Mandodari, Ravana's Wife, Ramayana Character

Mandodari’s Significance in Hindu Mythology

పురాణాలలో ఎంతోమంది ధీర వనితలు ఉన్నా… వారిలో కేవలం ఐదుగురిని మాత్రమే *పంచకన్యలు* గా చెప్పుకొంటాం. అలాంటి పంచకన్యలలో మండోదరి కూడా ఒకరు. పంచకన్యలు అంటే ఎవరో..! వారి ప్రత్యేకత ఏంటో..! ఈ స్టోరీ ఎండింగ్ లో చెప్పుకొందాం. 

ఇక మండోదరి విషయానికొస్తే, ఆమె రావణుడి భార్య అనీ, రాజ వైభోగాలు అనుభవించింది అనీ అనుకొంటాం. కానీ, నిజానికి తన జీవితం ఒక పోరాటంలా సాగిందనీ, పుట్టింది మొదలు… మరణించేంత వరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయిందనీ మీకు తెలుసా!  అంతేకాదు, పార్వతిదేవి శాపానికి ఎందుకు గురయింది? సీతకి, ఈమెకి మద్య గల సంబంధం ఏమిటి? రావణుడు మరణించాక ఈమె ఎవరిని వివాహమాడింది? ఇలాంటి ఎన్నో మండోదరి లైఫ్ సీక్రెట్స్  గురించి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్ లోకి వచ్చేయండి. 

పూర్వ జన్మ వృత్తాంతం

మండోదరి జన్మ వృత్తాతo గురించి పురాణాలలో అనేక రకాలుగా వర్ణిస్తూ వచ్చారు. కానీ, వాటన్నిటిలోనూ వాల్మీకి రామాయణం ఒకటే సరైన ఆధారం. దీని ప్రకారం చూస్తే, ముఖ్యంగా 3 కథలు ప్రచారంలో ఉన్నాయి.  సందర్భాన్ని బట్టి ఆ కథలని చెప్పుకొందాం.

పార్వతీ దేవి శాపం

పూర్వo దేవలోకంలో మథుర అనే ఓ దేవకన్య ఉండేది. ఆమె చాలా అందాల రాశి.  ఒకసారి ఆమె కైలాశానికి వెళుతుంది. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడ ఉండదు. ఇక కైలాశనాథుడిని చూడగానే ఆయనపై మనసు పడుతుంది.  ఈమె అందానికి దాసోహమై శివుడు కూడా తన పొందు కోరుకొంటాడు. 

ఇంతలో పార్వతి రానే వస్తుంది. రాగానే మథుర శరీరానికి  అoటిన విభూతిని చూస్తుంది. పార్వతికి పట్టరాని కోపం  వస్తుంది. వెంటనే మథురను బావిలో కప్పగా మారమని శపిస్తుంది. తాను చేసిన తప్పును క్షమించమని ఎంతగానో వేడుకొంటుంది. శివుడు కూడా ఆమెని కరుణించి, శాపాన్ని ఉపసంహరించుకోమని కోరతాడు. అప్పుడు పార్వతి 12 సంవత్సరాలు బావిలో కఠోర తపస్సు చేస్తే, శాప విముక్తి కలుగుతుందని చెబుతుంది.  

శాప కారణంగా, మథుర భూలోకమునకు వచ్చి కప్పగా మారి ఒక బావిలో 12 సంవత్సరములు కఠోర తపస్సు చేస్తుంది. అనంతరం ఆమె పసిపాపగా మారుతుంది. 

మాయాసురుడి ధ్యానం

పూర్వం మయాసురుడు అనే మహా శిల్పి ఉండేవాడు. అతను మహా మహా నగరాలను సైతం ఎంతో గొప్ప చాతుర్యంతో అద్భుతంగా నిర్మించగలడు. అందుకే అతడికి ‘మయబ్రహ్మ’ అని పేరు. ఇతను విశ్వకర్మ యొక్క కుమారుడు. మయాసురుడి భార్య పేరు హేమ. ఆమె ఓ గంధర్వకాంత. 

ఈ దంపతులకి మాయావి మరియు దుందుభి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ ఆడపిల్ల లేదనే చింత వారికి వుండేది.  అందుకే రాజ్యానికి దూరంగా వచ్చి ఆ రాజ దంపతులు దైవ ధ్యానం చేసే వారు. 

ఒకరోజు వారు తపస్సు చేస్తుండగా, దూరంగా ఉన్న ఓ బావి లోపలి నుండి పసిపాప ఏడుపు వారికి వినిపిస్తుంది. చుట్టూ వెతకగా బావిలోని మథుర అప్పుడే పసిబిడ్డగా మారి ఏడుస్తూ కనిపించింది. చుట్టుప్రక్కల అంతా వెతకగా వారికి ఎవరు కనపడరు. దైవమే తమకు ఆ పాపను ప్రసాదించాడనుకొని వాళ్ళు ఆ పాపను తమ రాజ్యానికి తీసుకొని వచ్చి మండోదరి అనే పేరు పెట్టి పెంచ సాగారు. 

పేరు వెనుక ఉన్న రహశ్యం 

మండోదరి అనే పదాన్ని మండ + ఉదరి = మండోదరి అని చెప్తారు. ఇక్కడ ‘మండ’ అంటే – మండూకము లేదా కప్ప అని అర్ధం.  ‘ఉదరి’ అంటే – ఉదరము లేదా పొట్ట అని అర్ధం. టోటల్ గా మండోదరి అంటే – కప్ప పొట్ట వంటి పొట్ట కలిగినది అని అర్ధం. 12 ఏళ్ల పాటు బావిలో కప్ప రూపంలో జీవించి, ఆ తర్వాత కప్ప లాంటి పొట్ట కలిగిన ఓ శిశువు రూపంలోకి మారటం చేత ఈమెకి ఆ పేరు వచ్చింది. 

అంతేకాదు, కప్ప పొట్టవంటి పొట్టను కలిగి ఉండడము మహారాణి లక్షణమని సాముద్రికశాస్తములో చెప్పబడినది. దానికి అణుగుణముగానే మండోదరి త్రిలోక విజేత అయిన రావణాసురునికి పట్టమహిషి అయింది. 

రావణుడితో వివాహం

పురాణాలలో అత్యంత అందమైన స్త్రీలుగా చెప్పుకొనే అతి కొద్దిమందిలో మండోదరి కూడా ఒకరు. ఈమె అత్యంత సౌందర్యవతి మాత్రమే కాదు, అత్యంత సుగుణవతి, అత్యంత సౌశీల్యవతి కూడా.  

ఒకసారి మండోదరి తన తండ్రితో కలిసి వనంలో సంచరిస్తున్న సమయంలో,  లంకాధిపతి అయిన రావణుడు వేటకై అటు వెళ్లినప్పుడు ఈమెను చూస్తాడు. తన అందచందాలకు ముగ్దుడై… ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొంటాడు. 

వెంటనే ఆ విషయాన్ని మయాసురుడితో చెప్పి, తనకు మండోదరిని ఇచ్చి వివాహం జరిపించమని కోరతాడు. రావణుడి బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వటానికి ఇష్టపడడు. వాస్తవానికి మొదట మండోదరికి కూడా ఈ వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. కానీ, రావణుడి బలం ముందు తన తండ్రి ఓడిపోతాడని భావించి, ఒప్పుకొంటుంది. 

అలా తండ్రియైన మయుడు మండోదరిని రావణునికిచ్చి వివాహం జరిపిస్తాడు. వీరికి మేఘనాధ, అతికాయ మరియు అక్షయ కుమారుడు అనే ముగ్గురు సంతానం కలుగుతారు.

ఇది కూడా చదవండి: Unveiling the Secrets of Mayan Muni: Facts and Mythology

సీత, మండోదరి మధ్య సంబంధం 

అద్భుత రామాయణం ప్రకారం, పూర్వం గృచ్చమద మహర్షి సాక్షాత్తూ ఆ లక్ష్మి దేవినే తన పుత్రికగా పొందాలని అనుకొంటాడు. అందుకోసం రెల్లు గడ్డిని తెచ్చి… దానిని   పిండి… పాలను తీస్తాడు. అలా తీసిన పాలని ఒక కుండలో పోసి… మంత్రోచ్ఛారణతో పవిత్రం చేసి కాపాడుతూ వుండేవాడట. 

అదేసమయంలో, మహర్షుల రక్తం త్రాగితే అద్బుత శక్తులు వస్తాయని రావణాసురుడు విన్నాడు. అందుకోసం ఎంతోమంది మహర్షుల తలలు నరికి… వారి రక్తాన్ని సేకరించి… ఒక కుండలో పోసి పెడుతూ వుండే వాడట.  

ఒకనాడు రావణుడు తన సేకరణలో భాగంగా, గృచ్చ మద మహర్షి ఆశ్రమమునకు వస్తాడు. ఆయన తల నరికి సేకరించిన అతని రక్తాన్ని కుండలో పోసి పెడదామని చుట్టూ చూస్తాడు. ఒకచోట గృచ్చమద మహర్షి కాపాడుతూ వచ్చిన పాల కుండ కనిపిస్తుంది. వెంటనే తాను సేకరించిన   మహర్షి రక్తాన్ని ఆ పాల కుండలో కలిపి పోసి తన మందిరానికి తీసుకొని వెళతాడు.

రావణుడు చేసే ఈ దురాగతాలను సహించలేక మండోదరి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటుంది. రావణుడు లేని సమయం చూసి, అతని మందిరంలోకి వెళుతుంది. అక్కడ తన భర్త తెచ్చి ఉంచిన కుండని చూస్తుంది. అందులో ఉన్నది విషమని భావించి తీసుకొని త్రాగేస్తుంది. గృచ్చమద మహర్షి మంత్రించిన ఆ పాలని తాగటం వల్ల మండోదరికి ఆడపిల్ల పుడుతుంది.  

ఆ శిశువుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆమెకి గతంలో జరిగిన ఓ విషయం గుర్తొస్తుంది. ఒకసారి ఒక జ్యోతిష్యుడు రావణాసురునికి  జ్యోశ్యo చెప్తాడు. అదేంటంటే, పట్టపు రాణికి పుట్టబోయే సంతానం ఒకవేళ ఆడపిల్ల అయితే, ఆ శిశువు వల్లే లంకా నాశనం, రావణుని మరణం సంభవిస్తుందని చెప్తాడు. ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాట గుర్తుకు వచ్చిన వెంటనే తన భర్త ఎలాగైనా ఈ బిడ్డని చంపేస్తాడని భయపడి పోతుంది. అందుకే ఆ శిశువుని ఒక  పెట్టెలో పెట్టి సముద్రంలో ఒదిలిపెట్టమని మండోదరి ఆ పెట్టెని రాక్షసులకు ఇచ్చి పoపిస్తుంది.     

అలా సముద్రంలో ఒదిలిన ఆ పెట్టెను సముద్రుడు  కాపాడి భూదేవికి అప్పగిస్తాడు. భూదేవి జనకమహారాజు బూమిని ధన్నినపుడు అతనికి లభించేలా చేస్తుంది. ఈ రహశ్యo మండోదరి రావణాశురుడికి తెలియ నీయలేదట. ఈ రకంగా చూస్తే, సీత మండోదరికి కూతురు అవుతుంది. మండోదరి బిడ్డగా లంకలో పెరగాల్సిన సీత జనకుడి వద్ద మిథిలా నగరంలో పెరిగినట్లు అద్భుత రామాయణంలో వ్రాయబడినది.

సీతను బంధించడంపై వ్యతిరేకత

వాల్మీకి రామాయణంలో మండోదరి ఎంతో అందమైన మహిళగా వర్ణించబడింది. రావణుడు సీతని అపహరించి లంకకి తీసుకు వచ్చిన తర్వాత ఆమెని వెతుకుతూ రాముని వానర దూత అయిన హనుమంతుడు అక్కడికి వస్తాడు. లంకలో తన అంతఃపురంలో ఉన్న మండోదరిని చూసి ఆమే తన తల్లి సీత అని పొరబడతాడు. 

ఎందుకంటే, సీతని రామాయణంలో అత్యంత అందమైన మహిళగా పేర్కొంటారు. అందుకే హనుమంతుడు కూడా మండోదరి అందాన్ని చూసి మొదట పొరపాటు పడ్డాడు. చివరకు సీతను కనుగొంటాడు. ఆ సమయంలో రావణుడు తనని వివాహమాడమని లేదంటే చంపేస్తానని సీతని బెదిరిస్తుంటాడు.  అందుకు సీత నిరాకరించడంతో, ఆమె తల నరికి వేసేందుకు రావణుడు కత్తిని ఎత్తుతాడు. 

వెంటనే మండోదరి రావణుడి చేయి పట్టుకుని ఆపి, సీతను కాపాడుతుంది. ఒక స్త్రీని చంపడం ఘోరమైన పాపమని హెచ్చరిస్తుంది. సీతను తన భార్యగా చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టమని కోరుతుంది. అంతేకాదు, స్త్రీల పట్ల  వ్యామోహం తగ్గించుకోమని, కావాలనుకొంటే తన ఇతర భార్యలతో కాలక్షేపం చేయమని తన భర్తని సూచిస్తుంది.  వెంటనే రావణుడు తన భార్య మాట విని సీత ప్రాణాలను విడిచిపెట్టాడు కానీ, సీతను వివాహం చేసుకోవాలనే కోరికను మాత్రం వదులుకోలేదు. 

యుద్ధ సమయంలో మండోదరి పాత్ర 

రావణుడు సీతను అపహరించి లంకకు తెచ్చినపుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి, రావణుడికి ఇక కాలం చెల్లిందని తెలుసుకుంటుంది. ఎంత గొప్ప శివభక్తుడయినా, ఎంతటి పరాక్రమ వంతుడయినా, ఎన్ని వేదాలు చదివినా, తన భర్తకి పరస్త్రీ వ్యామోహమనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి, అతన్ని సరిదిద్దేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. చేసేదేమీ లేక ఓర్పుతో సహిస్తుంది. 

భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తుంటుంది. రావణుడు సీతను అపహరించుకునిపోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని బోధ చేసింది. కాని ఆమె ప్రయత్నాలేవీ ఫలించలేదు.

తిరిగి ఇక రాడని తెలిసినా… యుద్ధ రంగానికి బయలుదేరిన తన భర్తకి వీరత్వాన్ని నూరి పోసింది మండోదరి. వీరుడిగా రణరంగంలో పోరుసల్పి చివరకు వీర స్వర్గాన్ని అలంకరించినా తనకు ఎంతోకొంత తృప్తి కలుగుతుందని భావించినది. ఎంతో శౌర్యంతో ఉండే తన భర్త నికృష్టంగా చావడం, అవమానాల పాలుకావడం ఊహించలేకపోతుంది. రాముణ్ణి ఎదిరించి జయించు లేదా అతని చేతిలో నువ్వు మరణించు అని చెప్తుంది. ఇలా మండోదరి యుద్ధ సమయంలో తన వంతు కృషి చేస్తుంది. 

ఇది కూడా చదవండి: Lesser-Known Stories of Hanuman

విభీషణుడితో పునర్వివాహం 

యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త రణరంగంలో విగత జీవిలా పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలచి వేసింది. ఇంతలో అక్కడికి వచ్చిన శ్రీరాముడిని చూడగానే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అవతారమని గ్రహిస్తుంది. స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలనూ  స్వయంగా చూసి నిండు మనస్సుతో నమస్కరిస్తుంది. 

రావణుడి మరణంతో మహా పతివ్రత అయిన మండోదరి  వితంతువు అయ్యే అవకాశం ఉంది. ఆమెకి ఆ  దుస్థితి పట్టకూడదని ఆమెకి నిత్య సుమంగళి యోగం కలిగేలా వరం ఇస్తాడు రాముడు. ఇంకా ఆమె పేరు విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయనీ వరం కూడా ఇస్తాడు. వెంటనే విభీషనుడుని పిలిపించి మండోదరిని భార్యగా స్వీకరించమని చెబుతాడు. అందుకు మండోదరి మొదట ఒప్పుకోదు. కానీ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వీరిని అజ్ణాపించినందువలన ఆయనకి కొన్ని షరతులను విధించి, వాటిని పాటించినట్లైతే,విభీషునుడికి  భార్య గా వుంటానంటుంది. 

ఆ షరతులలో మొదటిది తాను విభీషనుడికి కేవలం భార్యగా మాత్రమే ఉండటం, తన శరీరాన్ని మాత్రము అతనికి అర్పించక పోవడం. రెండవది తన అనుమతి లేనిదే, విభీషునుడు తన మందిరం లోనికి రాకూడదు. మూడవది తాను రాజ్య పాలనలో మాత్రం అతనికి పూర్తిగా సహాయం చేస్తానని చెబుతుంది. 

అందుకు అంగీకరించటంతో తాను విభీషనుడిని పునర్వివాహం చేసుకుంటుంది. రాజ్య పాలనలో విభీషనుడికి తన పూర్తి సహకారం అందిస్తుంది. కొంతకాలం అలా గడిచిన తర్వాత పర్వతాల్లోకి వెళ్లి తపస్సు చేస్తూ తనువు చాలిస్తుంది. 

ఇలా మండోదరి తన జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నప్పటికీ, తన శరీరాన్ని, మనస్సునీ ఎల్లప్పుడూ పవిత్రంగా కాపాడుకొంటూ పంచ కన్యలలో ఒకరిగా నిలిచిపోయింది. ఈ స్టోరీ స్టార్టింగ్ లో మనం చెప్పుకొన్నాం ఈ పంచ కన్యల గురించి. వాళ్ళెవరో చూద్దాం.

పంచ కన్యలు ఎవరు?

నిజానికి పంచ కన్యలు అంటే – భర్తలకు దూరం కావడం, భర్తలచే అనుమానింప బడడం, భర్తలయొక్క వియోగం పొందడం అష్ట కష్టాలు పడడం ఇలాంటివి ఏం జరిగినా ధైర్యం కోల్పోకుండా, తమ కర్తవ్యాన్ని నెరవేర్చి చరిత్రలో నిలిచిన మహిళలు. అహల్య, తార, కుంతి, ద్రౌపది, మండోదరి ఈ ఐదుగురు ధీర వనితలని పురాణాలలో *పంచ కన్యలు* గా పేర్కొంటారు. పంచ కన్యలు అంటే – ‘అత్యంత పవిత్రమైన వాళ్ళు’ అని అర్ధం. వీరినే ‘పురాణ పతివ్రతలు’ అని కూడా అంటారు. 

నీతి

మండోదరి జీవితం ద్వారా మనం తెలుసుకొన్న నీతి ఏంటంటే, భర్త చెడ్డవాడని కుంగిపోతూ కూచోకూడదు. చేతనైనంతలో భర్తను ఆ చెడు లక్షణాలనుంచి పక్కకు మళ్లించి, సన్మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి. భర్త చేసే మంచి పనులకు సంపూర్ణ సహకారం అందించాలి. భర్తలోని చెడుని నివారించేందుకు తనవంతు కృషి చేయాలి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top