పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో నెట్టేసింది. సెలెబ్రిటీలనుండీ సామాన్యుల వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా… సరదాగా… ఫిట్‌గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం ఒక్కసారిగా అందరినీ కలచి వేసింది. ఇక అభిమానులైతే, ఫుల్ షాక్ లో ఉన్నారు. యావత్ కుటుంబం గుండెలవిసి పోయేలా రోదిస్తున్నారు.
శ్యాండిల్ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీకి చెందిన అనేకమంది పునీత్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. దాదాపు పది లక్షల మంది అభిమానులు ఆయనని కడసారి చూసుకోవటం కోసం కంఠీరవ స్టేడియానికి తరలి వచ్చారు. అంతలా జన సముద్రం ఆయన కోసం రావటానికి గల ఏకైక కారణం ఆయనలో ఉన్న మంచితనమే!
అయితే, 29వ తేదీ శుక్రవారం వర్కౌట్స్ చేసి జిమ్ నుంచీ వచ్చిన తర్వాత పునీత్‌కి ఛాతిలో నొప్పి రావటంతో… తన భార్య అశ్వినికి విషయం చెప్పారు. వెంటనే ఆమె భర్తని తమ ఫ్యామిలీ డాక్టర్ అయిన రమణారావు ఇంటికి తీసుకెళ్ళారు. ఈసీజీ తీసేవరకూ పునీత్ చాలా యాక్టివ్గానే ఉన్నారు. కానీ, ఈసీజీ రిపోర్ట్‌లో జరగబోయే ప్రమాదాన్ని ముందే ఊహించిన డాక్టర్… అతనిని వెంటనే విక్రమ్ హాస్పిటల్ కి వెళ్లాల్సిందిగా సూచించారు.
అయితే డాక్టర్ రమణారావు ఇంటి నుంచి విక్రమ్ హాస్పిటల్ కి వెళ్ళటానికి కారు ఎక్కేవరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్ళారు పునీత్. తనకేమీ కాలేదని, ఎలాంటి నొప్పి లేదని కూడా తన భార్యతో చెప్పారు. అలా చెప్తూనే… కారులో భార్య ఒడిలో పడుకున్నారు. కేవలం 5 నిముషాల్లో విక్రమ్ ఆసుపత్రికి చేరతారనగా… భార్య ఒడిలోనే పునీత్ తుది శ్వాస విడిచారు.
ఇదిలా ఉంటే… డాక్టర్ రమణారావు ఇంటి నుంచి పునీత్ కారు వరకు నడుచుకుంటూ వెళ్లడం అక్కడ సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యింది. ఆయన చివరి క్షణాలకి సంబంధించిన ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ సర్క్యులేట్ అవుతుంది.