తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా చాటిచెప్పిన వ్యక్తి నందమూరి తారకరామారావు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో కూడా చెరగని ముద్ర వేశారు అన్న ఎన్టీఆర్. అటువంటి మహనీయుడి జయంతి నేడు.
ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ నేతలు, సినీ నటులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు కూడా ఆయనకి ఘన నివాళులర్పించారు. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు చిరంజీవి. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువై ఉండే యుగ పురుషుడు ఎన్టీఆర్. నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి అంటూ అంజలి ఘటించారు చిరంజీవి. అప్పట్లో తిరుగులేని మనిషి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి చిరంజీవి నటించారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వర్గీయ ఎన్టీఆర్ కి ఘన నివాళులర్పించారు. ఆయన అభ్యుదయవాది, తెలుగు గడ్డపై జన్మించిన విశిష్ట వ్యక్తుల్లో ఒకరు అంటూ కీర్తించారు.