కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు నిత్యం ఏదో ఒక వాహనసేవలో తరిస్తూ… తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ… భక్తులకు అభయమిస్తూ ఉంటాడు. అలాంటిది నిన్న నాగుల చవితి పండుగని పురస్కరించుకొని… నిన్న రాత్రి పెద్దశేష వాహనంపై కొలువుదీరారు.
ప్రతియేటా నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తూ ఉంటారు. పెద్దశేష వాహనంపై… శ్రీదేవి, భూదేవి సమేతంగా… శ్రీవారు మలయప్పస్వామిగా… ఆశీనులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో శ్రీవారిని వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తిరుమల గిరులన్నీ భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగిపోయాయి.
నిజానికి మనలో ఉన్న కల్మషాన్ని హరించేందుకే ఆ దేవదేవుడు పెద్ద శేష వాహనంపై కొలువుదీరి ఉంటాడని ఈ సేవ అంతరార్థం. అంతేకాదు, ఆదిశేషుడిని దర్శిస్తే… పరమపదం సిద్ధిస్తుందని కూడా భక్తుల నమ్మకం.