ఈరోజు ముంబైలో ఓ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ ముంబైలోని పరేల్‌లోని లాల్‌బాగ్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పటానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదం వెనుక అసలు కారణం తెలియనప్పటికీ, వీలైనంతవరకూ రక్షణ చర్యలు చేపట్టారు.
ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 60 అంతస్థులు ఉండగా… 19 వ అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రమాదం 3 వ స్థాయి అగ్ని ప్రమాదం. ప్రశాంతంగా ఉన్న ఈ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో… అపార్ట్‌మెంట్‌లో ఉన్న వాళ్లంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమని తాము రక్షించుకునేందుకు పరుగులు పెట్టారు. కొందరైతే భవనంపై నుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఇక ఓ వ్యక్తి మంటల బారినుండి రక్షించుకునేందుకు భవనంపై నుంచి దూకేశాడు. దీంతో అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇతర అంతస్తుల్లో కూడా చాలా మంది ఈ మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదం కారణంగా కర్రీ రోడ్ బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. అయితే, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.