హిందూ పురాణాలలో హనుమంతుడిని భక్తికి ప్రతిరూపంగా చెప్తుంటారు. రాముని పట్ల ఆయనకున్న విధేయత దేన్నయినా జయించే శక్తినిస్తే, నిరంతరం చేసే రామ నామమే ఆయనకున్న గొప్ప బలం. అలాంటి హనుమాన్ గురించి పురాణాలలో, ఇతిహాసాలలో చాలా కథలు ఉన్నాయి. కానీ, ఆయన గురించి ఇంతకు ముందెప్పుడూ వినని ప్రత్యేకమైన కథలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని ఈరోజు మేము మీతో షేర్ చేసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలశ్యం టాపిక్ లోకి వెళ్లిపోదాం పదండి.
హనుమంతుడు ఎవరు?
పురాణాల ప్రకారం, హనుమంతుడి తల్లి పేరు అంజనా దేవి అనీ, అందుకే హనుమంతుడిని ఆంజనేయుడు అని కూడా అంటుంటారు. అయితే, నిజానికి అంజనా దేవి శాపం కారణంగా భూమిపై జన్మించిన ఒక అప్సరసని తెలుసా!
ఇంద్రదేవుని రాజభవనంలో నివసించే “పుంజికస్థల” అనే అప్సరస ఈమె. చూడటానికి ఆమె ఎంతో అందంగా ఉండేది. అయితే, ఒకసారి తీవ్ర ధ్యానంలో నిమగ్నమైన దుర్వాస మహర్షి దృష్టిని మరల్చడానికి ఇంద్రుడు ఈమెని భూలోకానికి పంపుతాడు. అతని ఆదేశాన్ని పాటించి భూలోకానికి వచ్చిన పుంజికస్థలని ఆగ్రహించిన ఆ ఋషి ఆమెని కోతిలా బతకమని శపిస్తాడు.
అలా శాపానికి గురైన తర్వాత పుంజికస్థల తన తప్పును గ్రహించి క్షమించమని వేడుకొంటుంది. అది చూసిన దుర్వాసునికి కోపం తగ్గి, తన శాపాన్ని వనక్కి తీసుకోలేననీ, అయితే భూమిపై ఉన్న వానర రాజును వివాహం చేసుకుంటావని చెప్పాడు. అలాగే, శక్తివంతమైన కుమారునికి తల్లివి అవుతావని అంటాడు. అంతేకాదు, ఈ మానవాళి మొత్తం నిన్ను గౌరవిస్తారని కూడా వరమిస్తాడు.
కొద్దికాలానికి ఆమె వానర రాజైన కుంజరుని కుమార్తె అంజనగా జన్మించింది. “కేసరి” అనే వానరరాజుని వివాహం చేసుకుంది. అనంతరం పరమశివుని కోసం తీవ్ర తపస్సు చేసింది. సరిగ్గా అదే సమయంలో, దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. ఆ యాగ ఫలితంగా, వచ్చిన పవిత్రమైన పాయసాన్ని తన ముగ్గురు భార్యలకు ఇవ్వవలసి వచ్చింది.
అయితే, దశరథుడు తన భార్యలైన కౌసల్యకి, కైకేయికి పాయసం ఇచ్చాడు. సుమిత్రకి ఇవ్వబోతుండగా, ఒక పక్షి ఆ పాయసాన్ని లాక్కొని అక్కడి నుండి ఎగిరిపోయింది. వెంటనే, కౌసల్య మరియు కైకేయి ఇద్దరూ కూడా తమకిచ్చిన పాయసంలో కొంత భాగాన్ని సుమిత్రకు ఇచ్చారు. దాని ఫలితమే రాణి సుమిత్ర కవలలకు జన్మనిచ్చింది. వారే లక్ష్మణ మరియు శత్రుజ్ఞులు. రాణి కౌసల్య రాముడికి, కైకేయి భరతుడికి జన్మనిచ్చారు.
నిజానికి ఆ పాయసాన్ని దొంగిలించిన పక్షి మరెవరో కాదు, సువర్చల అనే అప్సరస. ఆమె చాలా ఉద్వేగభరితమైన ప్రవర్తన కలిగి ఉండేది. అందుకే బ్రహ్మ దేవుడు ఆమెని భూలోకంలో పక్షిగా మారి తిరుగుతుండమని శపిస్తాడు. ఆమె పశ్చాత్తాపపడి బ్రహ్మను వేడుకోగా, అగ్నిదేవుడు దశరథుడికి ఇచ్చిన పాయసాన్ని తాకితే శాపవిముక్తి పొందుతావని చెప్తాడు. అందుకే, తన శాపం తొలగిపోవాలనే ఆత్రుతతో సువర్చల రాణి సుమిత్ర నుండి పాయసం లాక్కుంది. వెంటనే రూపం మార్చుకుని అప్సరస అయింది.
సరిగ్గా అదే సమయంలో, శివుడు అంజనాదేవి తపస్సుకు మెచ్చి గొప్ప రామభక్తుడు ఇంకా అపారమైన శక్తి మరియు జ్ఞానాన్ని కలిగి ఉండే కొడుకును కనే వరం ఇచ్చాడు. ఇంకోపక్క శివుని ఆజ్ఞను అనుసరించి వాయుదేవుడు ఆ పాయసంలో కొద్దిగా కిందకి పడిపోయేట్లు విపరీతంగా గాలి వీస్తాడు. అప్పుడు పాయసంలో కొంతభాగం పక్షి గోళ్ల నుండి జారి నేలమీద పడిపోతుంది, అది అంజనాదేవి యొక్క చేతుల్లో పడుతుంది. ఫలితంగా ఆమెకు హనుమంతుడు జన్మించాడు.
వర ప్రభావం చేత వానరుల రాజు అంజనా మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. అందుకే, హనుమంతుడిని అంజనీ పుత్ర, కేసరి నందన, ఆంజనేయ అని పిలుస్తారు. ఇలా ఆంజనేయుడు ఒక అప్సరస కుమారుడు.
మరో విధంగా చూస్తే, హనుమంతుడిని వాయుదేవుడి కుమారుడు అని అంటారు. అందుకే పవన పుత్ర హనుమాన్ అని కూడా అంటారు. ఆ కథ కూడా ఇప్పుడు చెప్పుకుందాం.
హనుమంతుడు వానర రాజు కేసరి మరియు అంజనా దేవి పుత్రుడు అయినప్పటికీ, హనుమంతుని పుట్టుకలో వాయు దేవుని పాత్ర కూడా ఉంది.
ఎలాగంటే, అంజన ముని శాపానికి గురైన తర్వాత పరమ శివుడ్ని ధ్యానిస్తూ, కఠోర తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన పరమ శివుడు తన దివ్యశక్తిని మరియు ఆశీర్వాదాన్ని వాయువు ద్వారా అంజన గర్భంలోకి ప్రవేశ పెడతాడు. ఆ సమయంలో వాయువు ఆ పాయసాన్ని అంజన తినేలా చేస్తాడు. ఆమె దానిని తినే హనుమంతునికి జన్మనిచ్చింది. అప్పటినుండీ వాయుదేవుడు ఆంజనేయుడిని తన సొంత కొడుకులా చూసుకొంటున్నాడు.
హనుమంతుని భార్య ఎవరు?
పురాణాల ప్రకారం, హనుమంతునికి గురువు అయిన సూర్య భగవానుడు అతనికి 9 రకాల విద్యలు నేర్పించవలసి ఉంది. కానీ, అందులో 5 రకాల విద్యలను మాత్రమే నేర్పించాడు. కారణం అతను బ్రహ్మచారి కావటం చేత. వివాహితులు మాత్రమే సంపూర్ణ విద్యలు నేర్చుకోగలరు.
కాబట్టి మిగిలిన ఆ 4 విద్యలను కూడా నేర్చుకొనేందుకు గాను సూర్యుడు తన కుమార్తెను వివాహం చేసుకోమని చెప్తాడు. తన కుమార్తె అయిన సువర్చల కూడా హనుమంతుని లాగే బ్రహ్మచారిణి. అందుకే, ఆమెని వివాహం చేసుకొంటే తన బ్రహ్మచర్యం తప్పిపోదని కూడా చెప్పాడు. అదీకాక, వివాహం జరిగిన వెంటనే ఆమె తపస్సుకు బయలు దేరుతుందని సూర్యుడు హామీ ఇచ్చాడు.
గురువు ఆజ్ఞ శిరసావహించటమే శిష్యుడి కర్తవ్యం కాబట్టి హనుమంతుడు ఇందుకు అంగీకరిస్తాడు. వెంటనే సూర్య పుత్రిక అయిన సువర్చలని వివాహమాడి, మిగిలిన ఆ 4 విద్యలను కూడా నేర్చుకొంటాడు. దాంతో ఆంజనేయుడు సకల విద్యలలో ఆరితేరిన వాడవుతాడు.
హనుమంతుని కొడుకు ఎవరు?
హిందూ పురాణాలలో, హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అనీ, అతను తన జీవితాన్ని శ్రీరాముడి సేవకే అంకితం చేశాడనీ పేర్కొన్నారు. కానీ, హనుమంతుడికి కూడా ఓ కుమారుడు ఉన్నాడు. అతను ఎంత గొప్ప వీరుడో ఇప్పుడు తెలుసుకుందాం.
లంకా దహనం తరువాత హనుమంతుడు తన తోకకి అంటుకున్న నిప్పును ఆర్పివేయటానికి సముద్రంలో దూకుతాడు. అప్పుడు అతని శరీరంనుండీ వచ్చిన శక్తివంతమైన చెమట బిందువు ఒకటి జారి సముద్రపు నీటిలో పడుతుంది. దానిని ఓ చేప మింగేస్తుంది.
కొంతకాలానికి ఆ చేప పాతాళ రాజైన అహిరావణుని రాజ్యంలో నివసించే మత్స్యకారుల వలకి చిక్కుతుంది. ఆ చేప పొట్ట చీల్చి చూడగా, కోతి ముఖం, చేప శరీరం కలిగి ఉన్న బాలుడు కనిపించాడు. అహిరావణ అతని బలాన్ని చూసి అతనికి “మకరధ్వజుడు” అని పేరు పెట్టాడు.
తరువాత రాముడు రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు, అహిరావణుడు రాముడు మరియు లక్ష్మణులని మాయ చేసి వారిని పాతాళానికి తీసుకెళతాడు. అప్పుడు హనుమంతుడు వారిని అనుసరిస్తాడు. కానీ పాతాళ ద్వారం వద్ద మకరధ్వజుడు హనుమంతుని ఆపివేస్తాడు. అలాగే తాను హనుమంతుని కుమారుడిగా కూడా తనని తాను పరిచయం చేసుకుంటాడు.
ఎంతగానో సంతోషించిన హనుమంతుడు అతని కోరిక మేరకు తండ్రిగా తన దీవెనలను అందిస్తాడు. అయినప్పటికీ, హనుమంతుడు మరియు మకరధ్వజుడు మద్య ద్వంద్వ పోరాటం జరుగుతుంది. రామలక్ష్మణుల కోసం పాతాళంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు అతన్ని ఓడించవలసి వచ్చింది. అతను తిరిగి వచ్చిన తరువాత రాముని సలహా మేరకు, హనుమంతుడు మకరధ్వజుని పాతాళానికి కొత్త రాజుగా నియమించాడు.
ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology
హనుమంతుని సోదరులు ఎవరు?
పురాణాలలో చాలావరకూ హనుమంతుడిని రాముని భక్తుడిగానే చెప్తూ వచ్చాయి. కానీ ఆయనకీ ఓ భార్య, ఓ కుమారుడు ఉన్నాడని చెప్పుకున్నాం. అలాగే, ఆయన తల్లి గురించి అందరికీ తెలుసు. కానీ, తండ్రి గురించి చాలా కొద్దిమందికే తెలుసు. అందుకే మనం ఈ ఆర్టికల్ లో ఆయన తండ్రి గురించి కూడా చెప్పుకున్నాం.
ఇకపోతే, హనుమంతుడికి సోదరులు కూడా ఉన్నారు. హనుమంతుడిలా కాకుండా వారంతా వివాహాలు చేసుకొని పిల్లల్ని కూడా కన్నారు. ఇది కేవలం బ్రాహ్మణ పురాణంలో మాత్రమే ప్రస్తావించబడింది.
ఇందులో వానర రాజు కేసరికి 6 గురు కుమారులు ఉన్నారని పేర్కొనబడింది. పెద్ద కుమారుడు హనుమాన్. మిగిలిన వారి పేర్లు వరుసగా మతిమాన్, శ్రుతిమాన్, కేతుమాన్, గతిమాన్ మరియు ధృతిమాన్. వీరంతా హనుమంతుని సోదరులు.
హనుమంతుడు ఎవరి అవతారం?
దక్షయజ్ఞం సమయంలో తన తండ్రి దక్షుడు చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి ఆత్మత్యాగం చేస్తుంది. సతీదేవి మరణానంతరం శివుని గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఆ బాధను తట్టుకోలేక కోపావేశంతో సతీదేవి శరీరాన్ని తన భుజాలపై వేసుకుని శివ తాండవం చేస్తాడు శివుడు.
శివుడి బాధని చూసి ఎవరూ తట్టుకోలేక పోయారు. శివుడిని శాంతింపజేయమని కోరడానికి నారదుడు విష్ణువు వద్దకు వస్తాడు. కానీ, శివుడిని శాంతింపజేయడం మరియు అతని కోపాన్ని ఎదుర్కోవడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి ఏమీ చేయలేకపోతాడు. కానీ, దానికి బదులు సతీదేవి శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 18 భాగాలుగా విడగొడతాడు. ఆ భాగాలే భూమిపై పడి 18 శక్తి పీఠాలుగా మారాయి.
కానీ, శివుడు మాత్రం తన భార్యని తననుండీ వేరుచేశాడన్న కోపంతో, విష్ణువును భూమిపై జన్మించమని శపిస్తాడు. అలా మానవ రూపంలో జన్మించిన విష్ణువు కూడా తన జీవిత భాగస్వామి నుండి విడిపోయే బాధను అనుభవిస్తాడు. ఈ కారణంగానే విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి భూలోకంలో మానవ రూపంలో సీతా రాములుగా జన్మిస్తారు. రాముడు భార్యా వియోగంతో బాధపడతాడు.
కొంత సమయం తర్వాత శివుడు శాంతించి తాను చేసిన తప్పు తెలుసుకుంటాడు. వెంటనే విష్ణువు వద్దకు వెళ్లి శాపాన్ని వెనక్కి తీసుకోలేనని, అయితే తనకి మరోలా సహాయం చేసి ఈ బాధను పంచుకుంటానని చెప్తాడు. అందుకే, రాముడు తన భార్యను కనుగొనడంలో సహాయం చేయడానికి తాను హనుమంతుడిగా పుడతానని వాగ్దానం చేస్తాడు. అందుకే హనుమంతుడు శివుని మరో అంశ అని చెప్తారు.
నోట్: కొన్ని పురాణాలలో సతీదేవి అగ్నికి ఆహుతై పోతుందని చెప్తారు. ఏది నిజమో మన దగ్గర ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి లభించిన ఆధారాలను బట్టి ఈ స్టోరీ రాయాల్సి వచ్చింది.
హనుమంతుడు చేసిన సహాయం ఏమిటి?
ఒకసారి హనుమంతుడు గంగానది ఒడ్డున కూర్చుని, రాముడిని ధ్యానిస్తున్నాడు. అకస్మాత్తుగా, నదిలో ఒక చేప అతనితో మాట్లాడింది, అతని సహాయం కూడా కోరింది.
తనని ఓ పెద్ద చేప తరుముతున్నదనీ, తనకు సహాయం అవసరమనీ ఆ చేప చెప్తుంది. అది విన్న హనుమంతుడు ఆ చేపని చూసి జాలిపడి దానికి సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. అలాగే ఆ చేపను సురక్షితంగా ఉంచడానికి తన భుజంపై తీసుకెళ్లాలని కూడా నిర్ణయించుకుంటాడు.
ఇక హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆ చేప తాను మోయలేనంత బరువు పెరుగుతుంది. అలా పరిమాణం పెరిగి పోతున్న ఆ చేపని చూసి, అది మామూలు చేప కాదని గ్రహించిన హనుమంతుడు దాని నిజస్వరూపాన్ని బయటపెట్టమని కోరతాడు.
హనుమంతుని భక్తికి మెచ్చి అతనికి వరాన్ని అందించిన ఆ చేప విష్ణువుగా తన నిజరూప దర్శనం ఇస్తాడు. వెంటనే ఆంజనేయుడు శ్రీరామునిపై శాశ్వతమైన భక్తిని మరియు అతనికి ఎప్పటికీ సేవ చేయగల సామర్థ్యాన్ని ప్రసాదించమని కోరతాడు.
అతని విన్నపాన్ని మన్నించిన విష్ణువు, హనుమంతుడికి ఎగరగలిగే శక్తిని, తన ఇష్టమైనప్పుడు తన రూపాన్ని మార్చుకునే సామర్థ్యాన్ని, మరియు అతని ఆయుధాలకు ఎదుర్కొనే శక్తిని అనుగ్రహిస్తాడు. ఇంకా చిరంజీవిగా జీవించమని వరాన్ని కూడా ప్రసాదిస్తాడు.
ఇది కూడా చదవండి: Kalabhairavas Connection to Kashi Vishwanath
హనుమంతుడు రక్షించింది ఎవరిని?
రావణుడు దేవతలందరినీ ఓడించి, గ్రహాలన్నిటినీ తన అధీనంలోకి తెచ్చుకొన్నాడు. ఇక తన కొడుకు మేఘనాధుడు జన్మించే సమయంలో తన జాతకంలో 11వ ఇంట్లో ఉండాలని నవగ్రహాలన్నిటినీ ఆదేశించాడు. రావణుడి సూచన మేరకు అన్ని గ్రహాలు అలానే చేశాయి కానీ, శనిదేవుడు మాత్రం అందుకు నిరాకరించాడు.
శని మేఘనాదుని జాతకంలో 12వ ఇంట్లో స్థిరపడ్డాడు. దీంతో రావణుడు భయపడ్డాడు. ఎందుకంటే, అది శని యొక్క వక్ర చూపు. దీని ప్రభావం తన కుమారుడి జీవితంపై పడితే అది నానా ఇబ్బందులకి గురించేస్తుందని భావిస్తాడు. అందుకే శనీశ్వరుడి చూపు పడకుండా తన రాజ్యంలోనే ఓ చీకటి గదిలో బంధించి ఉంచుతాడు.
చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకనాడు హనుమంతుడు సీతాదేవిని కనుగొనడానికి శ్రీరాముని దూతగా లంకకు వస్తాడు. సీత జాడ కనుగొన్న వెంటనే రావణుడి సేనలచే పట్టబడతాడు. వారు హనుమంతుడ్ని బంధించి తోకకి నిప్పు పెడతారు. వెంటనే హనుమంతుడు తన తోకకి అంటుకున్న నిప్పుతో లంకంతా తగలబెడతాడు.
అలా తగలబెట్టే సమయంలో ఓ చీకటి గదిలో బందీగా ఉన్న శనిదేవుడిని చూస్తాడు. అతనిని మాత్రం రక్షించి మిగిలిన రాజ్యమంతా తగలబెట్టేస్తాడు. హనుమంతుడు చేసిన ఆ పనికి శని దేవుడు కృతజ్ఞతతో ఎవరైతే హనుమంతుడిని పూజిస్తారో వారికి శని దుష్ఫలితాలు ఉండవని వరమిస్తాడు. ఇలా హనుమంతుడు స్వయంగా ఆ శని దేవుడ్నే కాపాడతాడు.
హనుమంతుని ప్రాణ త్యాగం ఏమిటి?
పురాణాల ప్రకారం, అహిరావణ పాతాళ లోకానికి రాజు. గొప్ప మంత్ర శక్తులను కలిగి ఉండేవాడు. రావణుడితో యుద్ధ సమయంలో, అహిరావణుడు రామ లక్ష్మణులను మోసగించి తన గుహలోకి తీసుకెళ్ళి, బంధించాడు. అది కనిపెట్టిన హనుమంతుడు వారిని రక్షించటానికి ఆ గుహలోకి వెళ్తాడు.
ఐతే ఆ గుహను 5 మంత్ర దీపాలు కాపాడుతూ ఉండటం గమనిస్తాడు. ఎలాగైనా సరే ఆ దీపాలు ఆర్పి రామ లక్ష్మణులని రక్షించాలని అనుకొంటాడు. వెంటనే హనుమంతుడు వరాహ రూపంలోకి మారి పాతాళంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అహిరావణ గుహను కనుగొని, తన మాంత్రిక శక్తులను ఉపయోగించి అక్కడి రాక్షసులను ఓడిస్తాడు.
అయితే, హనుమంతుడు 5 దీపాలను ఆర్పివేసినప్పుడు, 6వ దీపం కూడా ఒకటి ఉందని, అది అహిరావణుడిని రక్షిస్తుందనీ ఆయనకు తెలీదు. ఆ దీపం ఆరిపోవాలంటే, నిజమైన భక్తుడు ప్రాణత్యాగం చేస్తే తప్ప అది ఆరిపోదు. ఈ విషయం తెలిసి ఆ దీపాన్ని ఆర్పడానికి హనుమంతుడు తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టాడు. ఎప్పుడైతే హనుమంతుడు ప్రాణత్యాగం చేశాడో, అప్పుడు ఆ దీపం ఆరిపోయి… రామ లక్ష్మణులు చెర నుండి విముక్తి పొందుతారు. వెంటనే రాముని ఆశీర్వాద బలంతో హనుమంతుడు పునర్జీవించ బడతాడు.
ముగింపు
శ్రీరామునిపై నిస్వార్థ భక్తి, అచంచలమైన విధేయత హనుమంతుడ్ని గొప్ప భక్తుడిగా మార్చాయి. అందుకే, ఇతను హిందూమతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరిగా మారారు. హనుమంతుడ్ని అనేక పేర్లతో పిలుస్తారు. వాటిలో ప్రతి ఒక పేరు అతని పాత్రని మరియు వ్యక్తిత్వంలో విభిన్న కోణాలని ప్రతిబింబిస్తుంది. ఇప్పటివరకూ హనుమంతునికి సంబంధించి కొన్ని కథల్ని మాత్రమే పురాణాలు చెప్తూ వచ్చాయి. కానీ, అతని జీవితంలో జరిగిన ఎవరూ వినని కొన్ని సంఘటనల గురించి ఈ స్టోరీ ద్వారా మేము మీతో షేర్ చేసుకున్నాము. మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి.