ఒక సాదారణ వ్యక్తిగా పుట్టి, అసాదారణ శక్తులను సాధించి, పరిపూర్ణ మానవుడిగా మారిన ఒక సిద్ధయోగి ఈ ప్రపంచానికే మిస్టరీగా మారాడు. హిమాలయాల్లో కొన్ని వందల ఏళ్లుగా జీవిస్తూ, ఇప్పటికీ యువకుడిలాగే కనిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడు పుట్టారు? అసలు నిజంగా మనిషేనా..? లేక దేవుని అంశా..? ఇలాంటి ఎన్నో మిస్టీరియస్ టాపిక్స్ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వెల్లిపోదాం పదండి.
ఆ మిస్టీరియస్ పర్సన్ ఎవరు?
ఈ రోజు మనం మాట్లాడుకొనే టాపిక్ మహావతార్ బాబాజీ గురించి. రజనీకాంత్ బాబా సినిమా చూసినవాళ్ళందరికీ మహావతార్ బాబాజీ గురించి తెలిసే ఉంటుంది. కానీ, నిజానికి చాలామందికి ఈ బాబాజీ ఎవరో తెలియదు. ఇంతకీ బాబాజీ ఎవరు? ఎప్పుడు పుట్టారు? బాబాజీ ఇప్పటికీ జీవించే ఉన్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎంతో కాలంగా చాలామందిని వేధిస్తూనే ఉన్నాయి.
మహావతార్ బాబాజీ ఎవరు?
బాబాజీ అసలు పేరు కానీ, ఆయన పుట్టిన తేదీ కానీ, ఊరు కానీ, అసలు ఆయన ఎవరు అనేది కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. కానీ, ఆయనను కలిసిన వారంతా పిలుచుకొనే పేరు మాత్రం బాబాజీ. ఒకానొక సమయంలో తనని కలిసిన లాహిరీ మహాశయులు అనేవారికి మాత్రం బాబాజీ తనను గురించి కొన్ని వివరాలను తెలిపినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ వివరాలన్నీ పరమహంస యోగానంద రచించిన “ఆటోబయోగ్రఫీ అఫ్ యోగి’ అనే బుక్ ద్వారా ప్రజల దృష్టికి వచ్చాయి.
మహావతార్ బాబాజీ పుట్టుక
బాబాజీ నవంబర్ 30, 203లో జన్మించారని కొందరంటే… క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో జన్మించారని మరికొందరు అంటారు. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లా కావేరీనది తీరాన గల పరంగిపత్తై అనే కుగ్రామంలో బాబాజీ జన్మించారు. బాబాజీ అసలు పేరు నాగరాజు. ఈయన నంబూద్రి బ్రాహ్మణ వంశానికి చెందిన శివభక్తులైన వేదాంత అయ్యర్, మరియు జ్ఞానాంబ దంపతులకు పుట్టారు. తండ్రి వేదాంత అయ్యర్ ఆ గ్రామంలో ఉండే సుబ్రహ్మణ్య ఆలయంలో పూజారిగా ఉండేవారు. ఈ పరంగిపత్తై గ్రామం చిదంబర క్షేత్రానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మహావతార్ బాబాజీ బాల్యం
బాబాజీ బాల్యం నుండే దగ్గరలో ఉన్న మణిగురుకులానికి వెళ్ళేవారు. అక్కడి అర్చకులు సుబ్రహ్మణ్య కీర్తనలు పాడడం వినీ వినీ బాబాజీకి కూడా ఆయనపై మనసులో విపరీతమైన భక్తిభావం పెంపొందింది. ఇక తండ్రితో పాటు చిదంబరంలో జరిగే పుణ్యకార్యక్రమాలు అన్నిటిలోనూ పాల్గోనేవాడు.
ఇది కూడా చదవండి: Philosophical Significance of Ashta Vakra Katha
మహావతార్ బాబాజీ జీవితం గురించి ఆశ్చర్యకరమైన నిజాలు
బాబాజీ జీవితంలో జరిగిన ఈ 2 ముఖ్యమైన సంఘటనలు ఆయన మహావతార్ బాబాజీగా మారడానికి కారణం అయ్యాయి. అవేంటంటే –
బాబాజీకి శిక్ష
బాబాజీకి 4 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆయన తల్లి జ్ఞానాంబ ఒక పనిష్మెంట్ ఇచ్చింది. అదేమిటంటే, జరగబోయే ఒక ఉత్సవం కోసం ఆమె ఒక పనసపండుని తెస్తుంది. దానిని ఇంట్లో దాచిపెట్టి పనిమీద బయటకు వెళ్తుంది. కానీ, అది తెలియని బాబాజీ ఆకలికి తట్టుకోలేక ఆపండుని తినేస్తాడు. బయట నుండి వచ్చిన తన తల్లి విషయం తెలుసుకుని కోపంతో… బాబాజీ నోటిని ఒక గుడ్డతో కట్టేసి చీకటి గదిలో బంధిస్తుంది.
ఇలా చేయటం వల్ల ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టమైంది. అప్పుడే శివానుగ్రహంతో బాబాజీకి చాలాసేపు ఊపిరి నిలిపి ఉంచగలిగే ‘కుంభక సిద్ది’ లభించింది. కొంతసేపటి తర్వాత తన బిడ్డ ఊపిరి తీసుకోవడం కష్టమౌతుందని భావించిన తన తల్లి ఆయన నోటికి కట్టిన గుడ్డని తొలగించింది.
ఆక్షణంలో బాబాజీకి తన తల్లిపై ఎలాంటి కోపం రాలేదు కానీ, ఈప్రపంచంలో ప్రేమకు మూలం తల్లి అని తెలుసుకుంటాడు. అప్పటినుండీ బంధాలకు అతీతమైన ప్రేమను గుర్తించి, చిన్మయత్వం వైపు అడుగేశాడు.
బాబాజీ కిడ్నాప్
బాబాజీకి 5 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు వాళ్ళ గ్రామంలో ఉండే శివాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది జనం అక్కడికి వచ్చారు. వారితో పాటు చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠా ఒకటి అక్కడకు వచ్చింది.
వాళ్ళు బాబాజీ నోట్లో గుడ్డలు కుక్కి… కిడ్నాప్ చేసి కలకత్తా తీసుకుపోతారు. బాబాజీని అక్కడ ఒక ధనిక బ్రాహ్మణుడికి అమ్మేస్తారు. అయితే, ఈ ధనిక బ్రాహ్మణుడు చాలా మంచివాడు. నిత్యం దైవ నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తుండేవాడు. క్రమంగా ఇవన్నీ బాబాజీ నేర్చుకుంటూ ఉండేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచింది. యజమాని బాబాజీని నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లి హ్యాపీగా బతకు అని పంపించేస్తాడు.
మహావతార్ బాబాజీ సత్యాన్వేషణ
కలకత్తా నుంచీ బయటపడిన బాబాజీ ఒక సన్యాసి బృందంతో కలిసి, ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రలు చేసాడు. కొంతకాలంపాటు రామాయణ, మహభారత ఇతిహాసాలను ఎంతో క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. వేదాలు ఉపనిషత్తులు నేర్చుకొని… అందులో పరిపూర్ణత కలిగిన కొంతమంది జ్ఞానులతో గడిపాడు. ఆ తరువాత బాబాజీ తన మనసులో ఇలా అనుకున్నాడు. “మాటలు మార్గాన్ని మాత్రమే నిర్దేశిస్తాయి, వాస్తవం ఏమిటో తెలుసుకోవాలంటే… వాటికి అతీతమైన మార్గంలో మనమే వెళ్ళాలి” అని. అందుకే, సత్యాన్వేషణ కోసం ఆ దిశగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో కొంతమంది యోగులను కలిశాడు.
భోగర్నాథ్ దర్శనం
బాబాజీ 11 సంవత్సరాల వయస్సులో కాశీ నుండి కొంతమంది సాధువులతో కలిసి కాలినడకన భారతదేశం యొక్క దక్షిణ తీరంలో శ్రీలంక ద్వీపానికి దగ్గరగా ఉన్న ధనుష్కోడి అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ నుండి శ్రీలంకకు పడవలో వెళ్లి, ద్వీపానికి ఉత్తరాన ఉన్న పవిత్ర నగరమైన కర్తార్గామాకు కాలినడకన బయలుదేరారు.
ఆ రోజుల్లో ఇది చాలా కష్టతరమైన ప్రయాణం మరియు ఈ పవిత్ర క్షేత్రానికి యోగులు మాత్రమే తమ మార్గాన్ని కనుగొనగలరు కానీ, బాబాజీకి ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. పూర్వ జన్మలో తాను అవతరించిన ప్రదేశం అది కాబట్టి అక్కడికి వెళ్లాలని అతను భావించాడు.
కతర్గామ మహా సిద్ధులందరూ దర్శించిన దివ్య క్షేత్రం. దీనిని ‘దక్షిణ కైలాసము’ అని అంటారు. కైలాసం హిమాలయాల్లో శివుని నివాసం. విచిత్రమేమిటంటే, ఈ రెండు ప్రదేశాలు 80.10 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. అలాంటి వాతావరణంలో ప్రయాణం చేస్తూ, కుండలిని యోగాను అభ్యసించాలనుకునే వారందరూ ఈ కతర్గామ ద్వారా ప్రవేశించాల్సి ఉంటుంది.
కతిర్గమలో భోగనాథుడు అనే సిద్దుడు ఉండేవాడు. ఈ సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని స్థాపించింది ఈయనే! భోగనాథుని దర్శనంతోపాటు బాబాజీకి సుబ్రహ్మణ్యుడిని దర్శనం కూడా కలిగింది. ఆ తర్వాత బాబాజీ భోగనాథునికి శిష్యుడిగా మారతాడు. ఆయన బాబాజీకి సుబ్రహ్మణ్య మంత్రం , కొన్ని ప్రత్యేకమైన ధ్యాన సాధనలు ఉపదేశిస్తాడు. వాటి ప్రభావంతో బాబాజీ ఒక వటవృక్షం క్రింద కూర్చొని… ఆరు నెలలపాటు తీవ్రమైన ధ్యానం చేస్తాడు.
బాబాజీ సాధనలు పరిపక్వత అయ్యే కొలది తను చదివిన అనేక గ్రంథాలలో ఉన్న సత్యాలు వాస్తవ సత్యాలుగా కనిపించటం, అనుభుతి చెందటం జరిగేది. కొద్దికాలానికి బాబాజీ తన భౌతిక శరీర పరిధి నుండి… ఈ విశ్వమే తన పరిధిలేని ఒక శరీరమని గ్రహిస్తాడు. సాధన పరిపక్వతకి చేరుకోగానే, బాబాజీకి సుబ్రహ్మణ్య దర్శనం కలుగుతుంది. అప్పడు సుబ్రహ్మణ్యుడు బాబాజీకి మృత్యుంజయత్వం వరంగా ప్రసాదిస్తాడు. అప్పటి నుండి బాబాజీకి నిత్య యవ్వనంతో ఉండే సిద్ది లభిస్తుంది.
తరువాత గురువుగారి దగ్గరికి వెళ్ళాలనిపించి భోగనాథున్ని స్మరిస్తాడు. అప్పుడు భోగనాథుడు ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు నన్ను ఏమి చేయమంటారు స్వామీ! అని బాబాజీ తన గురువుని అడుగుతాడు. వెంటనే ఆయన నీకు సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగింది కానీ నీకిది చాలదు. నీవింకా సిద్ధస్థితిని సాదించాలి. జన్మాంతర సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి నీవు. ఎందుకంటే నీ గతజన్మ చరిత్రలన్నీ నాకు తెలుసు, కొన్ని కారణాల వల్ల నీకు మానవజన్మ వచ్చింది. అందుకే, నీవు కుర్తాళం వెళ్ళు. అక్కడ అగస్త్య మహర్షి గురించి ధ్యానం చెయ్యి. ఆయన దర్శనం అయ్యే వరకూ తపస్సు చెయ్యి. ఆయన నీకు సిద్దత్వం ఇచ్చేటట్లు నేను చూస్తాను అని చెప్తాడు.
అగస్త్య మహర్షి దర్శనం
గురువాక్యం ప్రకారం బాబాజీ కుర్తాళం చేరుకుంటాడు. అక్కడ ఆయన ఆహరం తీసుకోకుండా… కేవలం నీరు మాత్రం త్రాగుతూ 48 రోజులు కఠోర దీక్ష చేసాడు. 48వ రోజున బాబాజీ శరీరం పూర్తిగా పట్టు కోల్పోతుంది. ఇంతలో దివ్యకాంతితో ఉన్న అగస్త్య మహర్షి దర్శనం కలుగుతుంది. అప్పుడు అగస్త్య మహర్షి బాబాజీని అనుగ్రహించి… క్రియాయోగ రచనల్లో ఉన్న “వశీ యోగం” అనే అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియను ఉపదేశిస్తాడు. ఆప్రక్రియ ద్వారా బాబాజీ యోగ సిద్దత్వాన్ని పొందుతాడు.
ఆ క్షణం నుండీ బాబాజీలోని అంతర్గత శక్తి అవగాహన అవుతూ వచ్చింది. “నాయనా ఈరోజు నుండి నీవు సిద్దుడివి అవుతావు నీవు హిమాలయ శ్రేణుల్లో ఉన్న బద్రీనాథ్ క్షేతానికి వెళ్ళి అక్కడ మహోన్నత సిద్ది పొందగలవు” అని తెలియజేస్తాడు.
క్రియా యోగా స్థాపకుడు
బద్రీనాథ్ క్షేత్రం హిమాలయ పర్వత శ్రేణుల్లో టిబెట్ కి దక్షిణ దిశలో కొద్దిమైళ్ళ దూరంలో 1243 అడుగుల ఎత్తులో నెలకొని ఉంది. బాబాజీ ఈ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 18 నెలలపాటు క్రియాయోగ సాధన చేసాడు. ఈసాధన ద్వారా బాబాజీ “సౌరభ సమాధి” అనే గొప్ప స్థితిని పొందాడు. భగవంతుని అనుగ్రహం లభించింది. బాబాజీ భౌతిక శరీరమంతా బంగారు రంగు కాంతితో నిండి దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. ఈ విధంగా క్రియాయోగ స్థాపనకు కారణమయ్యాడు. అప్పటి నుండి ఇప్పటివరకూ మహావతార్ బాబాజీ తన భౌతిక శరీరంతో ఉన్నారు.
మహావతార్ బాబాజీ శిష్యులు
- లాహిరి మహాశయుడు మహావతార్ బాబాజీ యొక్క ఏకైక శిష్యుడు. ఇతను కాక ఇంకా మరికొంతమందికి కూడా బాబాజీ తన ధ్యాన పద్ధతులను ఉపదేశించారు. కానీ, వారంతా శిష్యులు కారు, కేవలం అనుచరులు మాత్రమే అని చాలా మంది వాదిస్తారు. క్రియా యోగ శాస్త్రాన్ని పునరుద్ధరించడానికి లాహిరి మహాశయుడు 1861లో బాబాజీచే ఎంపిక చేయబడ్డాడు.
- మరొక గొప్ప శిష్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రైన దేవేంద్రనాథ్ ఠాగూర్. ఇతను హిమాలయాలలో బాబాజీతో కొంతకాలం గడిపినట్లు ప్రకటించాడు. అతను తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్‌ను కూడా బాబాజీతో మూడు సంవత్సరాలు నివసించడానికి పంపాడు.
- 700శతాబ్దంలో, మహావతార్ బాబాజీ ఆది శంకరాచార్యులకు క్రియాయోగ సాధనలో దీక్ష ఇచ్చి, కొన్ని ధ్యాన పద్ధతులను ఉపదేశించారు.
- 1868 లో, శ్యామాచరణ్ లాహిరీకి ఈ క్రియాయోగ దీక్షను అందించారు బాబాజీ. ఈ శ్యామాచరణ్ లాహిరీ వల్లే మహావతార్ బాబాజీ జీవిత చరిత్ర ఉనికిలోకి వచ్చింది.
- ఇక శ్యామాచరణ్ లాహిరీ చాలా మంది శిష్యులకు దీక్షను ఇచ్చారు. వారి ప్రియశిష్యుడు “శ్రీ యుక్తేశ్వర్ గిరి బాబా”.
- యుక్తేశ్వర్ గిరి బాబా ప్రియ శిష్యుడే “పరమ హంస యోగానంద”. ఈయన రచించిన “ఒక యోగి ఆత్మకథ” అనే పుస్తకంతో బాబాజీ ప్రజల దృష్టికి వచ్చాడు,
- ఇక 1940లో, మహావతార్ బాబాజీ V.T. నీలకంఠన్ గారికి దర్శనం ఇచ్చి… క్రియాయోగ కుండలినీ దీక్షని బోధించారు.
- 1942లో, S.A.A. రామయ్య గారికి కూడా క్రియాయోగ కుండలినీ దీక్షని బోధించారు.
- ఇక ఇటీవలి కాలంలో పాపులర్ యాక్టర్ అయిన రజనీకాంత్ కూడా యోగానంద రచించిన “ఒక యోగి ఆత్మకథ” బుక్ చదివిన తర్వాత నుండీ బాబాజీ ఫాలోవర్ గా మారినట్లు తెలిపారు. అప్పటినుండీ క్రియా యోగా అభ్యాసాన్ని అనుసరించడం కూడా ప్రారంభించాడు.
వీళ్ళే కాదు, ఇప్పటికీ మహావతార్ బాబాజీకి చాలా మంది శిష్యులు ఉన్నారు. చాలా మందికి ఆయన దర్శనాలు కూడా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology
మహావతార్ బాబాజీ సోదరి మాతాజీ
బాబాజీకి ఒక సోదరి కూడా ఉండేదట. ఈవిడని అందరూ ‘మాతాజీ’ అని పిలుస్తుంటారు. ఈమె కూడా బాబాజీతో సమానంగా సాధనలు చేసి యోగిగా మారింది. ఇప్పటికీ ఈమె తన భౌతిక శరీరంతో జీవించే ఉన్నట్లు తెలుస్తోంది.
మహావతార్ బాబాజీ – శ్రీకృష్ణుని అవతారం
బాబాజీని శ్రీకృష్ణుని అవతారంగా పేర్కొంటూ అనేక సిద్ధాంతాలు వెలువడ్డాయి. మహావతార్ బాబాజీ శ్రీకృష్ణుడే అని లాహిరి మహాశయుడు తన డైరీలో రాసుకున్నాడు. యోగానంద పరమహంస ఇతనిని కృష్ణునిగా తలచి ప్రార్థిస్తూ ఉండేవారు. యోగానంద మాత్రమే కాదు, ఆయన ఇద్దరు శిష్యులు కూడా బాబాజీని తన పూర్వ జీవితంలో కృష్ణునిగా విశ్వసించారని రాశారు.
మహావతార్ బాబాజీ భౌతిక స్వరూపం
మహావతార్ బాబా ఇప్పటికీ 24-25 సంవత్సరాల యువకుడిగా కనిపిస్తూ ఉంటారు ప్రకాశవంతమైన కాంతితో కూడుకొని ఉండి… పొడవాటి జుట్టు మరియు పదునైన ముఖ లక్షణాలతో కనిపిస్తారు. అతను “పద్మాసనం” లో కూర్చున్నప్పుడు, అతను దాదాపు 5 అడుగుల పొడవు ఉంటాడని చెబుతారు. సాధారణంగా, అతను ఎక్కువ సమయాన్ని “సమాధి”లోనే గడుపుతారు. మిగిలిన సమయాన్ని తన అనుచరులకు మరియు ఇతర సాధువులకు మార్గనిర్దేశం చేస్తాడు.
మహావతార్ బాబాజీ గుహ
మహావతార్ బాబాజీ గుహ ఇప్పటికీ ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో కుకుచినా నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న దూనగిరిలో ఉంది. ఈ గుహ సాధువులు మరియు గొప్ప వ్యక్తుల ధ్యాన స్థలం. సినీ నటులు రజనీకాంత్ మరియు జుహీ చావ్లా కూడా ఈ గుహను సందర్శించారు. మహావతార్ బాబాజీ ఈ శివాలిక్ కొండలలో నివసిస్తున్నారని నమ్ముతారు, మరియు అతను ఇక్కడ చాలా మంది యోగులకు దర్శనం కూడా ఇచ్చాడు.
మహావతార్ బాబాజీ ఆశ్రమాలు
మహావతార్ బాబాజీ ఆశ్రమాలు రాణీ ఖేడ్ మరియు కైలాస పర్వతం శిఖరం పైన ఉన్నాయి. అయితే, ఇక్కడికి రావడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు.
చివరిమాట
ఎవరైనా బాబాజీ పేరును భక్తితో ఉచ్ఛరిస్తే చాలు, తక్షణమే బాబాజీ నుండీ ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని అందుకుంటారట. ఇది చాలు బాబాజీ ఉనికికి నిదర్శనం. మహావతార్ బాబాజీ గురించి తెలుసుకోవాలంటే, చరిత్ర అవసరం లేదు. అతడు నిత్యుడు మరియు శాశ్వతుడు.