పోలీసుల ఓవర్ యాక్షన్‌పై ప్రజలు తిరగబడ్డారు. ఒక వాహనదారుడి విషయంలో చేసిన పనికి మిగిలిన వాహన దారులంతా కలిసి నిరసనకి దిగారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే… ఆ వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోక పోవటమే!
మహబూబాబాద్‌లోని మానుకోటలో ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా మాస్క్, హెల్మెట్ పెట్టుకోని వారిని ఆపి క్లాస్ పీకారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీనివాస్ అనే ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు ఝులం ప్రదర్శించారు. అతని బైక్ కీస్ తీసేసుకొని… అతన్ని విచక్షణా రహితంగా కొట్టారు. ఎందుకు కొడుతున్నారు? అని అడిగితే… హెల్మెట్ పెట్టుకోకపోవటం వల్లనే అన్నారు.
కూరగాయలకోసం అతను ఇంటినుండీ బయలుదేరానని ఎంత చెప్పినా వినకుండా… కన్న కూతురి ఎదుటే చితకబాదారు. తన తండ్రిని అలా కొట్టటం చూసి తట్టుకోలేక ప్లీజ్ అంకుల్… మా నాన్నని కొట్టకండి! అంటూ ఎంత బతిమిలాడినా పోలిసుల గుండె కరగలేదు.
తానెంత చెప్పినా వినకుండా పోలీసులు తనపై చేయి చేసుకోవటం గురించి ఆ వాహనదారుడు తిరగబడ్డాడు. రోడ్డుపై భైఠాయించి నిరసనకి దిగాడు. అటుగా వెళ్తున్న తక్కిన వాహనదారులు కూడా అతనికి మద్దతు పలికారు. అంతేకాదు, ఆకస్మిక తనిఖీల పేరుతో తమ వాహనాలని సీజ్ చేస్తున్నారని వాపోతున్నారు.