ఏలియన్స్ అనగానే మనలో ఏదో తెలియని భయం చోటుచేసుకుంటుంది. కారణం వాటి రూపం. ఈ సృష్టిలో అందం, తెలివితేటలు ఒక్క మనిషికే సొంతం. ఏలియన్స్ మనుషులకంటే తెలివైనవే అయినప్పటికీ అందంలో మాత్రం మనతో పోటీ పడలేవు.
అయితే, అందమైన రూపంతో ఉన్న వ్యక్తి, అందవిహీనంగా ఉండే ఏలియన్ లా మారాలని అనుకుంటే దానిని పిచ్చి అనుకోవాలో… వెర్రి అనుకోవాలో అర్ధం కావట్లేదు. తనని తాను ఏలియన్ లా ట్రాన్స్ ఫాం చేసుకోవటానికి తన జీవితాన్నే పణంగా పెట్టాడు.
ఫ్రాన్స్‌కి చెందిన 33 ఏళ్ల ఆంటోనీ లొఫ్రెండోకి మొదటినుండీ ఏలియన్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చితోనే తనని తాను ‘బ్లాక్ ఏలియన్’ గా పిలుచుకుంటాడు. తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచీ ఏలియన్ గా మారటం కోసం అనేక రకాల సర్జరీలు చేయించుకున్నాడు.
తన ముఖంలో కళ్లు, ముక్కు, నోరు, నాలిక ఇలా ఏ భాగాన్నీ వదలకుండా అన్నిటినీ ఏలియన్ శరీర భాగాల మాదిరిగా ఉండేలా సర్జరీ చేయించుకున్నాడు. ఒళ్లంతా నల్లటి టాటూలు వేయించుకున్నాడు. ఎలియన్స్ చేతులకు మనకి ఉన్నట్లు ఐదు వేళ్లు ఉండవు. అందుకోసమై మెక్సికో వెళ్లి… అక్కడ తనచేతికి ఉన్న రెండు వేళ్లని సర్జరీ ద్వారా తొలగించుకున్నాడు. తర్వాత బార్సిలోనా వెళ్లి… అక్కడ తన ముక్కుని తీయించేసుకున్నాడు. అందువల్ల ఇప్పుడు అతని ముక్కు ఉన్న స్థానంలో రంధ్రాలు కనిపిస్తాయి.
ఇలా వరుసగా చేయించిన సర్జరీలలో చెవులు తీయించేసుకున్నాడు. కళ్లు తేడాగా ఉంటాయి. పెదవులు కట్ చేయించుకున్నాడు. నాలిక పాము నాలికలా రెండుగా చీలి ఉంటుంది. శరీరం మొత్తం బ్లాక్ కలర్ లోకి మారేలా చేయించుకున్నాడు. ఎన్ని సర్జరీలు జరిగినా… తనకు హ్యాపీగానే ఉందని అంటున్నాడు. ఎందుకంటే, అంచెలంచెలుగా తాను ఏలియన్ కి దగ్గరైపోతున్నానన్న ఆనందం.
ఆంటోనీ గత 13 ఏళ్లుగా ఇలా తనని తాను ఏలియన్‌లా మార్చుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకూ తన శరీరంలో 34 శాతాన్ని ఏలియన్‌లా మార్చేసుకున్నాడు. ఇంకా 66 శాతం మిగిలివుంది. ఈ లెక్కన ముందు ముందు ఇంకెన్ని మార్పులు చేయించుకుంటాడో!
అయితే, ఆంటోనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో “the_black_alien_project” పేరుతో అకౌంట్ ఉంది. తరచూ ఇందులో తన అప్‌డేట్స్ పెడుతూ ఉంటాడు. తన పాత, కొత్త ఫోటోలని మిక్స్ చేసి పోస్టులు పెడుతూ ఉంటాడు. అందరూ తనని ఏలియన్ అనుకోవాలన్నదే ఇతని మోటివ్.