హిందూ మైథాలజీ త్రిమూర్తులని సృష్టి, స్థితి, లయ కారకులుగా చెప్తూ వచ్చింది. అలాంటి త్రిమూర్తులు ముగ్గురూ ఒకేచోట కొలువై ఉన్న క్షేత్రం త్రయంబకేశ్వరం. ఈ క్షేత్రంలో ఉండే శివలింగం అసాధారణంగా 3 ముఖాలు కలిగి ఉండి… మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాదు, ఈ శివలింగం క్రింద ఉండే మిస్టీరియస్ అండర్ గ్రౌండ్ వాటర్ ఎన్నో అంతుచిక్కని రహశ్యాలని తనలో దాచుకొంది. ఇవేకాక ఇంకా ఎన్నో, మరెన్నో నిగూఢమైన విషయాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి. అలాంటి త్రయంబకేశ్వర్ టెంపుల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ గురించి ఇప్పుడే తెలుసుకోండి.
ఆలయ విశిష్టత
త్రయంబకేశ్వర్ టెంపుల్ త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం, ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది హిందూ గాడ్ అయిన శివునికి డెడికేట్ చేయబడింది.
త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అయితే, మిగిలిన జ్యోతిర్లింగాలతో పోలిస్తే, ఈ ఆలయ లింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే, ఇక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రం కనుకనే దీనిని ‘త్రయంబకం’ అంటారు.
వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉందని చెప్తారు. అలాగే 33 కోట్ల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని నమ్ముతారు. అందుకే, ఈ లింగాన్ని పూజించిన వాళ్ళు ముక్కోటి దేవతలను ఒకేసారి పూజించినట్లుగా భావించి మోక్షాన్ని పొందుతారని చెబుతారు.
త్రయంబకేశ్వరుడు అంటే పరమశివుడు అని అర్ధం. ఇక్కడ ‘త్రయం’ అంటే ముగ్గురు; అలానే ‘అంబక’ అంటే నేత్రమని అర్థం. త్రయంబక అంటే – మూడు నేత్రాలు గల దేవుడు అనే అర్ధం వస్తుంది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క మూడు ప్రతిరూపాలు మూడు నేత్రలుగా కలిగిన దేవుడే ఈ త్రయంబకేశ్వరుడు.
ఈ ఆలయం బ్రహ్మగిరి, నీలగిరి మరియు కాలగిరి అనే మూడు కొండల మధ్య ఉంది. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు మరియు బ్రహ్మను సూచించే మూడు లింగాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ బిల్వతీర్థం, విశ్వనంతీర్థం మరియు ముకుందతీర్థం అనే మూడు తీర్థాలు కూడా ఉన్నాయి.
గోదావరి నదికి మూలమైన పవిత్రమైన త్రయంబక తీర్థం పేరు మీదుగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది. ఈ నదిని తరచుగా ‘దక్షిణ గంగ’ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో రెండవ పొడవైన నది. ఈ ప్రదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాలలో ఉంటారు. అందువలనే దీనిని త్రయంబకం అంటారు.
గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కనే ఉన్న కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తుంది. ఈ నీటిలో స్నానం చేయడం వలన సర్వ రోగాలు పోతాయని, సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.
పురాణ ఇతిహాసం
శివ పురాణం ప్రకారం, ఒకప్పుడు బ్రహ్మ, విష్ణువు లిద్దరూ సృష్టి యొక్క ఆధిపత్యం విషయంలో గొడవ పడ్డారు. అదే సమయంలో వాళ్ళని పరీక్షించడానికి, శివుడు అంతులేని ఓ కాంతి స్తంభంగా, జ్యోతిర్లింగంగా మూడు లోకాలను చీల్చుకొని వెళ్ళాడు. బ్రహ్మ,విష్ణువులు తమ డామినేషన్ ని ప్రూవ్ చేసుకోటానికి ఆ కాంతికి ఎండింగ్ ఎక్కడో కనుగొనాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం బ్రహ్మ హంస రూపాన్ని ధరించి, స్తంభం పై భాగాన్ని వెతకడానికి వెళ్ళాడు. ఇక విష్ణువు వరాహ రూపాన్ని ధరించి స్తంభం క్రింది భాగాన్ని వెతకడానికి వెళ్ళారు. బ్రహ్మ సగం వరకూ వెళ్లి తిరిగి వచ్చి, ఎండింగ్ ని కనుగొన్నట్లు అబద్ధం చెప్పాడు. కానీ, విష్ణువు మాత్రం తన ఓటమిని అంగీకరించాడు.
అప్పుడు శివుడు ఆ పిల్లర్ పై లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. ఈ సృష్టి ఉన్ననతకాలం విష్ణువు పూజించ బడతాడని వరమిస్తాడు. అలాగే, అబద్దం చెప్పినందుకు బ్రహ్మ మాత్రం ఎవరి చేతా పూజించ బడడని శపిస్తాడు. వెంటనే ఆగ్రహించిన బ్రహ్మ… లింగ రూపంలో ఈ భూమిపైకి నెట్టబడతావని మరియు సహ్యాద్రి పర్వతం వద్ద ఆ రూపంలో ఉండవలసి ఉంటుందని శివుడికి ప్రతిశాపం ఇచ్చాడు. ఈ విధంగా లింగ రూపంలో సహ్యాద్రి శ్రేణుల వద్ద ఉద్భవించి, త్రయంబకాన్ని తన నివాసంగా చేసుకున్నాడు శివుడు.
జ్యోతిర్లింగం అనేది పార్షియల్ రియాలిటీ. శివుడు అందులో పాక్షికంగా కనిపిస్తాడు. ఆ విధంగా శివుడు మండుతున్న కాంతి స్తంభంగా ఈ జ్యోతిర్లింగంలో కనిపిస్తాడు. వాస్తవానికి 64 జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ. వాటిలో 12 మాత్రమే అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో త్రయంబకేశ్వర్ కూడా ఒకటి.
ఇది కూడా చదవండి: Mysterious Powers of Meenakshi Temple
స్థల పురాణం
సత్య యుగంలో ఈ ప్రదేశమంతా మునులు, సాధువులు వంటి వారికి నివాస ప్రాంతంగా ఉండేది. సప్తరుషులలో ఒకరైన గౌతమ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే నివసిస్తుండేవారు. వీరి ఆశ్రమంలో ఎంతో మంది ఋషులు ఆశ్రయం పొంది ఉండేవారు.
ఒకానొక సమయంలో 24 ఏళ్లపాటు ఈ ప్రదేశమంతా కరవుకాటకాలతో అల్లాడింది. తినటానికి తిండిలేక, తాగటానికి నీరు లేక ఋషులందరూ ఆకలితో అలమటించారు. ఇదంతా చూసి తట్టుకోలేక గౌతమ మహర్షి తన తపోశక్తినంతా ధారపోసి ఓ సరస్సును సృష్టించారు. ఆ నీటితో పంటలు పండించి వారి ఆకలి తీర్చారు. గౌతముడి గొప్ప మనస్సుకి సంతోషించి వరుణ దేవుడు సకాలంలో వానలు కురిసేలా చేశాడు. అహల్యతో పాటు మిగిలిన రుషి పత్నులందరూ కూడా ఆ సరస్సులోని నీటినే ఉపయోగించుకునేవారు.
కరువు బారినుండీ ఋషులని కాపాడి వారందరికీ ఆహారం అందించినందుకు గాను వారి యొక్క ఆశీర్వాదం గౌతమ ఋషి యొక్క పుణ్యాన్ని మరింత పెంచింది. గౌతముడు చేస్తున్న ఈ గొప్ప కార్యం వల్ల ఆయన ప్రతిష్ట పెరిగి, తన పదవికి ఎక్కడ ముప్పు వస్తోందోనని స్వర్గంలో ఉన్న ఇంద్రుడు భయపడ సాగాడు.
వెంటనే ఒక మాయా ఆవుని సృష్టించి గౌతముని పొలాలలోకి ఒదులుతాడు. పంటని నాశనం చేస్తున్న ఆ ఆవుని బెదిరించటానికి గౌతముడు ఒక దర్భని విసురుతాడు. వెంటనే ఆ మాయా ఆవు చనిపోతుంది. దీంతో గౌతముడికి గోహత్యా పాతకం పట్టుకుంటుంది. దానినుండీ ఎలా విముక్తి పొందాలో తెలియక సతమతమవుతుంటే… పరమేశ్వరుడిని ప్రార్ధించి… అతని జటాజూటంలో ఉన్న గంగని రప్పించి… ఆ గంగలో స్నానం చేస్తే ఈ పాపం తొలగి పోతుందని ఋషులు చెప్తారు. వారు చెప్పినట్లే గౌతముడు బ్రహ్మగిరి శిఖరంపై 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు గంగానదిని ఇచ్చాడు.
ఇదే స్టోరీని మరో పురాణం ఇంకో విధంగా పేర్కొంది. గౌతమ ముని పుణ్యం పెరిగిపోవటం చూసి ఓర్వలేని ఋషులు అసూయతో ఒక మాయా ఆవుని సృష్టించి… పంట పొలాలని నాశనం చేసి… చివరికి అది మరణించేలా చేసి… ఆయనకి గో హత్యా దోషం పట్టుకొనేలా చేశారని చెప్తుంది. రీజన్ ఏదైనా గౌతమ మహర్షి శివుని గురించి తపస్సు చేశారన్నది మాత్రం నిజం.
ఇక గౌతముని తపస్సుకి మెచ్చిన పరమ శివుడు ప్రత్యక్షమై, గంగని వదలాలని నిశ్చయించుకుంటాడు. కానీ, గంగానది మాత్రం శివునితో విడిపోవడానికి సిద్ధంగా లేదు. అది అతనికి చికాకు కలిగించింది. వెంటనే బ్రహ్మగిరి శిఖరంపై తాండవ నృత్యం చేసి, అక్కడ తన జాటాజూటాన్ని విసిరి కొట్టాడు. ఈ చర్యకు భయపడిన గంగ బ్రహ్మగిరి పర్వతం మీద పడుతుంది. అక్కడినుండీ ప్రవహిస్తూ కిందకి వస్తుంది. అలా ప్రవహించిన గంగనే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తున్నారు.
తర్వాత త్రయంబక తీర్థంలో గంగ దర్శనమిచ్చింది. మహర్షి ఆమెను ఎంతగానో ప్రశంసించాడు కానీ ఆమె ఆ పర్వతం మీద వివిధ ప్రదేశాలలో కనిపించి కొద్ది దూరం తర్వాత కోపంతో అదృశ్యమైంది. మళ్ళీ గంగాద్వారం, వరాహతీర్థం, రామ-లక్ష్మణ తీర్థం, గంగా సాగర్ తీర్థాలలో గంగా దర్శనమిచ్చింది. ఇలా ఒకచోటని కాకుండా రకరకాల ఒంపులు తిరుగుతూ గంగ ప్రవహిస్తూ ఉంది. కానీ, గౌతమ మహర్షి మాత్రం ఆ నదిలో స్నానం చేయలేకపోతాడు.
ఏం చేయాలో పాలుపోని గౌతమ మహర్షి ఓ దర్బ పుల్లని తీసుకొని మంత్రించి ఆ నీటి చుట్టూ తిప్పి అందులో వదులుతాడు. ఆ ప్రవాహం అక్కడే నిలిచిపోతుంది. ఆ తీర్థానికి ‘కుశావర్త’ అనే పేరు వచ్చింది. ఈ కుశావర్తనం నుండే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది. కుశ అంటే ‘దర్భ’, వర్తం అంటే ‘తీర్ధం’ అని అర్ధం. ఈ తీర్ధంలో స్నానం చేసిన తర్వాతే గౌతమ మహర్షికి గోవును చంపిన పాపం నశించింది.
ఆర్కిటెక్చరల్ మార్వెల్
త్రయంబకేశ్వర్ ఆలయం సాంప్రదాయ హిందూ దేవాలయ నిర్మాణానికి ఓ చక్కటి ఉదాహరణ, ఇందులో అందమైన రాతి శిల్పాలు అలాగే సాంప్రదాయ నాగర శైలికి చెందిన శిఖరం ఉన్నాయి. ఆలయ వాస్తుశిల్పం పురాతన హిందూ హస్తకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది గత యుగం యొక్క కళానైపుణ్యం మరియు నిర్మాణ నైపుణ్యాలకు నిదర్శనంగా ఉంటుంది.
ఈ ఆలయం మొత్తం నల్ల రాతితో నిర్మించబడింది. ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతురాస్రాకారంగానూ, బయటి వైపు నక్షత్రాకారంగానూ ఉంటుంది. ఇంకా వివిధ దేవతలు మరియు పౌరాణిక వ్యక్తులను వర్ణించే శిల్పాలతో అలంకరించబడింది. ఆలయ ప్రధాన ద్వారాన్ని ‘మహాద్వార’ అని పిలుస్తారు, ఇది అనేక శిల్పాలు మరియు డిజైన్లను కలిగి ఉన్న ఒక భారీ నిర్మాణం.
పవిత్రమైన శివలింగం ఉన్న గర్భగుడి ఆలయంలో ఆధ్యాత్మిక ప్రార్థనలు చేసే సమయంలో భక్తులు నడవడానికి చుట్టూ ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. ఆలయ నిర్మాణ సౌందర్యం, దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో కలిపి యాత్రికులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది.
ఇది కూడా చదవండి: Mysterious Powers of Katarmal Sun Temple
చారిత్రక ప్రాముఖ్యత
త్రయంబకేశ్వర ఆలయ చరిత్ర అనేక పురాణాలు మరియు చారిత్రక కథనాలతో ముడిపడి ఉంది. పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా తెలియక పోయినప్పటికీ, ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 18వ శతాబ్దానికి చెందిన మరాఠా పాలకుడు నానా సాహెబ్ పేష్వాచే నిర్మించబడిందని నమ్ముతారు. క్రీ.శ 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది.
పౌరాణిక ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం చూస్తే, నాసిక్, త్రయంబకేశ్వరం ప్రాంతాలలో చతుర్యుగాలకి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి.
ఈ ఆలయం సత్య యుగానికి చెందిందిగా చెప్తారు. త్రేతాగుగంలో శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి 14 సంవత్సరాల వనవాస సమయంలో నివసించిన పంచవటి ఈ నాసిక్ సమీపంలోనే లో ఉందని చెబుతారు.
అలాగే లక్ష్మణుడు శూర్పణక ముక్కు, చెవులు కోసిన ప్రదేశం కూడా ఇదే. అందుకే ఈ ప్రాంతానికి ‘నాసికా’ అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘నాసిక్’ గా మారింది.
ఇంకా రావణాసురుడు సీతమ్మని అపహరించిన ప్రదేశం కూడా ఇదేనని అంటారు.
అంతేకాదు, ఆంజనేయుని జన్మస్థలమైన ‘అంజనేరి పర్వతం’ ఈ త్రయంబకేశ్వర్ నుండి 7 కి.మీ. దూరంలో ఉంది.
ద్వాపర యుగంలో పాండవులు ఈ త్రయంబకేశ్వరుని పూజించినట్లు ఆధారాలు ఉన్నాయి. కేవలం పూజించటమే కాదు, వజ్రాలు, పచ్చలు, కెంపులు పొదగబడిన కిరీటాన్ని ఇక్కడి స్వామివారికి బహూకరించారు. ఈ కిరీటంలో అత్యంత విలువైన ‘నాసిక్ వజ్రం‘ కూడా పొదగబడి ఉంది.
ఇక కలియుగంలో చాళుక్యులు, యాదవులు మరియు మరాఠాలతో సహా ఈ ప్రాంతాన్ని అనేక రాజవంశాల వాళ్ళు పరిపాలించారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
ఈ ఆలయం యొక్క మూలాలు పురాతన హిందూ ఇతిహాసాలు మరియు గ్రంథాలకు అనుసంధానం చేస్తూ చాలా లోతుగా ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన చారిత్రక సంఘటనలలో ఒకటి నాసిక్‌లో జరిగే కుంభమేళా.
ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నాసిక్ నగరం ఈ భారీ ఉత్సవానికి కేంద్రంగా మారుతుంది. ఆధ్యాత్మిక శుద్ధి మరియు మోక్షాన్ని కోరుతూ భారతదేశం మరియు విదేశాల నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానం చేయడానికి తరలివస్తారు. ఈ సమయంలో త్రయంబకేశ్వర్ ఆలయం కుంభమేళా కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుంది,
ఈ కుంభమేళా కోసం ఎక్కడెక్కడినుంచో భక్తులు, శివుని ఉపాసకులు, నాగ సాధువులు, అఘోరాలు ఇక్కడికి వస్తారు. వారంతా ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానమాచరించి త్రయంబకేశ్వరుడ్ని దర్శించుకొంటారు. పరమ పవిత్రమైన ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా చేసిన పాపాలకు విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు, జీవులు తమకు జనన, మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు.
ఇది కూడా చదవండి: Uncovering Chidambaram Temple’s Ancient Secrets
ఆలయ రహశ్యాలు
ఈ ఆలయ విషయానికొస్తే, ఎన్నో రహశ్యాలు, మరెన్నో అంతు చిక్కక్కని విషయాలు దాగున్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు చూద్దాం.
- త్రయంబకేశ్వరాలయం బ్రహ్మగిరి పర్వత పాదాల వద్ద ఉంది. ఇది పవిత్ర త్రివేణి సంగమం. ఇది గోదావరి, సరస్వతి, మరియు కుశావర్త అనే మూడు పవిత్ర నదుల కలయిక.
- ఇక్కడి శివలింగం త్రిమూర్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఇది ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇది యూనివర్శల్ యూనిటీ అఫ్ ట్రినిటీని సూచిస్తుంది.
- ఇక్కడి జ్యోతిర్లింగంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపాలు మూడూ కలిసి ఒకే లింగంగా ఏర్పడ్డాయి. ఇలాంటి మూడు ముఖాలు కలిగిన అరుదైన శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు.
- ఈ ఆలయం పరమ శివుని యొక్క పవిత్ర నివాసం అని నమ్ముతారు. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం శివుని యొక్క శాశ్వత శక్తిని ప్రతిభింబిస్తుంది.
- ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడి లింగం తన రూపాన్ని మారుస్తుందని స్థానికుల నమ్మకం.
- ఆలయ గర్భగుడిలో శివలింగం క్రింద ఓ రహస్యమైన భూగర్భ జలం దాగి ఉంది. ఈ జలం గోదావరి నదిలో కలిసే ముందు లింగం మీదుగా ప్రవహిస్తుందని, జ్యోతిర్లింగాన్ని తాకిన తర్వాత ఆ నీరు పవిత్రతని సంతరించుకొంటుంది అని చెబుతారు.
- సాధారణంగా ప్రతీ శివాలయంలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరునికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది. మొదటగా నందీశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే దేవదేవుణ్ని దర్శించుకుంటాం.
- గర్భగుడి లోపల, శివునికి ప్రతీకగా ఉన్న స్పటిక శిల అపారమైన ఆధ్యాత్మిక శక్తిని ప్రసరిస్తుంది.
- హిందూ పురాణాల ప్రకారం, సీతా రాములిద్దరూ వనవాస సమయంలో ఈ త్రయంబకేశ్వర్‌లో ఉన్నారు. ఆ సమయంలో రాముడు తన పూర్వీకుల ఆత్మలకు విముక్తి కలిగించడానికి “పిండ దాన్” వేడుకను ఇక్కడ నిర్వహించాడని నమ్ముతారు.
- ఆలయానికి ప్రక్కనే ఉన్న కుశావర్త కుండ్ లో పవిత్ర స్నానం చేస్తే, ఇది ఆత్మను శుభ్రపరుస్తుందని, ఇంకా పాపాల నుండి విముక్తి కలిగిస్తుందని నమ్ముతారు.
- ఆలయ సముదాయంలో అంతర్గతంగా “గర్భగృహ” అని పిలువబడే ఒక రహస్య భూగర్భ గది ఉంది. ఇదే అసలైన గర్భగుడి అని చెప్తారు. ఈ గది అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.
- గర్భగుడి లోపలికి అడుగు పెట్టగానే పూర్తి నిశ్శబ్దంగా ఉంటుంది. ఎటువంటి ప్రతిధ్వనులు ఇక్కడ వినబడవు, ఇది అసాధారణమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
- ఆలయ సముదాయంలో ఒక భారీ రాతి స్తంభం ఉంది. దీనిద్వారా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందని నమ్ముతారు.
- త్రయంబకేశ్వర్ ఆలయం యొక్క పవిత్ర విభూతి హీలింగ్ ప్రాపర్టీస్ కలిగి ఉందని నమ్ముతారు.
- ఈ ఆలయంలో ఉండే శివలింగం చుట్టూ ఎప్పుడూ జలం ఊరుతూ ఉండటం వల్ల లింగం క్షీణించడం ప్రారంభించింది. ఇది మానవ సమాజం క్షీణిస్తున్న స్వభావానికి ప్రతీక అని చాలామంది నమ్ముతారు.
చివరిమాట
త్రయంబకేశ్వర్ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు, శాశ్వత శక్తికి నిదర్శనం. దీని పురాతన మూలాలు గతానికి సాక్ష్యం మాత్రమే కాదు, ముందు తరాలకి స్ఫూర్తి. ఓవరాల్ గా ఈ ఆలయం ఓ పురాణ భాండాగారం అంతకుమించి ఓ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం.