భారతదేశంలో ఎన్నో జీవనదులు ప్రజలకి జీవనాధారంగా నిలుస్తున్నాయి. అందుకే మనదేశంలో నదులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలహాబాద్ సమీపంలో గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు కలుస్తాయి. దీనిని ‘త్రివేణి సంగమం’ అని కూడా అంటారు.
అయితే, వీటిలో గంగ, యమున నదులు మాత్రమే భూమిపై ప్రవహిస్తూ కనిపిస్తాయి. కానీ, సరస్వతి నది భూమిపై కనిపించదు. భూమి క్రింద అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కారణం ఇది అంతరించి పోవటమే! ఇదే విధంగా ప్రపంచంలో మరికొన్ని నదులు భూమి క్రింద ప్రవహిస్తూ పర్యాటకులని ఆకర్షిస్తున్నాయి. అవి ఏమిటో..! ఎక్కడ ఉన్నాయో..! ఇప్పుడు తెలుసుకుందాం.
లాబౌచే నది (ఫ్రాన్స్) :
ఫ్రాన్స్‌లో ఉన్న ‘లాబూయిచ్ నది’ ఐరోపా కంట్రీలోనే అతి పొడవైన భూగర్భ నది. దీనిని తొలిసారిగా 1906లో కనుగొన్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఇక్కడికి టూరిస్టులని అనుమతిస్తారు.
మిస్టరీ నది (ఇండియానా):
అమెరికాలోని ఇండియానాలో ఉన్న అతి పొడవైన భూగర్భ నదిని ‘మిస్టరీ నది’ అంటారు. ఇది 19 వ శతాబ్దంలోనే కనుగొనబడింది. అయితే మొదట ఈ నదిని చూసేందుకు ప్రభుత్వం అందరిని అనుమతించేది కాదు. కానీ, 1940 తర్వాత అందరినీ అనుమతిస్తుంది.
ప్యూర్టో ప్రిన్సిసా నది (ఫిలిప్పీన్స్):
సౌత్ వెస్ట్రన్ ఫిలిప్పీన్స్‌లోని ‘ప్యూర్టో ప్రిన్సిసా నది’ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటి. దీనిని 1992 నుండి సిటీ గవర్నమెంట్ నిర్వహిస్తుంది. ఈ భూమి కింద ఉన్న గుహల గుండా ప్రవహించి… చివరికి సముద్రంలో కలుస్తుంది. ఒక రోజులో 600 మంది పర్యాటకులకు అనుమతిస్తారు.
శాంటా ఫే నది (ఫ్లోరిడా):
‘శాంటా ఫే నది’ అమెరికాలోని నార్త్ ఫ్లోరిడాలో ఉంది. ఇది 17వ శతాబ్దంలోనే కనుగొనబడింది. అయితే, 1980లో త్రవ్వకాలలో బయటపడింది. నిజానికిది పూర్తిగా భూగర్భ నది కాదు, 5 కిలో మీటర్ల వరకు మాత్రమే భూగర్భంలో ప్రవహిస్తుంది. ఈ నది ఓలెనో స్టేట్ పార్క్‌లోని ఒక పెద్ద సింక్ హోల్‌లో పడి 5 కిలో మీటర్ల వరకు భూగర్భంలోకి వెళుతుంది.
రియో కాముయ్ నది (ప్యూర్టో రికో) :
ప్యూర్టో రికోలో ఉన్న రియో కాముయ్ నది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద భూగర్భ నదుల్లో మూడవది. దీనిని US జియోలాజికల్ సర్వీస్ 1995 లో స్టడీ చేసింది. ఈ నది రియో కాముయ్ గుహల గుండా ప్రవహిస్తుంది. ఇది దాదాపు ఒక మిలియన్ సంవత్సరాల నుండీ ఈ పురాతన గుహల ద్వారా వెళుతున్నట్లు పరిశోదనల్లో తేలింది.