సింహాన్ని దూరం నుంచి చూస్తేనే వణికిపోతాం. అలాంటిది సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఎవరికైనా ఉందా? సింహం నోట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ జూపార్క్‌లో మాత్రం ఓ యువకుడు ఈ పని చేశాడు. దాని ఎన్‌క్లోజర్ దగ్గరకి వెళ్ళటమే కాకుండా… సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న జనం గజగజ వణికిపోయారు.
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కి వచ్చిన ఓ ఆకతాయి… సింహంతో ఫోటోకి ఫోజు ఇవ్వాలనుకున్నాడు. మిగిలిన అందరు సందర్శకుల మాదిరిగానే లోపలి వెళ్ళిన అతను ఎన్‌క్లోజర్ బయటనుంచి కాకుండా… డైరెక్ట్‌గా లోపలి వెళ్లి… సింహం డెన్ ఉండే బండరాళ్లపై కూర్చున్నాడు. సింహంతో ఆటలాడే సాహసం చేశాడు. ఇక సింహం కూడా అతడ్ని వేటాడేందుకు తెగ ట్రై చేసింది.
ఇదంతా చూస్తున్న సందర్శకులు గగ్గోలు పెట్టారు. వద్దని ఎంత చెప్పినా వినకుండా దాని ఎదురుగా ఉన్న రాక్ పై కూర్చుంటున్నాడు, లేస్తున్నాడు, ఇలా నానారకాలుగా దానిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద చివరికి ఈ విషయం జూ అధికారుల కళ్లలో పడింది. ఇక ఏమాత్రం ఆలశ్యం చేయకుండా వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బహుదూర్‌పూర పోలీసులకు అప్పగించారు. ఈ భూమ్మీద ఇంకా నూకలున్నట్టు ఉన్నాయి. అందుకే ఆఖరి నిముషంలో బతికి బయటపడ్డాడు.