అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళు నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నారో అంతకంటే తెలీదు. బిక్కుబిక్కుమంటూ నేనిక్కడ ఒంటరిగా ఉన్నాను. నా ఎదురుగా చూస్తే ఓ పెద్ద పులి. ఎటు వెళ్ళాలో దారి తెలీదు. దారి తప్పి ఇటువైపు వచ్చాను. తీరా చూస్తే తెలిసింది నేను వచ్చింది ఓ పులి గుహలోకి అని.
ఇప్పుడేం చేయాలి? తప్పించుకునేదేలా? అయినా నా పిచ్చికానీ, పులి కంట్లో పడ్డాక ఇక తప్పించుకునే మార్గం ఎక్కడుంటుంది? చావు తప్ప. బలవంతుల మీద బలహీనులది ఏపాటి బలం. అయినాసరే, అస్సలు తగ్గేదే లేదు. నేనేంటో చూపిస్తాను. ఎటూ కొద్ది సేపట్లో నేను దానికి ఆహారం కాక తప్పదు. చిన్న బేబీని అనే కనికరం కూడా లేకుండా నన్ను పొట్టనపెట్టుకోబోతోంది. కానీ, అక్కడ మా అమ్మ కడుపుకోతకి కారణమవుతోంది.
ఇదంతా తెలిసి కూడా నేనేం చేయలేనా..? ఆలోచించి ఏదో ఒకటి చేయాలి. ఎలాగూ నేను వెళ్ళిపోక తప్పదు. కానీ వెళ్ళేముందు మా అమ్మ ఋణం తీరుచుకొని పోతాను. కడుపులో ఉన్నప్పుడు మా అమ్మని నేను ఎలా తన్నేదాన్నో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం తెలిసే నేను దీన్ని నా కక్ష్య తీరా తంతాను. అప్పుడే నా బలం ఏంటో నిరూపించుకోవచ్చు. అదేంటో కానీ, ఆ పులి కూడా నన్ను కాసేపు తనతో ఆడుకోనిచ్చింది. ఆటలో నేను ఓడిపోకూడదని ప్రతిసారీ ప్రయత్నిస్తూ వచ్చాను. కానీ, చివరికి దాని చేతిలో బలికాక తప్పలేదు. పోనీలే… పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నానని పేరైనా మిగులుతుంది. ఇది ఓ బుజ్జి లేడి పిల్ల న్యాలా వ్యధ.
న్యాలా అనే ఓ లేడి పిల్ల ఆడుకుంటూ పొరపాటున చిరుత గుహలోకి వస్తుంది. అయితే, ఆ సమయంలో పులికి ఆకలి అయినట్లు లేదు అందుకే న్యాలా తనని ఏం చేసినా ఊరుకుంది. న్యాలా పేరుకి చిన్న కూనే అయినా… అది కొట్టిన దెబ్బలు మాత్రం మాములుగా లేవు. దాని ప్రతాపం మొత్తం చూపించింది. అయినాసరే, ఆకలేసినప్పుడు దాని సంగతి చూద్దాంలే! అని మెదలకుండా ఉంది ఆ చిరుత.
దాదాపు రెండు గంటల పాటు ఆ రెంటి మద్య పోరు జరిగింది. ఇక చివరికి లేడి పిల్ల అలసి పోయింది. చిరుత చేతికి చిక్కింది. న్యాలాని నోట కరుచుకొని గుహలోకి దూరింది చిరుత. ఈ దృశ్యాన్నంతా ఓ సఫారీ గైడ్ తన కెమెరాలో క్యాప్చర్ చేశాడు.
ఆండ్రూ ఫౌరీ అనే సఫారీ గైడ్… సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌కి వెళ్లినప్పుడు ఈ అరుదైన దృశ్యం అతని కంట పడింది. సాధారణంగా జంతువులు వేటాడే దృశ్యాలు గైడ్‌లు రికార్డు చేయరు. కానీ, ఈ దృశ్యం తాము ఎప్పుడూ చూడని విధంగా ఉండడంతో రికార్డ్ చేసేశారు.