదేశం ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. 

ఈ కాసర దేవి ఆలయం కూడా ఒక శక్తిపీఠం అని అంటారు. అయితే చాలా మంది ఈ దేవాలయం శక్తిపీఠం కాదని, దానికి దగ్గరే ఉన్న కాళీమఠ్ ఒక శక్తిపీఠం అని అంటారు. కాళీమఠ్ దేవాలయంలో కాళీదేవి తన సోదరీమణులు అయిన సరస్వతి దేవి మరియు లక్ష్మి దేవి తో కలిసి భక్తులకు దర్శనం ఇస్తుంది. 

కాళీమఠ్ మరియు కాసర్ దేవి ఆలయం మధ్య దూరం ఒక కి.మీ కంటే తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ సందేహం కాబోలు. వీటిలో ఏ గుడి శక్తిపీఠం? అనే విషయం పక్కన పెడితే, ఈ ప్రదేశాన్ని 108 శక్తిపీఠాలలో ఒకటిగా గుర్తించారు.

అసలు ఈ శక్తిపీఠాలు ఎన్ని అనే విషయంలో కూడా చాలా గందరగోళం ఉన్నది. రకరకాల పురాణాల ప్రకారం వీటి సంఖ్య మారుతూ ఉన్నది. కొన్ని పురాణాల ప్రకారం, కేవలం నాలుగు ముఖ్యమయిన శక్తిపీఠాలు ఉన్నాయని, మిగతావి ఉప శక్తిపీఠాలని అంటారు. వీటి సంఖ్య కూడా 18, 51, 52, 64, 108 అని వేరు వేరు పురాణాలలో చెప్పారు.

ఇది కూడా చదవండి: Kalabhairavas Connection to Kashi Vishwanath

కాసర దేవి మహిమ

ఈ ఆలయంలో దేవి, శివుడు మరియు భైరవ దేవాలయం యొక్క రెండు వేర్వేరు సమూహాలను కలిగి ఉంటుంది. 

రోడ్డు మీద నుండి పైకి ఎక్కినప్పుడు మొదట కనిపించేది కాసర దేవి దేవతకు అంకితం చేయబడిన గులాబీ దేవాలయం. ఆమె శక్తివంతమైన దుర్గా దేవి స్వరూపం. దేవి యొక్క ప్రధాన మందిరం ఒక గుహలో పెద్ద రాళ్లతో ఏర్పడిన విధంగా ఉంటుంది. ఇక్కడే కాసర దేవి ఆలయం పక్కనే స్వామి వివేకానంద ధ్యానం చేసిన ఒక గుహను భారీ రాతిపై చూడవచ్చు. 

ఇక కాసర దేవి ఆలయం పైన ఉన్న కొండపై శివాలయం ఉంది. ఇది ఒక దక్షిణ భారతం నుండి వచ్చిన ఒక స్వామిచే స్థాపించబడినదిగా చెప్పబడుతున్నది. అయితే ప్రస్తుతం ఉన్న దేవాలయం భవనం చాలా కొత్తది, 1940లో పునరుద్ధరించబడింది. ఈ శివాలయం పక్కనే చిన్న భైరవ దేవాలయం కూడా ఉంది. శివుడు వినాశనానికి దేవుడు, కాళి శక్తికి దేవత, మరియు భైరవుడు కోపానికి దేవుడు. ఈ మూడు ఒక చోట కలిసి ఉండటం అంటే గొప్ప విశేషమే.

ఇక్కడ ప్రధాన ఆలయంలో అఖండ జ్యోతి ఉంటుంది, ఇది ఎన్నో సంవత్సరాలుగా 24 గంటలు మండుతూనే ఉంటుంది. ఇందులో ధుని కూడా ఉంది. ఇక్కడ చెక్క దుంగలను ఎప్పుడూ కాలుస్తూ ఉంటారు. దీని నుండి వచ్చే బూడిద చాలా శక్తివంతమైనదని నమ్ముతారు, ఈ బూడిద ఎటువంటి మానసిక రోగినైనా నయం చేయగలదు అని విశ్వాసం.

ఈ దేవిని భక్తులు సంతానోత్పత్తి కోసం, ఇంకా భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉండటం కోసం, పూజిస్తారని చెబుతారు. ప్రతి సంవత్సరం, కార్తీక పూర్ణిమ సందర్భంగా, కాసర దేవి జాతరకు పూజలు చేయడానికి, ఇంకా ఉత్సవాలు చూడటానికి మన దేశంలోని అనేక రాష్ట్రాల నుండే కాకుండా, విదేశాల నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. 

ఆధ్యాత్మికవేత్తలను ఆకర్షించిన ప్రాంతం

స్వామి వివేకానంద 1890 సెప్టెంబర్ మాసంలో కాసర దేవిని సందర్శించారు అని చెబుతారు. స్వామి వివేకానంద ఇక్కడ అమ్మవారిని దర్శించిన తరువాతనే ఈ ప్రదేశం ప్రాముఖ్యత బాగా పెరిగిందని ఇక్కడి గ్రామ ప్రజలు చెబుతారు. 

డానిష్ ఆధ్యాత్మికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ సోరెన్‌సెన్ ఒక సారి ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి ముగ్ధుడయిపోయి ఈ ప్రాంతాన్నే తన స్థిరనివాసంగా చేసుకున్నాడు. ఇతనిని సూన్యత బాబా అని కూడా పిలుస్తారు. ఇతను ఇక్కడ దాదాపు ముప్పై సంవత్సరాలు ఉన్నాడని చెబుతారు. ఇతను వచ్చిన తరువాత ఈ ప్రాంతం విదేశాలలో మంచి ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత టిబెటన్ బౌద్ధుడు అయిన లామా అనాగారిక గోవింద, ఇంకా బాబ్ డైలాన్, జార్జ్ హారిసన్, క్యాట్ స్టీవెన్స్, అలెన్ గిన్స్ బర్గ్, తిమోతి లియరీ వంటి అనేక మంది పాశ్చాత్య అన్వేషకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారని చెబుతారు. 

ఇది కూడా చదవండి: Mysterious Powers of Katarmal Sun Temple

హిప్పీ ఉద్యమంతో సంబంధం

1960లు మరియు 1970లలో హిప్పీ ఉద్యమం సమయంలో ఈ కాసర గ్రామం వెలుపల ఉన్న క్రాంక్స్ రిడ్జ్ కు కూడా ప్రసిద్ధి చెందినది. ఈ క్రాంక్స్ రిడ్జ్ నే “హిప్పీ హిల్” అని పిలుస్తారు. కాసర దేవి గ్రామానికి వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంటుంది. పెద్ద పెద్ద పైన్ వృక్షాలతో ఈ ప్రాంతం ఎంతో మనోహరంగా ఉంటుంది. తిమోతి లియరీ ఈ హిప్పీ ఉద్యమంలో భాగమయినప్పటి నుండీ ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది.

భారీ భూ అయస్కాంత క్షేత్ర ప్రాంతం

శతాబ్దాలుగా సుదూర ప్రాంతాల నుండి సందర్శకులను ఆకర్షిస్తున్న కాసర దేవి అయస్కాంత ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. ఈ మాగ్నెటిక్ పుల్ తరచుగా ఈ ప్రాంతంలో కలుస్తున్న ప్రత్యేకమైన శక్తి క్షేత్రం ఉనికికి ఆపాదించబడుతుంది. గ్రామస్తులు ఈ శక్తికి కారణం వారు ఆరాధించే స్థానిక కాసర దేవి అని బలంగా నమ్ముతారు. అయితే, శాస్త్రవేత్తలు ఈ ప్రాంతం యొక్క భౌగోళిక కూర్పు ఈ మర్మమైన శక్తికి దోహదపడుతుందని అంటున్నారు.

శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ ప్రదేశం “వాన్ అలెన్ బెల్ట్” లో ఉండటం వలన భారీ భూ అయస్కాంత క్షేత్రాన్ని కలిగి ఉన్నది. NASA వారి పరిశోధనల ప్రకారం ఈ ప్రదేశం కాస్మిక్ కిరణాలు మరియు సౌర పవనాల ద్వారా సృష్టించబడిన భారీ విద్యుదయస్కాంత క్షేత్రం. 

అసలు ఈ వాన్ అలెన్ బెల్ట్ అనే పేరు అమెరికన్ శాస్త్రవేత్త అయిన జేమ్స్ వాన్ అలెన్ పేరు మీద వచ్చింది. శాస్త్రవేత్తల ప్రకారం ఈ బెల్ట్ మన భూమిని భయంకరమయిన రేడియేషన్ నుండి కాపాడే ఒక కవచం లాంటిది.

ఈ వాన్ అలెన్ బెల్ట్ భూమి యొక్క అయస్కాంత గోళంలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉండి, అంతరిక్షంలోకి వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. అయితే, భూమి మీద మాత్రం, కేవలం మూడు ప్రదేశాలు మాత్రమే ఈ వాన్ అలెన్ బెల్ట్ ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. అందులో ఒకటే ఈ కాసర దేవి ప్రాంతం. మిగతా రెండు ఇంగ్లాండ్ లో ఉన్న స్టోన్ హెంజ్ మరియు సౌత్ అమెరికాలోని పేరూలో ఉన్న మచు పిచ్చు.

యోగా మరియు ధ్యానం 

ఎంతో ప్రశాంతంగా పచ్చదనంతో హిమాలయాల అందాలతో ఉండే ఈ ప్రదేశం భారతీయులకే కాకుండా ఎందరో విదేశీయులకు కూడా ఎట్రాక్ట్ చేసే టూరిస్ట్ ప్రాంతంగా ఉంది.  ఇంకా యోగా మరియు మెడిటేషన్ వంటివి  చేయటానికి ఇది ఎంతో అనువైన ప్రముఖ ప్రదేశం.

కాసర దేవి ఆలయం పక్కన చూడదగ్గ విశేషాలు 

హిమాలయాలకు సంబంధించి ఈ గుడి ఒక ఆకర్షణీయమైన పిక్నిక్ స్పాట్ అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ నుండి సమీప అల్మోరా పట్టణం మరియు హవాబాగ్ లోయ ఎంతో అందంగా కనిపిస్తుంది.

ఈ గుడికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో జాగేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉన్నది, ఇది కూడా ఒక తప్పకుండా చూడవలసిన మహాదేవుని ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలో శివునికి అంకితం చేయబడిన 124 చిన్న మరియు పెద్ద ఉప ఆలయాలు ఉన్నాయి. 

ఈ ఆలయం చుట్టూ భారీ దేవదారు వృక్షాలతో నిండి ఉంటుంది. అందుకే ఇక్కడి దృశ్యాలు చూడటానికి చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఈ ఆహ్లాదకరమైన ప్రదేశంలో నందిని మరియు సురభి నదులు కొండ మీద నుండి దిగువకు ప్రవహిస్తూ చూపు తిప్పుకోనివ్వవు.

ఇంకా ఇక్కడకు దగ్గరలో కతర్మల్ సూర్య దేవాలయం, చితాయ్ ఆలయం, బిన్సర్ వన్యప్రాణుల అభయారణ్యం మరియు జింకల పార్క్ ప్రత్యేక ఆకర్షణలు మరియు చూడదగ్గ ప్రదేశాలు.

చివరి మాట 

కసర్ దేవి ఆలయాన్ని దాటి అన్వేషించడం అంటే, సహజ సౌందర్యం,  సాహసవంతమైన యాత్ర,  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కోల్కొపోవటమే! అల్మోరాలోని కసర్ దేవి  ఆలయం మరియు దాని చుట్టుప్రక్కల ప్రదేశాలు    ఔత్సాహికుల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్లి తీరాల్సిందే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top